బీబీసీ డాక్యుమెంటరీ... ఓ లిట్మస్ టెస్ట్...
బీబీసీ డాక్యుమెంటరీ... ఓ లిట్మస్ టెస్ట్...
దశాబ్దాలుగా ఒక సాంస్కృతిక సంస్థగా చెప్పుకొంటూ... రాజకీయ వాద, వివాదాలకు దూరంగా ఉన్నట్లు నటిస్తూ వచ్చిన ఆర్ఎస్ ఎస్ ఇప్పుడు ముసుగుచించుకొని బయటకు వస్తున్నది. రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, చివరికి కోర్టు వ్యవహరాల్లోనూ తల దూర్చి ఆర్ఎస్ఎస్ నిజరూపమేమిటో బయట పెట్టుకుంటున్నది. 1948లో గాంధీజీని హత్యచేయటంతో నిషేధానికి గురైన ఆర్ఎస్ఎస్ ... నిషేధాన్నీ, ప్రజాగ్రహాన్ని తప్పించుకొనేందుకు సంస్కృతిక సంస్థగా చెప్పుకొంటూ ఇన్నాళ్లుగా తెరవెనుక రాజకీయం నడుపుతూ... వచ్చింది. కానీ.. గత కొన్నాళ్లుగా అనేక విషయాలపై హిందుత్వ మెజారిటీ రాజకీయాల ఎజెండాను ఎత్తిపడుతూ... అన్నింటా జోక్యం చేసుకొంటున్నది. పాలక పక్షానికీ, అందులోని వ్యక్తుల దురాగాతాలకు వత్తాసు పలుకుతున్నది.
గుజరాత్‌లో 2002లో జరిగిన మారణకాండ నేపథ్యంలో బీబీసీ ఇండియా:ది మోదీ క్వశ్చన్ అనే డాక్యుమెంటరీని రూపొందించి గత నెలలో యూకేలో విడుదల చేసింది. అది ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయ్యింది. ఆ డాక్యుమెంటులో గుజరాత్ అల్లర్ల సందర్బంగా ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ నేరపూరిత నిర్లక్ష్యం వహించాడని ఆ డాక్యుమెంటు సోదాహర ణంగా వివరించింది. ఆ క్రమంలోనే మోదీ రాజకీయ ప్రస్థానం.., క్రమంగా ఆయన రాజకీయంగా ఎదిగి వచ్చిన క్రమాన్ని సాక్ష్యాధారాలతో కండ్లకు కట్టింది. ఆ డాక్యుమెంటును దేశంలో వివిధ యూనివర్సిటీల్లో విద్యార్థులు చూడటానికి ప్రయత్నిస్తే... హిందుత్వ శక్తులు అడ్డుకున్నాయి. భారత్‌లో ఆ డాక్యుమెంటరీని నిషేధించాలని డిమాండ్ చేశాయి. దీంతో.. కేంద్ర ప్రభుత్వం సామాజిక మాధ్యమాల్లో డాక్యుమెంటరీ లింక్‌ను బ్లాక్ చేసింది! బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రభుత్వం బ్లాక్ చేయటాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుప్రీం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
ఈ వ్యవహారాన్నంతా గమనిస్తూ వస్తున్న ఆర్ఎస్ఎస్... నేడు సహనం నశించినట్లుగా అసహనం వెళ్లగక్కింది. సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీచేయటా న్ని ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక పాంచజన్య సంపదకీయం తీవ్రంగా తప్పు పట్టింది. సుప్రీంకోర్టు దేశ వ్యతిరేకులకు పనిముట్టు గా మారిందని విమర్శించింది. ఇన్నాళ్లూ... మానవ హక్కుల పేరుతో ఉగ్రవాదుల ను కాపాడటం, పర్యావరణం పేరుతో అభివృద్ది ప్రాజెక్టులను అడ్డుకోవటం చేసి, ఇప్పుడు దేశ వ్యతిరేక శక్తులకు భారత్‌కు వ్యతిరేకంగా దేశంలోనే తప్పుడు ప్రచారం చేసే హక్కును కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పాంచజన్య ఆరోపించింది!నిజానికి ఈ విధంగా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టడం తీవ్ర విషయం. ఇలాంటివి కోర్టు ధిక్కరణ కిందికే వస్తాయి. అలాంటి వారు శిక్షార్హులవుతారు. ఆర్ఎస్ఎస్ అధినేతలను తప్పుపట్టి శిక్షించే సాహసం నేటి న్యాయవ్యవస్థకు, కార్యనిర్వాహక వ్యవస్థకు ఉన్నదని, ఉంటుందని ఆశించటం అత్యాశే కావచ్చు, కానీ... ఒక మంచి జరుగుతున్నది. పాలు- నీళ్లు వేరవుతున్నాయి. ఎవరేమిటో, ఎవరు ఏ వర్గ ప్రయోజనాలకోసం ఉన్నారో ప్రజల ముందు తేటతెల్లం అవుతున్నది.
