ఎనిమిది సంత్సరాల బిజెపి పాలన ఒక పరిశీలన

ఎనిమిది సంత్సరాల బిజెపి పాలన ఒక పరిశీలన 

ఎటిట్ పేజి

ఇంద్రావతి కాలమ్

-లంకా పాపి రెడ్డి


2014 పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి పూర్తి మెజారిటీ సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచింది .  ఈ ఎనిమిది సంవత్సరాలలో బిజెపి దేశం అభివృద్ధి కొరకు ఏమి చేసిందో ఒకసారి పరిశీలించు కోవలసి ఉంది . ఎన్నికలకు ముందు బిజెపి ఏ వాగ్దానాలు చేసింది , ఏ హామీలు ఇచ్చింది , ఎన్నికల తరువాత ఏమి చేశారు అని చూడాల్సి ఉంది . పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ , ఎన్నికల సన్నాహాలు ప్రచారాలు అప్పుడే ప్రారంభం అయ్యాయి . ఈ నేపథ్యంలో కూడా బిజెపి ఎనిమిది సంవత్సరాలలో ఏమి చేసిందో పరిశీలించాల్సి ఉంది . తప్పొప్పులను ప్రజల ముందు పెట్టాల్సి ఉంది . బిజెపి తన 8 సం రాల పాలన గురించి అబద్దాలు అతిశయోక్తుల తో గొప్పలు ప్రచారం చేసుకుంటున్న సందర్భంలో వాస్తవాలు ప్రజల ముందు తప్పని సరిగా పెట్టాలి . 

2014 పార్లమెంటు ఎన్నికలకు ముందు , అప్పటి వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ని బిజెపి తన ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు తీసుకు వచ్చింది . బిజెపిలో మోది కంటే సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ మోదీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా  ముందు తీసుకరావడం యాదృచ్చికంగా జరగలేదు . ఒక ప్రణాళిక ప్రకారమే మోదీని ప్రొజెక్ట్  చేయడం జరిగింది .  దేశీయ విదేశీయ కార్పొరేట్ సంస్థలు , వారి మీడియా సంస్థలు నరేంద్ర మోదికి వెన్నుదన్నుగా నిలబడినాయి . గుజరాత్ లో మోడీ బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించాడు , ఇప్పుడు ప్రధాని అయితే దేశాన్ని కూడా గొప్పగా అభివృద్ధి చేస్తాడు అనే ప్రచారాన్ని మీడియా సంస్థలు, 24 గంటలు ఊదరగొట్టాయి . అప్పటికే కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం వివిధ కుంభకోణాలలో , అవినీతి ఆరోపణలతో బాగా చెడ్డ పేరు తెచ్చుకున్నది . ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల  తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది .  అదే సమయంలో ఎక్కువ పార్లమెంటు సభ్యులు ఉన్న ఉత్తరప్రదేశ్ లో  ప్రణాళిక ప్రకారం  మత కలహాలను సృష్టించారు . ఈ నేపథ్యంలోనే 2014లో బీజేపీ 31 శాతం ఓట్లతో గెలిచి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది . 

2014 , 2019 పార్లమెంట్ ఎన్నికల ముందు బిజెపి పెద్ద పెద్ద హామీలు ఇచ్చింది . అధిక ధరలను అరికడతామని అన్నారు . నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామన్నారు . సంవత్సరానికి కోటి ఉద్యోగాలు సృష్టిస్తామని అన్నారు . ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన సిఫార్సులను అమలు చేస్తామని చెప్పారు . 370 ఆర్టికల్ ఎత్తివేసి కాశ్మీర్ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు . నూతన విద్య విధానంతో విద్యావ్యవస్థ ఎదుర్కుంటున్న సమస్యలన్ని పరిష్కారం అవుతాయి అన్నారు . రైతుల ఆదాయం రెండింతలు చేస్తామన్నారు . జీఎస్టీ అమలు అయితే ధరలు తగ్గుతాయి అని ప్రచారం చేశారు . అన్నింటికీ ఒకే దేశం ఒకే నీతి అని ప్రచారం చేశారు .  ఇంకా చాలా చెప్పారు కానీ కొన్ని ముఖ్యమైన విషయాలను ఆచరణలో పరిశీలిస్తే సరిపోతుంది , బిజెపి ఎనిమిది సంవత్సరాలా పాలనను అర్థం చేసుకోవడానికి . 

