ఆదివాసీల ఆపద్బాంధువు ఇప్పచెట్టు

ఆదివాసీల ఆపద్బాంధువు ఇప్పచెట్టు

ప్రకృతితో మమేకమై జీవించే ఆదివాసీల జీవన విధానం మొత్తం అడవిపై ఆధారపడి ఉంటుంది.  అలా నివసించే ఆదివాసీలకు అడవిలో చెట్లు పుట్టలే వారికి మిత్రులు. ఆదివాసీలు ప్రకృతి ప్రేమికులు, ఆరాధికులు కూడా. ఆదివాసీలు పుట్టుక నుండి చావు వరకు వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయి. అడవిపై ఆధారపడి జీవనం సాగించే ఆదివాసీలకు ఇప్పచెట్టుతో విడదియలేని అనుబంధం ఏర్పడింది. బాహ్య ప్రపంచానికి “ఇప్పచెట్టు” అనగానే అందరికీ గుర్తు వచ్చేది “ఇప్పసారా” అనే పదం మాత్రమే. కానీ ఆదివాసీల జీవనంలో భాగమైన ఇప్పచెట్టు ఆకులు, పూలు, కాయాలు, కాయాలనుంచి వచ్చే పప్పు, బెరడు, చెట్టు కూడా గృహోపకరణాలు తయారీలో ఉపయోగపడుతుంది.  ఆదివాసీ సమాజంలో ఇప్పచెట్టును కొన్ని ప్రాంతాల్లో తమ ఇలవేల్పుగా కృతజ్ఞత భావంతో పూజిస్తారు. దీనిని ఛాందసవాద సమాజం మూఢత్వంగా వక్రీకరించింది.

ఇప్పపూల సేకరణ

వసంత ఋతువు ప్రారంభం కాగానే ఇప్పచెట్లు పూలు పుస్తాయి. ఆ పూల సువాసన అడవంతా గుబాళిస్తుంది. ఉదయాన్నే చల్లనిగాలి వీచే వేళలో ఇప్పపూల సువాసనతో మనసును ప్రశాంతంగా ఉంటుంది.  నేలరాలిన ఇప్పపువ్వులను చూస్తే నేలపరిచిన బొండుమల్లేల్లా కనిపిస్తుంటాయి. వాటిని సేకరించడానికి తెల్లవారుజామునే ఆడమగ, చిన్నవాళ్ళు, ముసలివాళ్ళు కూడా బుట్టలతో అడవికి బయలుదేరి నేలరాలిన ఇప్పపువ్వులను ఎండను కూడా లెక్క చేయకుండా మిట్టమధ్యాహ్నం వరకు  సేకరిస్తారు. మార్చి, ఏప్రిల్,మే నెలల్లో ఇదే వీరి దినచర్యగా ఉంటుంది.

ఇప్పపూలు,కాయల ఉపయోగాలు

ఎండ బెట్టిన విప్పపూలలో మాంసకృత్తులు, పిండి పదార్థం, ఖనిజలవణాలు, పీచు పదార్ధం, క్యాల్సియం, పాస్పరస్, కెరోటిన్, విటమిన్ సి, సక్లోజ్, వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రక్తహీనతతో బాధపడేవారికి, బాలింతలకు ఇప్పపూలు పోషకాహారంగా ఉపయోగపడుతుంది. గర్భిణీలో హిమోగ్లోబిన్ శాతం తక్కువ గా ఉండటం వల్ల ఎర్ర రక్తకణాలు తగ్గిపోయి రోగనిరోధక శక్తి లేక అనేక రోగాల బారిన పడుతున్నారు. కొన్ని సమయాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని అధిగ మించడం కోసం ఐటీడీఏలు డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇప్పించి ఇప్పపూల పల్లి పట్టిలను, లడ్డూలను తయారు చేయిస్తున్నారు. వాటిని కొనుగోలు చేసి అంగన్వాడీ సెంటర్లలో చిన్నపిల్లలకు, గర్భిణీలకు ఉచితంగా పంచుతున్నారు. దీంతో కొంతవరకు పోషకాహార లోపాన్ని, బాలింతల మరణాల రేటును తగ్గించగలిగారు. అనేక అనారోగ్యాలకు ఔషదంగా ఇప్పపువ్వు ఉపయోగపడుతుంది.

ఇప్పగింజలలోని పప్పులో  నూనె, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. పప్పు నుంచి తీసిన నూనెతో వంట కూడ చేస్తారు. సబ్బుల తయారీకి కూడా ఈ పప్పును ఉపయోగిస్తారు. మోకాళ్ల నొప్పులకు ఈ నూనెతో మర్దన చేస్తే అద్భుతమైన ఉపశమనం లభిస్తుంది. నూనె తీసిన తర్వాత పిప్పిని భూమిలో వేస్తే పంట పొలాలకు సహజమైన ఎరువుగా ఉపయోగిస్తారు.ఇప్పచెట్టు కలపను ఇంటి తలుపులు, గుమ్మాలు, కిటికీలు, ఎడ్లబండి చక్రాల తయారిలో వినియోగిస్తారు.

