తెలంగాణ అంటే రాజులా??నిజామా??జనమా??
తెలంగాణ అంటే రాజులా??నిజామా??జనమా??
ఉత్సవాలతో ఏం ఉపదేశిస్తారు?
- కాకతీయ కాలంలో వనరుల పరాయికరణ
- ఆదివాసీలపై ఆగని అణిచివేత
- సమ్మక్క తిరుగుబాటుకు ప్రతీక
- ధిక్కారానికి ఓరుగల్లు పుట్టినిల్లు
గొలుసుకట్టు చెరువులు, భారీజలాశయాలను నిర్మించి, జనరంజక పాలన అందించారని భావిస్తున్న కాకతీయులను స్మరించడానికి తెలంగాణప్రభుత్వం సిద్ధమౌతుంది. కోట్లాది ప్రజాధనంతో కాకతీయ ఉత్సవాలను ఒక్క వరంగల్ కే పరిమితం కాకుండా తెలంగాణ పది జిల్లాల్లో అంగరంగ వైభవంగా జరిపి దేశం మొత్తం గుర్తించేలా చేయాలన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్ణయం. ఈ ఉత్సవాలకు బస్తర్లోని కాకతీయుల వారసులు కమల్ చంద్రబంజేవును రాజు హోదాలో తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానిస్తుంది.
ఆ రోజు తెలంగాణ మంత్రులందరూ, కేసీఆర్ తెలంగాణ రాజ దర్బార్ కొలువుతీరనుంది. ఇదంతా చూస్తుంటే చరిత్ర తెలియని ఈ తరానికి బంగారు తెలంగాణ శిల్పి తెలంగాణలో గత రాచరికపు పాలనలో మంచి పనులను నాలుగు తరాలపాటు గుర్తించుకునేటట్లు చేస్తున్నాడుకదా! అనిపిస్తుంది.వాస్తవానికి కాకతీయ పాలన నుంచి నేటి పాలకులు రాయించింది, చెప్పింది, చెప్పించుకుంటున్నదే చరిత్రగా చలామణి అవుతుంది.ప్రజల ఆకాంక్షలు, ఆరాట పోరాటాల చరిత్ర నమోదు కాలేదు. ఏ లబ్ధి కోసమైనా సరే తెలంగాణప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలతో తెలంగాణ ప్రజలందరూ తమ పాలకులపై, గత పాలనపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
- ప్రకృతి వనరుల పరాయికరణ
కాకతీయుల పాలన ఏర్పడడానికి ముందు క్రీస్తుపూర్వం 271 నుంచి క్రీస్తు శకం 174 వరకు శాతవాహనుల పాలకులు క్రీ.శ. 225-330 మధ్యకాలంలో ఇక్ష్వాకులు పాలించగా. కాకతీయ పాలన ఆరంభం 1050లో కాగా వీరికి ముందుచాళుక్యులు, రాష్ట్రకూటులు పాలించారని చరిత్ర పరిశీలకుల అభిప్రాయం. శాతవాహనుల కాలం నుంచి సుమారు వేయి సంవత్సరాలకు పైగా ఈ ప్రాంతంలో ప్రకృతి వనరులపై ప్రజాస్వామ్యం క్రమంగా జారిపోతూ వచ్చింది. ఈకాలంలోనే భూమి, చెట్టు, పుట్టలపై ప్రజల అధికారం కులవృత్తులుగా పరిణామం చెంది గ్రామంగా స్థిరీకరించబడిన వ్యవస్థ ఉంది. వృత్తిసంఘంలా వీటికి నాయకులూ ఉన్నారు. భూస్వామ్య వ్యవస్థ జాడలు కనబడవు. ఈ పరిణామంలోనేబ్రాహ్మణుల జోక్యంతో వృత్తులు కులాలై 3వ శతాబ్దంలో ఇవే వర్ణ వ్యవస్థగా పరిణామం చెందింది. బ్రాహ్మణులు రాజుల నుంచి భూములను దానాలుగా పొందడం, అగ్రహారాలుగా రూపొందడంతో రైతుకు-రాజులకు మధ్య దళారీ ఆవిర్భవించిండు. ఈ పరిణామక్రమంగా ఉత్పత్తిలో ప్రత్యక్షంగా పాల్గొనేప్రజలు తమ వనరులపై, జీవితంపై హక్కుల్ని కోల్పోవడంవేగవంతమైంది.ప్రకృతితో అవినాభావ సంబంధం తెగిపడుతూ రాజ్యబంధం చుట్టుకుంటూ సాగిన పరినామం వల్లప్రజలకు రాజ్యానికి దళారులుగా బ్రాహ్మణ, రెడ్డి, వెలమలుగా రూపాంతరం చెంది బలపడ్డారు. వాస్తవానికి వీళ్లందరూవివిధ రాజులకాలంలో ఉద్యోగులుగావచ్చి స్థిరపడివారని చెబుతారు.
