సర్కారు వారి ‘భూ’ పాట
సర్కారు వారి ‘భూ’ పాట
– పంట భూముల చుట్టూ కంచె
– రింగ్ రోడ్డు చుట్టూ భూ సేకరణ
– 22వేల ఎకరాల భారీ పూలింగ్
– అధికారికంగా ‘కుడా’ రియలెస్టేట్
– రిలీజ్‌కు ముందే నిరసన వెల్లువ
– 27 గ్రామాలు 21,518 ఎకరాలు
– రైతుల భూమిపై గద్దల కన్ను
– రంగమెక్కిన కాంగ్రెస్, బీజేపీ లీడర్లు
తెలంగాణలో భూముల ధరలు వేలరెట్లు పెరిగాయి. నిన్నమొన్నటి వరకు తొండలు గుడ్లుపెట్టిన భూములిప్పుడు కోట్ల ధర పలుకుతోంది. ఇదంతా ఆషామాషీగా జరిగింది కాదు. ఈ భూముల ధరలు పెరగడం వెనుక తమ ప్రభుత్వ ఘనత ఎంతో ఉంది.
–––– ముఖ్యమంత్రి కేసీఆర్
వరంగల్ రింగ్‌రోడ్డు చుట్టూ ‘కుడా’ ద్వారా ల్యాండ్ పూలింగ్ చేపట్టామని, దీని ద్వారా నగరం చుట్టూ ప్రణాళిక బద్దమైన అభివృద్ధి చేపట్టేందుకు అవకాశం లభిస్తుందని, ఈ కార్యక్రమంలో రైతులు భాగస్వామ్యం కావడం వల్ల ప్రయోజనముంటుందని, భూమిని బలవంతగా రైతుల నుంచి సేకరించబోము.
––––– హన్మకొండలో మంత్రి కేటీఆర్
రెండు పంటలు పండే సారవంతమైన భూములను ప్రభుత్వానికి అప్పజెప్పేందుకు తాము సిద్ధంగా లేమని, తమ జీవనాధారంగా ఉన్న భూమిని బలవంతగా తీసుకునేందుకు ప్రయత్నిస్తే సహించేదిలేదు. ఇప్పటికే తమకు సంబంధంలేకుండా తమ భూముల్లో సర్వే చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భూమిని ఇచ్చేందుకు సిద్దంగా లేము.
–––– లాండ్ పూలింగ్‌లో ఉన్న రైతులు
పైన ఉదహరించిన మూడు ప్రకటనల సారాంశాన్ని పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) డైరెక్షన్లో వరంగల్‌లో నిర్మిస్తోన్న రింగ్ రోడ్డు చుట్టూ సాగుతోన్న ‘సర్కార్ వారి ‘భూ’ పాట’లోని రక్తికట్టించే ప్రధాన సన్నివేశాలోని అర్ధతాత్పర్యాలు మనకు సులభంగా అర్ధమైపోతాయి.
– కేసీఆర్ మాటల్లోని అంతరార్ధం ఇదేనా?
ఇటీవల కొద్ది రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సాధారణ ఏ సమావేశం జరిగినా, బహిరంగ సభ జరిగినా, తెలంగాణ అభివృద్ధి నమూనా గురించి ఢంకా బజాయించి చెబుతూ భూముల ధరలు గతానికి ఇప్పటికి పెరిగిన తీరును ఉదహరిస్తున్నారు. ఇదంతా తమ ప్రభుత్వ ఘనతగా ప్రకటిస్తున్నారు. భూములకు నీళ్ళు, మౌళిక వసతుల కల్పన వల్ల భూ ధరలు పెరిగాయని చెబుతూ అదొక ఆభివృద్ధికి సూచికగా ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ చుట్టు పక్కల భూములు, ఇళ్ళు, విల్లాలు కోట్లలో ధర పలుకుతున్న మాట ఎత్తినపుడే కొందరికి అనుమానం ఉన్నప్పటికీ పెద్దగా ప్రతిస్పందించలేదు.
