రాష్ట్ర రాజకీయ దారెటు !?

రాష్ట్ర రాజకీయ దారెటు !? 

–   రాజకీయ పరిస్థితి కాంగ్రెస్​కు కలిసొచ్చెనా? 

–  రాబోయే రోజుల్లో బీజేపీ వ్యూహమేమిటి!

–  గులాబీ పార్టీ భవిష్యత్​ కార్యాచరణేంటీ?

–  వామపక్ష, లౌకిక పార్టీల భవిష్యత్ ఎలా​?


వేకువ ప్రత్యేక ప్రతినిధి: రాబోయే సాధారణ ఎన్నికలకు ముందస్తుగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల పై ఏ మేరకుంటుందోననే ఆసక్తి నెలకొంది. సర్వత్రా ఈ అంశంపై రాజకీయ వర్గాలతో పాటు భిన్నవర్గాల్లో జోరుగా చర్చసాగుతోంది.  నిన్నమొన్నటి వరకు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ దూకుడు పై ఎన్నికల ఫలితాల ప్రభావం ఎలా ఉంటుందోననే ఉత్కంట నెలకొంది. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఏ మార్పుకు దోహదం చేస్తాయోనని ఎదురుచూస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన  టీఆర్​ఎస్​, కాంగ్రెస్​, బీజేపీలతో పాటు వామపక్షాల వైఖరుల్లో ఏమైనా మార్పులుంటాయా? వేచిచూడాల్సిందే. భవిష్యత్​లో ఈ రాజకీయ పక్షాల పయనమెంటు సాగుతుందోనని నిశితంగా పరిశీలిస్తున్నారు. తక్షణం ఈ మార్పుల ప్రభావం కనపడనప్పటికీ రానున్న రోజుల్లో స్పష్టమైన అనుకూలమో? ప్రతికూలమో?  ఏదో ఓ మార్పుకు దోహదం చేస్తాయనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల తర్వాత ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయా? పాత పద్ధతిలో ముందుకు సాగుతారా? ఏమైనా ఈ మార్పు ఎలా ఉంటుందనే ఆసక్తి కనబరుస్తున్నారు. –  గులాబీ దూకుడు కొనసాగుతుందా? 


