బిజెపి పాదయాత్ర కాదు అది దండయాత్ర

బిజెపి పాదయాత్ర కాదు అది దండయాత్ర 

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మూడవ విడత సంగ్రామ యాత్ర మొదలు పెట్టాడు . గత రెండు విడతల పాదయాత్రల ద్వారా ఆయన సాధించింది ఏమిటో ఎవరికీ తెలవదు . బండి సంజయ్ మాత్రం పాదయాత్ర వలన బిజెపి బలం పెరిగిందని చెప్పుకున్నాడు . ఏ మీటర్లు ఏ కొలబద్దలు ఉపయోగించి ఈ విషయం చెప్పాడో ఎవరికీ తెలవదు . మొదటి రెండు విడతల పాదయాత్రల తరువాత ఎక్కడ ఎన్నికలు జరిగింది లేదు , బిజేపి గెలిచింది లేదు . అయినా బండి సంజయ్ ఎటువంటి ఆధారాలూ లేకుండానే , ఎటువంటి ఉదాహరణలు చూపించకుండానే బలం పెరిగిందని చెబుతున్నాడు . ఒక గుడి దగ్గర మొదలు పెట్టి మరో గుడి దగ్గర పాదయాత్రను ముగించడం అంటేనే బిజెపి ఒక మతానికి చెందిన మతతత్వ పార్టీగా నిరూపించుకున్నది . బిజెపి తన పాదయాత్రను ఒక గుడి దగ్గర మొదలు పెట్టి ఒక మసీదు దగ్గర ఎందుకు ముగించదు ? ఒక చర్చి దగ్గర మొదలు పెట్టి ఒక గుడి దగ్గర ఎందుకు ముగించకూడదు ?  గుడి నుండి గుడికి చేసే పాదయాత్రతో తెలంగాణ ప్రజలకు బిజెపి ఏమి సందేశం ఇస్తున్నట్లు ? ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నది ? బిజెపి “ప్రజా”సంగ్రామ యాత్రలో మిగతావారు ప్రజలు కాదా ? బండి సంజయ్ చేస్తున్న పాదయాత్ర ఒక మతానికి చెందిన పాదయాత్ర కాదు కదా . బండి సంజయ్ చేస్తున్న పాదయాత్ర గణేష్ నిమజ్జన ఊరేగింపు కాదు హనుమాన్ శోభాయాత్ర కాదు శ్రీరామనవమి శోభాయాత్ర కాదు కదా . ఎందుకు గుడి నుండి గుడికి బిజెపి పాదయాత్ర చేస్తున్నది . బిజెపి ప్రజల సమస్యల గురించి పాదయాత్ర చేస్తున్నదా ? దేవతల సమస్యల గురించి ఈ పాదయాత్ర చేస్తున్నదా ? 