కానీ, తాజాగా వరంగల్ రింగ్ రోడ్డు చుట్టూ కిలోమీటర్ వైశాల్యపరిధిలో చేపట్టనున్నట్లు ప్రకటించి, అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన లాండ్ పూలింగ్ను పలిశీలిస్తే సీఎం కేసీఆర్ మాటల్లోని సత్యం అర్ధమైతోంది. అంటే రైతుల ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా సర్కార్ సహకారంతో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ( కుడా) లాంటి ద్వారా భూ వ్యాపారం చేసేందుకు సిద్ధమైతోంది. దీంతో ఒక్కసారిగా విస్తరిస్తూ, అభివృద్ధి క్రమంలో అడుగుపెడుతున్న వరంగల్ లాంటి చోట్ల కూడా సహజంగానే రియల్ భూంకు దారి తీసి భూముల ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ మాటలు నిజమయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ కొత్త భూ నాటకానికి అధికారికంగానే సర్కార్ తెరతీసింది. అయితే అప్పటికే అసలు భూ యజమాని నుంచి భూమి కుడాకో, కాకుంటే ప్రైవేటు సంస్థ చేతికో వెళ్ళి అధికార ధర వారికి అదనపు ఇబ్బందులు రైతులకు మిగిలిన విషాద సంఘటనలే ఎక్కువగా ఉంటాయనడంలో సందేహం లేదు. వరంగల్ రింగ్ రోడ్డు రైతులకు కూడా ఇది తప్పదేమో!?
– వరంగల్‌లో భారీ లాండ్ పూలింగ్
గతంలో హైదరాబాద్ పరిధిలో హుడా ఆధ్వర్యంలో ఇతర నగరాల చుట్టూ లాండ్ పూలింగ్ చేపట్టారు. వరంగల్‌లో సైతం కుడా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ దఫా భారీ లాండ్ పూలింగ్‌కు అధికార పార్టీలోని ముఖ్యులు, ప్రభుత్వ పెద్దలు స్కెచ్వేసినట్లు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో అభివృద్ధి అంశాన్ని జోడించి భారీ ఆదాయానికి దారులు తెరిచినట్లుగా చెబుతున్నారు. ఎందుకంటే వందో రెండొందల ఎకరాల పరిధి దాటి ఈ సారి కుడా ఆధ్వర్యంలో చేపట్టనున్న లాండ్ పూలింగ్ విస్తీర్ణం చూస్తే కళ్ళు తిరిగిపోతోంది. దాదాపు 22 వేల ఎకరాల విస్తీర్ణ భూమిని పూలింగి చేపట్టేందుకు సిద్ధం కావడం గమనార్హం. ఈ భారీ మొత్తం భూమిని చూసి ఉన్నతాధికారులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.
– 22వేల ఎకరాల భారీ లాండ్ పూలింగ్‌కు స్కెచ్
వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల పరిధిలోని 11 మండలాలు, 27 గ్రామాల పరిధిలో 21,518 ఎకరాల 38 గుంటల భూమిని కుడా ద్వారాసేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కుడా 27 ఏప్రిల్ 2022 ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 30 తేదీన అధికార గులాబీ పార్టీ అధికారిక పత్రిక నమస్తే తెలంగాణలో భూ సేకరణ ప్రకటన జారీ చేశారు. ఈ ప్రకటనలో భూ సర్వేనెంబర్లు, విస్తీర్ణం, రెవిన్యూకు సంబంధిన పూర్తి వివరాలను పొందుపరిచి ప్రకటించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలంప్ మెంట్ శాఖ నేతృత్వంలో కుడా ద్వారా వరంగల్‌లో కొంత నిర్మించి ఇంకొంత నిర్మించాల్సిన ఔటర్‌రింగ్ రోడ్డుకు ఒక కిలోమీటర్పరిధిలో విస్తీర్ణంలోని భూమిని సేకరించి, అభివృద్ధి పరిచేందుకు ఈ ప్రకటన జారీ చేశారు. ఈ ప్రకటనలో జారీ చేసిన సర్వే నెంబర్ల సంబంధిత, ఆసక్తి గల భూ యజమానులు కుడా కార్యాలయంలో సంప్రదించిన తమ సమ్మతిని తెలియజేయవచ్చని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.
