పదును పెంచితే ‘పవర్’​ పక్కా!




 అదును దాటితే అవకాశం గల్లంతు 

 తిరిగిలేచేందుకు కాంగ్రెస్​కు సదావకాశం!

 ఐక్యతతో అధికారం సాధ్యం!

 నాయకత్వంలో వేగం అవసరం!


వేకువ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్​ తమ ఘన చరిత్రను ఎంత ఊదరగొట్టుకున్నా...తెలంగాణ ఇచ్చింది మేమేనంటూ ఢంకా భజాయించుకున్నా...రాష్ట్ర ప్రజల మనసు గెలిచి  అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఆ పార్టీకి అందివచ్చిన అవకాశాన్ని చేజిక్కించంకునేందుకు శ్రమించకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది.  కారణాలేవైనా రాష్ట్రంలో అలాంటి మంచి అవకాశం కాంగ్రెస్‌కు మరోసారి వచ్చింది.  ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటా‌రనే చర్చ సాగుతోంది. రెండు పర్యాయాలుగా  ప్రతిపక్ష పాత్ర ఆశించిన స్థాయిలో లేకున్నా అధికార గులాబీ పార్టీ పై నెలకొన్న వ్యతిరేకత కాస్తా  కాంగ్రెస్​కు కలిసొస్తోంది. ఈ అదును దాటితే ప్రజల్లో నెలకొన్న పదును తగ్గిపోతుంది. అంతర్గతంగా  కాంగ్రెస్​ నాయకత్వానికి ఎన్ని ఇబ్బందులున్నా ప్రజలకు భరోసా కల్పించాల్సిన సమయం అసన్నమైంది. రాష్ట్రంలో  ఆ పార్టీ ​ శ్రేయోభిలాషులూ, ప్రభుత్వం పై న అసంతృప్తి వర్గాలూ,  టీఆర్​ఎస్​ వ్యతిరేకులు, ఉద్యమ ఆకాంక్షలు అమలు కాలేదనుకుంటున్న రాశులూ  రాష్ట్రంలో అధికార మార్పును కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్​ పైన టీఆర్​ఎస్​ను గద్దె దింపాల్సిన  బాధ్యత ఉంటుంది.  ఈ కర్తవ్యం కోసం ఆ పార్టీ చెమటోడ్చాల్సిన తరుణం వచ్చింది. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా కాంగ్రెస్​ నాయకత్వం ప్రయత్నిస్తుందా? గ్రూపు తగాదాలతో  కాలం వెల్లదీస్తారా? పాత పద్ధతుల్లో ముందుకు సాగుతారా? గత అనుభావాల నుంచి తగిన గుణపాఠం తీసుకుంటారా?  త్వరలో కాలం సమాధానం చెబుతోంది. 

 అదునుదాటితే అంతే..

కాంగ్రెస్​ అప్రమత్తమై ప్రజలకు భరోసా కల్పించకుంటే ప్రభుత్వం పైన నెలకొన్న అసంతృప్తి పక్కదోవపట్టే ప్రమాదం ఉంది. ప్రజా వ్యతిరేకతలో  చీలిక నెలకొనే అవకాశం ఉంది. ఈ పరిణామంతో టీఆర్​ఎస్​ పార్టీకి లాభం చేకూరి మూడో సారి అధికారంలోకి వస్తుంది. గులాబీ అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్​ పార్టీయే ‘త్రివర్ణ కార్పెట్’ పరిచినట్లుగా భావించాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికార పార్టీ ఎత్తులను పరిశీలించి తన వ్యూహాలకు పదనుపెట్టకపోతే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్​కు పుట్టగతులుండవు. టీఆర్​ఎస్​ తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు రెండేళ్ళ ముందుగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నది. ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయ చదరంగం ప్రారంభించింది.  అధికార పార్టీ వేగాన్ని చూసైనా ప్రతిపక్ష కాంగ్రెస్​ పార్టీకి కనువిప్పుకలుగకుంటే పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది. 

