జి7 , నాటో సమావేశాలు ఓ పరిశీలన
జి7 , నాటో సమావేశాలు ఓ పరిశీలన
రష్యా-యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుండి అమెరికా కాలు కాలిన పిల్లిలా ప్రపంచం అంతా పరుగు పెడుతూ రష్యా పైన సమావేశాల దండయాత్ర మొదలు పెట్టింది . అమెరికా ఆధిపత్యంలో , ప్రభావంలో ఉన్న కూటముల సమావేశాల పరంపర కొనసాగుతున్నది . ముందు ఐక్యరాజ్యసమితి సమావేశాలలో రష్యాపై దాడి చేసింది అమెరికా . కాని ప్రచారం తప్ప పెద్ద ఫలితం ఏమి రాలేదు . ఈ క్రమంలో అమెరికా కొత్త కూటములకు కూడా పునాదులు వేస్తున్నది . వీటన్నింటి ఉద్దేశం , లక్ష్యం రష్యాను నిలువరించడం . రష్యాను ఉక్రేయిన్ యుద్ధంలో గెలవకుండా చూడడం . అంతే కాదు ఈ యుద్ధాన్ని లాగదీసి సాగదీసి దీర్ఘకాలం యుద్ధం జరిగేలా చూసి రష్యాను ఓడించడం . ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధం ఏవో స్థానిక సమస్యలతో బద్దలైన ఏ ప్రాముఖ్యం లేని ఒక ప్రాంతీయ యుద్ధం కాదు . అమెరికా రష్యాల ప్రపంచ ఆధిపత్య పోటీల్లో భాగంగా జరుగుతున్న యుద్ధం . ఈ యుద్ధంలో రష్యా గెలిస్తే అమెరికా ఆధిపత్యం పశ్చిమ దేశాల ఆధిపత్యం పూర్తిగా అంతమవుతుంది . ఉక్రెయిన్ యుద్ద ఫలితం మొత్తం ప్రపంచ బలాబలాలలో మార్పు తీసుకువస్తుంది . ప్రపంచ నూతన ఆధిపత్య క్రమం మొదలౌతుంది . అందుకే యుక్రెయిన్ యుద్ధం అమెరికాకు జీవన్మరణ సమస్య .
వివిధ సమావేశాల క్రమంలో జి7 , నాటో సమావేశాలు కూడా జరిగినాయి . దీనికి ముందే జి7 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాలు కూడా మూడు జరిగాయి . అందులోనూ ప్రధాన ఎజెండా రష్యా ఉక్రెయిన్ యుద్ధమే . రష్యా పై ఆంక్షలు విధించడం , ఉక్రెయిన్ కు ఆధునిక ఆయుధాలు ఇతర సహాయాలు చేయడం , చైనా ను రష్యాకు దూరంగా ఉండేలా బెదిరిండం ఈ సమావేశాల ఉద్దేశం . ఈ సమావేశాల కొనసాగింపుగా జూన్ 26 , 27 తేదీలలో జర్మనీలో జి 7 దేశాధినేతల ప్రభుత్వాధినేతల సమావేశం జరిగింది . ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యం కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధమే . అయితే పేరుకు పర్యావరణ మార్పులు , ఆహారభద్రత , లింగ సమానత్వం లాంటి కొన్ని ఇతర అంశాలు చేర్చినా అసలు లక్ష్యం రష్యానే . సాధారణంగా జి7 సమావేశాలు ప్రపంచ వనరులు , మార్కెట్ ల కొరకే జరుగుతాయి . మొత్తం ప్రపంచ జనాభాలో జి7 దేశాల జనాభా 10 శాతం మాత్రమే కాని మొత్తం ప్రపంచ సంపదలో మాత్రం 58 శాతం ఈ దేశాలదే . ఈ విషయం చాలు ఈ దేశాల స్వభావం ఏమిటో అర్ధం చేసుకొవాడానికి . వీరికి సంబంధం లేని మిగతా 90 శాతం జనాభా గురించి వీరు నిర్ణయాలు చేస్తారు . ఈ నిర్ణయాలన్నీ సహజంహానే ఈ దేశాల ప్రయోజనాల కొరకే ఉంటాయని అందరికీ తెలుసు . అందుకే ఈ సమావేశాలు జరిగిన ప్రదేశంలో , ఎన్నో ఆటంకాలు కల్పించినప్పటికి వందలాది మంది జనం నిరసన ప్రదర్శనలు చేశారు . ప్రపంచ భద్రత ఏమో కానీ ఈ దేశాధినేతలు తమ భద్రత కొరకు మాత్రం 18 వేల మంది పోలీసులను నియమించుకున్నారు . 18 కోట్ల యూరోలు ఖర్చు చేశారు . ప్రపంచమంతా ప్రాతినిధ్యం ఉన్నదని చూపించుకోవడం కొరకు అభివృద్ధి చెందుతున్న దేశాల నాయకులను అతిధులుగా ఆహ్వానిస్తారు . సెనగల్ , దక్షిణాఫ్రికా . ఇండోనేషియా . భారత దేశ నాయకులను కూడా పిలిచారు . కానీ అసలు ఉద్దేశం ఈ దేశాల వనరులను మార్కెట్లు జీ7 దేశాలకు కావాలి .
