గు‘లాబీ’ పోరులో నిలకడెంత!?


–  కమలం పై గులాబీ కన్నెర!

–  టీఆర్​ఎస్​లో మార్పు నిజమా?

–  రాష్ట్రంలో తిరిగి అధికారమా?  

–  రాజకీయాల్లో ఆదర్శమా?

–  కేసీఆర్​ తీరుపై పలు సందేహాలు


వేకువ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర రాజకీయాల్లో గత ఎనిమిదేళ్ళ కాలం ఒక ఎత్తైతే...ఎనిమిదినెలల కాల రాజకీయం మరోఎత్తుగా సాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరుధ్యంగా ఈ ఎనిమిదేళ్ళకాలం కొనసాగుతోంది. దీంతో రాష్ట్ర రాజకీయ వేదికపై టీఆర్​ఎస్​ వర్సెస్​ బీజేపీ అనే తీరుగా మారిపోయింది. కేంద్రంలోని బీజేపీ విధానంలో  పెద్దగా వచ్చిన మార్పేమీ లేకపోయినప్పటికీ ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్​ విధానంలో వచ్చిన మార్పుగా చెప్పవచ్చు. గులాబీ బాస్​లో వచ్చిన ఈ తాజా మార్పు ఇలాగే కొనసాగుతుందా? లేక మూడవ పర్యాయం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఆడుతున్న రాజకీయ డ్రామాలా? అనే అనుమానాలున్నాయి. బీజేపీ వ్యతిరేక వైఖరితో కేసీఆర్​ నిలకడతో ఉంటారా?  అధికారం కాపాడుకునేందుకు అవకాశవాద విధానాలు అవలంభిస్తారా? అనే ప్రశ్నలు అందరిలో ముప్పిరిగొంటున్నాయి. 


–  బీజేపీపై పోరులో టీఆర్​ఎస్​ నిలకడెంత? 


ఎందుకంటే ప్రాంతీయ పార్టీగా, ఆ పార్టీ అధినేతగా కేసీఆర్​ రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే తాను అంత నిలకడగా ఉంటాడనేదానికి గ్యారంటీ లేదు. కేసీఆర్​ ఏకపక్షంగా ఎంత దాడి చేయగలరో? అంతే స్థాయిలో ఎదుటి పార్టీతో మిలాఖత్​ కావడానికి దోస్తీ చేయడానికి వెనుకంజ వేయరనేది జగమెరిగిన సత్యం. అందుకే గత ఎనిమిది నెలలుగా రాష్ట్రంలో టీఆర్​ఎస్​ వర్సెస్​ బీజేపీ అనేది తమతమ స్వార్ధ రాజకీయాల కోసమా? రాష్ట్రాభివృద్ధి ఆశించి, సమాజ ప్రయోజనాలలో భాగంగా  మత తత్వానికీ, ఆ రాజకీయాలకు  వ్యతిరేకంగా చేస్తున్న ‘పోరాటమా’  అనే సందేహాలు ఉన్నాయి. కొద్ది కాలంలోనే ఇవన్నీ తేలిపోతాయి. 


– ఎనిమిదేళ్ళుగా గులాబీ, కమలం దోస్తీ


ఎనిమిదేళ్ళ కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సయోధ్య కొనసాగింది. కానీ, ఇటీవల కేసీఆర్​లో వచ్చిన తేడాను గుర్తించి తాజా రాజకీయాలను విశ్లేషించుకుంటే అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావనంతరం మూడవ దఫా సాధారణ ఎన్నికలు నిర్వహించేందుకు చేరుకుంటున్నాం. ఇప్పటి వరకు సాగిన ఈ ఎనిమిదేళ్ళకాలంలో టీఆర్​ఎస్​ తన అధికారాన్ని కొనసాగిస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్​ తన గుర్తింపును కాపాడుకుంటూ వస్తోంది. రాష్ట్రం విడిపోయినా మూడవ స్థానంలో టీడీపీ కొనసాగుతూ వచ్చినప్పటికీ ఆ పార్టీ ఉనికిని సహించలేని అధికార పక్షం ఆ ఎమ్మెల్యేలను వశపరచుకోవడంలో సక్సెస్​ అయ్యింది. తదుపరి ఎంఐఎం, ఆ తర్వాత స్థానంలో బీజేపీ ఉందనేది వాస్తవం. అసెంబ్లీ బలాబలాల రీత్యా చూస్తే ఇవన్నీ మన కళ్ళ ముందున్న వాస్తవాలు. ఇక ఈ ఎనిమిదేళ్లకాలంలో కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ మెజార్టీ ప్రభుత్వం కొనసాగుతోంది. అక్కడ బలం, బలగం తగ్గినా ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకపోయినా రెండవ స్థానం కాంగ్రెస్​కే దక్కింది. 


