ఎన్నాళ్ళీ ఎడముఖం పెడ ముఖం!?

ఎన్నాళ్ళీ ఎడముఖం పెడ ముఖం!?


౼ ఇంతకాలం దోస్తీ ఇప్పుడు కుస్తీ

౼ పీఎం పర్యటనకు సీఎం దూరం

౼ బిజినెస్ స్కూల్ వార్షికోత్సవానికి మోడీ

౼ బెంగుళూరు వెళ్లనున్న కెసిఆర్?

౼ మళ్ళీ తలసానికే అవకాశం

౼ రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు(ప్రత్యేక ప్రతినిధి):ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ కార్యక్రమానికి గైర్హాజరైతున్నారు. కొత్త పద్ధతికి తెరతీశారు. ఇప్పటికీ ఒకసారి ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి మోడీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో ఆ కార్యక్రమంలో సహభాగస్వామి అయ్యేందుకు కేసీఆర్ అయిష్టంగా ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.


౼  ప్రధాని పర్యటనకు సీఎం దూరం

తొలిసారి రామానుజాచార్యుల విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఇరువురి మధ్య సమస్య పొడచూపింది. ముచ్చింతల్లో  జరిగిన భారీ కార్యక్రమానికి ప్రధాని హోదాలో మోడీ హాజరు కాగా ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్య కారణాల రీత్యా హాజరు కాలేక పోయినట్లు సీఎంవో వర్గాలు అప్పుడు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఎం కార్యక్రమంలో భాగస్వామి అయ్యారు. తాజాగా ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ వార్షికోత్సవానికి పీఎం మోడీ హాజరవుతున్ననేపథ్యంలో ఈ దఫా కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ దూరంగా ఉంటున్నారు.ఈసారి కూడా ముఖ్యమంత్రి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నట్లు సమాచారం.


౼ సీఎం బెంగళూరు వెళ్తారా!?ప్రధాని పర్యటన రోజు కెసిఆర్ స్థానికంగా ఉంటారా? లేకుంటే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమం ప్రకారం మాజీ ప్రధాని దేవెగౌడ కలిసేందుకు బెంగళూరు వెళ్తారా? అనేది రేపు తేలనుంది. ఎందుకంటే స్థానికంగా ఉంటూ పీఎం కార్యక్రమానికి దూరంగా ఉంటే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. పైగా ఇది మంచి సంప్రదాయం కూడా కానందున బీజేపీకి ఆ అవకాశం ఇవ్వకుండా కెసిఆర్ బెంగళూరు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు.౼ ప్రోటోకాల్‌కు రాజకీయ రంగు


వాస్తవానికి ప్రధాన మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఎవరున్నా వ్యక్తులూ, పార్టీలు ఏవైనా ప్రధానమంత్రి హోదాలో ఏ రాష్ట్రానికి అధికారికంగా హాజరైనా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వాగతం పలకడం,  ప్రధానితో పాటు ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం,  అనంతరం వీడ్కోలు పలకడం సర్వసాధారణ విషయం. పైగా ఇది గౌరవ మర్యాదల కార్యక్రమమే కాకుండా, ప్రోటోకాల్ కు సంబంధించిన విషయం కూడా ఇందులో ఇమిడి ఉంటుంది.రాజకీయ అభిప్రాయాలు, వ్యక్తిగత వైషమ్యాలకు ఇందులో తావులేదు. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి అందుబాటులో లేనప్పుడు ఆయన స్థానంలో మంత్రివర్గ సహచరుల్లో ఒకరు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఇదంతా మినహాయింపు మాత్రమే.కానీ, తాజాగా కెసిఆర్ మోడీ మధ్య నెలకొన్న విభేదాలు, రాజకీయ భిన్నాప్రాయాల నేపథ్యంలో కొత్త సంప్రదాయానికి కేసీఆర్ ప్రారంభిస్తున్నారు.౼ ఎంతకాలమీ ఎడమొఖం!