ఆదివాసులను, రచయితలు- మేధావులను, విద్యార్థులు, మైనారిటీ లను, ప్రజా కార్యకర్తలను జర్నలిస్టులను యూఏపీఏ చట్టం కింద దేశ ద్రోహ నేరం మోపటాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా హక్కులసంఘాలు విమర్శిస్తున్నాయి. కోర్టుల్లో సవాలు చేస్తున్నాయి. ఈ హక్కుల సంఘాల పనులనే ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులను కాపాడటంగా చెప్పుకొస్తున్నది. ఆదివాసీ ప్రాంతాల్లో గనుల తవ్వకాలు చేపడుతూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్న కార్పొరేట్ కంపెనీలను వ్యతిరేకిస్తున్నం దుకు... వారిని ప్రగతి నిరోధకులుగా ముద్రవేస్తున్నది. తాజాగా బీబీసీ డాక్యుమెంటరీని దేశ వ్యతిరేక ప్రచారం అంటున్నది. ఇండియా-ది మోదీ క్వశ్చన్ డాక్యుమెంటరీని నిషేధించటాన్ని తప్పుపట్టి కోర్టులో సవాల్ చేయటాన్ని ఆర్ఎస్ఎస్ దేశ వ్యకతిరేక కార్యకలాపంగా, సానుకూల కోర్టు స్పందనను దేశ వ్యతిరేక శక్తులకు పనిముట్టుగా మారినట్లుగా అభివర్ణిస్తున్నది. ఇంకా ఒకడుగు ముందుకేసి.... దేశం సొమ్ముతో మనుగడ సాగిస్తున్న సుప్రీంకోర్టు... ప్రజల కోసం పనిచేయాలని సూచిస్తున్నది.
ఆర్ఎస్ఎస్ నేతలకు నిజంగానే ప్రజలపై, దేశంపై నిబద్ధత, ప్రేమ ఉంటే... మొదీ అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేండ్ల కాలంలోనే 7కోట్ల 60లక్షల మంది నిరుపేదలుగా ఎందుకు మారారో వారికి కనిపించేది. పేదరిక గణన చేపట్టిన తర్వాత గరిష్టంగా మోదీ హయాంలోనే పేదరికం పెరిగిన వైనం తెలిసి వచ్చేది. అతి తక్కువ కాలంలో ప్రపంచ కుబేరులుగా ఆదానీ, అంబానీ ఎలా ఎదిగారో..., ఆ సంపద ఎవరిని కొల్లగొడితే పోగయ్యిందో వారికి కనిపించేది. దేశ సహజ వనరులపై కన్నేసి అడవిని ధ్వంసం చేస్తున్న ఆదానీ, జిందాలో కంపెనీల ప్రకృతి విధ్వంసం వారి కండ్లకు కనిపించేది. ఇవేవీ... మన ఆర్ఎస్ఎస్ నేతలకు కనిపించక పోవటంలో వారి భక్తి ఎవరిమీదనో చెప్పకనే చెప్తున్నారు.
-స్వరూపి