దూర ‘దృష్టి’లో దారి ‘మళ్లించే’ ఎత్తు!!


–  కేసీఆర్​ పథకంలో మూడు ప్రయోజనాలు

– ఆచితూచి అడుగేస్తున్న గులాబీ అధినేత 

– సమస్యలను  పక్కదోవపట్టించే యత్నం   

–  విపక్షాలను గందరగోళపరిచే  ప్రణాళిక


వేకువ ప్రత్యేక ప్రతినిధి:  గులాబీ పార్టీ అధినేత, సీఎం  కేసీఆర్​ రాజకీయ ​ దూరదృష్టితో  వేస్తున్న అడుగుల్లో  ఇప్పటికైతే మూడు ముఖ్యమైన ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని చెప్పవచ్చు. ఒకటి అరా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా... అవన్నీ రాష్ట్రాభివృద్ధితో  ముడివడి ఉన్న ఆర్థికాంశాలు మాత్రమే.  తన రాజకీయ ప్రయోజనాలతో పోల్చితే ఇప్పుడు ఇవి అంత ప్రధానమైనవిగా భావించడంలేదు.  కేసీఆర్​ తాజా ఈ ప్రణాళికలో  ప్రజలనూ, విపక్షాలను ‘దారి’ మళ్లించే భారీ ప్రయత్నం దాగి ఉన్నది.  

రాజకీయ పరిణితిలో  సీఎం ఆరితేరారని చెప్పడంలో ఎవరికీ ఎలాంటి సందేహం అవసరంలేదు. ఆయన సన్నిహితులతో పాటు ప్రత్యర్థులు సైతం చెప్పే అంశమిది. ఎనిమిదేళ్లలో అక్కడ  బీజేపీ, ఇక్కడ టీఆర్​ఎస్​ పాలన పైన ప్రజావ్యతిరేకత తీవ్రంగా పెరుగుతోందని మోడీ, కేసీఆర్​ ఇప్పటికే గుర్తించారు. వచ్చే ఎన్నికల నాటికి మరింత విపత్కర పరిస్థితి రావచ్చు. అందుకే కొత్త ఎత్తుగడతో జాతీయ రాజకీయాల్లో అడుగిడేందుకు ఇదే సరైన సమయమని సీఎం కేసీఆర్​ గుర్తించారు. దీని వల్ల స్వకార్యం, స్వామి కార్యం నెరవేరుతుందని ఆశిస్తున్నారు. 

కేసీఆర్​ రాజకీయ దూర దృష్టి

కేసీఆర్​ గత ఎన్నికల సందర్భంగా లేవనెత్తిన ‘ఫెడరల్​ ఫ్రంట్’​ను కోల్డ్​స్టోరేజీలో పెట్టి ఆ ఊసెత్తకుండా తాజాగా ‘జాతీయ’ అంశాలపై ఫోకస్​ చేస్తున్నారు. ఉన్నట్టుండి ఉరిమిపడ్డట్లు హుజురాబాద్​ ఉప ఎన్నికల ఫలితాల నాటి నుంచి కేసీఆర్​ రాజకీయ వీరవిహారం చేస్తున్నారు. కేంద్రంలోని అధికార బీజేపీతో పాటు అప్పుడప్పుడు కాంగ్రెస్​పై విరుచుకపడుతున్నారు. ఆరునెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలను లోతుగా పరిశీలిస్తే కేసీఆర్​ రాజకీయ వ్యూహం, ఎత్తుగడలు  కొంతమేరకు అర్థమవుతాయి.

