కలిసి వచ్చేదెవరో?
బీజేపీకి చెక్ పెట్టేందుకు కేసీఆర్ వ్యూహం
ముంబయిలో ఉద్దవ్ థాకరేతో మంతనాలు
కాంగ్రెస్ కూటమా? కాంగ్రెసేతర కూటమా?
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత క్లారిటీ?
కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడం ఇది మొదటిసారి ఏమి కాదు.. 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా దేశ రాజకీయాలలో మార్పులు తీసుకు వస్తాను.. చక్రం తిప్పుతా.. అంటూ ఉపన్యాసాలు ఇచ్చారు. ఫెడరల్ ఫ్రంట్, మూడో ఫ్రంట్ గురించి చెప్పారు.. కొన్ని ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు చేశారు.. కొన్ని ప్రాంతీయ పార్టీలకు ఎన్నికలలో సహాయం కూడా చేశారు అంటూ ప్రచారం జరిగింది. అయితే అప్పుడు కేంద్రంలో మొత్తం అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నించినట్లు కనిపించ లేదు అటువంటి పరిస్థితి కూడా అప్పుడు లేదు.. కేంద్రంలో హంగ్ పార్లమెంట్ ఏర్పడితే సాధ్యమైనన్ని ఎక్కువ పదవులు సాధించడానికి బేరమాడి అన్ని సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. కానీ 2019 లో బీజేపీ పార్లమెంటులో సంపూర్ణమైన మెజారిటీ సాధించడంతో కేసీఆర్ మొత్తం ఆటనే మార్చివేశాడు.. అప్పటి వరకు కేంద్రంలో చక్రం తిప్పుతానని చెప్పిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడం మొదలు పెట్టారు. మళ్లీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తో సమరాస్య సహకార పద్ధతిలోనే ప్రయాణం కొనసాగించారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధిస్తే కేసీఆర్ మళ్లీ ప్లేటు ఫిరాయించవచ్చు. అయితే పరిస్థితులలో అప్పటికీ ఇప్పటికీ చాలా తేడాలు ఉన్నాయి 2019లో ఉన్నంత బలంగా బీజేపీ ఇప్పుడు లేదు.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, పంజాబ్, కర్ణాటక మహారాష్ట్రలలో బీజేపీ అధికారాన్ని పోగొట్టుకున్నది. మధ్య ప్రదేశ్ , కర్ణాటక లలో తప్పుడు పద్ధతులలోనూ ప్రభుత్వాలను కూల్చి తిరిగి బీజేపీ అధికారంలో కి వచ్చింది అని అందరికీ తెలిసిందే. అది బీజేపీ బలం కాదు బలహీనతనే హర్యానా, బీహార్లలో కూడా చావుతప్పి కన్నులొట్ట పోయిన చందంగానే పొత్తులతో బీజేపీ కూటమి గెలిచింది. పశ్చిమబెంగాల్లో గెలవబోతున్న ట్లుగా ఆకాశం బద్దలయ్యే విధంగా ప్రచారం చేసిన బీజేపీ అవమానకరమైన విధంగా చతికిలపడింది. తమిళనాడులో జయలలిత చనిపోయిన తరువాత అన్నాడీఎంకే ను నయానో భయానో ఉపయోగించుకుని తమిళనాడులో ప్రవేశించి చక్రం తిప్పాలని అనుకున్నారు కానీ అక్కడ కూడా బీజేపీ కలలు కల్లలయ్యాయి. మహారాష్ట్రలో బీజేపీ చెట్టు ఎక్కి కూర్చుంటే శివసేన చెట్టునే నరికివేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా బీజేపీ చాలా బలహీనపడింది మొత్తంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ మెజార్టీ సాధించడం అసాధ్యం. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా బలపడ లేదు.. బల పడకపోగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత సంక్షోభంలో చిక్కుకున్నది. చేతికి వచ్చిన అవకాశాలను కూడా వాడుకలో లేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ నాయకత్వం పైన క్యాడర్ విశ్వాసం కోల్పోతున్నది. మరోవైపు ప్రాంతీయ పార్టీలు ఆటుపోట్లు ఎదుర్కొంటున్న నిలబడినా బలపడుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బలహీన పడుతుంటే ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయి కానీ అదే సమయంలో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ను బీజేపీని పూర్తిగా పక్కకు తొలగించే పరిస్థితిలోనూ లేవు. నిర్ణయాత్మక పాత్ర వహించే స్థితిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఒక సూత్రం అయినా ఐక్యమై లేవు . ఒక సంధి దశలో కనిపిస్తున్నది ఒక సూత్రం పైన ప్రాంతీయ పార్టీలు ఐక్యమై కాంగ్రెస్ పార్టీతో ఒక ఒప్పందానికి రాగలిగితే బీజేపీని కేంద్రంలో అధికారం నుంచి నిర్మించడం సాధ్యమవుతుంది. ఏమైనా వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలు నిర్ణయాత్మక పాత్ర వహించబోతున్నారు. అందుకే కొన్ని మోదీ వ్యతిరేక కార్పొరేట్ సంస్థలు కూడా ఈ ప్రాంతీయ పార్టీ నాయకులకు సహకరించడానికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఈ మధ్యలో బీజేపీ పైన చేస్తున్న దాడిని చూడాల్సి ఉంటుంది.
అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్ని రోజులుగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం పైన ఒంటికాలిపై లేస్తున్నారు . కేంద్ర ప్రభుత్వ అసమర్థత, అవినీతి, ప్రజావ్యతిరేక విధానాల పైన నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటి వరకూ బీజేపీ నాయకులు కేసీఆర్ చిట్టా అంతా మా దగ్గర ఉన్నది కేసీఆర్ ను జైలుకు పంపుతామని బెదిరించే వారు . ఇప్పుడు కేసీఆర్ కేంద్ర మంత్రుల చిట్టా అంతా నా దగ్గర ఉంది, బీజేపీ నాయకులను జైలుకు పంపిస్తాను అని బెదిరిస్తున్నారు. బీజేపీ అధికారం నుంచి దించి ఎవరిని అధికారంలోకి తీసుకు రావాలో వారిని తీసుకు వస్తాము అంటున్నారు. మొత్తంగా చూస్తే కేసీఆర్ కొన్ని విషయాలు చెప్పకున్నా అర్థం అవుతున్నాయి . కొన్ని విషయాలు చెపుతున్నా అవి ఎలా అమలు అవుతాయనేది తెలవడంలేదు.
కేంద్ర మంత్రుల చిట్టాలు నా వద్దకు వచ్చాయి అని చెపుతున్నప్పుడు సహజంగానే తెలిసిపోయే విషయం ఏమిటంటే బీజేపీ వ్యతిరేకులు లేదా కేసీఆర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా అటువంటి చిట్టాలు చేరి ఉంటాయని. బీజేపీ వ్యతిరేకులు ఎవరు ? బీజేపీలో ఉన్న గ్రూపు తగాదాల వలన మోదీ కి వ్యతిరేకం గా మారిన నాయకులు కేసీఆర్ కు సమాచారం ఇచ్చి ఉండవచ్చు . లేకపోతే కేంద్ర ప్రభుత్వ వ్యవహారం వల్ల , పక్షపాత వైఖరి వలన నష్టపోయిన కార్పోరేట్ సంస్థలు అయినా అటువంటి సమాచారం కేసీఆర్ కు చేరవేసి ఉండవచ్చు . ఏదిఏమైనా ఏదో ఒక బలమైన శక్తి కేసీఆర్ కు వెన్ను దన్నుగా నిలబడి ఉన్నట్లు కనిపిస్తున్నది .
పెద్దపెద్ద కార్పొరేట్ శక్తులు తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలను కూల్చివేసి అనుకూలంగా ఉన్న వారిని అధికారంలోకి తీసుకు రావడం చరిత్రలో కొత్త ఏమి కాదు. స్వయంగా ప్రధాని మోదీకి 2014 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా గౌతమ్ అదానీ, మోడీకి ఎంతో సహాయం చేశారు. ఏదైనా ప్రభుత్వం ప్రజలలో అపఖ్యాతిపాలు అయినప్పుడు లేదా ప్రజల్లో పెద్దఎత్తున వ్యతిరేకత పెరిగినప్పుడు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు తమ మద్దతు ద్వారానే నెలకొల్పబడిన ప్రభుత్వాలను సైతం కూల్చి వేస్తాయి . సమయం ఉండగానే తమకు అనుకూలమైన వారిని రంగం మీదికి తీసుకువస్తారు . లేకపోతే వారికి వ్యతిరేకమైన ప్రభుత్వం ఏర్పడితే వారి ప్రయోజనాలకు నష్టం కలుగుతుంది మరి .