- 'సంతృప్త' రాజకీయాలు
రాజ్యం 'ప్రశాంతంగా ఉండాలంటే వీరిని సంతృప్తి పరచడం అనివార్యం. (నేటి పార్లమెంటరీ వ్యవస్థలో పాలకులుఇదే సంప్రదాయం కొనసాగిస్తున్నారు) వీరిని సంతృప్తి పరచడానికి ప్రజలపై ఎటువంటి భారాలు మోపినా సమర్థనీయంగానే ఉండేది.సైన్యాధికారాలుగా పరిణామం చెందిన కాకతీయులు స్థిరపడ్డానికి, విస్తరించడానికి వీరిమీదే ఆధారపడ్డారు.కాకతీయ పాలనలో సామంతరాజులు, భూస్వామ్య, దొరలు ఫ్యూడల్ పాలన కొనసాగించారనేది చరిత్ర. కాకతీయుల చివరి పాలకుడైన ప్రతాపరుద్రుని పాలకమండలిగా ఉన్న 70 మంది రెడ్డి, వెలమ కులస్తులే. వీళ్ళందరూ వ్యవసాయం ఆధారంగా ఎదిగి పాలకులకు దళారులుగా పరిణామం చెందారు.
- కాకతీయ కాలంలో ఏం జరిగింది?
వీరి పాలన కాలంలోనే పాకాల, రామప్ప,లక్నావరం వంటి భారీ జలాశయాలను, తాటకాలను నిర్మించి వ్యవసాయంలో స్థిరత్వాన్ని, ఉత్పాదకతను పెంచారు. నిజమే. కాదనము. ఐతే ఈ వ్యవసాయ మిగుళ్ళు దళారులకే చెందే క్రమం విస్తరించి బలపడింది. మెజారిటీ ప్రజలకు, ఉత్పత్తిలో భాగమైన శ్రమజీవులకు అందలేదనేది గుర్తించాలి. జనరంజక పాలనగా చెప్పబడుతున్న వీరిపాలన ప్రజలపై పన్నులువేసి కట్టలేని కరువు పరిస్థితి ఉన్నప్పటికీ వీపులపై బండలు,ఎండలో నిలబెట్టడం, కోదండం వంటి అమానవీయ శిక్షలు అమలుచేయబడ్డ కాలం. అటువంటి పాలనలో మేడారం పరగణ ఒక్కటి. ఆదివాసీ సమూహంతో కాకతీయ రాజ్యం సరిహద్దులో ఉంటుంది.
నేడు పార్లమెంట్లో ప్రతిష్ఠించాలంటున్న రాణి రుద్రమ మనువడు ప్రతాపరుద్రుడు ఈ ఆదివాసీ ప్రజలపై కరువు కాలంలో పన్నులు కట్టాలని ఒత్తిడి తెచ్చాడు. "కరువు వచ్చింది కప్పం కట్టలేం మహ ప్రభువు' అని ఆదివాసీల నాయకత్వం ప్రతాపరుద్రునికి తెలియజేశారు. అయినా కనికరించని ప్రతాపరుద్రుడు ఆదివాసీ ప్రజలపై సైనిక బలగంతో పన్నులు, శిస్తులు వసూలు చేసే ప్రయత్నం చేశారు.
- తిరుగుబాటు ప్రతీక మేడారం గడ్డ
పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్కలు తిరుగుబాటుకు నాయకత్వం వహించి ఆదివాసీల పోరుకు తుడుం మోగించారు. కాకతీయ సైన్యాన్ని ప్రతిఘటించిన సమ్మక్క, సారక్కలను పొట్టనపెట్టుకుని మెదారం పరగణలో రక్తపురేట్లు పారించారు కాకతీయ పాలకులు. అసలు ఏపాలకుడైనా... కాకతీయ రాజులైనా.. నిజాం నవాబులైనా... నేటి ప్రజాస్వామ్య పాలకులైనా.... తమ పాలనను ప్రజానుకూలంగా చేసారనేదానికి పోలిక ఏంటి? ఆనాటి మానవాభివృద్ధే కొలబద్ద కదా!
- సమ్మక్క గురించి ఏం చెబుతారు?