ఆదివాసీల ఆర్థిక వనరుగా ఇప్పుపువ్వు

పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవించే ఆదివాసీల ఆదాయ మార్గాల్లో ఇప్పపూలదే ప్రధాన స్థానం. ఆదివాసీలు వ్యవసాయం కంటే అటవి ఉత్పత్తులపైనే ఎక్కువగా ఆధారపడి జీవిస్తారు. ఇప్పపూలతో ఇటు ఆరోగ్యం, ఆటు ఆదాయం రెండూ లభిస్తున్నాయి. ఇప్పచెట్టు చాలా సంవత్సరాల కాలం వరకు బ్రతుకుతుంది. ఇవి అడవిలో జంతువులకు, పక్షులకు ఆహారం, ఆశ్రయాన్ని ఇస్తున్నాయి. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి అటవీ ఉత్పత్తులను సేకరించే ఆదివాసీలు.. వాటిని ఎలా అమ్ముకోవాలో తెలియక దళారుల చేతుల్లో మోసపోతున్నారు. ఆటవీ ఉత్పత్తులను ప్రభుత్వమే కొని ఆదివాసీల జీవనోపాధికి, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలి.

ఆదివాసీల కుటుంబంలో ఆనందాన్ని తెచ్చే ఇప్పుపూలు

ఆదివాసీలు పోడు వ్యవసాయంపై మాత్రమే ఆధారపడి జీవిస్తారు. వారుసాగు చేసుకునే పంటలు కూడా వర్షాధార పంటలే ఒక్కోసారి వర్షాలు సరిగా లేకపోతేనో లేక పంటల కాలం ముగిసిన తర్వాత కొంత మంది ఆదివాసిలు జీవనోపాధి కోసం తమ కుటుంబాన్ని, బంధువులను వదిలి మైదాన ప్రాంతాలకు వలస వెళతారు. అలా జీవనోపాధి కోసం వెళ్లిన వారు ఇప్పపూల సమయం రాగానే పూలు సేకరిసేకరించడానికి తమ ఇండ్లకు చేరుకుని తమ కుటుంబంతో, బంధువులతో ఆనందం గడుపుతారు.

ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలలో ఇప్పపువ్వు

ఆదివాసీల సంప్రదాయాల్లోని పండుగలకు, శుభాకార్యాలకు ఇప్పసార తప్పనిసరిగా ఉంటుంది.. ఆదివాసీలే స్వయంగా తాము సేకరించిన ఇప్పపూలతో నాణ్యమైన సారా తయారు చేస్తారు. వివాహ శుభకార్యాల్లోనూ, దినకర్మకాండ సందర్భంలోనూ, పండుగలకు ఇంటికి వచ్చిన అతిధులకు ఇప్పసారాను మర్యాదపూర్వకంగా ఇవ్వడం ఆచారం.ఇది ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాల్లో అంతర్భాగామే. ఊరబెట్టిన ఇప్పపూల ఆవిరితో సారాను తయారు చేస్తారు. ఇది హానికరమైనది కాదు. నేడు వైన్ షాపుల్లో దొరికె మద్యం కన్నా ఎంతో నాణ్యతతో ఉంటుంది.  స్వచ్ఛమైన విప్పసారా అనేక రకాలు శారీరక రుగ్మతల నయం చేయడానికి ఎంతో దోహదపడుతుందని ఆదివాసీలు నమ్ముతారు.

ఆహారంగా ఇప్పపువ్వు

ఎండబెట్టిన పువ్వులో ఎక్కువ పోషక విలువలుంటాయి. అందుకే ఆదివాసీలు వంటలకు కూడా ఉపయోగిస్తారు. ఇప్ప కుడుములు, ఇప్ప ఇడ్లీలు, జొన్నపిండితో, గోధుమపిండితో ఇప్పపూలు  చేర్చి రొట్టెలు చేస్తారు. పకోడీలు, ఇప్పపువ్వు జావ, తయారుచేస్తారు. గోంగూర ఇప్పపువ్వు కలిపి కూర చేస్తారు. ఇప్పపూల మసాలా.. తయారు చేసుకొని వాడుతారు. ఇప్ప పూలతో లడ్డూలనూ, పల్లి పట్టిలను తయారుచేస్తారు. రకారకాల వంటకాలను తయారు చేస్తారు.

అడవి జంతువులతో ప్రమాదం

ఇప్పపూల సేకరణలో ఆదివాసీలు అడవి జంతువుల దాడికి గురైన సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇప్పపూలను ఎలుగుబంట్లు అమితంగా ఇష్టపడతాయి ఇప్పచెట్లు ఉండే ప్రాంతంలో ఎక్కువగా అవి సంచరిస్తుంటాయి. తెల్లవారుజామున ఇప్పపూలు సేకరించడానికి వెళ్లినవారు ఒక్కోసారి వాటితో ముఖాముఖిగా తలపడాల్సి ఉంటుంది. అలాంటి ప్రమాదం పొంచి ఉండే ప్రాంతాలలో ఆదివాసిలు గుంపుగా వెళ్లి అప్రమత్తతో ఉండి ఇప్పపూలను  సేకరిస్తారు.

 -వంకా.వరాలబాబు 


Newsletter