ఒకవేళ నిజంగానే పెద్ద కార్పోరేట్ సంస్థలు కేసీఆర్ వెనక ఉండినా , కేసీఆర్ కు బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చి మరో ప్రభుత్వాన్ని నిలిపే సమర్థత ఉన్నదా ? కాంగ్రెస్ లాంటి ఒక జాతీయ పార్టీ ఉండగా ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిని మోడీకి వ్యతిరేకంగా నిలబెట్టడానికి ఏ కార్పొరేట్ సంస్థలైనా ఎందుకు పునుకుంటాయి. కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉండడం వల్ల లేదా రాహుల్ గాంధీ నాయకత్వ సమర్థతను మీద నమ్మకం లేకపోవడం వల్ల సమర్థవంతమైన ప్రాంతీయ పార్టీ నాయకుడిని ఎంచుకుని ఉండవచ్చు . కేసీఆర్ దేశంలోని బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరుపుతానని కూడా చెబుతున్నారు . త్వరలోనే మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రులతో చర్చలు జరగబోతున్ననట్లు వార్తలు కుడా వస్తున్నాయి . మాజీ ప్రధాని, మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి దేవగౌడ తోనూ మాట్లాడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి . అయితే అసలు విషయం ఏమిటంటే , ముగ్గురో నలుగురో ముఖ్యమంత్రులతోనే బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయగలుగుతారా ? ఇందులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెసేతర కూటమికి సిద్ధపడతాడా ? మమతా బెనర్జీ ఈ మధ్యలోనే ఇటువంటి ప్రతిపాదన చేసినప్పుడు శివసేన తిరస్కరించింది . ఇప్పుడు కేసీఆర్ చెప్పితే ఠాక్రే వింటాడా ? మహారాష్ట్రలో శివసేన కాంగ్రెస్ పార్టీలు పొత్తు లో ఉన్నాయి . తమిళనాడులో కూడా స్టాలిన్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు లో ఉన్నాడు . దేవగౌడ కూడా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉన్నాడు . ఇటువంటి పరిస్థితిలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్సేతర కూటమి సాధ్యం అవుతుందా ? అఖిలేష్ కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత ఏర్పడే పరిస్థితిని బట్టే వ్యవహరించుతాడు . కేజ్రీవాల్ పూర్తిగా స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నాడు . ఏ కూటమి వైపు చూడడం లేదు . ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాంగ్రెసేతర బీజేపీయేతర కూటమి కి అనుకూలంగా ఉండవచ్చునేమో కానీ ఆయన కూటములలో చురుకుగా ఉండటం కంటే తన రాష్ట్ర ప్రయోజనాల గురించే ఎక్కువ శ్రద్ధ పెడతాడు. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా కచ్చితంగా కాంగ్రెసేతర బీజేపీయేతర కూటమికి సిద్ధం అవుతాడా అనేది చెప్పలేము ? కేసీఆర్ , మమతాబెనర్జీ లు మాత్రమే స్పష్టంగా కాంగ్రెసేతర బీజేపీయేతర కూటమి కి అనుకూలంగా ఉన్నారు. మిగతావారు వ్యతిరేకం గానో లేదా తేల్చుకోలేని పరిస్థితిలోనో ఉన్నారు . ఇటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ బీజేపీయేతర కూటమి అంత సులువు కాదు. అటువంటి కూటమి ఏర్పడిన కాంగ్రెస్ తో ఎన్నికలలో పొత్తు పెట్టుకోవలసిరావచ్చు.
రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరిస్తుండడం వల్ల , ఇతరత్రా వేధింపుల వల్ల బీజేపీ యేతర పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే బీజేపీ కేంద్ర ప్రభుత్వంపైనా పోరాటానికి ఒక్కటి అయ్యే అవకాశం ఉన్నది. అంతేకాదు ఆయా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్ని కాకపోయినా కొన్నైనా ఒక కూటమిగా ఏర్పడే అవకాశం ఉన్నది . కానీ కేవలం ప్రాంతీయ పార్టీల కూటమి ఒక్కటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ని గద్దె దించ కలిగే పరిస్థితి లేదు . ఈ ప్రాంతీయ పార్టీలు కూటమిగా ఏర్పడినా, కాంగ్రెస్ పార్టీ తోనూ వామపక్షాల తోనూ ఎన్నికల పొత్తు పెట్టుకోవడమో ఏదో ఒక ఒప్పందం చేసుకోవడం తప్పదు, బీజేపీని గద్దె దించాలి అంటే ..
ప్రశాంతి కిషోర్ ముందు కాంగ్రెస్ నాయకత్వంలో బీజేపీ వ్యతిరేక కూటమికి ప్రయత్నించినట్లు కనిపించింది . తరువాత కాంగ్రెస్ లేకుండానే బీజేపీ వ్యతిరేక కూటమికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు . ముందు మమతా బెనర్జీని ముందు పెట్టి అటువంటి కూటమికి ప్రయత్నం చేశాడు . కానీ ఫలితం ఏమీ కనిపించలేదు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్నాడు అని చెపుతున్నారు . మమతా బెనర్జీని ముందు పెట్టి చేసిన ప్రయోగాన్ని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ ను ముందు పెట్టి చేస్తున్నట్లు కనిపిస్తున్నది . ప్రశాంత్ కిషోర్ వెనక కార్పోరేట్ సంస్థలు ఉండి ఈ కథను అంతా నడిపించినా.. ఇప్పటికిప్పుడు కేసీఆర్ కు కాంగ్రెసేతర కూటమిని నిలబెట్టే సమర్థత లేదు . అటువంటి పరిస్థితి లేదు . ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఈ కూటముల నిర్మాణం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది
లంక పాపిరెడ్డి
సామాజీక , రాజకీయ విశ్లేషకులు