గణాల నుంచి గణతంత్రం దాకా..

కలలు తీర్చని తెలంగాణ ...

– ఆదిమ సమాజం మీదుగా  ఆధునికం వరకు 

– వనరులపై హక్కు కోసం ఆగని సమరం

–  శతాబ్దాలుగా నెత్తురోడుతున్న నేల 

ప్రకృతితో మానవుడు చేస్తున్న పొరాటంలో ఆనాటి ఆదిమసమాజం నుంచి నేటి ఆధునిక సమాజం వరకు వనరులను దక్కించుకునేందుకు తరతరాలుగా నిరంతర పోరాటం సాగుతూనే ఉన్నది. ఈ క్రమంలో వేలాది మంది త్యాగధనులు తమ నెత్తురుతో ఈ నేలను ‘సస్యశ్యామలం’  చేసేందుకు ప్రాణాలు పణంగా పెట్టారు.  ఈ నాటికి తమ తమ హక్కుల సాధన కోసం వనరుల పై పట్టును సాధించేందుకు తమ పెద్దలందించిన  దీపదారిలో అలసట లేకుండా ముందుకు సాగుతున్నారు. రాచరికం వ్యవస్థలో, ఫ్యూడల్​ వ్యవస్థలో, శతాబ్దాలు గడిచినా బుక్కెడు బువ్వకోసం, చారెడు నేలకోసం, జీవించే హక్కు కోసం సమాజంలో అణగారిన వర్గాలు,కులాలు తమ ఆర్తనాదాలు పదేపదే వివిధ రూపాల్లో వినిపిస్తున్నారు.  ఏడున్న దశాబ్దాల స్వాతంత్ర్యం, 72 యేళ్ళ గణతంత్రం, ఏడున్నరేళ్ళ తెలంగాణ పాలనలో తమకేం ఒరిగిందని అధికారపక్షాలను  తమ దైన తీరులో నిలదీస్తున్నారు. నిరసన తెలిజేస్తున్నారు. తిరుగుబాటు చేస్తున్నారు. అప్పుడప్పుడు అధికారం చేతిలో పావులుగా మారుతున్నారు. అయినా మళ్ళీ లేచి తమ గొంతు వినిపిస్తున్నారు. నేటి ప్రజాస్వామ్యంలో,  కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో  అన్నింటా తమ వాటా కోసం ఉద్యమిస్తున్నారు. ఆ దిశగా కేసీఆర్​ సర్కారు అడుగులు వేయకుండా అధికారాన్ని కాపాడుకునే ఎత్తుగడలతో పాలన కొనసాగించడం పట్ల ఈ వర్గాలు, కులాల్లో తీవ్రమైన అసంతృప్తి  వ్యక్తమవుతున్నది. గణతంత్ర దినోత్సవం సందదర్భంగా తమ హక్కులు కోల్పోతున్నా, వనరుల సాధనకు ఎక్కుపెట్టిన పోరాటమై సాగుతున్న  దు:ఖ పీడితుల గురించి అవలోకిద్దాం. 

– సమిష్టి జీవనం నుంచి అంతరాల ఆధిపత్యం

వ్యక్తిగత ఆస్తికి తావులేని ఆదిమకమ్యూనిస్టు సమాజంలో కొనసాగిన సామూహిక జీవన విధానం, సమిష్టి ఆస్తి హక్కు క్రమంగా కోల్పోయి జరిగిన సామాజిక పరిణామ క్రమంలో ఆధిపత్యవర్గాలు, కులాలు వనరులను గుప్పిటపెట్టుకుని మిగిలిన వారిపై పెత్తనాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. భూస్వామ్యం, రాచరికం, విదేశీ పాలనల్లోనూ క్రమంగా అణచివేతకు గురయ్యే వర్గాలు, కులాలుగా స్పష్టమైన విభజన రేఖ ఏర్పాటు చేశారు. ఈ వర్గాలు,కులాల పుట్టక నుంచి చావు వరకు తమకు సేవచేసే వర్గాలు,కులాలుగా చిత్రీకరించి తమపై నిరాటంకంగా పెత్తనాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. నేటి ప్రజాస్వామ్యానికి కలికితురాయిగా చెప్పే గణతంత్రం వరకు ఇదే పరిస్థితిని అనుభవిస్తున్నారు. కాకుంటే ప్రతీ ఏటా గణాంకాల్లోనే కాసింత తేడా అమలవుతున్నది. ముఖ్యంగా తరతరాల అణచివేతకు, దోపిడీకి గురయ్యే వారిలో దళితులు, ఆదివాసీలు, మహిళలు, మైనార్టీలు ఉన్నారు. వీరే ఆధిపత్యశక్తులకు పావులుగా మారుతున్నారు. ఆత్మగౌరవం కోసం, వనరులపై వాటా కోసం, రాజ్యాధికారంలో తమ భాగస్వామ్యం కోసం ఈ శక్తులు తరాలుగా తమ నిరసనను, ఆందోళనను, పోరాటాలను కోనసాగిస్తున్నారు. ఈ దశలో సాయుధ తిరుగుబాట్లను చేసిన సాహసం ఈ నేల బిడ్డలకున్నది .

