ఫాసిస్టు పాలనలో ప్రజాస్వామ్యం మృగ్యం
ఫాసిస్టు పాలనలో ప్రజాస్వామ్యం మృగ్యం
- హక్కుల ఉద్యమాల పై ఉక్కుపాదం
- ప్రజా ఐక్యత ద్వారా పరిరక్షించుకుందాం!!
దశాబ్దాలుగా దేశంలో మెజారిటీవాద హిందూ ఆధిపత్యవాదం విజృంభిస్తున్నది. వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత ఊపందుకొని.., నరేంద్రమోదీ ఢిల్లీని ఆక్రమించుకొన్న తర్వాత అది ‘ఫాసిజం’గా పరిణమించింది. ఈ హిందూ ఆధిపత్యవాదాన్నే ‘బ్రాహ్మణీయ హిందూ ఫాసిజం’గా తాత్వికంగా, సైద్ధాంతికంగా నిర్వచిస్తున్నప్పటికీ, రాజకీయంగా ‘మోదీ ఫాసిజం’గా చెప్పుకొంటున్నాం.హిందూ ఆధిపత్యవాదం కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత మోదీ హయాంలోనే పుట్టుకొచ్చింది కాదు. చరిత్ర పొడుగునా అది సంఘటితపడుతూ.., విస్తరిస్తూ వస్తున్నది. కాలానుగుణంగా రూపం మారుస్తూ వస్తున్నది. ఆయా చారిత్రక సందర్భాల్లో నిర్దిష్ట సమాజాన్ని ప్రభావితం చేస్తూ, ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నది.
- ఫాసిజం ప్రజలకు ప్రమాదకరం
జైన, బౌద్ధాల ఆవిర్భావంతో కొంత వెనకపట్టు పట్టినా... తనదైన కుట్రపూరిత చాణక్యనీతితో హిందూ ఆధిపత్యవాదం ఈ సమాజంపై పట్టును సాధించింది. మొత్తం గా భారత సామాజిక, ఆర్థిక రంగాలను శాసిస్తున్నది. సామాజిక అంతరాలను కాపాడుతూ ఆధిపత్య దోపిడీ వర్గాలకు రక్షణగా కాపలా కాస్తున్నది.
ఆధునిక చరిత్రలో హిందూత్వం రూపుమార్చుకొని ‘ఆర్.ఎస్.ఎస్’గా ముందుకొచ్చిం ది. జాతీయోద్యమంలో హిందూత్వ ఆధిపత్యప్రయోజనాలకోసం కొనసాగుతూ.. సంఘటితపడుతూ వచ్చింది.
- స్వాతంత్ర్య పోరులో ప్రయత్నం
ఈ క్రమంలోనే... ఆరెస్సెస్ ఆవిర్భావం, ప్రజలను సంఘటితపర్చటానికి తిలక్ నిర్వహించిన గణేశ ఉత్సవాల లాంటివి హిందూత్వ శక్తుల ఏకీకరణకూ, బలోపేతానికీ సంకేతాలు మాత్రమే. ఇది, క్రమంగా కొనసాగి 1947 నాటికి.. దేశ విభజనకు బ్రిటిష్ పాలకులు అనుసరించిన ‘విభజించు- పాలించు’ అనే దుర్నీతి ఎంత కారణమో, మెజారిటీ వాద హిందూ ఆధిపత్యవాదం కూడా అంతే కారణమన్నది మరువరాదు.
- కాంగ్రెసు, బీజేపీ ఇద్దరి పాత్ర
ఆధునిక చరిత్రలో హిందూ ఆధిపత్యవాదం విస్తరించటం, బలోపేతం కావటంలో కాంగ్రెస్, బీజేపీలది సమాన పాత్ర. కాకుంటే... 80వ దశకం తర్వాత, కాంగ్రెస్‌ను తలదన్ని బీజేపీ మరింత దూకుడుగా, పాశవికంగా మెజారిటీవాదంతో దూసుకురావటమే నేటి విపరీతానికి కారణం.
