కాంగ్రెస్​కు​ ‘కాల’ పరీక్ష



– స్వయంకృతమే పార్టీకి శాపం

– సానుకూల పరిస్థితిపై నిర్లక్ష్యం

–  పీసీసీ ముఖ్య నేతల్లో అనైక్యత 

– హుజురా‘బాధల’ ఉప  ఎన్నిక 

– కోరి తెచ్చుకున్న కొత్త కష్టాలు 


వేకువ ప్రత్యేక ప్రతినిధి​: ఔనన్నా! కాదన్నా! కాంగ్రెస్​ ఇటీవల కాలపరీక్షను ఎదుర్కొంటోంది. మరో సారి అలాంటి పరీక్షను ఎదుర్కోనున్నది. ఇప్పటికే రెండు పర్యాయాలు కేంద్రం, రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది. మూడో సారి ముచ్చటగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది.  కాంగ్రెస్​కు అనుకూల అంశాలు ఎదురొస్తున్నా ఫలవంతం చేసుకోవడంలో విఫలమవుతోంది.  సొంతగా టీఆర్​ఎస్​ చేయించుకున్న సర్వేల్లో రాష్ట్రప్రభుత్వంపై నెలకొన్న తీవ్ర అసంతృప్తి బహిర్గతమైంది.   రెండో  దఫా అధికారంలో ఉన్నందున సహజంగానే వ్యతిరేకత పెరుగుతుంది. ఈ  వ్యతిరేకత అధికార పార్టీలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.  పైకి సీఎం కేసీఆర్​ గంభీర ప్రకటనలు చేస్తున్నా... పెరిగిన వ్యతిరేకత కాంగ్రెస్​కు సానుకూలంగా మారితే ప్రమాదం తప్పదని భావిస్తున్నారు. అందుకే విపక్షాలకు, ముఖ్యంగా కాంగ్రెస్​కు తిరిగి అవకాశం దక్కకుండా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

ఈ  ప్రజావ్యతిరేక స్థితిని తమకనుకూలంగా మార్చుకోవడంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్​ విఫలమవుతోంది. నిస్తేజకరమైన పరిస్థితిలో పీసీసీ చీఫ్​గా రేవంత్​రెడ్డిని నియమించినప్పుడు పార్టీలో అసమ్మతి ఎదుర్కొన్నారు. ఈ విషయాలను  పట్టించుకోకుండా ప్రజాసమస్యల పై దృష్టిపెట్టడంతో  కాంగ్రెస్​ శ్రేణుల్లో ఉత్తేజం నెలకొంది. ఈ ఉత్సాహాన్ని హుజురాబాద్​ ఉప ఎన్నిక ఫలితం మింగేసింది. ఫలితాల తర్వాత గులాబీ నేత ఎత్తుల్లో చిక్కుకున్నది. రాష్ట్రంలో విపక్షాలకు పెద్దన్న పాత్ర వహించాల్సిన కాంగ్రెస్​ గ్రూపు తగాదాలకే పరిమితమవుతోంది. కేసీఆర్​ వలలో పడి తల్లడిల్లుతున్నది. 

 సానుకూల పరిస్థితిపై నిర్లక్ష్యం 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో తొలిసారి పీసీసీ అధ్యక్షుడు పొన్నాల నాయకత్వంలో 2018లో ఉత్తమ్​ నాయకత్వంలో రెండోసారి అధికారం దక్కించుకోలేక పోయారు.  గంపెడాశలు పెట్టుకున్న కాంగ్రెస్​ నేతలు  బొక్కాబోర్లాపడ్డారు. ​ మూడో సారి రేవంత్​రెడ్డి ఆధ్వర్యంలో  అధికారాన్ని చేజిక్కించుకుంటుందా? అనే చర్చ సాగుతున్నది. రాష్ట్రంలో ఎనిమిదేళ్ళుగా అధికారంలో ఉన్నందున  టీఆర్​ఎస్​ పైన వ్యతిరేకత పెరుగుతున్నది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవడంలో రాష్ట్ర కాంగ్రెస్​ నాయకత్వం సమిష్టిగా విఫలమవుతోంది. స్వయంకృతాపరాధాలతో తమకున్న  పలుకుబడిని తగ్గించుకుంటూ,  తమ స్థానాన్ని రోజుకింత తగ్గించుకుంటున్నారు. ప్రధానంగా నాయకత్వం కోరి కష్టాలు తెచ్చుకుని ఇబ్బందుల పాలవుతున్నారు. టీఆర్​ఎస్​ను కాదని కాంగ్రెస్​  వైపు ఆకర్షించే ప్రజల్లో కలిగే విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు. కాంగ్రెస్​కు సానుకూల పరిస్థితులున్నప్పటికీ విఫలమవుతున్నారు.  రాష్ట్ర నాయకత్వం, అధిష్ఠానం వచ్చిన ఈ అవకాశాన్ని కాలదన్నుకుంటున్నారు.  