నిజానికి బీజేపీ ప్రజల సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు ఈ పాదయాత్ర చేయడం లేదు . లేకపోతే , ఎటువంటి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలనో  ఈ పాదయాత్రలు చేయడం లేదు . తెలుగు ప్రజలలో ఉన్న మత సామరస్య భావాన్ని దెబ్బతీసి మతతత్వాన్ని పెంచడం కొరకే ఈ పాదయాత్రలు చేస్తున్నారు . తద్వారా ఎన్నికలలో లబ్ది పొందాలనేది బిజెపి ఉద్దేశం . ఈ పాదయాత్రతో హిందూ ఓట్ల ధ్రువీకరణ బిజెపి లక్ష్యం . హిందువుల ఓట్లు అన్ని బిజెపికే ఎక్కువగా  రావాలంటే మతాల మధ్య ద్వేషాన్ని పుట్టించాలనేదే బిజెపి అతి పురాతన ఎత్తుగడ . గతంలో తెలంగాణా లో ఇటువంటి ఎత్తుగడలు ఫలించలేదు . కాని ఇప్పుడు , కేంద్రంలో ఉన్న అధికారంతో , అంగబలంతో , ఆర్థిక బలంతో , అసత్య ప్రచారాలతో తెలంగాణాలో మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తున్నది . అందులో భాగంగానే ఈ పాదయాత్రలు చేస్తున్నది . నిజంగానే బిజెపి ప్రజల సమస్యల పరిష్కారం కొరకే ఈ పాదయాత్ర చేస్తున్నట్లైతే ,  యాత్రా క్రమంలో చూచిన సమస్యల గురించి మట్లాడాలి . ఆ సమస్యలపై ప్రజలను చైతన్యపరిచి ఉద్యమించేలా చేయాలి . అయితే ప్రజలకు సమస్యలను సృష్టించిందే బీజేపీ . అందుకే బిజెపి యాత్రలో అధిక ధరలు , పెట్రోలు డీజిల్ ధరల గురించి , జీఎస్టీ గురించి , నిరుద్యోగం గురించి మాట్లాడడం లేదు .  అధిక ధరలు నిరుద్యోగం గురించి బిజెపి పాదయాత్రలు చేయడం లేదు . ఒక్కొక్కటిగా రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తూ ఉంటే కూడా  తెలంగాణ రాష్ట్ర బిజెపి నిమ్మకునీరెత్తినట్లు కూర్చున్నది కాని వద్దని పాదయాత్ర చేయడంలేదు . ప్రజలు అసలు సమస్యల గురించి ఆలోచించకుండా వారి దృష్టి మరల్చి ఎన్నికల లబ్ధి పొందడానికే ఈ మతతత్వ యాత్రలు బీజేపీ చేస్తున్నది  కాని ప్రజలకొరకు కాదు .

 ఇది ఒక రాజకీయ దండయాత్ర కూడా . మొత్తం భారతదేశంలో బిజెపి వివిధ రాష్ట్రాలలో ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చుకుంటూ వస్తునది . ఏ రాష్ట్రంలో అయితే మతతత్వాన్ని రెచ్చగొట్టి బిజెపి గెలవలేకపోయిందో ఆ రాష్ట్రంలో మిగతా పద్ధతులు అవలంబించి  ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చుతున్నది . తెలంగాణలో  ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర కూడా ఈ పాదయాత్ర లో ఒక భాగమే . అందుకే ప్రజల సమస్యలు కాకుండా ఈ యాత్రలో ఎంతమంది అధికార పార్టీ ప్రజాప్రతినిధులు టచ్లో ఉన్నారు , వారు ఎప్పుడు బిజెపి లో చేరబోతున్నారో  అని చెబుతున్నారు బండి సంజయ్ . ప్రజా సంగ్రామ యాత్ర అని పేరు పెట్టి చెప్పుచున్నది ఏమిటి ? ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చే ఈ సంగ్రామ యాత్ర జరుగుతూ ఉండగానే కోమటిరెడ్డి సోదరులు , దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు . బహుశా ఈ యాత్రలో భాగంగా మునుగోడు లో జరిగే సభలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరవచ్చని చెబుతు న్నారు . ఇదంతా యాదృచ్చికంగా జరుగుతున్నది అనుకుంటే పొరపాటే . ఒక పాదయాత్రను పార్టీ ఫిరాయింపులతో జోడించి తెలంగాణ ప్రజల ముందు బీజేపీనే అధికారంలోకి రాబోతున్నది అనే భావం కల్పించే ఒక సైకలాజికల్ వారు కూడా ఈ యాత్ర . అప్పుడు బండి సంజయ్ గారు చూడండి మూడో విడత పాదయాత్రతో ఎంత బలం పెరిగిందని కూడా చెప్పవచ్చు . బిజెపి చేపట్టిన ఈ కుట్రపూరిత మతతత్వ అహంభావ పూరిత పాదయాత్రను తెలంగాణ ప్రజలందరూ అర్థం చేసుకోవలసి ఉన్నది .  అప్పుడు మాత్రమే తెలంగాణ మతతత్వ ముప్పు నుండి తప్పించుకోగలుగుతుంది . లేకపోతే తెలంగాణా వందల సంవత్సరాల వెనకకు తిరోగమిస్తుంది .

-లంకా  పాపిరెడ్డి

Relative Post

Newsletter