ఇసుక క్వారీ లో అక్రమాలు
ఇసుక క్వారీ లో అక్రమాలు
చక్రం తిప్పుతున్న ఆంధ్ర కాంట్రాక్టర్లు
ప్రభుత్వ నిబంధనలకు పాతర
లోడింగ్ ల పేరుతో వీరబాదుడు
ములుగు జిల్లా వెంకటాపురం గోదావరి ప్రాంతంలో ఇసుక క్వారీలను చేజిక్కించుకున్న ఆంధ్ర కాంట్రాక్టర్లు ఒక ఇసుక క్వారీనీ అడ్డాగా చేసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో చక్రం తిప్పుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఇక్కడి అమాయక గిరిజనులను ఆసరాగా చేసుకుని సూరవీడు ఇసుక క్వారీ లో అక్రమాలకు పాల్పడుతున్నారని మండలంలో బహిరంగ విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి సూరవీడు సొసైటీ పేరుతో సుమారు లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుకను తీసేందుకు ప్రభుత్వం అనుమతించింది. కానీ ఇదే అదనుగా కాంట్రాక్టర్లు గోదావరి నదిలోని ఇసుకను అందినకాడికి దోచుకుంటున్నారు. సొసైటీ నిర్వహకులకు ప్రభుత్వం నుంచి క్యూబిక్ మీటర్ కు రూ. 180 మాత్రమే ఇస్తున్నప్పటికీ కాంట్రాక్టర్లు మాత్రం ఓవర్ లోడ్ లు, జీరో దందాలు చేస్తూ కోట్లు గడిస్తున్నారు.
లోడింగ్ ల పేరుతో వీరబాదుడు....
సూరవీడు ఇసుక క్వారీ లో లోడింగ్ ల పేరుతో కాంట్రాక్టర్లు లారీల వద్దనుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. లారీ ఓనర్లు, డ్రైవర్లు కూడా తమకు సీరియల్ కోసం రోజుల తరబడి వెయిటింగ్ లో ఉన్నప్పటికి అక్రమ మార్గాన డబ్బులు పెట్టి ఓవర్ లోడింగ్ చేయించుకుని రోడ్లపైకి రావడానికే ఇష్టపడుతున్నారు. లారీ ఓనర్ లు సంబంధిత ఇసుక క్వారీ లో ఇసుక నింపుకునేందుకు ప్రభుత్వానికి 12600 డిడి రూపంలో చెల్లించినప్పటికీ క్వారీ నిర్వాహకులు మాత్రం లోడింగ్ పేరుతో రూ 1000, సీరియల్, గుమస్తా ఛార్జి, జెసిబి ఆపరేటర్ ల పేరుతో సుమారు 1300 నుండి 1500 వందల రూపాయలు వసూలు వసూలు చేస్తున్నారు. అంతే కాకుండా అదనపు బకెట్లకు అదనపు డబ్బులు ఇస్తున్నామని లారీ డ్రైవర్లే తెలపడం గమనార్హం. సూరవీడు సొసైటీ రాంపులు రోజుకు సుమారు 50 నుండి 70 లారీల వరకు లోడింగ్ జరుపుతూ ఒక్కో లారీ వద్ద రూ.1500 చొప్పున వసూలు చేస్తున్నారు.
ప్రభుత్వ నిబంధనలకు పాతర.....
ప్రభుత్వం నుండి సూరవీడు సొసైటీ ర్యాంకు లక్ష క్యూబిక్ మీటర్ల అనుమతులు పొందిన కాంట్రాక్టర్లు అడ్డదారిలో అక్రమ వ్యాపారం జీరో దందాలకు పాల్పడుతున్నారు. సంబంధిత ర్యాంపు నిర్వాహకులు లారీ ఓనర్ లతో జీరో దందా చేసేందుకు బేరాలు కుదుర్చుకుని హైదరాబాద్ అక్రమ ఇసుకను తరలిస్తున్నారు. జీరో ఇసుక రవాణనును అడ్డుకునేందుకు సంబంధిత శాఖ అధికారుల అండదండలు పొందిన కాంట్రాక్టర్లు ఏజెన్సీ ప్రాంతంలో తమ పెత్తనాన్ని చెలాయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఫిర్యాదు చేసినవారి నోళ్లు మూస్తున్నారు..
ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు ఇసుక క్వారీ కేంద్రంగా జీరో ఇసుక రవాణా నడుపుతుండడమే కాకుండా, ప్రభుత్వం అనుమతించిన దానికి మించి గోదావరి నది నుంచి ఇసుక తీస్తున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే చాలు.. వారిని కోదాడ ప్రాంతానికి చెందిన ఆ కాంట్రాక్టర్, హైదరాబాద్కు చెందిన చౌదరిలు నయానో.. భయానో వారి దారికి తెచ్చుకుంటున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.