 కాంగ్రెస్​లో  వేగం అవసరం

కాంగ్రెస్​ మేల్కొని ఏక కాలంలో బహుముఖ కర్తవ్యాలు చేపట్టకుంటే నాయకత్వం కంటున్న కలలు నిష్ఫలమవుతాయి. ప్రజాసమస్యలపైన నిత్యం ప్రజల్లో కదలిక తేవాల్సి ఉంది. ప్రభుత్వం రెండు దఫాలుగా ఇచ్చిన హామీల అమలులో విఫలమైన అంశాలను చర్చకు తేవాల్సి ఉంటుంది. ఆందోళనా, ప్రజా విశ్వాస కార్యక్రమాలతో పాటు తమ పార్టీ నాయకత్వ బలహీనతలు తగ్గించుకోవాల్సి ఉంది. కాంగ్రెస్​కు అనుకూలంగా ఉన్న రాజకీయ పరిస్థితితో సంబురాలు చేసుకోకుండా ‘ఓటు బ్యాంకు’గా మార్చాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రచారాందోళనలతో పాటు, నియోజకవర్గ స్థాయిలో నమ్మకమైన నాయకత్వాన్ని రూపొందించుకోవాల్సిన బహుముఖ కర్తవ్యాలు ఇప్పటి నుంచే వేగం చేయాల్సి ఉంది.  కేసీఆర్​ ఎత్తులను తిప్పికొట్టాల్సిన అవసరంతో పాటు శ్రేణులను అప్రమత్తం చేయాల్సి ఉంది. పీసీసీ చీఫ్​ రేవంత్​ ఆధ్వర్యంలో ఇటీవల కార్యక్రమాలు పెరిగాయి. ప్రస్తుతం ఊరు పోరు, నిరుద్యోగ దీక్ష, జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి .  వీటిని మరింత పెంచి కేసీఆర్​ జిమ్మిక్కులకు చెక్​పెట్టాల్సి ఉంది. ముందస్తు ఎన్నికలొస్తాయనే దృష్టితో  రాష్ట్రంలో అధికారం లక్ష్యంగా పనిచేసినా అవకాశం దక్కడం అంత సులువైంది మాత్రం కాదు.

  టీఆర్​ఎస్​ లక్ష్యం కాంగ్రెస్​

రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలో రాకుండా చేయడం కేసీఆర్​ ప్రథమ లక్ష్యం. ఆ పార్టీని తెలంగాణలో మళ్లీ లేవకుండా చేయడం ఆయన తక్షణ రాజకీయ వ్యూహం. బహిరంగంగా ఈ విషయాన్ని చెప్పకుండా కేసీఆర్​ తన ఎత్తులు అమలు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని వనరులు అందుబాటులో ఉన్నందున వాటిని సద్వినియోగం చేసకుంటున్నారు.  దీని కోసం  ఎదుట ఉన్న  అన్ని దారులను ఉపయోగిస్తున్నారు. అందుకే బహుముఖ కర్తవ్యాల వెనుక రాష్ట్రంలో తగ్గిన బలాన్ని తాత్కాలికంగా పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్​కు ‘మద్దతు’ మాటలందిస్తూ ఆ పార్టీ శ్రేణుల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. పార్టీ శ్రేణుల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. టీఆర్​ఎస్​కు రాష్ట్రంలో అధికారం ముందు మిగిలిన లక్ష్యాలన్నీ దిగదుడుపే.  అందుకే కాంగ్రెస్​ పార్టీకి  అవకాశం దక్కకుండా గులాబీ నేతలు తీవ్రంగా యత్నిస్తున్నారు.  ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు’ గంపగుత్తగా  ‘కాంగ్రెస్​’ పార్టీ వైపు వెళ్ళకుండా చెమటోడుస్తున్నారు. కాంగ్రెస్ నాయకత్వ ప్రతిష్టను మసకబారుస్తున్నారు. 

 ప్రజలకు భరోసా అవసరం 

కేసీఆర్​ ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించే పనిచేస్తున్నారు. బంగారు తెలంగాణ ఢంకా భజాయిస్తున్నారు. ఈ భ్రమల నుంచి బయటపడేయాల్సిన బాధ్యత కాంగ్రెస్​ పార్టీ పై ఉంది.  రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగ నియామకాలు పూర్తి  చేయలేదు. నిరుద్యోగ భృతి ఊసేలేదు. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. వరిసాగు సమస్యల్లో ఉంది. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేదు. పారిశ్రామికరంగంలో ఉద్యోగ కల్పన అంతగా లేదు.  ప్రభుత్వ విద్య ‘ప్రైవేటు’ ముందు వెలవెల పోతున్నది. రెండు పడకల ఇండ్లు, మూడెకరాలు మూలకుపడ్డాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు అమలు కాలేదు. 

ప్రజా సమస్యలపైన ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్​ గొంతులేకుండా చేస్తున్నారు. ఈ కుయుక్తులను పసిగట్టి ఈ కొద్ది కాలం అప్రమత్తతో ప్రజలను కదలించే కార్యక్రమం చేపట్టాలి. కాంగ్రెస్​ వైపు ప్రజలను తిప్పుకోవడమే కాదు. నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల్లో భరోసా కల్పించకుండా కేవలం టీఆర్​ఎస్​ వ్యతిరేకత కాంగ్రెస్​ను గట్టెక్కిస్తుందిలే అనుకుంటే ఎన్నికల నాటికి పరిస్థితి కిందిమీదకై అధికారం మరోసారి చేజారిపోయే ప్రమాదం ఉంది.


Relative Post

Newsletter