మతం ముసుగులో అకృత్యాలు
మతం ముసుగులో అకృత్యాలు
- నాగరిక సమాజానికి సవాలు
- అమానవీయకు అద్దం పట్టే ఘటనలు
ఆసారాం బాపు ఉదంతం మరిచిపోక ముందే.. నెల్లూరు జిల్లాలోని ఓ దర్గాలో మతబోధకుడిగా ఉన్న హఫీజు పాషా అఘాయిత్యా లు.., పోర్చుగీసులోని అతిపెద్ద క్యాథలిక్ చర్చిలో 4,800 మంది చిన్నారులపై లైంగిక వేధింపులు జరిగినట్లు వచ్చిన వార్త ఒకే రోజు పత్రికల్లో వచ్చాయి. సమాజంలో గౌరవనీయ పూజనీయ స్థానంలో ఉన్న మత గురువుల వికృతాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. సమాజానికి మార్గం చూపే వారుగా చెలామణి అవుతున్న వారంతా.. పరమ నీచమైన పనులు చేస్తూ చట్టం ముందు, జనం ముందు దోషులుగా నిలుచున్నారు. చాలా మంది జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. ఇంకా చాలా మంది కాషాయ వేషధారణ మాటున గురువులుగా, మత బోధకులుగా సమాజంలో తిరుగుతున్నారు.
- అకృత్యాలకు మతభేదం లేదు
మతం ముసుగులో నీచానికి పాల్పడటంలో ఈ మతం, ఆ మతం అనే తేడా లేదు. మతం ఏదైనా... అకృత్యాల్లో, నీచ పనుల్లో తేడా ఏమీ లేదు. సంతులు, సన్యాసులు, గురువులు, మత బోధకులుగా ప్రజల అంధ విశ్వాసాలను ఆసరా చేసుకొన్న వారి వ్యవహారమంతా.. దొరికితేనే దొంగ అన్న చందంగా ఉన్నది. ఇప్పటికీ బోధకులుగా, గురువులుగా చెలమణి అవుతున్న వారి కార్యకలాపాలపై అనేక ఆరోపణలున్నాయి. ముఖ్యంగా అందరిలో ప్రధానంగా కనిపించేది లైంగిక అత్యాచారాలు, వేధింపులు ఉండటం గమనర్హం. వీరంతా పొద్దున లేస్తే... నైతికత గురించి విలువల గురించి బోధిస్తూనే.. ఎంతటి దుర్మార్గాలకు పాల్పడ్డారో వెలుగులోకి వచ్చిన విషయాలను గమనిస్తే... ఓళ్లు గగుర్పొడుస్తుంది, భయమేస్తుంది.
- హఫీజ్ పాషా ఉదంతం
తాజాగా... బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులకు చిక్కిన హఫీజు పాషా నెల్లూరు జిల్లాలో ఓ పవిత్రమైన దర్గాలో పూజారి. మత బోధకుడు. దీర్ఘకాలిక రోగాలు, మానసిక, శారీరక జబ్బులను నయం చేస్తానంటూ.. జనాన్ని నమ్మబలికాడు. అది ఆనోటా ఈ నోటా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత ప్రచారంలో ఉన్నది. ఆ క్రమంలోనే... హైదరాబాద్ నుంచి ఓ కుటుంబం వారు వెళ్లి తమ కుమార్తె అనారోగ్యం గురించి చెప్పుకుంటే... హఫీజ్ పాషా నయం చేస్తానని నమ్మ బలికాడు. కానీ.. ఆమె ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా.. ఆమెను తనకు ఇచ్చి పెండ్లి చేస్తేనే ఆమె బతుకుతుందని చెప్పుకొచ్చాడు. పాపం అమాయకులు ప్రాణం కన్న ఏదీ ఎక్కువ కాదని నమ్మి, అతినికిచ్చి పెండ్లి చేయటానికి ఒప్పుకున్నారు. పెండ్లి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. తీరా పెండ్లి సమయానికి ఆరోగ్యం బాగా లేదని చెప్పి హఫీజ్ తప్పించుకోవటంతో... తాము మోసపోయామని తెలుసుకున్న కుటుంబం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేయటంతో హఫీజ్ రాసలీలలు, అఘాయిత్యాలు వెలుగు చూశాయి. ఇలాంటి మాయమాటలతోనే... ఇతను ఇప్పటికే ఏడు పెండ్లీలు చేసుకున్నాడు. ఇలాంటి వారిని ఎందరినో మాయ మాటలతో వంచించాడు. వేధింపులకు పాల్పడ్డాడు. ఇతని అక్రమాలు, అఘాయిత్యాలపై ఇప్పటికే 13 కేసులు నమోదయ్యాయి. రాజకీయ నేతల అండదండలతోనే హఫీజ్ ఎలాంటి కేసులు లేకుండానే... తప్పించుకొని తిరుగుతున్నాడు.
- చిన్నారుల పైన దాష్టీకం
ఇక... ఆధునిక, అభివృద్ధిచెందిన నాగరిక సమాజాలుగా చెప్పుకొంటున్న పోర్చుగీసులో చర్చిలో సాగిన లైంగికవేధింపుల విషయంలో ఓ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేయించారు. అతిపెద్ద క్యాథలిక్ చర్చిలో కొన్నేండ్లుగా కొనసాగిన వికృతాలు వెలుగుచూశాయి. దాదాపు 4,800 మంది చిన్నారులు లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిసింది. చిన్నారులపై అకృత్యాలకు పాల్పడ్డవారంతా మత పెద్దలే కావటం గమానర్హం. చిన్నారుల్లో 47శాతం బాలికలున్నారు. ఇంత జరిగినా.. ఇప్పటికీ 512 మంది మాత్రమే నోరు విప్పి తమపై కొనసాగిన దారుణాలను తెలుపగలిగారు.