ఆనాటి ప్రాథమిక వనరులను, వాటిపై స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ఎంతవరకు అనుభవించని తెచ్చి అన్న దాన్నిబట్టి కదా! అంచనావేసేది. ఆనాటి హక్కుల్ని హరించినవా.... హరించిన పాలన ప్రజలు పండుగ చేసుకునేంత గొప్పవా?కాకతీయ పాలన అన్నప్పుడు'సమ్మక్క 'స్వయంపాల' చరిత్ర ఏంటి? ఈ దేశ మూలవాసులైన ఆదివాసీల పాలనపై దురాక్రమణలు... వారిపై దౌర్జన్యాలు... యుద్ధాలు... నేడు జరుగుతున్న గ్రీన్లాంట్ హంతకవేటను ఏ ఉత్సవాలలోచెబుతారనేది ప్రశ్న. సమ్మక్క 'స్వయంపాలన'ను దురాక్రమించడానికి ఆమెను చంపి తర్వాత దేవతను చేసి పూజలు చేసిన కాకతీయుల దురాక్రమణ చరిత్రను ఈ ఉత్సవాలలో చెబుతారా? కొమురంభీం స్వయంపాలన కాంక్షను అణచడానికి ఆయన్ని చంపి ఆదివాసీ రక్షణ చట్టాలు చేశారు నిజాం పాలకులు. నేటి ప్రజాస్వామ్య పాలకులు అభివృద్ధి పేర ఆదివాసీ సమూహంపైహంతకవేటను కొనసాగిస్తున్న పాలకులు వారి పేర విశ్వనగరాల్లో 'భవన్'లు కడుతున్నారు. భవన్లు కట్టితే గంపగుత్తగా ఓట్లు పడుతాయి కావచ్చు. కానీ ఆ ప్రజలకు ప్రకృతి వనరులు కాపాడబడితేనే బతుకు ఉంటుంది. ఈ నేల కోసం, స్వయం పాలన కోసం, ఆత్మగౌరవం కోసమంటూ పోరాడి తెలంగాణను సాధించుకున్నాం కదా!.
- తెలంగాణలో ఆగని అణిచివేత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో ఏవిధంగానైతే మావోయిస్టుల ఏరివేత పేరుతో సాధారణ పౌరులను కాల్చిచంపడం వంటి ఘటనలు, ఎన్కౌంటర్లు ఉండవన్న తెలంగాణలో.. అదే బంగారు తెలంగాణ నిర్మాణంలో తుపాకుల తూటాలకు ఆదివాసీలు రక్తంఓడుతూ ప్రాణాలు విడుస్తూనే ఉన్నారు. నిన్నటికి నిన్న అడవుల్లో అన్నలు తప్పించుకుపోయారనే కోపంతో ఆదివాసీలపై దాడుల పరంపర. ఈ ఘనటలపై కనీసం మాటవరసకైనాముఖ్యమంత్రి స్పందించలేదు. హోం మంత్రి వివరణ కూడా లేదు. నాడు ఏ ఘటనలైతే తెలంగాణ ఉద్యమానికి ప్రేరణలైనవో ఆ ఘటనలే నేటి పాలనలో కూడా కొనసాగుతున్న పరంపర పరిశీలిస్తే రాజ్యవ్యవస్థ నుంచి, పార్లమెంటరీ వ్యవస్థకు ఆధిపత్య రూపం మారినా, ఈ సారం మారలేదు. పార్టీల పేరు ఏదైనా.. ప్రభుత్వం ఏదైనా.. పాలకుల నెత్తిన టోపీలు, భుజాన కండువాలు మారినా... వారి తలలో ఆలోచనలు మారిందిలేదనేది స్పష్టం. నాటి కాకతీయుల పాలన నుంచి ఇప్పటివరకు ఏ సైనికుల, ఏ రాజుల, ఏ పాలకుల పేరు మీద పాలన జరిగినా అది పాలకుల, పాలన భాగస్వాముల, పాలనా యంత్రాంగం ఆధిపత్యాన్ని, ప్రయోజనాల రక్షణకు విస్తరించడానికనేది సుస్పష్టం.
- ధిక్కారానికి ఓరుగల్లు పుట్టినిల్లు
ధిక్కారాలకు పుట్టినిల్లుగా ఓరుగల్లు కీర్తిస్తాం. ఇక్కడి గాలి, నీరు, చెట్టు,చేమ... వేటిని అడిగినా.. తిరుగుబాటు అంటే ఏంటో చెబుతాయి. ఈ నేలపై దోపిడీ, పీడన లేని సమాజం కోసంఇంకా... రక్తం ఓడుతూనే ఉంది కదా! అటువంటి ధీరభూమిపై కాకతీయులను స్మరించుకోవడమంటే పాలకులు
ఆదిపత్య విస్తరణవాద సంస్కృతిని ఎత్తిపట్టడమే. అందుకే కాకతీయ ఉత్సవాలను ఆత్మగౌరవం ఉన్న తెలంగాణ వాదులు, కవులు, కళాకారులు, ఆదివాసీ విద్యావంతులు, మేధావులు, ఆదివాసీ సంఘాలే కాకుండా ప్రజాస్వామ్యవాదులందరూ,విద్యార్థులందరూ పాలకుల ఉత్సవాలను ఎత్తిపట్టే కాకతీయ ఉత్సవాలను బహిష్కరించి అడ్డుకోవాలి.
- బండి దుర్గాప్రసాద్
6303375514