గత ఎనిమిదేండ్లుగా మోదీ హయాంలో బీజేపీ అనుసరిస్తున్న రాజకీయ, ఆర్థిక విధానా లతో దేశం మున్నెన్నడూ లేని విధంగా విషమ పరిస్థితులను ఎదుర్కొంటున్నది. స్వావ లంబన దిశగా సాగి పోవాల్సిన దేశం పరాధీన దేశంగా కుదేలవతున్నది. ఈ నేపథ్యం లో... ప్రతిదీ ప్రైవేటికరించబడుతున్నది. ప్రభుత్వరంగ సంస్థలన్నీ ప్రైవేటు పరం అవుతున్నాయి. ఈ క్రమంలోనే రైళ్లూ, విమానాశ్రయాలు, ఓడరేవులు కారుచవకగా అదానీ, అంబానీ లాంటి ఆధునిక కుబేరుల వశం అవుతున్నాయి. దేశ భక్తి తమ గుత్తసొత్తు అయినట్లు, నోరు తెరిస్తే.. జాతీయత, దేశభక్తి అంటూ చెప్పుకుతిరిగే.. మోదీ రక్షణ రంగ ఉత్పత్తులు మొదలు దేశ సముద్రతీరం సమస్తాన్నీ ప్రైవేటు పెట్టుబడిదారు లకు కట్టబెట్టడం గమనార్హం గర్హనీయం. దేశ ప్రజల జీవన భద్రతకు భరోసాగా ఉన్న జీవిత బీమాసంస్థ (ఎల్‌ఐసీ)ని సైతం ప్రైవేటు పరం చేయటం ఏవిధమైన దేశభక్తో, ఎవరిపై భక్తో అర్థం అవుతూనే ఉన్నది. ఎనిమిదేండ్లుగా మోదీ చేస్తున్నదంతా దేశాన్ని అంగట్లో సరకుగా అమ్మివేయటమే.
- అణిచివేత ఆయుధం
ఇలాంటి ప్రజావ్యతిరేక విధానాలపై విమర్శలను, కనీస నిరసనలను సైతం సహించలేని మోదీ ప్రభుత్వం అణిచివేతను కొనసాగిస్తున్నది. ఈ క్రమంలోనే పౌర, ప్రజాస్వామిక హక్కులు హరించిపోయాయి. విమర్శ, నిరసన గళాలను సైతం మోదీ ప్రభుత్వం దేశ ద్రోహంగా ముద్రవేసి నిర్బంధించి జైళ్లలో పెడుతున్నది. ఈ క్రమంలోనే గౌరీ లంకేశ్, దబోల్కర్, కలబుర్గీ హత్యోదంతాలు; స్టాన్ స్వామి నిర్బంధ హత్య, ప్రొఫెసర్ సాయిబాబ అక్రమనిర్బంధం లాంటివి రాజ్య దుర్మార్గానికి పరాకాష్టగా నిలుస్తున్నాయి. ఇలాంటి భయానక పరిస్థితులతో స్మశాన శాంతిని సృష్టిస్తున్నది మోదీ ప్రభుత్వం.
ఇంతే కాదు, రాజ్యాంగ వ్యవస్థలు, సంస్థలన్నింటినీ మోదీ ధ్వంసం చేస్తున్నాడు. విచారణాసంస్థలను ప్రత్యర్థి రాజకీయ పార్టీలపై ఉసిగొల్పి భయబ్రాంతులకు గురిచేస్తూ లొంగదీసుకొంటున్నాడు. చారిత్రకంగా కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను సరళీకరణ పేరిట రద్దుచేశాడు. 1500 చట్టాలను తన ఇష్టారాజ్యంగా రద్దు చేశాడంటే.. ప్రజల హక్కులు ఏ రీతిన హరించబడ్డాయో అర్థమవుతున్నది.
- మోడీతో పెరిగిన వ్యక్తి స్యామ్యం
ఇదంతా.. ప్రజస్వామ్యపాలన స్థానంలో మోదీ తన వ్యక్తిస్వామ్యాన్ని నెలకొల్పటమే.