- ఆసారాం బాపు రాసలీలలు
ప్రపంచ ప్రఖ్యాత అద్వైత వేదాంత ప్రబోధకుడిగా... అసారాం బాపు దేశ దేశాల్లో లక్షల సంఖ్యలో అనుయాయులను, శిశ్యులను కలిగి ఉన్నాడు. వందలకోట్ల రూపాయలతో దేశ , విదేశాల్లో ఆశ్రమాలు నిర్మించాడు. ఆ ఆశ్రమాల్లో రోజుల తరబడి ఆధ్యాత్మిక తరగతులు, నీతి, భక్తి బోధనలు చేశాడు. మన దేశంలో అయితే.. ఆయనొక నడుస్తున్న దేవుడిగా కీర్తించబడ్డాడు. జీవన విలువలు, సచ్ఛీలత, నడవడిక, మానసికానందం గురించి బోధనలు చేస్తూ... కీర్తి ప్రతిష్ఠలు సంపాదించాడు. ఆ క్రమంలో తన ఆశ్రమానికి వచ్చిన మహిళలను చెరబట్టి లొంగదీసుకొని నీచానికి పాల్పడ్డాడు. ఎంతమందిపై అత్యాచారాలకు తెగించాడో లెక్కలేదు. ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చినవే పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇప్పటికే 2013లోనే ఓ బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు విధించింది కోర్టు. తాజా ఈ మద్యనే మరో అత్యాచారం, హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడింది. ఇంకా ఎన్ని వెలుగు చూడాలి..., ఆసారాం చేసిన అకృత్యాలకు ఏ శిక్ష తగినది.., ఆయన లాంటి వారు ఇంకా మన సమాజంలో ఎంత మంది మిగిలి ఉన్నారు అన్నది మన సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇవి ఈ మధ్య కాలంలో... వార్తల్లోకి ఎక్కి సంచలనాత్మకం అయినవి.
- మతం ముసుగులో దారుణం
ఇలా మత బోధకులు, సంతులు, సన్యాసులు, గురువులుగా చెలామణి అవుతూ సాధారణ మనిషి చేయలేనన్ని నేరాలు, ఘోరాలు చేశారు. కిడ్నాపులు, ఆర్థిక నేరాలు, భూ కబ్జాలు, బెదిరింపులు మొదలు... హత్యలు, అత్యాచారాల దాకా వారు చేయని నేరం లేదు. ఒక్కో సందర్బంలో మత గురువుల వేషంలో ఉన్న వారు చేసిన నీచకార్యాలను చూస్తే... ఎంతటి శిక్ష వేసినా తక్కువే అనిపిస్తుంది. పదులు వందల సంఖ్యలో అత్యాచారాలు, హత్యలకు పాల్పడిన వారు ఇంకా మత బోధకులుగా ఉన్నారు. డేరా బాబాగా పేరు గాంచిన గుర్మీత్ రామ్‌రహీమ్‌సింగ్ పంజాబ్, హర్యాణా, యూపీ రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో అనుయాయులను కలిగి ఉన్నాడు. డేరాబాబాది ఓ చీకటి నేర సామ్రాజ్యం. ఎంతో మందిపై అత్యారాలకు పాల్పడ్డాడు. ఎన్నో హత్యలు చేశాడు. ఓ హత్య, అత్యాచారం కేసులో అడ్డంగా దొరికి జైల్లో ఉన్న డేరా బాబా పెరోల్‌పై బయటికి వస్తే.. మళ్లీ వేల సంఖ్యలో భక్తులు ఆయన పాదాలకు మొక్కటానికి బారులు తీరారంటే.. మన సమాజం ఏ దిశగా పోతున్నదో భయమేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే... బాబా రాంపాల్, స్వామీ నిత్యానంద, నిర్మల్ బాబా, స్వామీ వికాసానంద్.. దాకా, కాశాయం ధరించి కసాయి పనులు చేసిన సన్యాసుల సంఖ్య తక్కువేమీ లేదు. ఇంకా నేరుగా దొరకకుండా రాజకీయ నేతల అండదండలతో గురువులుగా గౌరవం పొందుతున్న వారంతా నేరస్తులే అనటానికి ఇప్పటి దాంకా వెలుగు చూసిన ఉదంతాలే నిదర్శనం.
- అమానవీయతకు అద్దం
అయితే... మౌలిక విషయం ఏమంటే... మతం పునదిగా... మత బోధనలతో... మనుషుల్లో నైతికతను, జీవన విలువలను పెంపొందించటమే లక్ష్యంగా చెప్పుకొంటూ.. సమాజంలో గౌరవ మర్యాదలు, మన్ననలు పొందుతున్న వారంతా నిలువెల్లా మకిలంతో ఉన్నారని తెలిసి వస్తున్నది. తరతరాలుగా మంచినే బోధిస్తున్న మతం వెలుగులో... నడుస్తున్న సమాజ సమూహాల్లో అవినీతి, అక్రమాలు ఎందుకున్నాయో ఎవరూ చెప్పరు! ఏ మతమూ బాధ్యత వహించదు!! జరుగుతున్న ఘటనలు, సామాజిక పరిణామాలను చూస్తే... అసలు అమానవీయత అంతా మతంలోనే ఉన్నదని ఎందుకు అనుకోకూడదనే ప్రశ్న ఉత్పన్నం కాక మానదు. ఆధునిక నాగరిక సమాజానికి మతం గుదిబండ కాదా..?
*-శ్రామిక