అధిక ధరల విషయంలో కాంగ్రెస్ ను తీవ్రంగా విమర్శించిన బీజేపీ ధరలను అరికట్టడంలో ఘోరంగా విఫలం అయింది . నిత్యావసర సరుకులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి . ఈ అధిక ధరలు సామాన్యుడి నడ్డి విరిచి వేశాయి . జీఎస్టీ అమలు అయితే ధరలు తగ్గుతాయని అబద్దాలను ప్రచారం చేసింది బిజెపి . రక రకాల పన్నులను తీసివేసి ఒకే పన్నుగా జీఎస్టీ అమలు చేయడం వల్ల ధరలు తగ్గుతాయని నమ్మబలికారు . ధరలు తగ్గలేదు కానీ పన్నులు వసూలు చేసే విషయంలో రాష్ట్రాల అధికారాలకు మాత్రం  కత్తెర పడింది . ఒకే దేశం ఒకే పన్ను పేరుతో రాష్ట్రాల అధికారాలను కత్తిరించారు . సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వున్న ఉద్యొగాలకు ఉద్వాసన పలికారు . ఉద్యోగాలు ఏవని అడిగితే పకోడీలు వేసుకోవడం కూడా ఉద్యోగమేనని గద్దించారు . లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీ ఉన్న భర్తీ చేయడం లేదు . చివరికి సైన్యంలో కూడా ఖర్చులు తగ్గించుకోవడానికి మూడు సంవత్సరాల అనిశ్చిత  ఉద్యోగాలు తీసుకురాబోతున్నారు . రైతుల విషయంలో చెప్పిన దానికి పూర్తిగా భిన్నంగా వ్యవహరించింది బిజెపి ప్రభుత్వం . స్వామినాథన్ కమిషన్ రిపోర్టు సిఫారసు ప్రకారం కనీస మద్దతు ధర (c2+50%) గా నిర్ణయించలేము అని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం . 2019 పార్లమెంట్ ఎన్నికల ముందు రైతుల ఆదాయం రెండింతలు చేస్తామని చెప్పారు . గెలిచిన తర్వాత రైతుల భూముల కే ఎసరు పెట్టే , 3 రైతు చట్టాలను తీసుకువచ్చారు . ఒక సంవత్సరం పాటు వందలాది మంది రైతుల బలిదానాలతో చేసిన రైతుల ఆందోళన కారణంగా ఆ చట్టాలను ఉపసంహరించుకున్నది బిజెపి . ఇప్పటికీ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే రైతులు అసలు డిమాండ్ ను బీజేపీ వ్యతిరేకిస్తుంది . నూతన విద్య , నైపుణ్య విద్య , అందరికీ విద్య అంటూ రకరకాల పేర్లతో బిజెపి విద్యను కాషాయీకరణ చేయ పూనుకున్నది . చరిత్రను వక్రీకరిస్తున్నారు . బిజెపి పాలిత రాష్ట్రాలలో హిందూ మత గ్రంథాలను పాఠ్యాంశాలుగా చేర్చడం మొదలుపెట్టారు . వాటినే చరిత్రగా చెప్పాలని చూస్తున్నారు . కర్ణాటకలో భగత్ సింగ్ , పెరియార్ చరిత్రలను తీసివేసి లేదా కుదించి వేసి , హెడ్గేవార్ ఉపన్యాసాన్ని పెట్టారు . బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అయితే జ్యోతిష్యాన్ని కూడా అధ్యయనం అంశంగా చేర్చడమే కాదు పిడకలు చేయడం మంత్రాలు చేతబడులు వరకు అధ్యయన విషయాలుగా చేర్చారు . విద్యను కాషాయీకరణ చేస్తూ దేశాన్ని మధ్యయుగాలలోకి తీసుకు వెళ్తున్నారు . ఉన్నత విద్యాసంస్థల అధిపతులుగా ఆరెస్సెస్ భావజాలం కలవారిని నియమిస్తున్నారు . విద్యను మాత్రమే కాషాయీకరణ చేయడం లేదు విద్యా సంస్థలను కూడా కాషాయీకరణ చేస్తున్నారు . తమకు వ్యతిరేకమైన విద్యార్థి సంఘాల నాయకులను వేధిస్తున్నారు కేసులు పెడుతున్నారు . మొత్తంగా విద్యను తమ భూస్వామ్య ఆలోనా విధానానికి అనుకూలంగా మార్చుతున్నది బిజెపి . 

డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ అంత గొప్ప వాడు ఇంత గొప్పవాడు అంటూ బూటకపు భజన చేస్తూనే రాజ్యాంగంలో పనికిరాని చట్టాలు చాలా ఉన్నాయి వాటిని అన్నింటిని తీసివేయాలని ప్రధాని మోడీ చాలా సార్లు చెప్పాడు . అందులో భాగంగానే కార్మికులకు అనుకూలమైన చట్టాలను తీసివేసి పారిశ్రామిక అధిపతులకు అనుకూలమైన నాలుగు లేబర్ కోడ్ లను  తీసుకువచ్చింది బిజెపి ప్రభుత్వం . రాజ్యాంగ రక్షకులం అని చెప్పుకునే సంఘాలు , సంస్థలు ఈ విషయంలో మౌనవ్రతం  వీడడం లేదు . ఒకే దేశం ఒకే విధానం అనే పేరు మీద రాష్ట్రాల అధికారాలను ఒక్కటొక్కటిగా కత్తిరించి వేస్తూ అధికారాలన్ని కేంద్రం దగ్గర కేంద్రీకరించ బడుతున్నాయి . భారతదేశం రాష్ట్రాల సంగం అనే ఫెడరల్ భావాన్ని బీజేపీ నెమ్మదిగా చెరిపి వేస్తున్నది . పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలకు రాష్ట్రాల అధికారాలు అడ్డురాకుండా , ఆటంకం కాకుండా చూడడానికే , కేంద్రం రాష్ట్రాల అధికారాలను కుదించి వేస్తున్నది . ఇక పెద్ద నోట్ల రద్దు ద్వారా నల్ల డబ్బు , దొంగ నోట్ల అంతం అవుతాయని చెప్పారు ప్రధాని మోడీ గారు . కానీ ఇవి రెండూ అంతం కాలేదు . అసలైన 2000 నోట్లు నల్లధనం గా మారింది . నకిలీ 2000 నోట్లు మార్కెట్లో తిరుగుతున్నాయి . ఇటీవలనే రిజర్వుబ్యాంకు ఇచ్చిన రిపోర్టు ప్రకారం గత సంవత్సరంతో పోలిస్తే 500 రూపాయల నకిలీ నోట్లు వంద శాతం పెరిగాయి . రెండు వేల నకిలీ నోట్లు 54 శాతం పెరిగాయి . 370 ఆర్టికల్ రద్దు చేస్తే కాశ్మీర్ వేర్పాటువాదం దానికదే అంతం  అవుతుందని చెప్పింది బిజెపి ప్రభుత్వం . 370 ఆర్టికల్ ను రద్దు చేసి మూడు సంవత్సరాలు కావస్తున్నా కాశ్మీర్లో కాల్పుల మోతలు ఆగడం లేదు . మరణ రోదనలు నిలవడం లేదు . కాశ్మీర్ పండితుల పేరు చెప్పుకుని ఓట్లు దండుకోవడం తప్ప 8 సంవత్సరాలు అయినా  వారి సమస్యకు పరిష్కారం చూపించలేకపోయింది కేంద్ర ప్రభుత్వం . చివరికి వారికి రక్షణ కల్పించడంలో కూడా బిజెపి ప్రభుత్వం విఫలం అయ్యింది .  