ఈ సంక్షుభిత పరిస్థితుల్లోంచే.. దేశంలో మూల మూలనా ప్రజా ఉద్యమాలు ముందు కు వస్తున్నాయి. తమవైన సమస్యల పరిష్కారం కోసం, న్యాయమైన డిమాండ్ల సాధనకోసం ఉద్యమిస్తున్నారు. సొంత భూమిలోనే కాందిశీకులను చేసే, నేరస్తులను చేసే సీఏఏ, ఎన్‌ఆర్‌సీ లాంటి చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మైనారిటీలు, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేటు శక్తులకు అప్పజెప్పే కొత్త వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని రైతాంగం ఏకంగా దేశ రాజధాని ఢిల్లీనే ముట్టడించింది. సుదీర్ఘ పోరాటంతో వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకునే దాకా ఏడాది కాలం ఉద్యమించిన రైతులు.. మోదీ మెడలు వంచి విజయం సాధించారు. ప్రభుత్వరంగ సంస్థలైన బ్యాంకులు, రైల్వేలు, ఎల్‌ఐసీ లాంటి వాటిని ప్రైవేటు పరం చేయటాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు.
- నిరసనోద్యమాలు
ఈ నేపథ్యంలో... లౌకిక ప్రజాస్వామిక శక్తుల పునరేకీకరణను ‘కారు చీకటిలో కాంతి రేఖ’గా చెప్పవచ్చు.
ఇదే అదనుగా బీజేపీయేతర రాజకీయ పక్షాల్లోనూ కదలిక రావటం గమనార్హం. గత ఏడెనెమిదేండ్లుగా తలను లోపలికి ముడుచొకొన్న ‘అలుగు’(బండరాయి)లా పడిఉన్న విపక్షాలు నేడు కదలికను కనబరుస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మొదలు కొన్ని ప్రాంతీయ పార్టీ(శక్తు)లు కూడా మోదీకి వ్యతిరేకంగా గొంతెత్తున్నాయి.
అయితే ప్రస్తుత మోదీ ఫాసిస్టు పాలనలో ఎంత చిన్నదైనా, ఎంతగా అనుమానించ దగినదైనా అవసరమైనదిగా కనిపిస్తున్నది.
- అన్నీ ఆ తాను ముక్కలు
నేడున్న పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ యాత్రను; టీఆర్‌ఎస్ చేసిన బీఆర్‌ఎస్ ప్రకటనను కొందరు ఓ ఆశావహ పరిణామంగా చూస్తున్నారు. తమదైన స్థాయిలో భాగస్వాములవుతున్నారు. అయితే... నిన్న మొన్నటి దాకా మోదీ ప్రజావ్యతిరేక, ఫాసిస్ట్ విధానాలను నిరసించటం, వ్యతిరే కించటంలో కనీస బాధ్యత చూపని విపక్షాలను మనం ఎంతమేరకు విశ్వసించాలనేది నేడు లౌకిక ప్రజాస్వామిక శక్తులముందున్న ప్రశ్న. జాతీయోద్యమ కాలం మొదలు 80వ దశకం దాకా కాంగ్రెస్ అనుసరించింది కూడా మెజారిటీ వాదమే. ఆ తర్వాత కాలంలో ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ వినాశకర విధానాలనే అనుసరించింది. అయోధ్యలో నిత్యపూజల పేరిట వివాదాస్పద రామాలయం ‘గుడి తాళాలు’ తీసింది రాజీవ్‌గాంధీయే. అలాగే... అయోధ్య-బాబ్రీ మసీదు వివాదంలో హిందూత్వ సంస్థలు చేపట్టిన ‘కరసేవ’ సందర్భంగా... విధ్వంసం జరుగబోతున్నదని నిఘాసంస్థల హెచ్చరికలున్నా పీవీ నరసింహారావు మౌనమునిగా కూర్చొని బాబ్రీ మసీదు కూల్చివేతకు పరోక్షకారకుడైన తీరు ఉండనే ఉన్నది.