జి7 ఎజెండాలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ , మౌలిక సదుపాయాలు , భద్రత లాంటి విషయాలు ఉన్నాయి . ఇందులో అభివృద్ధి చెందుతున్న దేశాలలో మౌలిక సదుపాయాలు అనే విషయం ఎంతో ముఖ్యమైనది . చైనా అభివృద్ది చెందుతున్న దేశాలలో తన బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ క్ర్యక్రమంతో తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేసుకుంటున్నది . చైనా యొక్క ఈ కార్యక్రమం జి7 దేశాల ప్రయోజనాలను దెబ్బతీస్తుంది . దీన్ని ఎదుర్కోవడం కొరకే ఈ సమేవేశంలో జి7 దేశాలు ఆరువందల బిలియన్ డాలర్లు మౌలిక సదుపాయాల కొరకు సేకరించాలని నిర్ణయం తీసుకున్నాయి . కానీ ఇది ఒక నిర్ణయం మాత్రమే . 600 బిలియన్ డాలర్లు లేక లేక అంతకంటే ఎక్కువ ధనాన్ని జి7 దేశాలు ప్రపంచ మౌలిక వసతుల కొరకు ఖర్చు చేయగలిగే పరిస్థితే ఉంటే , అసలు చైనా అభివృద్ధి చెందుతున్న దేశాలలో కి విస్తరించకనే పోయేది .
అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆశ చూపుతూ తమ చేతి నుండి జారి పోకుండా చూడటం కొరకు మాత్రమే జి7 దేశాలు ఈ తీర్మానాలు చేశాయి . మరో ముఖ్య విషయం ఆహార భద్రత . ఆహార భద్రత కొరకు 4.5 బిలియన్ డాలర్లు సేకరించాలని కూడా జి7 తీర్మాణం చేసింది . 2015 లో కూడా జి7 దేశాలు ఇటువంటి తీర్మానం చేసి యాభై కోట్ల మంది ప్రజలను పేదరికం నుండి పైకి తీసుకురావాలని తీర్మాణం చేసింది . కానీ 2022 లెక్కల ప్రకారం 50 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడలేదు కాని ఇంకా అదనంగా మరో 15 కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా పేదరికంలోకి జారి పోయారు . యుద్ధం కారణంగా ఎగుమతులు ఆగిపోయి ఆహారధాన్యాల సంక్షోభం సంక్షోభం ఏర్పడింది . దీన్ని పరిష్కరించకుంటే ఉంటే పేద దేశాలు చైనా చేతిలోకి వెళ్లిపోతాయని భయం . అయితే జీ7 దేశాలే స్వయంగా గత 40 సంవత్సరాల ఎప్పుడూ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి . ద్రవ్యోల్బణం పెరిగిపోయింది . నిరుద్యోగం వేధిస్తున్నది . కరోనా కాలంలో సంక్షోభం మరింత తీవ్రం అయితే ఇప్పుడు రష్యా పై విధించిన ఆంక్షల కారణంగా సంక్షోభం సుడులు తిరుగుతున్నది . ఈ పరిస్థితులలో జి7 దేశాలు తీర్మానాలు ఏమేరకు అమలు అవుతాయో వేచి చూడాల్సిందే . నిజానికి ఈ తీర్మానాలు రాజకీయంగా ప్రభావితం చేయడానికి పనికి వచ్చే ప్రచార తీర్మానాలు మాత్రమే . జి7 సమావేశాల అసలు లక్ష్యం రష్యా పైన ఆంక్షలు విధించడం , ఉక్రెయిన్ కు ఆధునిక ఆయుధాలు సరఫరా చేయడం , చైనా పైన ఒత్తిడి చేసి రష్యాకు దూరంగా ఉంచడం ఈ క్రమంలో ప్రపంచంపై తమ ఆధిపత్యాన్ని తిరిగి నెలకొల్పు కోవడం .
