తెరాస 8 సంవత్సరాల పాలన ఒక పరిశీలన

 తెరాస 8 సంవత్సరాల పాలన ఒక పరిశీలన


 ఎడిట్ పైజీ వ్యాసం     ఇంద్రావతి కాలమ్


తెలంగాణ రాష్ట్ర సమితి 2014లో కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణాలో తొలిసారిగా జరిగిన ఎన్నికలలో మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది . రెండవసారి ముందస్తు ఎన్నికలు జరిపి 2018 డిసెంబర్ లో మరోసారి తెరాస గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది . మొత్తంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తెరాస 8 సంవత్సరాల నుండి పాలన సాగిస్తూ ఉన్నది .   ఎన్నికల్లో అన్ని పార్టీలు చెప్పినట్లుగానే తెరాస కూడా అవి ఇవి అన్నీ చేస్తామని హామీలు ఇచ్చింది . వ్యవసాయం పారిశ్రామిక అభివృద్ధి తో లక్షల కొద్దీ ఉద్యోగాల కల్పన చేస్తామని హామీ ఇచ్చింది . పౌర హక్కులను శాంతియుత ఉద్యమాలకు హామీ ఇచ్చింది . ఇంకా విద్యా , వైద్య , సంక్షేమ కార్యక్రమాలు ఇరిగేషన్ గురించి కూడా చాలా హామీలను ఇచ్చింది . కొన్ని ముఖ్యమైన హామీలను పరిశీలిద్దాం .

వ్యవసాయరంగం;

వ్యవసాయానికి సంబంధించి తెరాస ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం లేదా ప్రణాళిక ఉన్నట్లు కనిపించదు . గ్రామాలలో రైతు సంఘాల నిర్మాణం చేశారు . వాటికి ఏమి చేయాలో ఇప్పటికీ తెలవదు . తెలంగాణ వాతావరణం ఎంతో అనుకూలమైనది , రక రకాల విత్తనాల హబ్ గా  తెలంగాణను అభివృద్ధి చేయవచ్చు అన్నారు . కానీ ప్రభుత్వం  ప్రత్యేకంగా చేస్తున్న కృషి ఏమీ లేదు . తెలంగాణ రాష్ట్రాన్ని ఆయా పంటల ప్రాతిపదికగా క్లస్టర్లుగా విభజించి ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామన్నారు . ఇంతవరకు ఆ దిశలో ఎటువంటి కార్యక్రమాలు లేవు . ఇక మధ్యలో ఒకసారి అయితే వ్యవసాయ ఉత్పత్తుల ధరలను రైతులే నిర్ణయించేలా చేస్తామని కెసిఆర్ అన్నారు . కానీ ఏమైందో తెలవదు కానీ మళ్ళీ ఆ ప్రస్థావనే తేవడం లేదు . రుణమాఫీ అరకొరగానే జరిగింది . ఒకసారి మరోసారి మొక్కజొన్న వేయకండి అని చెప్పారు . ఒకసారి పత్తి వేయకండి అని చెప్పారు . రెందు సార్లు ప్రభుత్వం చెప్పిన దానికి భిన్నంగానే