నిరుద్యోగుల ఆశలతో ‘పొలిటికల్​’ గేమ్​




ఏడేళ్లుగా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం

ఖాళీలు లక్షా90వేలని పీఆర్​సీ​ ప్రకటన

91వేల ఉద్యోగాల భర్తీకి మాత్రమే సర్కార్​ చర్యలు 


వేకువ ప్రత్యేక ప్రతినిధి:  కొట్లాట, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ రాజకీయ క్రీడగా మార్చివేశారు. సొంత రాష్ట్రం ఏర్పడితే తమ ఆకాంక్షలన్నీ నెరవేరుతాయని భావించిన వారి ఆశయలతో అధికార పక్షం చెలగాటమాడుతున్నది. ఏడున్నరేళ్ల పాలన తర్వాత నిరుద్యోగుల కలలు నెరవేరుస్తున్నామంటూ సీఎం కేసీఆర్​ అసెంబ్లీ సాక్షిగా ‘సంచలన’ ప్రకటన చేశారు. రాష్ట్రంలో 91 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు ఇందులో 11వేల మంది ఉద్యోగాలను రెగ్యులరైజ్​ చేస్తున్నట్లు ప్రకటించారు.  గమ్మత్తేమిటంటే తెలంగాణ ఆవిర్భావం అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్​ఎస్​  తొలిశాసనసభా సమావేశంలో కూడా ఇలాంటి ప్రకటన కేసీఆర్​ చేయడం గమనార్హం. 2014 ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షా7వేల ఉద్యోగాలను తక్షణం భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించినట్లు తాజాగా టీఎస్​పీఎస్​ కమిటీ సభ్యుడు విఠల్​ గుర్తు చేశారు.  కానీ, సాధ్యం కాలేదు ఇప్పుడు చేసినట్లుగానే పాలాభిషేకాలు సంబరాలతో యువత ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రాక్టికల్ గా అనేక సమస్యలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. 

నిరుద్యోగులతో చెలగాటం 

నిరుద్యోగుల ఆకాంక్షలు, ఆశలతో అధికారంలోకి వచ్చిన టీఆర్​ఎస్​ ఏడున్నరేళ్లుగా ఆటలాడుతున్నది. తాజాగా సీఎం కేసీఆర్​ అసెంబ్లీలో మాట్లాడుతూ  ఉద్యోగాల భర్తీ జాప్యానికి ముల్కీ స్ఫూర్తి  కంటే మించి రాష్ట్రపతి ఉత్తర్వులు ఉండే విధంగా కృషిచేయడం వల్ల జరిగిందని ప్రకటించిన విషయం తెలిసిందే. మాటవరుసకు అది సరైందే అనుకున్నప్పటికీ మరి ఏడేండ్లుగా ఇదిగో ఉద్యోగాల భర్తీ, అదిగో ఉద్యోగాల భర్తీ అంటూ నిరుద్యోగులతో చెలగాటమాడి తమ రాజకీయ పబ్బం గడుపుకున్నారని, తీరా విషయం బహిర్గతం కావడంతో రాష్ట్రపతి ఉత్తర్వులు, స్థానికులకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యమంటూ ప్రకటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ రాక, కోచింగ్​లు, శిక్షణల పేరుతో వేల రూపాయలు వెచ్చించి, ఆర్థికంగా నష్టపోయి నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడిన నిరుద్యోగుల కుటుంబాలకు ఎవరు సమాధానం చెబుతారని నిలదీస్తున్నారు. జాబ్​ రిక్రూట్​ మెంట్  క్యాలెండర్ ప్రకటించేందుకు ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ఏదిచేసినా అధికారమే లక్ష్యంగా ఆర్భాటం హంగూ హంగామా ప్రదర్శించడం తప్ప చిత్తశుద్ధి కరువైందని అంటున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ తెచ్చినోళ్ళమైన టీఆర్​ఎస్​,  మా మీద బాధ్యత ఉందనీ  ఇంకా తమ మంత్రులు రైల్వే కేసులచుట్టూ తిరుగుతున్నారని సీఎం ప్రకటించడం విమర్శలకు తావిస్తున్నది. ప్రస్తుత రాష్ట్ర మంత్రి వర్గంలో  ఎక్కువ మంది తెలంగాణ ఉద్యమకాలంలో  ఏపార్టీలో ఉన్నారని, ఎక్కడ ఉన్నారని, ఇందులో ఉద్యమకారుల పై దాడులు దౌర్జన్యం చేసినవాళ్ళెంతమందని నిలదీస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం నిజాలను సీఎం దాచిపెడుతున్నారని విమర్శిస్తున్నారు. 

