రిటైర్డ్ న్యాయ మూర్తులు పదవులు పొందొచ్చా..?
రిటైర్డ్ న్యాయ మూర్తులు పదవులు పొందొచ్చా..?
- అబ్దుల్ నజీర్ నియామకం చర్చనీయాంశం
- ఇదే మొదలూ కాదు...ఆఖరు కాదేమో!
- అమలులో నియమాలకు చెల్లుచీటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ నియామకం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన జస్టిస్ నజీర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా... ఈ మధ్యనే గతనెల జనవరి 4న పదవీ విరమణ చేశారు. న్యాయమూర్తులుగా కొనసాగిన వారు ఆ తర్వాత ప్రభుత్వ పదవులు పొందటంలో గతంలో ఇచ్చిన వారి తీర్పులు కారణం అవుతున్నాయా..? అన్నది చర్చనీయాంశం అవుతున్నది. జస్టిస్ నజీర్ విషయంలో అదింకా వాడి వేడి చర్చకు తావిస్తున్నది.సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నజీర్ అనేక కీలక విషయాల్లో తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో భాగస్వాములుగా ఉన్నారు. అయోధ్య-రామజన్మభూమి వివాదం, ట్రిపుల్ తలాక్, పెద్దనోట్ల రద్దు విషయాల్లో తీర్పులు వెలువరించిన వారిలో ఒకరుగా జస్టిస్ నజీర్ ఉన్నారు. ఈ తీర్పులన్నీ కేంద్రంలోని పాలక ప్రభుత్వ విధానాన్ని సమర్థించినవిగా ఉండటం గమనార్హం. అంతేగాక... ముస్లిం మైనారిటీ వర్గాల్లో ఉన్న ట్రిపుల్ తలాక్ విషయంలో అది చట్టవిరుద్ధమని తీర్పును ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. ఆయన గతంలో ఇచ్చిన తీర్పులకు గాను ఏపీ గవర్నర్‌గా పదవి పొందారా.. అన్నది ముందుకు వస్తున్నది.
- ఇదే మొదలు కాదూ...ఆఖరు కాదేమో?
ఈ విధమైన విమర్శలు రావటం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ ఇలాంటి ఉదంతాలు అనేకం ఉన్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కూడా ఇలాంటి విమర్శలు తెరమీదికి వచ్చాయి. ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమైన సందర్బాల్లోంచే అనేక అభిప్రాయాలు ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలోంచే... సుప్రీం కోర్టు నుంచి న్యాయమూర్తులు రిటైర్ అయిన తర్వాత మరొక పదవి స్వీకరించటానికి రెండేండ్ల కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉండాలని జస్టిస్ ఆర్. ఎం. లోధా అన్నారు. కానీ ఆతర్వాత కాలం 2014లో లోధా సూచించిన కూలింగ్ పీరియడ్‌ను సుప్రీం కోర్టు నిరాకరించింది.
- అమలులో కొరవడిన నియమాలు
అయితే సుప్రీం కోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ తర్వాత మరో రాజ్యంగ పదవులను చేపట్టే విషయంలో ఎలాంటి రాజ్యాంగబద్ధమైన నియమ నిబంధనలు లేనే లేవా అంటే.. ఉన్నాయి. విస్పష్ట విధానాలను సూచించాయి. కానీ వాటిని అమలు చేయటంలో పాలకుల ఉదాసీనత నాటినుంచి నేటిదాకా కొనసాగుతున్నది. 1958లోనే.... లా కమిషన్ ఆఫ్ ఇండియా తన 14వ నివేదికలో.. న్యాయమూర్తులు పదవీ విరమణ తర్వాత ప్రభుత్వ పదవులను చేపట్టడాన్ని నిషేధించాలని సూచించింది. అలాగే... భారత రాజ్యాంగం ఆర్టికల్ 124 (7) ప్రకారం... సుప్రీం కోర్టునుంచి రిటైర్ అయిన న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థలో ఎలాంటి పదవిని చేపట్టకూడదు. ఏ కోర్టులోనూ ప్రాక్టీస్ చేయకూడదు అని పేర్కొన్నది. ఇంతటి విస్పష్ట విధానాలను పట్టించుకోకుండా.., అమలు చేయకుండా ఉన్నది పాలకులు మాత్రమే.
- పదవులు పొందిన వారెంతో మంది
జస్టిస్ నజీర్ వలెనే గతంలో కూడా అనేక మంది న్యాయమూర్తులుగా రిటైర్ ఐన తర్వాత అనేక కీలక పదవులను చేపట్టారు. గవర్నర్‌లుగా, కేంద్ర స్థాయిలోని సంస్థలకు చైర్మన్‌లుగా నియమితులయ్యారు. అందులో జస్టిస్ జహరుల్ ఇస్లాం, జస్టిస్ రంగనాథ్ మిశ్రా, జస్టిస్ ఏకే గోయాల్, జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఫాతిమా బివీ, జస్టిస్ సదాశివం తదితరులెందరో న్యాయమూర్తులుగా పదవీ విరమణ పొందిన తర్వాత పదవులు పొందారు. ఈ అన్ని సందర్భాల్లోనూ అధికార పక్షంపై విమర్శలు వచ్చాయి. అందుకే... ఇప్పటికైనా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రిటైర్ అయిన తర్వాత పదవులు పొందటంపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. గతం కన్నా నేడు అది అత్యవసరంగా ముందుకు వచ్చింది.
- బీజేపీ హయాంలో వేగం
ముఖ్యంగా బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత తనదైన తీరుతో అన్ని వ్యవస్థలను హిందుత్వ శక్తులతో నింపేస్తున్నదన్న అరోపణలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో... ఇప్పటికైనా రాజకీయ పక్షాలు ఏకతాటిపై ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. చట్టసభల్లో విధాన నిర్ణయానికి సమాయత్తం కావాలసిన అగత్యం జరూరుగా ఏర్పడింది.
-శ్రామిక