రాచరికానికి_రాజకీయ 'పట్టాభిషేకం'

#రాచరికానికి_రాజకీయ 'పట్టాభిషేకం'

- ధిక్కారానికి అవమానం
- ఒకే ఒరలో రెండు కత్తులు!?
- కాకతీయ 'సప్తాహం' సందేశమేంటి?
- ప్రజాస్వామ్యం అపహాస్యం
- చులకనైన ప్రజాప్రతినిధులు?
- పాలకులదంతా ఒకే బాట
- అంతా స్వార్ధం, 'అధికార' మార్మికం

ఒక్క ఒరలో రెండు కత్తులు ఇముడవనేది చరిత్ర చాటిచెప్పిన సత్యం. పదే పదే మన ముందు రుజువైతోన్న అంశం కూడా. ప్రజలూ, ప్రశ్నించే వారు ఒక్క క్షణం కళ్ళుమూసుకుంటే పాలకులు తిమ్మినిబమ్మిని చేయడంలో సిద్ధహస్తులని మరోసారి నిరూపించారు.ఘనతవహించిన మన తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుండి ఆర్భాటంగా ప్రారంభించిన కాకతీయ 'సప్తాహం' దీనికి తాజా ఉదాహరణ. అధికారంలో ఉన్న పార్టీ, ప్రభుత్వం ఏది చేసినా వాటి వెనుక ఏదో ప్రయోజనం ఉంటుందనేది తరచూ విమర్శకులోనయ్యే అంశం. దీనికి మన తెలంగాణ పాలకులు కూడా అతీతం కాదని స్పష్టమవుతోందీ.అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత హఠాత్తుగా కాకతీయ ఉత్సవాలను 'సప్తాహం' పేరుతో ఏడు రోజులపాటు ఉత్సవాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, వరంగల్ జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు గత నెల రోజుల నుంచి హడావుడి, ఆర్భాటం ప్రదర్శిస్తూ ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