– లాండ్‌పూలింగ్ చేపట్టే గ్రామాలు
లాండ్ పూలింగ్ పరిధిలో గొర్రెకుంట, పోతరాజుపల్లి, ధర్మారం, దూపకుంట, వసంతపూర్, వంచనగిరి, గాడేపల్లి, వెంకటాపూర్ హవేలీ, బొల్లికుంట, కాపులకనపర్తి, చెన్నారం, పంథిని, పున్నేల్, దామెర, గరిమిల్లపల్లి, కూనూర్, వెంకటాపూర్, ధర్మాపూర్, కక్కిరాలపల్లి, నష్కల్, పెద్దపెండ్యాల, రఘునాథపల్లి, రాంపూర్, ఐనవోలు, కొత్తపేట, మొగిలిచెర్ల, పైడిపల్లి పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతుల భూములున్నాయి. అయితే మెజార్టీ గ్రామాల పరిధిలో ఇప్పటికే రియలెస్టేట్ వ్యాపారం ప్రారంభమైన విషయం కాదనలేము.
– అధికారిక బెదిరింపులు ఆరంభం
ప్రకటన చట్టబద్ధంగా, ఇష్టముంటే అనేతీరులోనే ఉన్నప్పటికీ గ్రామాల్లో రైతులపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు. రైతుల్లో భయాందోళనలు రేకెత్తించి ఈ పూలింగ్ను పూర్తి చేసేందుకు యత్నిస్తున్నారు. వాస్తవానికి కుడా చేపట్టనున్న ఈ లాండ్ పూలింగ్ పరిధిలోని ప్రాంతాల్లో నగర స్థాయి అభివృద్ధి నిర్మాణాలు ప్రారంభం కావాలంటే కనీసం రెండు దశాబ్దాలు పట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు దశాబ్దాల కాలం పంటలు పండించుకునేందుకు అవకాశం ఉన్న భూమిని ముందే సర్కారే సేకరించి రియలెస్టేట్ చేయడమంటే ఇంతకు మించిన సిగ్గుమాలిన పని మరొకటి లేదని ఆర్ధిక, వ్యవసాయ నిపుణులు విమర్శిస్తున్నారు. ఈ సర్కారుకు ఫక్తు ఆర్ధికాదాయం, అక్రమ సంపాదన తప్ప రైతుల స్థితిగతులు, వారి ఉపాధి అవకాశాలు, కుటుంబాల పరిస్థితి గురించి ఆలోచన లేదంటున్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రైవేటు వ్యక్తుల పోటీ పేరుతో ప్రభుత్వమే వ్యాపారం చేసేందుకు సిద్ధం కావడాన్ని ప్రశ్నిస్తున్నారు.
– ఎదురు తిరిగిన ‘కుడా। ఎత్తుగడ
వరంగల్ రింగ్ రోడ్డు చుట్టూ కుడా ద్వారా చేపట్టాలని భావించిన లాండ్ పూలింగ్ వ్యవహారమిక్కడ సర్కార్ వ్యూహానికి భిన్నంగా ఎదురుతిరిగినట్లు కన్పిస్తోంది. చివరికి దీని పర్యవసానాలు ఎటు దారి తీస్తాయో తెలియదు కానీ, ఇప్పటికిప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ భూ రియలెస్టేట్ వ్యాపారం బెడిసికొట్టినట్లే చెప్పవచ్చు. భూ సేకరణకు ఉద్దేశించిన గ్రామాల పరిధిలో భూములు కోల్పోయే రైతులు ఒక్కరొక్కరుగా గొంతు విప్పుతూ ‘ఐక్య’ కార్యాచరణ కమిటీల ద్వానా లాండ్ పూలింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారు. వాస్తవానికి తమ భూముల్లో కొందరు అనధికారికంగా సర్వే చేస్తున్నారంటూ యేడాది కాలం క్రితమే రైతులు ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా ప్రభుత్వమే ఈ సర్వే చేయించిందని తెలియడంతో భూములున్న రైతులు ఒక్కసారిగా భగ్గుమంటున్నారు. ఆరెపల్లి, కొత్తపేట, పెగడపెల్లి, గొర్రెకుంట, పోతరాజుపల్లి తదితర ప్రాంతాల్లో ప్రారంభమైన రైతుల నిరసన రోజురోజుకు విస్తిరిస్తోంది. రైతులు సంఘటితమై అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. ఈ పూలింగ్‌కు తాము వ్యతిరేకమంటూ బహిరంగంగా ప్రకటిస్తున్నారు. తాజాగా రైతులు గ్రేటర్ వరంగల్ కమీషనర్ ప్రావీణ్య ముందు నిరసన తెలిపారు. వరంగల్ జిల్లా కలెక్టర్‌తో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి కాళోజీ సెంటర్లో ఆందోళన చేపట్టారు. గ్రామాల్లో నిరసన దీక్షలు ప్రారంభమయ్యాయి.