 కరోనా విషయంలో బీజేపీ ప్రభుత్వం నేరపూరితమైన నిర్లక్ష్యం వహించింది . మొదటి వేవ్ లో కరోనా 2020 జనవరి లోనే భారత దేశంలో ప్రవేశించినా ప్రతిపక్షాలు హెచ్చరించినా పట్టించుకోలేదు . ఫిబ్రవరిలో నమస్తే ట్రంప్  పేరు మీద గుజరాత్ లో పెద్ద బహిరంగ సభ జరిపారు . ధిల్లీ ఎన్నికలలో తలమునకలై ఉన్నారు . దిల్లి ఎన్నికలలో బిజెపి ఓటమి తరువాత జరిగిన మతకలహాల సమయంలో కూడా కరోనా గుర్తుకు రాలేదు కేంద్ర ప్రభుత్వానికి . చివరికి కరోనా తీవ్రం అయ్యే సరికి ఆగమేఘాల మీద ఎటువంటి ముందస్తు తయారీలు హెచ్చరికలు లేకుండా మార్చి 22 న  దేశవ్యాప్తంగా మొత్తం లాక్ డౌన్  ప్రకటించారు . లక్షలాది వలస కార్మికులు ఈ నిర్ణయం వలన నరకం చూశారు . తమ సొంత ఊర్లకు కాలినడకనే చేరుకోవడానికి ఎటువంటి కష్టాలు పడ్డారో ప్రపంచం అంతా చూసింది . ఇక రెండవ వేవ్ సందర్భంగానూ బీజేపీ ప్రభుత్వం అదే క్షమించరాని నిర్లక్ష్యం వహించింది . రెండో వేవ్ మన దగ్గర కూడా వస్తుందని హెచ్చరిస్తున్నా , హరిద్వార్ లో కుంభమేళ నిర్వహించారు అట్టహాసంగా . బెంగాల్ ఎన్నికలలో గెలవబోతున్నామనే  మత్తులో కరోనాను పట్టించుకోలేదు . పరిణామం ఏమంటే రెండవ వేవ్ లోనే చాలా మంది చనిపోయారు . ఆక్సిజన్ లేక కొందరు చనిపోయారు . స్మశాన వాటికలలో  శవాల క్యూలు పెట్టాల్సి వచ్చింది . గంగానదిలో శవాలు ప్రవహించాయి . కరోనాతో మనదేశంలో చని పోయిన వారి సంఖ్య ప్రభుత్వం చెబుతున్న దాని కంటే పది రేట్లు ఎక్కువే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పుతున్నది . వ్యాక్సిన్ విషయంలోనూ అదే గందరగోళం పద్ధతిని అవలంబించింది బిజెపి . మొదట్లో వ్యాక్సిన్ లను కేంద్ర ప్రభుత్వానికి ఒక ధరతోనూ  రాష్ట్రాలకు ఒక దరతోనూ  కంపెనీలు అమ్ముతాయని చెప్పింది కేంద్రం . కేంద్రం , కొన్ని రాష్ట్రాలకు ఉచితంగా వాక్సిన్ ఇస్తానని ఎన్నికల వాగ్దానం చేసి ఉండింది . తరువాత సుప్రీంకోర్టు అందరికి వ్యాక్సిన్  ఉచితంగా ఇవ్వాలని మొట్టికాయలు వేసిన తర్వాతనే , ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమాన్ని తీసుకున్నది ప్రభుత్వం . ఇప్పుడు విచిత్రంగా బిజెపి ప్రభుత్వం కరోనాను సమర్థవంతంగా అరికట్టిబట్లుగా ప్రచారం చేసుకుంటున్నది .

మొత్తంగా చూస్తే ఈ ఎనిమిది సంవత్సరాలలో బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాలలో ఘోరంగా విఫలం అయింది . ఆర్ధికరంగంలోనూ , రాష్ట్రాలు కేంద్రం సంబంధాల విషయంలోనూ విద్య వైద్య విషయంలోనూ  విదేశీ విధానం లోను విఫలం అయ్యింది . వ్యాపార లోటు పెరిగిపోతూనే ఉంది. దేశాన్ని అప్పుల పాలు చేసింది .  అయినా విచిత్రంగా బిజెపి ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి సాధించినట్లు వీడియోలు తీసి మరీ ప్రచారం చేస్తున్నది . రానున్న గుజరాత్ ఎన్నికల కొరకు బీజేపీకి ఇది అవసరం . అందుకే వైఫల్యాలను కూడా విజయాలుగా ప్రచారం చేస్తున్నది బిజెపి . అయితే ఇది బిజెపి రెండవ దఫా పాలన కావున ప్రజలు , బిజెపి చెప్పినదంతా నమ్మడం కష్టం .  ప్రజలు బిజెపి ఆచరణను , ప్రచారాన్ని సరిపోయినంత చూశారు.

-లంకా పాపిరెడ్డి

Relative Post

Newsletter