రాష్ట్రంలో అధికార పార్టీ అధినేత కేసీఆర్​లో ఆరునెలల క్రితం ఉన్నట్లుండి ఆస్మకమార్పు జరిగిన విషయం తెలిసిందే. అప్పటి వరకు కేసీఆర్​, టీఆర్​ఎస్​ అనుసరిస్తున్న రాజకీయ వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. హైదరాబాద్​ స్థానిక ఎన్నికలతో ప్రారంభమైన మార్పు హుజురాబాద్​ ఉప ఎన్నికలతో ఓ స్పష్టమైన రూపం తీసుకున్నది. అటు తర్వాత ఇక ఏకబిగిన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. వ్యూహాత్మకమా? ఎత్తుగడ రాజకీయమా? అనే అంశాన్ని పక్కనపెడితే బీజేపీకి జాతీయంగా ప్రత్యామ్నాయం అవసరమనే విధానంతో వేగంగా అడుగులు వేశారు. ఈ క్రమంలో ఉత్తరాదిన ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయనే అంశం సైతం కేసీఆర్​ దృష్టిలో ఉంది. ఇందులో దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఉత్తరప్రదేశ్​ ఎన్నిక కూడా ఉందని కేసీఆర్​కు తెలియందీకాదు. ఈ క్రమంలో కేసీఆర్​ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్​ ఎన్నికల్లో బీజేపీ గతంకంటే సీట్లు తగ్గుతాయిగానీ, అధికారం వస్తుందని చెప్పడం ఇక్కడ తీసిపారయలేని అంశం. ఇక మిగిలిన ఉత్తరాఖండ్​, పంజాబ్​, మణిపూర్​, గోవా రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా? ఉంటాయనేది దేశ రాజకీయవర్గాలు పెద్దగా ఆసక్తికనబరచలేదు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్​లో 80 లోక్​సభ సీట్లుండడం గమనార్హం. అయితే మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీకి ఏమైన ఎదురుదెబ్బ తగులుందనే అంచనా వేశారా? లేదా? ఇప్పుడు చెప్పలేము. బీజేపీ తిరిగి బలంగా పుంజుకుంటుందని ఊహించారా? లేదా? చెప్పలేం. ఏమైనా బీజేపీపై  ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందనే అంశాన్ని కేసీఆర్​ పలుపర్యాయాలు వ్యక్తం చేశారు. ఫలితాలకు ముందు ఎన్ని ఊహాగానాలూ, అంచనాలూ వేసుకున్నప్పటికీ ఇప్పుడు వాస్తవాలు కళ్ళముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల పై  ఏ మేరకు ప్రభావముంటుందనేది ప్రధానాంశం. రాజకీయ పార్టీల వైఖరి ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు ప్రధానం. నిన్నటి వరకు దూకుడు ప్రదర్శించినట్లుగా కేసీఆర్​, టీఆర్​ఎస్​ రానున్న రోజుల్లో పట్టుదలతో పనిచేస్తుందా? జాతీయ రాజకీయాల్లో కేసీఆర్​ నిన్నటి వరకు చెప్పిన పాత్ర నిర్వహించేందుకు కట్టుబడి ఉంటారా? లేకుంటే ఏమైనా మార్పు చేసుకుంటారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశాలు. రాష్ట్రంలో అధికారం తప్పనిసరి అవసరమైన టీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ దూకుడు కొనసాగించేందుకు నిర్ణయించుకుంటారా? లేదా? అంచనాలు తారుమారయ్యాయనే భావనతో ఏమైనా మార్పు చేసుకుంటారా? వేచిచూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడే ఈ అంశంపై అంచనా వేయలేము. కొద్ది రోజులు వేచిచూస్తే తప్ప గులాబీ పార్టీ వైఖరి బహిర్గతమయ్యే అవకాశం లేదు.  అప్పటి వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ఫలితాలు వచ్చి రోజులు మాత్రమే గడుస్తున్నాయి. దీనికి తోడు కేసీఆర్​కు తాత్కలికంగా విశ్రాంతి అవసరమైంది. ఈ కారణంగా మరికొద్ది రోజులు వేచిచూడక తప్పదు. మరో విషయమేమిటంటే తమకు, తమ పార్టీకి ముప్పుగా భావిస్తే ఇప్పటి వరకు ఉన్న వైఖరిలో మార్పు చేసుకునేందుకు కేసీఆర్​ ఒక్కక్షణం కూడా ఆలోచించరనేది ఆయన గత ఆచరణ మనకు నేర్పుతున్న పాఠం.


–  కాంగ్రెస్​పార్టీ పై ప్రభావమెంత? 


తాజా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీ పై ఎంతో కొంత ప్రభావం కనబరుస్తాయడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.  ఎవరు అంగీకరించినా? అంగీకరించకపోయినా? కాంగ్రెస్​ బలాబలాల పై ఎవరెంతని చెప్పినా! ప్రస్తుతానికి రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీయే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది. గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. గెలిచిన తర్వాత పలువురు ఎమ్మెల్యేల్లో పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రజల్లో కాంగ్రెస్​ పలుకుబడి ఎంతనేది రానున్న రోజుల్లో తేలనున్నది. ప్రస్తుతానికి మాత్రం వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనని కాంగ్రెస్​ బల్లగుద్ది వాదిస్తోంది. కేసీఆర్​ కాంగ్రెస్​ను విమర్శిస్తున్నప్పటికీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ తక్షణ ప్రమాదకారిగా కాంగ్రెస్​కు అవకాశాలెక్కువనే విషయం ఆయనకు తెలియంది కాదు. అయితే ఐదు రాష్ట్రాల ఫలితాలు తప్పకుండా కాంగ్రెస్​ లీడర్లను, శ్రేణులను తీవ్రంగా నిరాశపరిచాయి. కొంత కుంగదీసే పరిణామం. పంజాబ్​లో ఉన్న అధికారాన్ని కోల్పోయారు. ఇంకెక్కడ గెలువలేదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ కనుబరుగైతోందనే చర్చ సాగుతోంది. ఇన్ని ప్రతికూల అంశాలున్నప్పటికీ ఇప్పటికీ ఆ పార్టీకి బలమైన నాయకులు, శ్రేణులు, కాంగ్రెస్​ సంప్రదాయ ఓటుబ్యాంకు రాష్ట్రంలో ఉన్నది. దీన్ని కాపాడుకుని విభేదాలు పరిష్కరించుకుని, ఉత్సాహంతో ముందుకు పోతే ఫలితాలుంటాయి. కాంగ్రెస్​ పార్టీ పై ఎన్నికల ఫలితాల ప్రభావం కొంత ఉన్నా  వైఖరిలో మార్పుండక పోవచ్చు. 