టీఆర్​ఎస్​ ప్రధాన టార్గెట్​ కాంగ్రెస్​ 

ఇటీవల సీఎం కేసీఆర్​ అత్యంత చాకచక్యంగా బీజేపీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయినప్పటికీ ఆ పార్టీకి ఇంకా రాష్ట్రంలో క్షేత్రస్థాయి బలం లేదనే విషయం కేసీఆర్​కు తెలియంది కాదు. బీజేపీ విమర్శించడంలో ఏ వ్యూహముందనేది కాసేపు పక్కన పెడితే కాంగ్రెస్​ అధికారంలోకి రాకుండా చేయడమే కేసీఆర్​ ప్రధాన లక్ష్యం.  ఈ కారణంగానే కాంగ్రెస్​కు ‘మద్దతు’ మాటల కరచాలనం అందిస్తున్నారని భావిస్తున్నారు. ఈ పరిణామం రాష్ట్రంలో కాంగ్రెస్​కు ఇబ్బందికరంగా పరిణమించింది. కేసీఆర్​ కరచాలనంతో కాంగ్రెస్​ నాయకుల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్​, కాంగ్రెస్​ కలిసి ముందుకు సాగుతారనే ‘అభిప్రాయాన్ని’ కల్పిస్తున్నారు.  పైగా తాను కాంగ్రెస్​తో కలిసి పనిచేయాలనుకోవడం లేదంటున్నారు. కేసీఆర్​ ద్విముఖ ధోరణి వల్ల కాంగ్రెస్​ పార్టీ శ్రేణుల మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్​ నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని తప్పించుకునే ముఖ్యమైన ప్రయోజనం  కేసీఆర్​ ఎత్తుగడల్లో దాగి ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారం కోల్పోతే కేసీఆర్​ పరిస్థితి ఎలా ఉంటుందో ఆయనకు తెలియంది కాదు. అందుకే రాష్ట్రంలో అధికారం ముందు మిగిలిన లక్ష్యాలన్నీ రెండో  ప్రాథామ్యాలుగా చెప్పవచ్చు. అందుకే కాంగ్రెస్​కు అవకాశం దక్కకుండా యత్నిస్తున్నారు. 

ఇదిలాఉండగా కాంగ్రెస్​ తిరిగి ప్రత్యామ్నాయంగా మారకుండా మోడీ, కేసీఆర్​ ద్వయం కలిసి ప్రయత్నిస్తూ వచ్చారు. ఈ పాచిక వచ్చే ఎన్నికల నాటికి పారుతుందో లేదోనని ఇరు నేతలు గుర్తించారు.  ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు’ ముద్దగా ‘కాంగ్రెస్​’ పార్టీ వైపు వెళ్లకుండా చేయాలనే  ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఇద్దరి లక్ష్యం ఒక్కటే.  అక్కడా, ఇక్కడా కాంగ్రెస్​ అధికారంలోకి రాకుండా చేయడమే. ఈ పనిని చాపకింద నీరులా కొనసాగిస్తున్నారు. వీలైనంత మేరకు కాంగ్రెస్​ను జనంలో పలుచన చేస్తున్నారు. ఇదిలాఉండగా కాంగ్రెస్​ అధినాయకత్వం సైతం ఈ మేరకు కనీస స్పందనలేకుండా  పరోక్ష ‘సహకారం’ అందిస్తుందనే విమర్శలు లేకపోలేదు.  

సమస్యల దారి మళ్ళింపు ప్రణాళిక

కేసీఆర్​ తాజా జాతీయ వ్యూహంతో కొంతమేరకైనా, కొంతకాలమైనా రాష్ట్రంలో నెలకొన్న ‘ప్రధాన’ సమస్యలను విజయవంతంగా దారి మళ్ళించడంలో సఫలమవుతున్నారు. పైగా రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలకు తావివ్వకుండా ‘తెలంగాణ నమూనా’ అంటూ దేశానికి చాటిచెప్పే యత్నం చేస్తున్నారు. ఈ బంగారు తెలంగాణ నమూనా ముందు రాష్ట్రంలో ఇంకా అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు మరుగున పడుతున్నాయి. రానున్న రోజుల్లో విపక్షాలు ఏ మేరకు మేల్కొంటాయో? పక్కన పెడితే ఆరునెలలుగా మాత్రం ‘రాష్ట్రంలో’  ఎదుర్కొంటున్న సమస్యలను  వాయిదా వేయించి ప్రజలను పక్కదోవపట్టించడంలో సక్సెస్​ అయ్యారు. ఎనిమిదేళ్ళుగా లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. దీనిపై ఇప్పటికీ ప్రభుత్వ వాదనే నెగ్గుతున్నది.  నిరుద్యోగ భృతి ఊసేలేదు. ఎన్ని ‘బంధు’లున్నా రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. వ్యవసాయం సమస్యల్లో ఉంది. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేదు. పారిశ్రామిక పురోగతి కాగితాల పైన పరుగులు తీస్తున్నది. ప్రభుత్వ విద్య ‘ప్రైవేటు’ ముందు వెలవెల పోతున్నది. రెండు పడకల ఇండ్లు, మూడెకరాలు మూలకుపడ్డాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు కేంద్రం కోర్టులోకి నెట్టేశారు.  కింది నుంచి పై వరకు ఏకపక్ష అవినీతి చర్చల్లోనే లేకుండా పోయింది. ఈ సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే ప్రత్యామ్నాయ రాజకీయ చేయూత లేకుండా  కేసీఆర్​ ఇప్పటి వరకు విజయవంతం కాగా, తాజా ఎత్తుగడతో  కాంగ్రెస్​, బీజేపీలు, విపక్షాలు ఇంకా తేరుకోవడంలేదు. 