  కొత్త పీసీసీ ఊపు ఉష్​కాకి

2018లో  రెండో సారి అధికారం దక్కకపోవడంతో కాంగ్రెస్​లో నిస్తేజం నెలకొంది. ఈ పరిస్థితుల్లో  పీసీసీ మార్పంటూ రెండేళ్లు కాలాయాపన చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయించకుండా కాపాడుకోలేక పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్​రెడ్డిని నియమించారు. రేవంత్​ నియామకంతో ఆ పార్టీ సీనియర్ నాయకులు కొందరు తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏఐసీసీ నేతలు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అలకలు, అసంతృప్తులు, బుజ్జగింపులు ఏదోరూపంలో కొనసాగుతున్నాయి.  

 ప్రజాకదలికపై అసమ్మతి నిప్పులు 

పీసీసీలో అసమ్మతిని పట్టించుకోకుండా రాష్ట్ర నలుమూలలా ‘భారీ సభలు’ పాదయాత్రలు, నిరసనలతో  పార్టీలో కొత్త కదలిక తెచ్చారు.  దళితులు, నిరుద్యోగుల సమస్యలను  ఎజెండాపైకి తెచ్చి ప్రతిపక్ష పాత్రను కొనసాగించారు. కాసింత కదలిక వచ్చిందనుకోగానే మళ్లీ అసమ్మతి కుంపట్లు రాజేశారు. అడుగు ముందుకేస్తే ముందరి కాళ్ళకు బంధం వేయడం అసమ్మతి నాయకులకు అలవాటుగా మారింది. పైగా పాతతరం, కొత్త తరానికి మధ్య పొసగని పరిస్థితి నెలకొంది. ఈ అసమ్మతి  పర్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. కాంగ్రెస్​లోని ఈ కల్చర్​ ఆ పార్టీ ఉనికికి ముప్పుగా పరిణమించింది. అయినా సోయి రావడంలేదంటున్నారు. 

 స్వయంకృతం హుజురా‘బాధ’

కాంగ్రెస్​లో  కాస్తంత ఊపు రాగానే  ‘హుజురాబాద్​’ ఎన్నికలొచ్చాయి.  టీఆర్​ఎస్​ నాయకులు కాంగ్రెస్​ లక్ష్యంగా పావులు కదిపారు.  గత ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థి పాడి కౌశిక్​రెడ్డిని తమవైపు తిప్పుకుని  గేమ్​ప్లాన్​ అమలు చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన హుజురాబాద్​ ఉప ఎన్నికల్లో పార్టీ బలాబలాలపై ముఖ్యనేతలందరీకి  స్పష్టమైన అంచనా ఉన్నది.  కానీ, ఎన్నికల ఫలితాలు రాగానే కొంపలు మునిగినట్లు మాట్లాడి గులాబీ నేతలు వేసిన ఉచ్చులో చిక్కుకొని విలవిలలాడారు. ఓడిన అధికార గులాబీ పార్టీ కంటే, కోరి కొరివితో గోక్కొని కాంగ్రెస్​ ఎక్కువ నష్టం చేసుకున్నది. కాంగ్రెస్​ భుజాల పైన తుపాకీపెట్టి టీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ మాటల తూటాలు పేలుస్తుంటే, సొంతపార్టీలోని ఓ గ్రూపు వంతపాడింది. ఢిల్లీ వరకు వెళ్ళి వార్​రూమ్​ వేదికగా రచ్చరచ్చ చేసుకున్నారు. 

ఈ సమస్య చల్లారగానే  సంస్థాగత బలోపేతంపై  నాయకత్వం కేంద్రీకరించింది. నియోజకవర్గాల్లో డిజిటల్​ సభ్యత్వాన్ని పోటీలుపడి చేపట్టారు. ఈ మధ్యలో రాష్ట్ర ముఖ్యులు, కేంద్ర పరిశీలకుల సమావేశం నిర్వహిస్తే ‘ప్రజా సమస్యలు’ పార్టీ పురోగతి కంటే నేతల పరస్పర ఫిర్యాదులే ఎక్కువయ్యాయి. తాజాగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి ఎపిసోడ్​ ఇంకా కొనసాగుతున్నది. 

  నేతలకు కనువిప్పుకలిగేనా!?

ఇప్పటికైనా కాంగ్రెస్​ ఏఐసీసీ, పీసీసీ నాయకత్వం తమ పద్ధతి మార్చుకుని రాష్ట్రంలో తమ పార్టీకి ఉన్న అనుకూల పరిస్థితిపై  దృష్టి పెడుతారా?  గ్రూపు తగాదాలతో తన్నుకుంటారా? అనే చర్చ సాగుతున్నది. నాయకత్వం విభేదాలు పక్కనపెట్టి ప్రజా విశ్వాసాన్ని చూరగొనడంపై దృష్టి పెట్టాలని ఆ పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.  టీఆర్​ఎస్​కు ప్రత్యామ్నాయంగా నిలవాలని కోరుతున్నారు. ఇప్పటి నుంచి ఐక్యంగా పనిచేస్తే వచ్చే ఎన్నికల నాటికి విజయం సాధించేందుకు అవకాశం ఏర్పడుతుంది. 

Relative Post

Newsletter