 ఇప్పటి వరకు 62వేల ఉద్యోగాలు భర్తీ 

ఇప్పటికే రాష్ట్రంలో లక్షా 32వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది వాస్తవానికి కాదని విఠల్​ స్పష్టం చేయడం గమనార్హం. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 30 వేల ఉద్యోగాలు,  టి ఎస్ పి ఎస్ సి ద్వారా 32వేల ఉద్యోగాలు అంటే మొత్తంగా 62వేల ఉద్యోగాలు మాత్రమే ప్రత్యక్షంగా రిక్రూట్​మెంట్​​ చేశారు.  మిగిలిన 42 వేల ఉద్యోగాలు పంచాయతీరాజ్ శాఖలో 20వేల మందిని, విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ విధానంపై పనిచేస్తున్న 22వేల మందిని ఇందులో కలిపి ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. నిజానికి వీళ్లంతా 20 సంవత్సరాల క్రితం నుంచే కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు.

సర్వీస్​ రూల్స్​, రిజర్వేషన్​ల అడ్డంకి

తాజాగా  ప్రకటన నోటిఫికేషన్లు వచ్చేందుకు దాదాపు మూడు నుంచి నాలుగు నెలల టైం పడుతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో 32 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ఈ  కొత్త జోనల్ విధానం ప్రకారం ప్రస్తుతం 8 నుంచి 9 శాఖలకు సంబంధించిన ఖాళీల భర్తీకి చర్యలు తీసుకున్నారు. కానీ కొత్త జోనల్ విధానం ప్రకారం ఇంకా సర్వీస్ రూల్స్ రూపొందించాల్సిన అవసరం ఉంటుంది.  ఇప్పటికీ ఆ పని చేపట్టలేదు. అదేవిధంగా రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లు కూడా నిర్ణయించిన తర్వాత ఉద్యోగాల నోటిఫికేషన్ కసరత్తు చేసి ప్రకటన ఇచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో 317 జిఓ బదిలీల వల్ల అనేక గందరగోళాలు నెలకొన్నాయి. 

 ఖాళీలు లక్షా 90వేలని పీఆర్​సీ​ నివేదికలో ప్రకటన 

పీఆర్సీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో లక్షా తొంభై ఒక్క వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు పాయింట్ వైస్ గా ప్రకటించింది. బిస్వాల్ కమిటీ ప్రతిపాదనలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నది. ఈ మొత్తం  ఖాళీగా ఉన్న ఉద్యోగాలను  ప్రభుత్వం భర్తీ చేయకుండా కేవలం 90 వేల ఖాళీల భర్తీకి  చర్యలు చేపట్టారు. యుపీపీఎస్సీ  ప్రతియేటా ఉద్యోగ భర్తీ చేపట్టగా టి ఎస్ పి ఎస్ సి మాత్రం ఈ ఏడేళ్ల కాల పరిమితులలో  గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించి వెయ్యి  మంది,  గ్రూప్ ఫోర్త్​  సంబంధించి 1500 ఖాళీలు భర్తీకి మాత్రమే నోటిఫికేషన్లు జారీ చేయగలిగానంటే ప్రాక్టికల్ గా ఎదురయ్యే ఇబ్బందులు ఏవిధంగా ఉంటాయో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.  అందుకే ప్రభుత్వం ప్రకటన చేయగానే ఉద్యోగాల భర్తీ జరిగిపోయినట్టు భావించకూడదు  తాజా ఉద్యోగాల భర్తీ నిజాయితీగా చేపడితే మూడు నెలలు పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Relative Post

Newsletter