జి 7 సమావేశాల కొనసాగింపుగానే స్పెయిన్ లో నాటో సమావేశాలు జరిగాయి . జర్మనీలో జి7 సమావేశాలు ముగించుకుని , ఈ నాయకులందరూ స్పెయిన్ కు వెళ్లారు . జూన్ 28 నుండి 30 వరకు స్పెయిన్ లో నాటో సమావేశాలు జరిగాయి . స్పెయిన్ లో కూడా వేలాది ప్రజలు నాటోను రద్దు చేయాలంటూ నాటో కు వ్యతిరేకంగా ప్రదర్శన చేశారు . ఇక్కడ కూడా ఈ దేశాధినేతల రక్షణ కొరకు 25 వేల మంది పోలీసులను నియమించారు 37 కోట్ల యూరోలు ఖర్చు చేశారు . నాటో సమావేశాలలో కూడా రష్యా నే కేంద్ర బిందువు . చైనా రెండవ టార్గెట్ . అయితే కోల్డ్ వార్ తర్వాత ఈ సారి నాటో సమావేశాలలో ఇప్పుడు ప్రకటించినంత స్పష్టంగా రష్యా చైనాల గురించి ఎప్పుడూ ప్రకటించలేదు . రష్యాను నాటో దేశాలకు ప్రత్యక్ష ప్రమాదకారిగా పేర్కొన్నారు . నాటో దేశాల ప్రయోజనాలకు , రక్షణకు , విలువలకు చైనా సవాలుగా మారిందని పేర్కొన్నారు . అంటే రాబోయే పది సంవత్సరాలు నాటో వ్యూహాలు ఎత్తుగడలు ఈ అవగాహనను బట్టే ఉంటాయన్నమాట . కోల్డ్ వార్ ముగిసిన తర్వాత నాటో ఇటువంటి అవగాహనకు రావడం ఇదే మొదటిసారి . అంటే ప్రపంచం ఎటువంటి ఆర్థిక రాజకీయ సంక్షోభంలో ఉన్నదో నాటో యొక్క ఈ కొత్త అవగాహన తెలియజేస్తున్నది .
నాటో సమావేశాలలో నాటో విస్తరణ విషయం కూడా ఉంది . కోల్డ్ వార్ ముగిసిన తర్వాత ప్రపంచమంతా శాంతి వెల్లి విరుస్తుందని ప్రచారం జరిగింది . ఇక యుద్ధాలు లేని ప్రపంచాన్ని స్వప్నించవచ్చు అని ఉపన్యాసాలు ఇచ్చారు . కానీ నాటోను మాత్రం రద్దు చేయలేదు . రద్దు చేయక పోగా నాటో ను విస్తరిస్తూనే పోయారు . ఎగరేసిన శాంతి కపోతాల రెక్కలకు కత్తులు , ముక్కులకు మిస్సైల్స్ మొలిచాయి . పావురాలు రాబందులగా మారినాయి . రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మరో రెండు దేశాలు స్వీడన్ , ఫిన్లాండ్ లు నాటో లో చేరడానికి సిద్ధమయ్యాయి . నాటో చేరాలంటే అంటే నాటో సభ్య దేశాలన్నీ అంగీకరించాలి . నాటో దేశమైన టర్కీ ఈ రెండు దేశాలు నాటో లో చేరడాన్ని వ్యతిరేకించింది . స్వీడన్ , ఫిన్లాండ్ కుర్దిష్ తిరుగుబాటు దారులకు మద్దతు ఇస్తున్నాయి . తమ దేశాలలో వారికి శరణు ఇస్తున్నాయి . నాటో లో చేరాలంటే ఫిన్లాండ్ , స్వీడన్ లు కుర్దిష్ తిరుగుబాటుదారులకు మద్దతు ఇవ్వవద్దు వారి దేశాలలో ఉన్న తిరుగుబాటు నాయకులను అప్పజెప్పాలని టర్కీ డిమాండు చేస్తున్నది . టర్కీ డిమాండ్ ను ఫిన్లాండ్ స్వీడన్ లు అంగీకరించాయనీ ఈ రెండు దేశాలు నాటోలో ఇక చేరిపోతాయి అని చెబుతున్నారు . అంటే నా నాటో లో చేరాలంటే ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న న్యాయమైన ఉద్యమాలకు మద్దతు ఇవ్వవద్దు , వాటిని అణచడానికి సహకరించాలి ప్రజాస్వామ్యాన్ని పాతర వేయాలి . అయితే న్యాయమైన స్వాతంత్ర్య పోరాటాలను బలపరిచే స్వభావం కల ఈ దేశాల ప్రజలు తమ ప్రభుత్వాల నిర్ణయాలను అంగీకరిస్తారా తిరస్కరిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది . ఇప్పటికే నాటోలో చేరడాన్ని ఈ దేశల ప్రజలలో ఒక సెక్షన్ వ్యతిరేకిస్తున్నది .
