హైదరాబాద్‌లో ధోని క్రికెట్‌ అకాడమి

 హైదరాబాద్‌లో ధోని క్రికెట్‌ అకాడమి

హైదరాబాద్‌: భారత దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన మహేంద్ర సింగ్‌ ధోనీ క్రికెట్‌ అకాడమీ (ఎంఎస్‌డీసీఏ)ని హైదరాబాద్‌లో ప్రారంభిస్తుండడం గొప్ప విషయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సి.మల్లారెడ్డి కొనియాడారు. శుక్రవారం నాచారంలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ (డీపీఎస్‌)లో జరిగిన ఎంఎస్‌డీసీఏ అకాడమీ ప్రారంభోత్సవంలో మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ (శాట్స్‌) చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి, ఎంఎస్‌డీసీఏ-ఆర్కా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మిహిర్‌ దివాకర్‌ పాల్గొన్నారు. తొలుత మంత్రి సమక్షంలో ఎంఎస్‌డీసీఏతో రెండేళ్ల కాలానికి కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలను ఢిల్లీ స్కూల్‌ నాచారం, పల్లవి విద్యాసంస్థల చైర్మన్‌ మల్కా కొమరయ్య, మిహిర్‌ దివాకర్‌ మార్చుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎంఎస్‌డీసీఏను ఉన్నత ప్రమాణాలతో నడుపుతూ భవిష్యత్‌లో ధోనీ వంటి ఉత్తమ క్రికెటర్లను టీమిండియాకు అందించాలని మంత్రి ఆకాంక్షించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెరుగైన శిక్షణ అందించాలనే ఉద్దేశంతో ‘ఎంఎస్‌డీసీఏ’ను స్థాపించినట్టు ఆ సంస్థ ఎండీ మిహిర్‌ చెప్పారు. తొలి దశలో భాగంగా  ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ (నాచారం)లో ఈ నెలాఖరు నుంచి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు.


Relative Post

Newsletter