– రంగమెక్కిన రాజకీయ పక్షాలు
రైతుల ఆందోళనకు కాంగ్రెస్, బీజేపీలతో పాటు వివిధ పార్టీలు, నాయకుల మద్ధతు పెరిగింది. గ్రామాల్లో అధికార పార్టీ లీడర్లు సైతం నిరసనల్లో భాగస్వామ్యం కావడంతో పరిస్థితి గంభీరంగా మారుతోంది. ఇది ప్రస్తుత పరిస్థితి. ఈ క్రమంలోనే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రెండు రోజుల క్రితం వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఈ విషయంపై ఆయన స్పందిస్తూ రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోమని ప్రకటించారు. రైతుల సమ్మతితోనే ఈ పూలింగ్చేపట్టి అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేస్తామంటూ స్పష్టం చేశారు. అయితే మంత్రి చెప్పినట్లుగా క్షేత్రస్థాయిలో పరిస్థితిలేదని రైతులను రకరకాలుగా బెదిరించి భూములు స్వాధీనం చేసుకునేందుకు నయానా, భయాన ప్రయత్నం చేస్తూ ఒత్తిడులు చేస్తున్నారు.
– ప్రత్యామ్నాయం పరిశీలించకపోతే నష్టం
ప్రభుత్వం కుడా ఆధ్వర్యంలో ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రతిపాదన నిర్మాణ రూపానికి చేరుకునేసరికి దాదాపు 20 యేండ్లు పడుతాయి. అయితే అప్పటి వరకు ఈ భూములు ఇలా ఉంటాయా? అంటే ప్రభుత్వ పెద్దలు వాదించినట్లు ప్రైవేటు గద్దలు వాలొచ్చు. ప్రణాళికలేని అభివృద్ధి, వెంచర్లు ప్రారంభమైతాయి. వీటన్నింటిని నియంత్రించే సత్తాలేని సర్కారు ముందు జాగ్రత్త పేరుతో బంగారు పంటలు పండే రైతుల భూములను అగ్గువకు కొట్టేయాలను కోవడం దారుణం. ప్రభుత్వానికి రైతుల పట్ల నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే రైతులు తొందరపడి భూములు అమ్ముకోవద్దని, అప్పటి వరకు పంటలు పండించి అభివృద్ధి దశకు వచ్చేసరికి భూములు విక్రయిస్తే మంచి ధర వస్తుందని వారిని ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ ప్రభుత్వం పూర్తి భిన్నమైన ఎత్తుగడను అమలు చేయడం సిగ్గుచేటు. అందుకే రైతుల నుంచి ఈ వ్యతిరేకత వ్యక్తమైతోంది. ఇప్పటికే రగిలిన ఈ లాండ్‌పూలింగ్ వ్యవహరం అధికార పార్టీ నాయకుల్లోనూ అంతర్గతంగా గుబుల రేకెత్తిస్తోంది. తమ అసెంబ్లీ పరిధిలో ఈ గ్రామాలున్న ఎమ్మెల్యేలకు పెద్ద అగ్నిపరీక్ష ఎదురైతోంది. అయితే ముందుగానే కుడా ప్లాన్ లీకైన నేపథ్యంలో కొందరు అధికార పార్టీ లీడర్లు, భూ వ్యాపార గద్దలు ఏడాది క్రితమే ఇక్కడ వాలిపోయి రైతుల నుంచి పెద్ద ఎత్తున భూములు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఏమైనా వరంగల్ రింగ్ రోడ్డు చుట్టూ లాండ్ పూలింగ్‌కు సంబంధించి అధికార పార్టీ తేనెటీగలతుట్టెను కదిపిందని భావిస్తున్నారు. విపక్ష రాజకీయ పార్టీల నేతల చిత్తశుద్ధికి ఇది పరీక్షగా అభివర్ణిస్తున్నారు. ఏమైనా ఈ భూ వ్యవహారం రానున్న రోజుల్లో మలుపు తీసుకునే అవకాశాలున్నాయి.
–––––––––––––బండి.దుర్గాప్రసాద్