ఉండినాయి ఫలితాలు . ఇప్పుడు కూడా వ్యవసాయ మంత్రి గారు లాభాలు ఉన్న పంటలు వేయండి అని చెబుతున్నాడు . మంత్రి గారికి పెట్టుబడిదారి మార్కెట్ ఆర్థిక వ్యవస్థ గురించి తెలవదు అనిపిస్తున్నది . ఒక పంటకు లాభం ఉందనగానే  అందరూ అదే పంట వేస్తారు . దానితో మళ్ళీ కథ మొదటికి వస్తుంది . ఒక ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థలో మాత్రమే ఏ పంట వేయవచ్చును ఏ పంట వేయవద్దని చెప్పగలుగుతారు .  ప్రస్తుతం చేయవలసినది ఏమంటే రైతు  పంటకు గిట్టుబాటు ధర లభించేలా తెలంగాణా ప్రభుత్వం  కృషి చేయాలి . స్వామినాథన్ కమిషన్  చెప్పిన సిఫారసు ప్రకారం రైతులకు కనీస మద్దతు ధర లభిస్తే , కనీస జీవన న స్థాయిలో భద్రతతో బతక గలుగుతాడు  . ఎరువులకు , వ్యవసాయ పనిముట్లు ఇతరాలకు సబ్సిడీలు  ఇవ్వడం వల్లనూ , గిట్టుబాటు ధర వాల్లనూ కౌలు రైతులకు కూడా మేలు జరుగుతుంది .   ఆత్మహత్యలు చేసుకునే రైతులు ఎక్కువ మంది కౌలు రైతులే . సరి అయిన వ్యవసాయ విధానం లేనందువల్లనే ఇప్పటికీ రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి . కానీ తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం మే  రైతుల సమస్యలన్నింటికీ పరిష్కారం అన్నట్లుగా ప్రచారం చేస్తున్నది . వ్యవసాయ పెట్టుబడి విపరీతంగా పెరిగి పోతూ ఉంటే రైతుబంధు పేరు మీద ఇచ్చే డబ్బు రైతు సమస్యలను మొత్తంగా పరిష్కరించలేదు రైతు . రైతు కుటుంబం శ్రమ + పెట్టుబడి, ఇతరాలను కలిపి , స్వామినాథన్ సిఫార్సు ప్రకారం నిర్ణయించే చట్టబద్ద కనీస మద్దత్తు ధర మాత్రమే  ప్రస్తుత పరిస్థితుల్లో రైతు సమస్యలను కనీసంగా పరిష్కరించగలదు. ఎందుకంటే పెట్టుబడి ఎంత పెరిగినా దాని ఆధారంగానే కనీస మద్దత్తు ధర నిర్ణయించబడుతుంది కావునా , దానికి చట్టబద్ధత ఉంటుంది కావున రైతుకు నష్టం జరగదు . ఇరిగేషన్ సౌకర్యం కల్పించడమే వ్యసాయం అభివృద్ది కాదు . నీటిపారుదల సౌకర్యం వలన రెండు పంటలు పండినా , ఎక్కువ పంట పండినా కనీసమద్దత్తు ధర లభించనప్పుడు రైతులకు ఒరిగేది ఏమి ఉండదు . కాకపోతే ప్రభుత్వం , మా హయాంలో ఉత్పత్తి ఎంతో పెరిగిందని గొప్పలు చెప్పుకోవడానికే పనికి వస్తుంది.