- రాచరికానికి రాజకీయ పట్టాభిషేకం
కాకతీయ సప్తాహం పేరుతో సాగిస్తున్న కార్యక్రమంలో రాచరికపు ఆనవాళ్లను ప్రదర్శించి అదో ప్రగతికి సూచికగా చాటి చెప్పేందుకు ప్రయత్నించడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడంగా భావించాల్సి వస్తోంది.మన అనుభవం చెబుతోన్న విషయమేమిటంటే, చిత్రంగా మన పాలకులు ప్రజాస్వామ్యంలో రాచరికపు అవశేషాలను అప్పుడప్పుడు జొప్పించి, కొన్ని ఇముడ్చుకొని తమ పాలక స్వభావాన్ని చాటి చెబుతుంటారు. కొంత లోతుగా పరిశీలిస్తే చాలా సంఘటనలు మనకు ఇలాంటివి ఎదురైతాయి.గమ్మత్తైన విషయం ఏమిటంటే పాలితులుగా ఉన్న బాధితుల అంశాలను సమయానుకూలంగా విస్మరించి తమ పాలక నీతిని పదేపదే చాటి చెబుతుంటారు. ఇందులో అమాయకులు ( ప్రజాప్రతినిధులైనా సరే) బలి పశువులుగా మారుతారు. ఆధిపత్య స్థానాల్లో ఉన్న అధిపతులు తమ అవసరాలకు అందరినీ వినియోగించుకుంటారు. మరో విధంగా చెప్పాలంటే పాలకులుగా ఉన్నతస్థానంలో ఉన్న వారి ఆయుధంగా పాలిత వర్గాల నుంచి ఎదిగిన వ్యక్తులనూ, శక్తులను తమ అధికారాన్ని పదిలపరుచుకునేందుకూ, తమ రాజకీయ స్వార్థానికి వినియోగించుకుంటారనేదీ తాజా ఉదాహరణ.
ఏ రాచరికపు వ్యవస్థ అయినా ప్రజల రక్త మాంసాలను పీల్చిపిప్పిచేసి తమ పాలన సాగించి ఉంటారనేది నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మనమంతా చెప్పుకునే నిష్ఠూర సత్యం. అయితే రాచరికపు పాలనలో సైతం కొన్ని 'అభివృద్ధి' కార్యక్రమాలు, ప్రజాహిత కార్యక్రమాలు జరిగితే జరిగి ఉంటాయి. వీటి వెనక కూడా ప్రజల ధనమానప్రాణాల త్యాగం ప్రధానమై ఉంటుంది. చారిత్రిక క్రమంలో ఆ రాచరిక వ్యవస్థ యొక్క ఆనవాళ్లూ, అవశేషాలు కొన్ని, అభివృద్ధి నమూనాలు మరికొన్ని మనకు వారసత్వంగా లభించే అవకాశాలు ఉంటాయి. అంతమాత్రాన ఆ రాచరికపు వ్యవస్థ మొత్తం ప్రజా అనుకూలమైన పాలన చేసిందని, స్వర్ణ యుగంగా కొనసాగిందని చెప్పేందుకు కించిత్తు అవకాశం లేదు. అయితే అవశేషాలుగా మిగిలిన కొన్ని 'అభివృద్ధి' కార్యక్రమాలను ఇలాంటి ఉత్సవాల సందర్భంగా ఉదహరించడం అనేది కొంతమేరకు అంగీకరించే అంశం గా ఉంటుంది. దీనికి కాకతీయ పాలకులు కూడా మినహాయింపు కాదు. ఎందుకంటే కాకతీయ రాచరికపు వ్యవస్థలో కొంత తలమానిక కార్యక్రమాలు కొనసాగితే కొనసాగి ఉండవచ్చు. పాలకులు తమ అప్పటి అవసరాల నిమిత్తం పాలనాపరమైన కొన్ని ప్రగతి సంస్కరణలు అమలు చేసి ఉండవచ్చు. ఉదాహరణకు కాకతీయుల పటిష్టమైన సైనిక వ్యవస్థ, అదే విధంగా మూడు 'టీ'ల పేరుతో టెంపుల్, ట్యాంక్, టెరిటరీ సూత్రంగా తమ అభివృద్ధి నమూనా కొనసాగించిన తీరును చెప్పుకోవచ్చు.
- ప్రజల స్వేదం పైన్నే అభివృద్ధి
కాకతీయ పాలనలో కూడా తమ అవసరార్థ అభివృద్ధి క్రమంలో వ్యవసాయ అభివృద్ధికి కొంత ప్రాధాన్యత ఇచ్చినట్లు అర్థమవుతోంది. దీనిలో భాగంగా గొలుసుకట్టు చెరువుల నిర్మాణం, దాని పక్కనే శిల్పకళ ఉట్టిపడే గొప్ప ఆలయాలు, పక్కనే ఒక పట్టణం నిర్మించే పద్ధతిని విధానంగా కొనసాగించి అమలుచేశారు. అయితే ఇదంతా ఆనాటి ప్రజల శ్రమ, త్యాగం పై ఆధారపడే ఉంటుందనేది ఎవరూ కాదనలేని నగ్నసత్యం. ఈ క్రమాన్ని పరిశీలించినప్పుడు కాకతీయ ఉత్సవాలను నిర్వహిస్తే ఆ రాజ్యంలో చేసిన అభివృద్ధి నమూనాలను ఒక మేరకు ప్రజలకు వివరించే అవకాశం ఈ సందర్భంగా ఉండొచ్చు. అది కూడా పరిమితులకు లోబడి. కానీ దీనికి భిన్నమైన 'సప్తాహం' పేరుతో ఏకపక్షంగా రాచరికాన్ని కీర్తిస్తూ సంబరాలు నిర్వహించడం అత్యంత అభ్యంతరకరం. రాచరికపు పోకడలను ప్రజలకు గొప్పవిగా ప్రదర్శించే ప్రయత్నం చేయడం సరైనది కాదు. దీనివల్ల ప్రజాస్వామ్య వ్యవస్థను చులకన చేసినట్లుగా భావించాల్సి ఉంటోంది. ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళుతాయి.