 వారసునికి ‘అధికార’ లైన్​క్లియర్​? 

కేసీఆర్​ తాజా ప్రణాళికలో వారసుడు కేటీఆర్​కు అధికారాన్ని కట్టబెట్టే పని మిగిలి ఉంది. దీనికి ముహుర్తమెప్పుడనేది పక్కన పెడితే ఆయన ఎజెండాలో ఇదొక ప్రధానమైనదే. సీఎం పగ్గాలు ఈ టర్మ్​లో కుమారునికి అప్పగిస్తారా? లేక వచ్చేసారి అధికారాన్ని దక్కించుకుంటామనే భరోసాతో వేచిచూస్తరా? అనేది ఆచితూచి తీసుకునే నిర్ణయం.  కుమారునికి  సీఎం పగ్గాలు అప్పగిస్తే  జాతీయ రాజకీయ బాధ్యతతో  ముందుకు సాగేందుకు కేసీఆర్​కు లైన్​క్లియర్​ అవుతుంది. దేశ నేతలకు సైతం నేను పూర్తి ‘జాతీయ’ నాయకునిగా వ్యవహరించే వెసులుబాటు తనకొక్కడికే ఉందనే సందేశమివ్వచ్చు.  అదే సందర్భంలో తెలంగాణ ప్రజల్లో  ‘అపనమ్మకం’ సడలకుండా ‘దేశ ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి’ లక్ష్యంమంటూ సెంటిమెంట్​ పండించే అవకాశమూ ఉన్నది.  

  పెరుగనున్న భేరమాడే ప్రాంతీయ ‘శక్తి’? 

కేసీఆర్​ నిన్నటి ముంబై పర్యటన, ఎన్సీపీ నేత శరద్​పవార్​, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ఠాక్రేతో చర్చలు, ఈ జాతీయ పయనం చివరికి ఏ రూపు తీసుకుంటుదో? ఈ గుణాత్మకతగా మారుతుందో? అవగాహన మేరకు సాగే ముందడుగుల ఈ ప్రాంతీయ ‘శక్తి’ ఏ రూపంలో ఘనీభవిస్తుందో పక్కనపెడితే కేసీఆర్​కు మాత్రం లాభదాయకమేనని భావించవచ్చు. నిజంగానే బీజేపీకి వ్యతిరేకంగా ముందుకు సాగితే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల్లో కొంత కొర్రీపడే అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి ఆర్థిక నష్టం కంటే కేసీఆర్​కు తన రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం. కాగా, రాబోయే కాలంలో ఈ ప్రాంతీయ శక్తులు అవగాహన మేరకు కలిసి పయనిస్తే అధికారంలో ఏ పార్టీ వచ్చినా అవసరం మేరకు ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడానికి, కేంద్రంతో బేరమాడే శక్తి కొంతైనా పుంజుకుంటుంది. ఎన్నికల ఫలితాల తర్వాత పరస్పర అవసరాల మేరకు ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ఇదంతా వచ్చేసారి రాష్ట్రంలో టీఆర్​ఎస్​ అధికారంలోకి వస్తేనే సాధ్యం. రేపు  అంతగా ఎదుటిపక్షం నుంచి కక్షసాధింపులు ఎదురైతే ‘కాంప్రమైజ్​’ కావడం కూడా కేసీఆర్​ లాంటి వారికి పెద్ద కష్టమైన విషయమేమి కాదంటున్నారు. ఏదిఏమైనా రాష్ట్రంలో కేసీఆర్​ కదలికలను పసిగట్టి ప్రత్యామ్నాయ కార్యక్రమాలు చేపట్టడంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్​ పార్టీతో పాటు ఇతర పక్షాలు విఫలమయ్యారని అంటున్నారు.

Relative Post

Newsletter