పారిశ్రామిక రంగం

రెండు ఇక రెండవ విషయం పారిశ్రామిక రంగం . ఈ రంగంలో తెలంగాణ చెప్పుకోదగిన అభివృద్ధి ఏమి సాధించలేదనే చెప్పాలి . ఆంధ్ర వలస పాలన కాలంలో తెలంగాణలో మూసివేయబడిన పరిశ్రమలను మళ్లీ తెరుస్తాం లేదా ప్రత్యామ్నాయ పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం అని తెరాస తన ఎన్నికల ప్రణాళికలో చెప్పింది. వరంగల్ ఆజంజాహి మిల్లు ఏమైందో అందరికీ తెలుసు . ప్రత్యామ్నాయంగా హామీలు , ప్రచారాలు , శంకుస్థాపనలు , రిబ్బన్ కటింగ్ లు తప్ప నేలమీద ఏమీ జరగలేదు .  హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక కారిడార్ అని చెప్పిన హామీని అందరూ ఎప్పుడో మరిచిపోయారు . మళ్లీ ఎప్పుడో ఎన్నికలప్పుడు తవ్వకాలలొ ఇటువంటి హామీలు బయటకు వస్తాయి . వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు అందులోనూ అంత పెద్ద పురోగతి ఏమీ లేదు . ప్రపంచంలో ఎక్కడైనా , పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలే నిలకడైన ఆర్థిక అభివృద్ధిని కనపరుస్తున్నాయి , వ్యవసాయాన్ని ఆధారం చేసుకుంటూ సాధించే పారిశ్రామిక  అభివృద్ధి మత్రమే తెలంగాణలోని నిరుద్యోగాన్ని నిర్మూలించగలిగుతుంది . అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాదు అని కూడా చెప్పారు నిజమే కానీ ఇతర ఉద్యోగాల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి ఏది ?  తెలంగాణ పారిశ్రామికంగా అభివృద్ధి అయినప్పుడే  వ్యవసాయంలో కొనసాగుతున్న అప్రత్యక్ష నిరుద్యోగం కూడా అంతమవుతుంది . అందరి ఆదాయాలు పెరుగుతాయి . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి పేరిట లేదా దానికి ప్రత్యామ్నాయంగా సర్వీస్ సెక్టార్ ను ని చూస్తున్నది . అందులోనూ ముఖ్యంగా ఐటీ రంగాన్ని తెలంగాణ అభివృద్ధికి చిహ్నంగానూ పారిశ్రామిక అభివృద్ధికి చిహ్నంగానూ భావిస్తున్నది . ఐటీ రంగం పారిశ్రామిక రంగం కల్పించినన్ని ఉద్యోగాలను కల్పించలేదు . అంతే కాదు ఈరోజు  మన దేశ  ఐటి రంగం అంతా , మన దేశ వ్యవసాయం పారిశ్రామిక రంగానికి చేసే సేవ స్వల్పం మాత్రమే . అందుకే అమెరికా యూరప్ ఆర్థిక వ్యవస్థలకు జలుబు చేస్తే మన ఐటీ రంగానికి చీముడు కారుతుంది అంటారు . ఐటీ రంగం నిలకడైన రంగం కాదు ఈ రోజు . ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో ఐటీ రంగాల్లో ఉద్యోగాల పెరుగుదలకు పరిమి ఉంది . మన వ్యవసాయం పారిశ్రామిక అభివృద్ధి మాత్రమే ఐటీ రంగానికి నిలకడైన పునాదిని అందించగలదు . పారిశ్రామిక అభివృద్ధి , వ్యవసాయం అభివృద్దికి ఊపును ఇస్తుంది . ఈ రెండింటి అభివృద్ధి మాత్రమే సర్వీసు రంగం అభివృద్ధికి తోడ్పడుతుంది . మన వ్యవసాయ , పారిశ్రామిక అభివృద్ధి లేకుండా జరిగే సర్వీస్ సెక్టర్ , ఐటీ రంగం అభివృద్ధి గాలిలో దీపం లాంటిదే .  

 మిగతా రాష్ట్రాలతో పోల్చి నప్పుడు ముఖ్యంగా బిజెపి పాలిత రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ అభివృద్ధిలో మెరుగ్గానే ఉన్న మాట వాస్తవమే . అయితే తెలంగాణ రాష్ట్రంగా తెరాస చేతికి వచ్చేటప్పటికే ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల కంటే చాలా మెరుగైన అభివృద్ధి చెందిన ప్రాంతం గానే ఉన్నది . హైదరాబాద్ అప్పటికే ఐటీ కేంద్రంగా ఎదుగుతున్నది . వ్యవసాయం పరిశ్రమలు ఐటీ రంగంలో అప్పటికే అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ఒక రాష్ట్రంగా తెలంగాణా ఉన్నది . తెరాస చెప్పినట్లుగా అప్పటికే ధనిక  రాష్ట్రం తెలంగాణ . కానీ తెరాస మొత్తం పునాది నుండి తెలంగాణను అభివృద్ధి చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నది . తనకు లభించిన పునాది పైనే ఆధారపడి ఎంత అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందో అంత అభివృద్ధి జరిగిందా లేదా చూసుకోవాలి తెరాస నాయకులు . కానీ అంతా తామే అభివృద్ది చేసినట్లుగా చెప్పుకోవడం వాస్తవంగా ఉండదు .  


కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావున మొదట్లో కేంద్రంతో ఘర్షణ తో కూడిన సంబంధాలు కాకుండా సామరస్యపూర్వక సంబంధాలు ఏర్పరచుకోవడం అనివార్యం కావచ్చు . కానీ కేంద్రం స్పష్టంగా రాష్ట్రాల హక్కులను కుదించుకుపోతూ ఉంటే తెరాస ప్రభుత్వం కిమ్మనకుండా నే ఉన్నది . తెలంగాణ రాష్ట్రానికి కావలసిన అనుమతులు అవకాశాలు నిధులు లభిస్తే చాలు అన్నట్లుగా వ్యవహరించింది . చివరికి అధికారాలన్ని కేంద్రం వద్ద కేంద్రీకృతమవుతుంది వచ్చి , సమస్యలు ఎదుర్కొనే సరికి కేంద్రానికి వ్యతిరేకంగా అనివార్యమై మాట్లాడుతున్నది . అప్పటి వరకూ కేంద్రం నిర్ణయాలు అన్నింటిని సమర్థించుకుంటూ పోయింది తెరాస .రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీజేపీకి అనుకూలంగా ఓటు వేసింది . చివరికి విద్యుత్ బిల్లులు వ్యవసాయ చట్టాల సందర్భంలో కేంద్రాన్ని తెరాస వ్యతిరేకించింది . కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది . ప్రాంతీయ పార్టీల పట్ల బిజెపికి ఉన్న అవగాహనను అర్ధం చేసుకొవడంలో తెరాస విఫలం అయ్యింది . ఇప్పటికీ కేంద్రం ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఒక స్పష్టమైన కార్యక్రమం , నిర్మాణం ఏమీ కనిపించడం లేదు .

ప్రజాస్వామిక ఉద్యమాల పై టీఆర్ఎస్ విధానం

ఇక చివరగా తెరాస తన 2014 ఎన్నికల ప్రణాళిక లోనే ఈ విధంగా చెప్పింది “ ప్రజాస్వామికమైన కార్యకలాపాలను ఎవరు చేపట్టినా వారికి ఎటువంటి అవరోధం లేని విధంగా వారి హక్కులను కాపాడే విధంగా ఉంటుంది . ప్రజలు శాంతియుతంగా అహింసామార్గంలో ఉద్యమించే హక్కు అమలయ్యే వాతావరణం నిర్మిస్తుంది “ . అని రాసుకుంది .  8 సంవత్సరాల తెరాస పాలన దీనికి పూర్తిగా విరుద్ధంగా కొనసాగింది . సంక్షేమ కార్యక్రమాలపై డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తే ఏవిధంగానైనా పాలన చేయవచ్చు అనుకున్నట్లు కనిపిస్తుంది . ధర్నాలు , నిరసనలు నిషేధానికి గురయ్యాయి . ఆంధ్ర వలస పాలకుల కాలంలో కూడా వంద రోజులు , సంవత్సరం కూడా టెంట్లు వేసుకుని నిరసన తెలిపిన రోజులు ఉన్నాయి . కాని తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రోజు కూడా టెంటు వేసి నిరసన తెలిపే పరిస్థితి లేకుండా పోయింది.  చివరికి హాల్ మీటింగ్ లను సైతం నిషేధించిన ఉదాహరణలున్నాయి అంటే , అంటే ప్రజాస్వామ్యం పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు . ఇంకా క్రింది స్థాయి లో టిఆర్ఎస్ నాయకులు , కొందరు ప్రజాప్రతినిధులు తమ ను ప్రశ్నించిన వారిని పోలీసులతో కొట్టిస్తున్నారు . పై నాయకత్వానికి ఇటువంటివి తెలిసినా తెలవక పోయినా అవి తెరాస ఖాతాలోనే పడతాయి . మొన్నటికి మొన్న వరంగల్ జిల్లాలో ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు ఎమ్ఎల్ఎ ఆరూరి రమేష్ , రైతులను పోలీసులతో కొట్టించాడు . ప్రజాస్వామ్యం లేకుండా శాంతి ఉండదు . కానీ కొందరు ప్రజాస్వామ్యాన్ని నిషేధించి శాంతిని సాధించవచ్చు అనుకుంటారు . కానీ ప్రజాస్వామ్యానికి , శాంతికి , అభివృద్ధికి విడదీయలేని సంబంధం ఉంది.. నాయకులందరూ శాంతి లేకుండా అభివృద్ధి సాధ్యం కాదంటూ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు .కానీ అసలు ప్రజాస్వామ్యం లేకుండా శాంతి అనేది ఉండదు అని తెలుసుకోవాలి ఈ నాయకులు . ప్రజాస్వామ్యం ఉంటే , శాంతి ఉంటుంది . శాంతి అంటే అభివృద్ధి జరుగుతుంది .

      -లంకా పాపి రెడ్డి

 మోబైల్ నంబర్; 8465053792

                  

Relative Post

Newsletter