డ్రగ్స్‌ చీడను తరిమేయండి

డ్రగ్స్‌ చీడను తరిమేయండి

సామాజిక బాధ్యతగా దీనిపై కృషి జరగాలి

వినూత్న రీతిలో దీనినిర్మూలన కఠనంగా సాగాలి

సామాజిక ఉద్యమంగా డ్రగ్స్‌ నిరోదక కార్యక్రమాలు సాగాలి

ప్రగతిభవన్‌ ఉన్నతస్థాయి సవిూక్షలో సిఎం కెసిఆర్‌ ఆదేశాలు

డోపమ్యాప్‌ తీసుకుని రానున్నట్లు డిజిపి వెల్లడి

హైదరాబాద్‌: డ్రగ్స్‌ సమాజానికి పట్టిన చీడ.. డ్రగ్స్‌ వాడకాన్ని రాష్ట్రం నుంచి తరిమేయాలని.. అది సామాజిక బాధ్యతతో ప్రతీ ఒక్కరు సహకారం అందించినప్పుడే సాధ్యం అవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ అన్నారు.. దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్న గంజాయి తదితర నార్కోటిక్‌ డ్రగ్స్‌ వాడకాన్ని తెలంగాణ నుంచి కూడా సమూలంగా నిర్మూలించడానికి పోలీస్‌ అధికారులు వినూత్నరీతిలో బాధ్యత కలిగిన మానవులుగా ఆలోచనలు చేయాలన్నారు.. అదొక సామాజిక ఉద్యమంగా మలచిననాడే డ్రగ్స్‌ కంట్రోల్‌ సాధ్యమవుతుందని రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్‌ శాఖ అధికారులకు  కేసీఆర్‌ పిలుపునిచ్చారు.. రాష్ట్రంలో గంజాయి తదితర నార్కోటిక్‌ డ్రగ్స్‌ వినియోగాన్ని కూకటివేళ్లతో పెకిలించా లనే లక్ష్యంతో ప్రగతిభవన్‌ లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ’రాష్ట్ర పోలీసు,ఎక్సైజ్‌ అధికారుల సదస్సు’ జరిగింది.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు అద్భుతంగా అమలవుతున్న నేపథ్యంలోనే రాష్ట్రం అనతికాలంలో అత్యద్భుతంగా అభివృద్ధి పథాన దూసుకుపో తుందన్నారు.. ఇక, నార్కోటిక్‌ డ్రగ్స్‌ వాడకం అనేది ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న దుర్వ్యసనమని ఆవేదన వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్‌.. అది సమాజమనే వేరుకు పట్టిన చీడ పురుగు వంటిదని.. ప్రజలను డ్రగ్స్‌ కు వ్యతిరేకంగా చైతన్యం చేసేందుకు సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు.. వెయ్యి మంది సుశిక్షితులైన పోలీస్‌ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకుని అత్యాధునిక హంగులతో కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌‘ ను ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ మహేందర్‌ రెడ్డిని ఆదేశించారు.  ఇప్పటికే పలు అసాంఘిక శక్తులను వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ఏర్పాటు చేసుకున్న గ్రే హౌండ్స్‌ తదితర వ్యవస్థలు విజయవంతం గా పనిచేస్తున్నాయని, అదే మాదిరి, నార్కోటిక్‌ డ్రగ్స్‌ ను నియంత్రించే విభాగం కూడా శక్తి వంతంగా తేజోవంతంగా పని చేయాలన్నారు. అద్భుత పనితీరు కనపరిచే పోలీస్‌ అధికారులకు అవార్డులు, రివార్డులు ఆక్సెలరేషన్‌ ప్రమోషన్స్‌ తదితర అన్ని రకాల ప్రోత్సాహకాలను అందించాలన్నారు. ఇందుకోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందని స్పష్టం చేశారు తెలంగాణ సీఎం.. మరోవైపు, డ్రగ్స్‌ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని, ఈ విషయంలో ఏ పార్టీకి చెందిన వారైనా సరే, నేరస్థులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసు చేసిన తిరస్కరించాలని అధికారులకు కేసీఆర్‌ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌ గౌడ్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్‌, కవితా నాయక్‌, ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, రెడ్యానాయక్‌, రవీంద్ర కుమార్‌ నాయక్‌, ఆళ్ల వెంకటేశ్వర్‌ రెడ్డి, రాజేందర్‌ రెడ్డి, గాదరి కిశోర్‌ కుమార్‌, సాయన్న, రేఖా నాయక్‌, అబ్రహం, హన్మంతు షిండే తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌, సీఎంవో అధికారులు రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి అధికారులు, ఎస్పీలు, కమిషనర్లు, డీసీలు పాల్గొన్నారు. కాగా, ఈ సదస్సుకు ముందు.. డీజపీ మహేందర్‌రెడ్డి ఓ సమావేశం నిర్వహించి.. గత ఐదేళ్లుగా డ్రగ్స్‌ కేసులు, వాడకం దారులు, అమ్మకందారులు.. తదితరుల చిట్టా కూడా సిద్ధం చేసిన విషయం తెలిసిందే.రాష్ట్రంలో డ్రగ్స్‌ విక్రయాలపై నిఘాకు డోపమ్‌ యాప్‌ను పోలీసులు రూపొందించారు.  డ్రగ్స్‌ వ్యవహారంపై డీజీపీ మహేందర్‌రెడ్డి సవిూక్ష నిర్వహించారు. డీజీపీ సమావేశంలో కీలక ప్రతిపాదనలను సిద్ధం చేశారు. డ్రగ్స్‌ విక్రయదారులు, వినియోగదారుల చిట్టాను రెడీ చేశారు. గతంలో డ్రగ్స్‌ తీసుకున్నవారి పేర్లతో చిట్టాను పోలీసులు రూపొందించారు. సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలు, విద్యార్థులకు సంబంధించిన పేర్లతో చిట్టా తయారయింది. గంజాయి తీసుకున్నవారి వివరాలనూ పోలీస్‌శాఖ పొందుపర్చింది. డ్రగ్స్‌ విక్రయాలపై నిఘాకు ఆనూజీప యాప్‌ను పోలీసులు రూపొందించారు. డ్రగ్స్‌కు సంబంధించి గత పదేళ్ల డేటాను పోలీస్‌ శాఖ తయారు చేసింది. 


Newsletter