– అభివృద్ధిలో అంతరాలు 

చరిత్ర పరిశీలకులు చెప్పే వివరాల ప్రకారం ఈ నేలను వందలాది సంవత్సరాలు  శాతవాహనులు, ఇక్ష్వాకులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, తదుపరి ముస్లీం పాలకులు, బ్రిటీష్​వారికి సామంతులుగా వ్యవహరించిన చివరి రాజులుగా పెత్తనం చెలాయించిన నిజం నవాబులు ఈ తెలుగు నేలను పాలించారు. ఈ రాజుల పాలనతో పాటు నేటి ప్రజాస్వామ్యంలో ఆంధ్ర , తెలంగాణ రాష్ట్ర పాలకులు తమ పాలనలో ప్రజలకు ఏంచేశారనేదే ఇప్పుడు  ప్రశ్న. దేనికైనా మానవాభివృద్ధే కొలబద్దగా తీసుకుంటే  ప్రాథమిక వనరులను , స్వేచ్చా,స్వాతంత్ర్యలను ఎంతవరకు కింది వర్గాలను అనుభవవించనిచ్చారనే దాన్ని బట్టి వారిని అంచన వేయవచ్చు. హక్కుల్ని హరించిన పాలకల పాలనలు ఏమేరకు గొప్పవనే  ప్రశ్న ఉదయిస్తున్నది. తమ పాలనలో అనేక ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతూ వచ్చారు.ఈ పాలనలను కూలదోసేందుకు అప్పటి నుంచి ఇప్పటి వరకు రకరాలుగా ప్రజలు తిరుగుబాట్లు చేస్తున్నారు. అధునిక ప్రజాస్వామ్యంలో అధికారాన్ని ఇతరులకు బదలాయిస్తూ తమ నిరసను మరో రూపంలో తెలియజేస్తున్నారు. 

ప్రజల చేజారిన వనరులు  

చరిత్రకారుల చెబుతున్న ప్రకారం శాతవాహుల కాలం నుంచి సుమారు వెయ్యి సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రకృతి వనరుల పై స్థానిక ప్రజల పట్టు జారిపోతూవచ్చింది.  ప్రకృతి వనరులైన భూమి,చెట్టు,పుట్టల పై ప్రజల అధికారం కుల వృత్తులుగా పరిణామం చెందినట్లు తదుపరి గ్రామంగా స్థిరీకరించిన వ్యవస్థ ఏర్పడింది.  ఈ పరిణామంలోనే మూడవ శతాబ్దంలో బ్రాహ్మణాధిపత్యంలో వృత్తులు కులాలు చాతుర్వర్ణవ్యవస్థగా పరిణామం చెందింది. బ్రాహ్మణులు రాజుల నుండి భూములను దానాలుగా పొంది అగ్రహారాలుగా రూపొందడంతో రైతుకు-రాజుకు మధ్య దళారీ ఆవిర్భవించి ఈ పరిణామం క్రమంగా ఉత్పత్తిలో ప్రత్యక్షంగా పాల్గొనే ప్రజలు తమ వనరుల పై ,జీవితం పై హక్కుల్ని కోల్పోవడం క్రమంగా వేగవంతమైంది.