- ఉత్సవంలో 'ఉన్నత' నేతల జాడెక్కడ?
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తెలంగాణ పాలకులు సైతం తాజాగా అనుసరించిన తప్పుడు విధానమిదే. ఉత్సవాల్లో హంగామాతో తాత్కాలికంగా కొంత ప్రయోజనం నెరవేరవచ్చు. కానీ, భావితరాలకు ఏ సందేశం ఇచ్చారనేది ఇక్కడ ప్రధానం. విచిత్రం ఏమిటంటే ఈ ఉత్సవాల, రాచరికపు ఊరేగింపుల్లో పాల్గొనే వారి జాభితాలో అధికార పార్టీ 'ఉన్నత' స్థానంలోని నాయకులు ఎవరు పాల్గొనకుండా స్థానిక జిల్లా నాయకత్వాలను ఇందులో భాగస్వామ్యం చేయడం అంటే వారిని రాజుకు సేవకులుగా మార్చే ఆధిపత్య సంస్కృతికి అద్దం పడుతుంది. అది మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఉన్నతాధికారులైనా మినహాయింపు కాకపోవడం విచారకరం.ఇవే ప్రస్తుతం కాకతీయ సప్తాహం సందర్భంగా నగ్నంగా కనిపిస్తున్న దృశ్యాలలో దాగిన ముఖ్య అంశాలు.
- రాచరికానికి మోకరిల్లిన 'అధికారం'
విచిత్రం ఏమిటంటే కాకతీయుల వారసులుగా పేర్కొంటూ బస్తర్ మహారాజు కుటుంబానికి చెందిన కిషోర్ చంద్రదేవ్ బాంజ్‌ను మహోత్సవాలకు హాజరయ్యే విధంగా ఆహ్వానం పలికారు. తాజాగా ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఆయన రాక నేపథ్యంలో ఏర్పాటు చేసిన గుర్రపుబగ్గీ, సైనిక వేషధారణలూ, హడావుడి, ప్రజాప్రతినిధుల హైరానాను చూస్తే మనం ఎటువైపు ప్రయాణిస్తున్నామనేది ఆశ్చర్యం కలగక మానదు. రాచరికపు వారసునికి జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు మోకరిల్లినట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. అసలు సప్తాహానికి కాకతీయ వారసులను తీసుకొచ్చి రాచరికపు ఊరేగింపులు నిర్వహించి ప్రజలకు ఏ సందేశాన్ని తెలంగాణ ప్రభుత్వం అందించదలచుకున్నదో అనే చర్చ సాగుతోంది. ఎప్పుడో వందల ఏళ్ళ క్రితం కాకతీయ సామ్రాజ్యమైన వరంగల్ తో సంబంధ బాంధవ్యాలు తెగిపోయిన వ్యక్తులను ఇప్పుడు తీసుకొచ్చి రాచరికపు పటాటోపాలని ప్రదర్శించడం సరికాదు.పైగా సమ్మక్క, సారలమ్మ ధిక్కారస్వరానికి ప్రతీకగా నిలిచిన ఓరుగల్లు గడ్డపై బూజుపట్టిన ఈ రాజరికపు దర్పం ప్రదర్శించడం విడ్డూరం కాక మరేమవుతుంది. ఎవరినైనా అతిథిగా పిలిచినప్పుడు గౌరవ మర్యాదలు ఇవ్వడం సరైందే. ఉత్సవాలకు అతిథిగా ఆహ్వానించి ఇక్కడ పరిచయం చేయడం మేరకు పరిమితం కావచ్చు. కానీ, ఒక రాచరికానికి వారసుడైనందున మాత్రాన ఇచ్చే ఈ అతి మర్యాదలెందుకూ? అపహాస్యంపాలవడమెందుకూ? ప్రజలు తిరస్కరించిన రాచరికపు ఆనవాళ్లకు ప్రతీకగా ఉత్సవాలను నిర్వహించడం అనేది సిగ్గుచేటు. పైగా ఈ కార్యక్రమంలో ప్రజల చేత ఎన్నుకోబడిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాచరికాన్ని కీర్తిస్తున్నట్లు సేవకులుగా సహభాగస్వామ్యం కావడం బాధాకరమైన విషయం. కాలదోషం పట్టిన రాచరికం ముందు మనల్ని మనమే తక్కువ చేసుకోవడం సిగ్గుచేటు.