కానీ బీజేపీ కన్నా ఏ అర్థంలో కాంగ్రెస్ విభిన్నమో రాహుల్ గాంధీ చెప్పటం లేదు. మేధావులు, సామాజిక కార్యకర్తల నిరసన గళాల నోరు నొక్కేందుకు దేశద్రోహ కేసులు మోపుతున్న మోదీ తీరును ప్రశ్నించటం లేదు. అలాగే స్వయం నిర్ణయాధికార, స్వావలంబన ఆర్థిక విధానాల అమలు గురించి మాట్లాడటం లేదు. అలాంటప్పుడు మోదీకి రాహుల్ గాంధీ ఏ రూపంలో ప్రత్యామ్నాయం? ఆర్‌ఎస్‌ఎస్ హిందుత్వ శక్తులు విచ్ఛిన్న శక్తులని తీర్మానం చేసినంత మాత్రాన ఉన్నపలాన కాంగ్రెస్ లౌకక ప్రజాస్వామిక శక్తి కానేరదు. ఇక ప్రాంతీయ పార్టీల రూపంలో ఉన్న శక్తులన్నీ అధికారం కోసం చేసే ఆరాటాలు తప్ప మరేమీ కాదు. బీజేపీ, ఇతర ప్రాంతీయ పార్టీల మధ్య తీవ్ర ఘర్షణగా కనిపిస్తున్న వన్నీ అధికార పెనుగులాటలే. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ మొదలు సమాజ్ వాదీ, ఆర్‌జేడీ, డీఎంకే తదితర పార్టీల స్థానిక ప్రాంతీయ రాజకీయ శక్తులకు బీజేపీతో ఉన్న పంచాయితీ, ఘర్షణ అంతా అధికారం కోసమే.
ఇక్కడే ఒక ప్రాంతీయ రాజకీయ శక్తిగా టీఆర్‌ఎస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో కేంద్రంలోని బీజేపీ, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నది. మోదీ అనుసరిస్తున్న రాజకీయార్థిక విధానాలపై ఉద్యమిస్తున్నట్లుగా ‘పోజు’ పెడుతున్నది. దేశవ్యాప్తంగా బీజేపీని నిలువరించే రాజకీయ శక్తి తానేనని చెప్పుకొంటున్నది. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చి.. నక్క పులిచారలు గీసుకొని నమ్మబలుకుతున్నది. రాష్ట్ర సాధన తర్వాత గత ఏడేండ్ల టీఆర్‌ఎస్ పాలన ప్రజలను తీవ్ర నిరాశా నిస్పృహలకు గురిచేసింది.
- తెలంగాణలో పెరిగిన నిరాశ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో విముక్తి లభిస్తుందన్న ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. ప్రజల ప్రజాస్వామిక హక్కులు, ఆకాంక్షల విషయంలో తెలంగాణ ప్రజల బతుకు పెనం మీదినుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారైంది. గోరంతను కొండంత చేసి.. అబద్దాలు, అభూత కల్పనలతో ప్రజలను కేసీఆర్ ఏమార్చి వంచిస్తున్నాడు. సరిగ్గా ఇక్కడే మనం అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. లౌకిక ప్రజాస్వామిక శక్తులు మోదీ పాలనను వ్యతిరేకిస్తున్నామంటున్న శక్తుల, పార్టీల గత ఆచరణను తరచి చూడాలి. టీఆర్‌ఎస్ గత ఆచరణ, అనుభవాలను చూస్తే.. కేసీఆర్ చరిత్ర అంతా మోదీ పల్లకి మోయటంగానే ఉన్నది. రాజకీయార్థిక విధానపర విషయాల్లో బీజేపీ, టీఆర్‌ఎస్ రెండూ ఒకే తాను గుడ్డలేనని తేటతెల్లమైంది. పెద్దనోట్ల రద్దు, దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానమంటూ...తెచ్చిన ‘జీఎసీ’్టపై దేశంలో అందరికన్నా ముందుగా మోదీకి వంతపాడింది కేసీఆర్ మాత్రమే. వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతుల దేశవ్యాప్త సమ్మెకు మద్దతు ప్రకటించి, రాత్రికి రాత్రి ‘యూ టర్న్’ తీసుకున్న విషయం మర్చిపోలేం. ప్రజల హక్కులను హరించటంలో, క్రూర నిర్బంధకాండ అమలు చేయటంలో మోదీ, కేసీఆర్ ఎవరికి ఎవరూ తీసిపోరు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి ఏరూపంలో, ఏ అర్థంలో బీఆర్‌స్ ప్రత్యామ్నాయం అవుతుందో అందరూ ఆలోచించాల్సిందే. ఈ ఎనిమిదేండ్లలో నరేంద్రమోదీ మెజారిటీ వాద ఓటు బ్యాంకు రాజకీయంలో రాటుదేలాడు. తన పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను, వ్యతిరేక ఓటునూ చీల్చి అధికారం చేజిక్కించుకోవటంలో ఆరితేరాడు. దీనికి యూపీ ఎన్నికలే సాక్ష్యం. యూపీలో మోదీకి ప్రత్యర్థి పార్టీలే వనరు. అవి చీల్చే ఓట్లతోనే సీట్లు గెలుస్తూ అధికారం కైవసం చేసుకుంటున్నాడు. మోదీ విజయ రహస్యమంతా విపక్ష పార్టీల ఉనికిలోనే ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇవ్వాళ చాలా మంది రాజకీయ విశ్లేషకులు బీఆర్‌ఎస్‌ను అనుమానిస్తున్నారు. బీజేపీకి ‘బీఆర్‌ఎస్’ను ‘బీ-టీమ్’ అంటున్నారు.
- చివరిదాకా కేసీఆర్ నిలబడుతారా?
ఇదిలా ఉంటే... అవకాశవాదంగానైనా, కేసీఆర్ లాంటివారు తుదివరకూ మోదీని గద్దెదించే పోరాటంలో నిలుబడుతారా అన్న అనుమానాలు బలంగానే ఉన్నాయి. బెంగాల్‌లో బీజేపీతో ఎంత ఘర్షణ పడినా.., దేశ వ్యాప్తంగా మోదీ వ్యతిరేక శక్తులను కూడగట్టడానికి మమతాబెనర్జీ ఎక్కడా ప్రయత్నిస్తున్న దాఖలాలు లేవు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ దిశగా కాలు కదుపుతున్న పరిస్థితులేమీ కనబడటం లేదు. ఎందుకో... ఈ మధ్య కేసీఆర్ మాట్లాడుతున్న మాటలను ఎంత మేరకు విశ్వసించవచ్చునో ఆలోచించాల్సిందే.
- అప్రమత్తత అవసరం
సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే లౌకిక ప్రజాస్వామిక శక్తులన్నీ ఎరుకతో, జాగరూకతతో ఉండాలి. మోదీ వ్యతిరేకత పేరిట తార్కికతను, విచికిత్సను మరిచి ‘పోలో’మని పోరాదు. మోదీకి వ్యతిరేకంగా దేశంలో ఏ మూలనుంచి ఏ చిన్న కదలిక వచ్చినా దాన్ని ఆహ్వానించాలి.. భాగస్వామ్యం కావాలి. అలాగే... అవకాశ వాద రాజకీయం పట్ల ఎల్లప్పుడూ ఏమరుపాటుగా ఉండాలి. సామాజిక ఉద్యమాల్లో పవిత్రతా వాదం పనికి రానట్లే.., ఫక్తు రాజకీయాల పట్ల అప్రమత్తత అత్యవసరం. నిబద్ధత, విలువల నీడ అంటేనే గిట్టని రాజకీయ శక్తుల చెంతన ప్రజాస్వామ్య శక్తులు నిత్యనూతనంగా చైతన్యంతో వ్యవహరించాలి. ఈ సంక్లిష్ట సంధికాలంలో వస్తున్న ప్రతి కదలికనూ, ఉద్యమాన్నీ స్వాగతిస్తూనే.., ఆ ఉద్యమాలను నిజమైన ప్రజానుకూల ప్రజాస్వామిక ఉద్యమాలుగా మలుచుకోవాలి, నిలుపుకోవాలి. అందుకోసం ప్రజాస్వామిక ఉద్యమ శక్తులన్నీ మరింత పట్టుదలతో, బాధ్యతతో వ్యవహరిస్తూ ప్రజలు ఉద్యమించాలి.