జోరుగా బేరసారాలు

జోరుగా బేరసారాలు 

౼ విచ్చలవిడి అమ్మకం కొనుగోల్లు

౼ సాగుతున్న రాజకీయ వ్యాపారం 

౼ దిగజారుతున్న రాజకీయాలు

౼ బహిర్గతమవుతున్న పార్టీల డోల్లతనం

౼ ప్రజా ఉద్యమాలే పరిష్కారం



(ప్రత్యేక ప్రతినిధి):గతంలో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రాజకీయ పార్టీలలో చేరికలు కొనసాగేవి. ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి చేరికలు లేదా పార్టీని వీడటం జరిగేది. ప్రధాన నాయకుడు పార్టీ మారితే ఒక సంచలన విషయంగా కనిపించేది. 

సాధారణంగా ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఎక్కువగా పార్టీలు మారి ఎన్నికలలో పోటీ చేసేవారు. తమకు పార్టీ టికెట్ దక్కనప్పుడు, ఎదుటి పార్టీ ఇచ్చే ఆఫర్ను స్వీకరించి ఆ పార్టీల్లో చేరేవారు. లేదా ఇండిపెండెంట్గనో, రెబల్ క్యాండిడేట్లుగానో బరిలో నిలిచేవారు.

౼ కేంద్రంగా మారిన తెలంగాణ


ప్రస్తుతం తెలంగాణలో విచిత్రకరమైన రాజకీయ పరిస్థితి నెలకొంది. ప్రధానంగా కాంగ్రెస్, టిఆర్ఎస్, బీజేపీ నుంచి పరస్పరం మార్పులు, చేర్పులు అమ్మకాలు, కొనుగోలు జోరుగా సాగుతున్నాయి. మరోరూపంలో చెప్పాలంటే టచ్ పాలిటిక్స్ రాష్ట్రంలో ఊపందుకున్నాయి

౼ దిగజారుడు రాజకీయం

కానీ, గత దశాబ్దంన్నర కాలంగా రాజకీయ రంగంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక విధమైన దిగజారుడు రాజకీయ విధానాలు తెరపైకి చేరాయి.

ఒక విధంగా సామాన్య జనం సైతం సిగ్గుపడే విధంగా రాజకీయ పార్టీల కార్యకలాపాలు జంపింగ్ జపాంగులు జోరుగా జరుగుతున్నాయి. ఈ పార్టీ మార్పుల ప్రక్రియ పతాక స్థాయికి చేరి, విలువలు పాతాళానికి పడిపోయాయి. 

సమయమూ, సందర్భము లేకుండా ఎదుటి పక్షాన్ని నిర్వీర్యం చేసేందుకు లేదా తమ పార్టీని పరిరక్షించుకునేందుకు, తప్పులను కప్పిపుచ్చేందుకు ఈ పార్టీల నేతలు మార్పులకు పురికొల్పుతున్నారు. దీనికి ఏదో ఒక పార్టీ కారణం కాదు. అన్ని పార్టీలు ఏదో ఒక సందర్భంలో ఇదే ప్రాతిపదికను అమలు చేస్తూ రాజకీయ విలువలను దిగజారుస్తున్నాయి. 

౼ జోరుగా అమ్మంకం కోనుగోళ్ళు

ఈ చేరికలు సందర్భంగా అమ్మకం, కొనుగోళ్ళు జోరుగా సాగుతున్నాయి. ఇందులో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా అమ్మకం కొనుగోలులో బలిపశువులవుతున్నారు.  ఒక విధంగా మార్కెట్ రేటు ప్రకారం ధర చెల్లిస్తే అమ్ముడుపోయేందుకు, అమ్యామ్యాలకు తలవంచేందుకు సిద్ధంగా ఉంటున్నారు. ప్రత్యక్ష, పరోక్ష ఆర్థిక ప్రయోజనాల కోసం, నమ్మిన సిద్ధాంతానికి,  చెబుతున్న రాజకీయ విలువలకూ చివరికి ప్రజలకు ఇస్తున్న హామీల పట్ల,  నియోజకవర్గాల ప్రజలూ, ఓటర్ల నమ్మకాలను బలి పెడుతున్నారు. తమ స్వార్ధ రాజకీయ పదవులకూ, సొంత ఆర్థిక అభివృద్ధికి తల తాకట్టు పెడుతూ ఉన్నారు. అప్పటివరకు తమ ఎదుగుదలకూ, పదవులు వచ్చేందుకు దోహదం చేసిన పార్టీలను తీవ్రంగా విమర్శిస్తూ ఎదుటి పార్టీలో చేరిపోతున్నారు. 


౼ ప్రజా ఉద్యమాలే పరిష్కారం


ఈ దిగజారుడు తనాలకు వ్యతిరేకంగా ప్రజలూ, ప్రజాస్వామిక శక్తుల నుంచి క్షేత్రస్థాయిలో బలమైన ఒత్తిడి వచ్చేవరకు ఈ తప్పుడు పద్ధతులు రాచమార్గంలో కొనసాగుతాయి. విచిత్రమేమిటంటే ఏ పార్టీ ముఖ్యనేతలు మాట్లాడినా పతనమవుతోన్న విలువలూ, దిగజారిపోయిన రాజకీయాల గురించి నీతుల ప్రవచనాలు చెప్పడం మరీ విడ్డూరం. వీరంతా ఏ చిన్న అవకాశం చిక్కినా ఇదే తప్పుడు పద్ధతిలో కొనసాగడం సిగ్గుచేటు. ఇటీవల దేశంలో, వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు జుగుప్సాకరంగా మారుతున్నాయి. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్నాయి. చివరికి ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువను కాపాడాల్సిన, వాటి రక్షణకు కృషి చేయాల్సిన వ్యవస్థలు కూడా ప్రేక్షకపాత్ర వహిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ తప్పుడు ధోరణులపై ప్రజలు అప్రమత్తం గావాల్సిన ఆవశ్యకత ప్రస్తుతం ఎంతో ఉంది.


Relative Post

Newsletter