చరిత్రను పరిశీలిస్తే రాచరికానికి ప్రజాస్వామ్యానికి అస్సలు పొసిగే అవకాశం ఉండకూడదు. అదేవిధంగా పాలకులకూ, పాలితులకు మధ్య ఎప్పుడు వైరుధ్యం కొనసాగుతూనే ఉంటుంది.ఈ కోణంలో పరిశీలించినప్పుడు కాకతీయుల రాజ్యం ఏ మేరకు విస్తరించిందనేది, ఎన్ని సంవత్సరాలు విలసిల్లింది, దాని భోగభాగ్యాల సంగతి తెలుసుకోవాల్సిన చారిత్రక జ్ఞాన అవసర అంశమే అయినప్పటికీ, అదొక రాచరికపు వ్యవస్థకు ప్రతిబింబం. కాకతీయుల కాలంలో కూడా అన్ని రాచరికపు వ్యవస్థల్లో జరిగినట్లే రాజు కీలకంగా రాజకీయ నిర్ణయాలు జరిగి ఉంటాయి. ఇందులో ప్రజల భాగస్వామ్యం, ప్రజా కోణం అనేది అతి తక్కువగా ఉంటుందనేది మనమందరం సులువుగా గ్రహించే విషయం. ఇక కాకతీయ సామ్రాజ్యపు ప్రగతి పటాటోపాలను పక్కకు పెడితే వారి రాజ్యంలో తిరుగుబాట్లు జరిగి రాచరిక వ్యవస్థ పై నిత్యం పోరాటం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయనేది మనకు చారిత్రకంగా అర్థమవుతున్న విషయం.

- ధిక్కార గడ్డకు అవమానకరం
తెలంగాణలో మహా జాతరగా కొనసాగే మేడారం సమ్మక్క, సారలమ్మలు గిరిజనుల ఆరాధ్య దైవాలుగా ఉన్నప్పటికీ కాకతీయ రాజులకు వ్యతిరేకంగా, వారి ఆధిపత్యానికీ, అమానుషత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగించి అమరులయ్యారనేది చరిత్ర మనకు చెబుతోన్న చేదునిజం. కాకతీయ సేనతో జరిగిన యుద్ధంలో అసువులుబాసి ఆదివాసీ గిరిజన వనితలుగా కీర్తి ప్రతిష్టలను పొంది ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో పరిశీలించినప్పుడు కాకతీయుల పాలనతో పాటు అట్టడుగు ఆదివాసీలపై అణచివేత కాకతీయులు కొనసాగించారనేది మనకు అర్థమవుతున్న విషయం. అందుకే దేనికైనా బొమ్మ బొరుసున్నట్లు మంచీ చెడులు కాకతీయుల పాలనలో కూడా కొనసాగాయి. ఈ నేపథ్యంలో కాకతీయ సప్తాహం నిర్వహించడం అంటే వారి వైభవాన్ని మాత్రమే కాదు, వారు అనుసరించిన దుర్మార్గమైన పాలకనీతిని సైతం మనం చాటి చెప్పేందుకు సంసిద్ధమైనప్పుడే ఇలాంటి కార్యక్రమాలకు నిజమైన ప్రజాస్వామిక ప్రాతిపదిక ఏర్పడుతుంది. నేటి తరానికి స్పష్టత నెలకొంటుంది. కానీ దీనికి భిన్నమైన పద్ధతిలో సప్తాహం సాగుతోంది.మరో కోణంలో చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో రాచరికపు వ్యవస్థను కొనియాడడం అంటేనే ప్రజలను అవమానపరిచే అంశంగా భావించాల్సి ఉంటుంది. పాలకులు ప్రజల్లో 'కాకతీయ' గడ్డ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి తమ రాజకీయ ప్రయోజనాల కోసం, ఎన్నికల సందర్భంగా కొన్ని ఓట్లు కొల్లగొట్టేందుకు ఇలాంటి తంతులు నిర్వహించడం అనేది వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇది కూడా అందులో భాగంగా భావించాల్సి ఉంటుంది.

