రాజనీతా... రణనీతా...

రాజనీతా... రణనీతా...

మధ్యలో కాంగ్రెస్ రాజద్రోహం

పీఎం పర్యటనకు సీఎం దూరం

రసకందాయంలో రాష్ట్ర రాజకీయం

వేకువ ప్రత్యేక ప్రతినిధి:
కొద్ది రోజులుగా రాష్ట్రం రాజకీయ కేంద్రంగా ఎత్తులూ పై ఎత్తులూ మధ్యలో రాజకీయ జిత్తులు హాట్హాట్గా సాగుతున్నాయి. చివరికి ముచ్చింతల్లో రామానుజుని భారీ విగ్రహావిష్కరణ, సమారాధన ఉత్సవాలు కేంద్రంగా మరో అంకానికి చేరుకున్నాయి. రానున్న రోజుల్లో ఈ రాజకీయం ఏ మలుపుతీసుకుంటుందో? అనే ఆసక్తి క్రమంగా పెంచుతున్నారు. ఇదిలాఉండగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఆసక్తితో పాటు అనుమానాలూ, సందేహాలూ తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా అసలు ఉన్నట్లుండి తెలంగాణ కేంద్రంగా తెరతీసిన తాజా రాజకీయ ‘వ్యూహం’లో దాగి ఉంది రాజనీతా...? లేక రణనీతా? అనే  ప్రశ్నలు ఉత్పన్నమైతున్నాయి.  రాజకీయ పరిశీలకుల మెదళ్ళు సైతం ఈ విషయమై చురుకుగా లెక్కలు వేసే కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇటీవల వేగంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ అనుమానాలు తలెత్తుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత రెండవ అంకంలోకి ప్రవేశించిన బీజేపీ, టీఆర్ఎస్ తెరముందు వైరం కేంద్ర బడ్జెట్లో మరో స్థాయికి చేర్చింది. వేడిని మరింత రగిల్చింది.  కొత్త రాజ్యంగం పైన చర్చ జరగాలనే అంశం కాంగ్రెస్, బీజేపీ, దళిత వర్గాలకు ఆయుధంగా మారింది.

 పీఎం పర్యటనకు సీఎం దూరం

ఈ క్రమంలో రామనుజ విగ్రహావిష్కరణ, ఇక్రిసాట్స్వర్ణోత్సవాలకు ప్రధాని మోడీ శనివారం హైదరాబాద్కు వచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కూడా పాల్గొనాల్సి ఉండే. కార్యక్రమానికి ముందే ప్రధాని, సీఎం ఎదురెదురుపడుతారా? ఈ కార్యక్రమానికి కేసీఆర్ దూరంగా ఉంటారా? అనే ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అనుకున్నట్లుగానే విమానాశ్రయంలో ప్రధాని స్వాగత కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఇక్రిసాట్ ఉత్సవాల్లో కూడా పాల్గొనలేదు. జ్వరం కారణంగా ఆయన ఈ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని సీఎంవో వర్గాలు ప్రకటించినప్పటికీ అనేక సందేహాలు నెలకొన్నాయి. నిజంగానే కేసీఆర్ జ్వరం కారణంగా ప్రధాని పర్యటనకు దూరంగా ఉన్నారా?  లేక ఉద్దేశ్యపూర్వకంగా దూరంగా ఉన్నారా?  అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకున్నాయి. అందుకే ఇది రాజనీతా? లేక రణ నీతా అనే అనుమానాలు వ్యక్తమైతున్నాయి. తెరవెనుక వ్యూహమా? అనే వారూ లేకపోలేదు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ లేవనెత్తుతుండగా  ఏమైనా రానున్న కాలంలో  రెండు పక్షాల ఆచరణతో ఎవరి ఎత్తులేంటనేవీ తేలనున్నవి. ప్రధాని పర్యటనకు కారణాలేమైనా సీఎం పాల్గొనకపోవడం ఉద్దేశ్యపూర్వకమని ఇప్పటికే బీజేపీ నేతలు టీఆర్ఎస్ తీరును, సీఎం కేసీఆర్ ను విమర్శిస్తున్నారు. దీన్ని టీఆర్ఎస్ వర్గాలు కొట్టివేస్తున్నాయి.


 మధ్యలో కాంగ్రెస్ రాజద్రోహం

ఇదిలాఉండగా ఈ రాజకీయ రణరంగంలో కొంత వెనుకంజలో ఉన్న కాంగ్రెస్ ‘రాజ్యంగం’ అంశాన్ని ఆసరా చేసుకుని కేసీఆర్ను ఇరుకున పెట్టే కార్యక్రమానికి తెరదీశాయి. ఇప్పటికే దీక్షలు చేపట్టి నిరసన తెలియజేసిన కాంగ్రెస్ తాజాగా చట్టబద్ద పోరాటానికి తెరదీసింది. రాజద్రోహం కేసులు పెడుతూ ఒత్తిడి తెచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నది. ఈ నేపథ్యంలో సీఏం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్ పోలీస్ స్టేషన్లో స్వయంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఫిర్యాదు చేయడం గమనార్హం. ఏది ఏమైనా అధికార పక్షాలైన టీఆర్ఎస్, బీజేపీ పరస్పరం రంగమెక్కి వీరంగమెస్తుండగా ప్రతిపక్ష పాత్రంలోని కాంగ్రెస్ రాజకీయ వేడిని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నది.  రానున్న రోజుల్లో రాష్ట్రంలో రాజకీయం మరింత రసకందాయంలో పడనున్నది.
–––––––

Relative Post

Newsletter