ఆధిపత్యంపై తిరుగుబాటు జెండా

వనరుల పై ఆధిపత్యం చెలాయిస్తూ కుల, మత, లింగ వివక్షల పేరుతో అణచివేస్తూ కిందికులాలు, వర్గాలపై పాశవికమైన దమనకాండను కొనసాగించిన భూస్వామ్యశక్తులు, పాలకులకు వ్యతిరేకంగా ప్రజలు అనేక తిరుగుబాట్లు చేశారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈ పోరాటాలు సాగాయి. ఈ క్రమంలోనే తెలుగు నేలపైన పోరాటు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. కాకతీయ పాలనలోనే ఓరుగల్లు కేంద్రంగా టెంపుల్​, ట్యాంక్​, టౌను మూడు ‘టి’ల ప్రాతిపదికన రాజ్యమేలిన  పాకాల, రామప్ప, లక్నవరం వంటి భారీ జలాశయాలను,చెరువులను నిర్మించి వ్యవసాయంలో స్థిరత్వాన్ని, ఉత్పాదతను పెంచారు. ఈ సమయంలో వ్యవసాయ మిగుళ్లు దళారులకే చెందే క్రమం విస్తరించి బలపడింది.  ‘ఘనమైన’ పాలన చేపట్టిన కాకతీయ రాజుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందిన ఆదివాసీ బిడ్డలైన సమ్మక్క, సారలమ్మల  "స్వయం పాలన" చరిత్ర కూడా మనకళ్ళముందే ఉన్నది. మేడారం జాతరగా కొనసాగుతున్నది. నిజాం పాలనకు వ్యతిరేకంగా కొమురంభీం ఆధ్వర్యంలో ఆదిలాబాద్​ కేంద్రంగా తిరుగుబాటు ఆదివాసీలు జల్,​జంగిల్​, జమీన్​ కోసం కొనసాగింది.  ఆదివాసీల స్వయం పాలన కాంక్ష ను అణచివేసేందుకు కొమురం భీమ్​ను చంపి ఆదివాసీలను మభ్యపెట్టేందుకు  రక్షణ చట్టాలను చేశారు. తదుపరి అధికారంలోకి వచ్చిన  ప్రజాస్వామ్య పాలకులు ఆ చట్టాలకు తుట్లూ పొడుస్తూ అభివృద్ధి పేర ఆదివాసీ సమూహం పైన  మైనింగ్, మాఫియాలతో  హంతక వేట కొనసాగిస్తూ  విశ్వనగరాల్లో " ఆత్మగౌరవం భవన్"లు కడుతున్నారు. అదే విధంగా ఆంధ్రలో  అల్లూరి ఆధ్వర్యంలో గిరిపుత్రుల ఆధ్వర్యంలో  గోదావరి జిల్లాలో రంప తిరుగుబాటు జరిగింది.  ఈ సయయంలోనే దేశవ్యాప్తంగా బ్రిటీష్​ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యోద్యమం  ఉదృతంగా కొనసాగింది. ఈ క్రమంలో  తెలంగాణను పాలిస్తున్న నిజాం నవాబు, భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా 1946– -48 వరకు మహత్తర సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. దొరల దౌర్జన్యాలు, ఫ్యూడల్​ అణచివేత, భూస్వామ్య ఆధిపత్యానికి వ్యతిరేకంగా పల్లెపల్లె పోరాట శంఖారావమై కదిలింది. మూడు వేల గ్రామాలను  విముక్తం చేసి 10లక్షల ఎకరాల భూమిని పేదలు స్వాధీనం చేసుకున్నారు. రజాకార్ల దాడిలో వందలాది మంది ప్రాణత్యాగం చేశారు. హైదరాబాద్ రాష్ట్రం, నెహ్రూ సైన్యం పాశవిక అణచివేత వల్ల తెలంగాణ  సాయుధ పోరాట విరమణ జరిగింది. దీని ఫలితంగా హైదరాబాద్​ రాష్ట్రం భారతయూనియన్లో కలిసిపోయింది. 1951 హైదరాబాద్ రాష్ట్రంలో బూర్గుల రామకృష్ణ రావు తొలి ముఖ్యమంత్రిగా స్వతంత్ర భారతంలో ఈ ప్రాంతవాసులు భాగస్వామ్యమయ్యారు. 

– తొలి తెలంగాణ ఉద్యమం 

1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ఏర్పాటుకు,  ఆంధ్రపాలనకు వ్యతిరేకంగా 1967, 1969లలో  ప్రత్యేక తెలంగాణ ఉద్యమం  కొనసాగింది. ఈ ఉద్యమాన్ని అప్పటి కాంగ్రెస్​  పాలకులు అణచివేశారు. ఈ కాలంలోనే బెంగాల్​లో భూమి సమస్య పై నక్సల్​బరి, తర్వాత తెలుగునేలపైన శ్రీకాకుల రైతాంగ పోరాటాలు వెల్లువెత్తాయి. ఈ ఉద్యమాల్లో ఎందరో యువకులు అమరులయ్యారు. దేశవ్యాప్తంగా ఈ పోరాటాలు సంచలనానికి కేంద్రబిందువులుగా నిలిచాయి.  