ఇదిలా ఉండగా కేసీఆర్ ప్రధానికి  దూరంగా, ఆయనను కలువకుండా ఎంతకాలం ఉంటారనేది పెద్ద ప్రశ్న.

ఎందుకంటే రాష్ట్ర కేంద్రాల మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ రెండు ప్రభుత్వాల మధ్య సయోధ్య లేకపోతే,  సత్సంబంధాలు లేకపోతే కొన్ని ఇబ్బందులు తప్పవేమో?౼ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం


ప్రస్తుతం మోడీ కెసిఆర్ మధ్య వైరుధ్యం కొనసాగుతోంది. ఇది ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారే అవకాశాలు ఉన్నాయి. తమ తమ వ్యక్తిగత ప్రతిష్ట కోసం రాష్ట్ర ప్రయోజనాలను బలి పెట్టడం సరైనది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఇప్పటికే అప్పుల అంశంపై పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. కేంద్ర నుంచి రావాల్సిన నిధుల విడుదలలో వివక్ష కనబరుస్తున్నారనే ఆరోపించారు.విభజన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో రాజకీయ ప్రయోజనాలకోసం రాష్ట్రానికి నష్టంవాటిల్లుతుందనే ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.౼ లోపిస్తున్న రాజ్యాంగ స్ఫూర్తి

రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం కేంద్ర రాష్ట్రాల మధ్య స్పూర్తిదాయక సంబంధాలు ఉండాలని కోరుకుంటారు. ఈ పద్ధతి చాలా కాలంగా అమలైతోన్నదే. ఇదే సమయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య విభేదాలు వచ్చిన సందర్భాలున్నాయి. వీటిని సామరస్యంగా ఫెడరల్ స్ఫూర్తితో పరిష్కరించుకుంటే ఇరువురికీ గౌరప్రదం. కానీ ఇటీవల దేశ,రాష్ట్ర ప్రయోజనాలు,విలువలకంటే స్వార్థ, స్వప్రయోజనాలకు విలువనిస్తూ దిగజారి ప్రవర్తించడం సిగ్గుచేటు.

౼ ఇంతకాలం దోస్తీ...ఇప్పుడు కుస్తీ


గత ఎనిమిదేళ్లుగా కెసిఆర్ మోడీ మధ్య సత్సంబంధాలు కొనసాగాయి. కానీ హఠాత్తుగా వీరి మధ్య విభేదాలకు, వైరుధ్యాలకు కారణాలు ఏంటనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఉన్నట్టుండి ఇరు పార్టీల మధ్య విమర్శలు ఆరోపణలు ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్నారు. అయితే ఇవి ఎంతకాలం కొనసాగిస్తారనేది ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. మరో రెండేళ్లపాటు అధికారంలో ఉండే అవకాశం ఉంది. మరి అప్పటి వరకు కేంద్రంలో మోడీయే ప్రధానిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండేళ్ల పాటు రాష్ట్ర కేంద్రాల మధ్య అనేక సమస్యలు, సంబంధాలు, ఇచ్చిపుచ్చుకునే ధోరణి, ఇబ్బందులను పరిష్కరించుకునే ప్రయత్నం, రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకునే అవకాశం తదితర అనేక సమస్యలు ఉంటాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి హోదాలో కెసిఆర్ ప్రధానిని కలవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే రానున్న రెండేళ్లపాటు కెసిఆర్ మోడీని కలవకుండా ఉంటారా అనేది ఇప్పుడు ప్రశ్న. ఇక ఇదిలా ఉండగా కేసీఆరే కాదు ఎవరైనా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళవచ్చు అంతమాత్రాన ప్రధానితో ఎడమొఖం, పెడ ముఖంగా ఉండడమేమిటో అర్థం కాదు. ఏది ఏమైనా ఈ సంప్రదాయం సరైంది కాదని పలువురు అంటున్నారు.


Relative Post

Newsletter