‘భృతి’ ’ లేనట్టేనా?


-జాబ్ క్యాలెండర్‌లో మతలబు ఏంటో

-నమోదైన నిరుద్యోగులే 25 లక్షలు!

నిరుద్యోగ భృతి హామీ అమలు జోలికి వెళ్లని సీఎం


వేకువ వార్త, హైదరాబాద్​: కొత్త కొలువులపై సీఎం కేసీఆర్ ప్రసంగంలో నిరుద్యోగ భృతి అంశం జోలికి వెళ్లకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. యువతకు నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికి నెలకు రూ.3,116 అందజేస్తామని టీఆర్ఎస్ 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. కానీ..తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలను మరింత ఉధృతం చేస్తూ సీఎం కేసీఆర్ మెగా కొలువుల జాతర ప్రకటించారు. ఏకంగా 91,142 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామన్న సీఎం.. ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా నేరుగా నియామకం చేయాల్సిన ఖాళీల సంఖ్య 80,039 అని, వీటికి దశలవారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ దాదాపు 40 నిమిషాలపాటు అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో నిరుద్యోగ భృతి అంశం జోలికి వెళ్లకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొలువుల ప్రకటనకుతోడు ఇకపై ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న సీఎం ప్రకటనతో నిరుద్యోగ భృతి అటకెక్కినట్లేనా?, కొవిడ్ దెబ్బకు ఉపాధి అవకాశాలు తగ్గిన నేపథ్యంలో నిరుద్యోగ భృతి లేకపోవడం యువతకు భారమేననే వాదనలు వినిపిస్తున్నాయి.

తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీని త్వరితగతిన చేపడతాం. అదే సమయంలో యువతకు నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికి నెలకు రూ.3,116 అందజేస్తాం..’అని టీఆర్ఎస్ తన 2018 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొంది. కానీ గడిచిన మూడున్నరేళ్లలో ఏ ఒక్కరికీ నిరుద్యోగ భృతి లభించలేదు. ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కొలువుల ప్రకటనతోపాటే నిరుద్యోగ భృతిపైనా కేసీఆర్ క్లారిటీ ఇస్తారని యువత ఆశించినా, కనీసం ఆ పదాన్ని కూడా సీఎం ప్రస్తావించకపోవడం గమనార్హం. నిజానికి తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య 30 లక్షల వరకు ఉంటుందని నిరుద్యోగ సంఘాలు వివరిస్తున్నాయి. కాగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీఎస్సీ)లో వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌ కింద 25 లక్షల మందికిపైగా రిజిస్టర్‌ చేసుకున్నారు. అంటే, రాష్ట్రంలో నమోదైన నిరుద్యోగుల సంఖ్య 25 లక్షలుకాగా, సర్కారు ఇప్పుడు ప్రకటించిన ఉద్యోగాల సంఖ్య లక్ష కూడా చేరలేదు. కేసీఆర్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగులు అందరికీ భృతి విడుదల చేయాలని విపక్షనేతలు డిమాండ్ చేస్తున్నారు.

Relative Post

Newsletter