జి7 దేశాల మాదిరిగానే నాటో దేశాల సమావేశాలలో కూడా కొన్ని నిర్ణయాలు చేశారు . అందులో ఒకటి నాటో దేశాల తూర్పు సరిహద్దు లో నాటో బలగాలు సంఖ్యను పెంచడం . ఇప్పుడు ఉన్న 40 వేల సంఖ్యను 3 లక్షల వరకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు . ఈ పెంచే బలగాల ఖర్చునంతా ఎవరు భరిస్తారు అనేది జవాబు లేని ప్రశ్ననే . 30 దేశాలు ఉన్న నాటోలో కేవలం తొమ్మిది దేశాలు మాత్రమే తమ బడ్జెట్లో రక్షణ కొరకు రెండు శాతం కేటాయిస్తున్నారు . నాటో దేశాల నిర్ణయం ప్రకారం అన్ని దేశాలు రెండు శాతం కేటాయించాలి . గతంలోనే ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాటో దేశాల మీటింగ్ లో నిరసన వ్యక్తం చేశాడు . అమెరికానే నాటో ఖర్చును అధికంగా ఎందుకు భరించాలంటూ , జర్మనీలోని అమెరికా బలగాలను కొన్నింటిని వాపసు కూడా తీసుకున్నాడు . ఇప్పుడు అన్ని దేశాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నది . 3 లక్షల సైన్యాన్ని నియమించడం ఎలా అవుతుందో చూడవలసిందే . ఇంకా అమెరికా , పోలాండ్ లో శాశ్వత సైనిక శిబిరం ఏర్పాటు చేస్తానని , బ్రిటన్ లో ఎఫ్ 35 ఆధునిక సైనిక విమానాల రెండు అదనపు స్క్వాడ్రన్ లను నియమిస్తానని ప్రకటించింది . చూడబోతే అమెరికా , యుద్ధం చేస్తున్న వారికి , సొంత రక్షణ భయం ఉన్నవారికి ఆయుధాలు అమ్మి లేదా కిరాయికి ఇచ్చి ఎక్కువ లాభం పొందవచ్చు అనుకుంటున్నట్లుంది . అవును యుద్దం చేస్తే ఎంత నష్టం జరుగుతుందో అమెరికా కంటే ఎక్కువ ఎవరికి తెలుసు . ఏది ఏమైనా జి7 సమావేశాలు నాటో సమావేశం నిర్ణయాలు ప్రపంచ ప్రజలకు ఉపయోగపడేవి ఏవీ లేవు . అందులోనూ అమలు చేయగలిగేవి తక్కువనే భారతదేశ ఎన్నికల వాగ్దానాలు లాగా . కేవలం ధనిక దేశాలు తమ దేశాల ప్రయోజనాల కొరకు ప్రపంచ రాజకీయాలలో ఎవరికి వారు పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే జి7 నాటో సమావేశాల తీర్మానాలను కూడా చూడాల్సి ఉంటుంది . అవి సహజంగానే ప్రపంచ ప్రజల ప్రయోజనలకు విరుద్దంగానే ఉంటాయి.
-లంకా పాపిరెడ్డి