– రైతాంగ పోరాటాలు 

1970 వదశకందశకంలో నక్సలైట్ల నాయకత్వంలో మళ్ళీ  సాయుధ రైతాంగ పోరాటం ఎజెండాగా  సిరిసిల్ల, జగిత్యాల జైత్రయాత్ర, ఉత్తర తెలంగాణలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు పెల్లుబికాయి.  ఈ చ రిత్రంతా నెత్తుటి గాయాల చరిత్రే. ఇంటింటికి ఒక అమరుడు, పల్లె పోలిమేరల్లో స్థూపాలు, నెత్తురోడిన నేల, తీవ్ర నిర్బంధ కాండలో అన్ని రకాలుగా దళిత, గిరిజన, బలహీన వర్గాలు, ఈ పోరాటంలో పాల్గొన్న యువత ప్రాణత్యాగం చేశారు. ఈ పోరాటాల ఫలితంగా భూస్వాములు, పెత్తందారులు, దొరలు పల్లెలను విడిచి పట్నం బాటపట్టారు. ప్రజలు ఎర్రజెండాలు పాతి స్వాధీనం చేసుకున్న భూములు సైతం క్రమంగా మళ్ళీ భిన్నరూపాల్లో వారి చేతికే చేరాయి. అడవిబిడ్డలు సాగించిన  పోడు భూములు కూడా క్రమంగా వారి చేజారి పోతున్నాయి. నూతన తెలంగాణ రాష్ట్రంలో సైతం భూపంపిణీ మూలకు పడేశారు. వనరులపై ఇతర రూపాల్లో ఆధిపత్యశక్తులు, కులాల పెత్తనం నేటికి నిరంతరంగా కొనసాగుతున్నది. 

– కలలు తీర్చని తెలంగాణ 

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పినట్లుగా చిన్నరాష్ట్రాలతోనే అభివృధ్ధి జరుగుతుందని ప్రజలు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టి,  90 దశకంలో బీజ రూపంలో మలిదశ తెలంగాణ పోరాటం మళ్ళీ ప్రారంభించారు.  ఉద్యమం తీవ్రమై ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కల 2014లో సిద్ధించింది. ఈ రాష్ట సాధనకు అన్ని శక్తుల సమిష్టి పోరాటమే ఇంధనమైనప్పటికీ పాలనా ఫలితాలు గులాబీ నేతలకు దక్కాయి. అణచివేతతో తల్లడిల్లిన తెలంగాణ పల్లెలన్నీ ఈ పోరాటంలో బలమైన ఆకాంక్షతో తమ బతుకుల్లో కొత్తవెలుగులు వస్తాయనే ఆశతో భాగస్వామ్యమయ్యాయి. 1200 మంది విద్యార్ధి, యువకులు ఈ ఉద్యమంలో ప్రాణత్యాగం చేశారు. ఈ పోరాటంలో కీలక భూమిక పోషించిన పునాదిరాళ్ళుగా నిలిచిన వారికి మొండిచేయి మిగులుతున్నది. అట్టడుగు వర్గాలైన దళిత, గిరిజనులు, బలహీనవర్గాల మౌలికాభివృద్ధి పథకాలకు గండికొట్టి ఓటుబ్యాంకులుగా మార్చివేశారు. మరోసారి రాష్టంలో అసంతృప్తితో ఉన్న వర్గాలు తమ నిరసన గొంతెత్తుతున్నాయి. 

– ఆశల పల్లకిలో

1947లో దేశానికి స్వాతంత్రత్యం సిద్ధించినా 1948 సెప్టెంబర్లో యూనియన్​ సైన్యాల ‘పోలీస్​ ఆక్షన్​’ తర్వాతగానీ అప్పటి హైదరాబాద్​ రాష్టంగా ఉన్న తెలంగాణ భారత్​లో విలీనమైంది. 1950 జనవరి 26న గణతంత్రదేశంగా ప్రకటించారు. 72 సంవత్సాల గణతంత్రంలో సైతం ఇంకా అట్టడుగు వర్గాలు,కులాల ఆకాంక్షలు ఆశలుగానే మిగిలిపోయాయి. ఆధిపత్యకులాల, శక్తుల పెత్తనమే ప్రజాస్వామ్య ‘పద్ధతి’లో నిరాటంకంగా సాగుతున్నదనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో మరో గణతంత్రం సందర్భంగానైనా ఈ వర్గాల అభ్యున్నతి, మౌళికాభివృద్ధికి  ప్రభుత్వం నూతన మార్గంలో పయనిస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. 

––––––––––––––––– బండి.దుర్గాప్రసాద్

Relative Post

Newsletter