- పాలకులదంతా ఒకే బాట
పాలకులు ఎవరైనా ఎక్కడైనా ఒక్కటే అన్నట్లు మన తెలంగాణ పాలకులు కూడా దానికి భిన్నమైన వారు కాదనేది ఇప్పటికే పలు అంశాలలో చాటి చెబుతూ వచ్చారు. ఉద్యమ కాలంలో వారు చెప్పిన అంశాలకూ అధికారంలోకి వచ్చిన తర్వాత అనుసరించే విధానాలకు పొంతనే లేదంటే ఎవరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. దీనికి అనేక ఉదాహరణలు మనం ఇవ్వచ్చు. రాజుల సంస్కృతిని ప్రజా సంస్కృతిగా, ప్రజల వారసత్వంగా మార్చడం కోసం చేస్తున్న ప్రయత్నాలనేవి ప్రజాస్వామికంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇవేకాదు తెలంగాణలో జరుగుతున్న అనేక మార్పులు దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. స్థానికుల తలలో నాలికగా ఉండే స్థలాలు, వాటి పేర్లను మార్చడం దేవాలయాల పేర్లు మార్చడం, ప్రాజెక్టులకు స్థానికత లేకుండా ఎక్కడెక్కడో పేర్లు ఆపాదించడం, బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలంలో భాగమే. ప్రజలను వాస్తవాలకు దూరంగా పెట్టి మరికొంత కాలం మభ్య పెట్టేందుకు అనుసరించే ఎత్తుగడ మాత్రమే. ఇదంతా పకడ్బందీ ప్రణాళికలతో సాగే వ్యవహారం. ఇక 'సప్తాహం' అనడంలోనే ఆధిపత్య భావ దారిద్ర్యం దాగి ఉంది. వాస్తవానికి తెలంగాణ సంస్కృతిలో ఇలాంటి కార్యక్రమాలను స్థాయిని బట్టి ఉత్సవం, జాతర, తీర్థం అంటూ ఉంటారు. ఇక ఏడు రోజులు 'ఉత్సవాలు' నిర్వహిస్తే వారోత్సవాలుగా పేర్కొనవచ్చు. మన పాలకులకు కాకతీయులకు కీర్తి కిరీటాలు ఆపాదించదలుచుకుంటే, కాకతీయ వైభవం అంటూ నామకరణం చేయవచ్చు. కానీ ఈ 'సప్తాహం' నామకరణంలోనే సగం మార్మికం దాగి ఉంది. ఇప్పటికైనా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రజాహిత కార్యక్రమాల పట్ల స్పష్టతతో, దూరదృష్టితో ఇటువంటి కార్యక్రమాలు కొనసాగించినప్పుడే ప్రగతి పథానికి దారులు పడతాయి. ప్రభుత్వానికి, పాలకులకు గౌరవం పెరుగుతోంది. లేకుంటే ఇటువంటి భారీ భజన తంతులను చాలా చూడాల్సి వస్తోంది.
07జూలై2022.

Relative Post

Newsletter