–  మోడీ పాలసీలకు కేసీఆర్​ మద్ధతు 


ఈ ఎనిమిదేళ్ళ కాలంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా ఎన్టీఏ పక్షాలకంటే మిన్నగా, బీజేపీ నాయకులకంటే ఎక్కువగా మోడీని, కేంద్ర ప్రభుత్వ విధానాలను బహిరంగంగా సమర్ధించడంలో కేసీఆర్​ ముందున్నారు. డీమానిటైజేషేషన్​ నుంచి ఆర్ధిక సంస్కరణలకు సంఘీభావం అందిస్తూ వచ్చారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ ముందు మాట్లాడిన కేసీఆర్​ ఢిల్లీకి వెళ్ళి మోడీని కలువగానే మాటమార్చారు. 


– కమలం పైన గులాబీ కన్నెర్ర


ఇటీవల మోడీ రైతు వ్యతిరేక విధానాలపై  ప్లేట్​ ఫిరాయించి సీఎం స్థాయిలో ప్రత్యక్షంగా ధర్నా చేశారు. హైదరాబాద్​, దుబ్బాక, హుజురాబాద్​ ఎన్నికల తర్వాత వరి సాగుతో మొదలైన వివాదం ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తోంది. విభజన హామీలు, మళ్ళీ ధాన్యం కొనుగోళ్ళను ముందుకు తెచ్చారు. అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధికార పార్టీగా కేంద్రంపై గులాబీ శ్రేణులను మోహరిస్తోంది. హిజాబ్​ లాంటి అంశాలను లేవనెత్తి మతపిచ్చి అంటూ తీవ్రంగా విమర్శించారు. ప్రధాని హోదాలో మోడీ రాష్ట్రానికి వస్తే స్వాగతం పలకకుండా ఆరోగ్యం పేరుతో దూరంగా ఉన్నారు. లౌకిక విధానాలను ఏకరువుపెడుతున్నారు. యాదగిరి గుట్ట పున:ప్రారంభానికి మోడీని దూరం పెట్టారు. కేంద్రం తాజా అన్ని విధానాలపై తీవ్రంగా విరుచుకపడుతున్నారు. కేసీఆర్​ విమర్శల్లో నిజం లేకపోలేదు. కానీ, ఇంతకాలం కిమ్మనకుండా ఉండి, పైగా మద్ధతుతెలిపిన కేసీఆర్​ ఆకస్మికంగా ఈ వ్యతిరేక లైన్​ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.  గత ఎనిమిది నెలలుగా టీఆర్​ఎస్​, బీజేపీ మధ్య ఉప్పూనిప్పూ అనే తీరుగా సాగుతోంది. ఈ విధానాలపై రాజకీయ నిబద్ధతతో కేసీఆర్​ దీర్ఘకాలం బీజేపీ, కేంద్రానికి వ్యతిరేకంగా నిలబడుతారా? లేదా? అనేది భవిష్యత్​లో మాత్రమే తేలనున్నది. ఎన్నిచెప్పినా కేసీఆర్​ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నిలకడగా ఉండే వ్యక్తిమాత్రం కాదంటూ గత అనుభవాలను కొందరు గుర్తు చేస్తున్నారు. 

Relative Post

Newsletter