–  బీజేపీ దూకుడు పెంచే అవకాశం

తెలంగాణలో బీజేపీ దూకుడుపెంచే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్​ ఎన్నిక ఫలితాలు పార్టీకి ఆక్సిజన్​లాగా పనిచేస్తాయనడంలో సందేహం లేదు. అందుకే ఫలితాలు రాగానే ఆ పార్టీ నేతలు స్వరం పెంచారు. చాలా కాలం వరకు తమ దోస్తీగా ఉన్న టీఆర్​ఎస్​ను టార్గెట్​ చేసి విమర్శలవాడి పెంచారు. బండి సంజయ్​ రాష్ట్ర అధ్యక్షుడైనప్పటి నుంచి ఈ వైఖరిలో మార్పు వచ్చింది.  2018 శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ చతికిలపడింది.  గతంలో ఉన్న స్థానాలు కోల్పోయి ఒకే స్థానంలో గెలిచి పరువు నిలుపుకోంది.  తర్వాత లోక్​సభ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు స్థానాల్లో ఎంపీలుగా గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. అందులో ఉత్తర తెలంగాణలోని కీలకమైన స్థానాలను కైవసం చేసుకున్నది. ఇక తదుపరి హైదరాబాద్​ నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలు ఉత్సాహాన్ని నింపాయి. దుబ్బాక, హుజురాబాద్​ ఉప ఎన్నికలతో బీజేపీకి ఈ రాష్ట్రంలో పాగవేయొచ్చనే ఆశరేకిత్తింది. కాంగ్రెస్​ను బలహీనం చేసి టీఆర్​ఎస్​ను టార్గెట్​ చేస్తూ వచ్చింది. ఇటీవల కొంత గొంతు తగ్గినా తాజా ఫలితాలు నైతిక స్థైర్యాన్ని పెంచుతాయనడంలో సందేహం లేదు. అయితే ఈ దూకుడు ఈ విధంగానే సాగుతోందా? రానున్న లోక్​సభ ఎన్నికల్లో గులాబీ అవసరం పడుతుందేమోననే ముందు జాగ్రత్తతో ఏమైనా ఆచితూచి వ్యవహరిస్తాయా? గులాబీతో కలిసి కాంగ్రెస్​ను తొక్కేసేందుకు పావులు కదుపుతాయా? వేచిచూడాల్సిందే. 


– వామపక్షాల ప్రేక్షకపాత్ర


వామపక్షపార్టీలూ, టీడీపీ, బీఎస్పీ, లౌకిక పార్టీలు రానున్న రోజుల్లో ఏమేరకు రాష్ట్ర రాజకీయాల్లో తమ ఉనికిని చాటుకుంటాయనేది పెద్ద ప్రశ్న. ఓట్లు సీట్లు రాకపోయినా రాజకీయ ప్రభావం కనబరిచేందుకు ఈ పార్టీల కృషిని తక్కువచేయలేము. ఈ పార్టీల పాత్ర బాగానే ఉంటోంది. ఈ పార్టీలు ఏ పార్టీతో జతకలుస్తాయనేది కూడా కొద్ది రోజుల్లో తేలనున్నది. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తాయనడంలో సందేహం లేనప్పటికీ కాంగ్రెస్​తో కలిసిపోతాయా? టీఆర్​ఎస్​తో దోస్తీ చేస్తాయా? తేలనున్నది. ఏమైనా రానున్న ఎన్నికలకు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు మాత్రం బీజేపీకి రిహార్సల్​గా మారాయి. మూడవ పర్యాయం కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్​ఎస్​ అధికారాన్ని నిలబెట్టుకుంటాయా? రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణలు పెరిగి ప్రత్యామ్నాయాలు ముందుకు వస్తాయా? వేచిచూడాల్సిందే. 

Relative Post

Newsletter