మహిళా క్రికెట్‌పై ఇంకా వివక్షేనా...?
మహిళా క్రికెట్‌పై ఇంకా వివక్షేనా...?
మహిళలా... క్రికెట్టా... అంటూ నోరెల్లబెట్టి చూసిన కాలం నుంచి... దేశంలో మహిళా క్రికెట్ ఎంతో ఎదిగింది. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు సైతం రైళ్లలో రిజర్వేషన్ లేకుండా.. మహా అయితే సెకండ్ క్లాస్‌లో ప్రయాణించిన మహిళా క్రికెటర్లు.. నేడు స్టార్ ప్లేయర్లుగా వెలుగొందుతున్నారు. మహిళా క్రికెటర్లను పోటీల కోసం ఫ్రాంచైజీలు కోట్లు పెట్టి కొంటున్నాయి. మహిళల ఐపీఎల్ కోసం మహిళా క్రికెటర్ల వేలం పాటలో అంబానీ, ఆదానీ లాంటి దిగ్గజ కార్పొరేట్ సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ మధ్యనే అండర్-19 ప్రపంచ మహిళల కప్‌ను బలమైన ఇంగ్లండ్‌ను ఓడించి భారత్ కప్ గెలుచుకున్న నేపథ్యంలో... మహిళా క్రికెట్‌కు క్రేజ్ మరింత పెరిగింది.
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ లో భారత్‌లో పురుషుల వన్డే ప్రపంచ కప్ జరుగనున్నది. దానికోసం అప్పుడే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా బడా కార్పొరేట్ కంపెనీలు ప్రసార హక్కుల కోసం వెచ్చించే లక్షల కోట్ల పెట్టుబడుల ప్రభావం ఇప్పటినుంచే కనిపిస్తున్నది. సరిగ్గా ఈ పరిస్థితిలోనే మహిళా క్రికెట్ కూడా ఊపందుకున్నది. దేశంలో వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.
దేశంలో.., ప్రపంచంలోనూ మహిళా క్రికెట్ ఇవ్వాళ ఈ స్థితికి చేరుకోవటం వెనుక మహిళా క్రికెటర్ల అకుంఠిత దీక్ష, అలుపెరుగని పోరాటం ఉన్నది. ఆ క్రమంలో మహిళా క్రికెటర్ల ఎదుర్కొన్న వివక్ష అంతా ఇంతా కాదు. అడుగడుగునా వివక్షా పూరితమే, చిన్నచూపే. ఒకానొక సందర్భంలో... నా మాట నెగ్గే పరిస్థితే ఉంటే... అసలు మహిళా క్రికెట్ జరుగనివ్వను అని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) చైర్మన్ భారత మహిళా క్రికెట్ కేప్టెన్ అయిన డయానా ఎడుల్జీతోనే అన్నాడంటే వివక్ష ఏ స్థాయిలో ఉండేదో ఊహించుకోవచ్చు.
మొదట్లో 1970-80లలో అయితే.. మహిళా క్రికెటర్లను ఓ ఆటగాళ్లుగా కాదు, మనుషులుగా కూడా గుర్తించిన దాఖలాలు కనిపించవు. అంతర్జాతీయ పోటీలకు ఆడుతున్న క్రీడాకారులకు కూడా కనీస సదుపాయాలు ఉండేవి కాదు. దేశంలో ఓ అంతర్జాతీయ పోటీకి హాజరైన మహిళా క్రికెటర్లు ఓ పాఠశాలగదిలో వరుసగాపరిచిన పరుపులపై పడుకోవాల్సిన దుస్థితి. పోటీల కోసం ప్రయాణాలకు రైల్లే గతి. ఎప్పుడో ఒక సారి సెకండ్ క్లాస్ సౌకర్యం ఉండేది. బ్యాట్లు, లగేజీతో సాధారణ బోగీల్లో ప్రయాణించిన రోజులే ఎక్కువ. అంతెందుకూ... పురుషులకు స్పాన్సర్లు ఇచ్చిన డ్రెస్సులు మిగిలిపోతే... వాటినే మహిళా క్రికెటర్లు వాడాల్సిన దుస్థితి ఉండేదంటే... మహిళా క్రికెట్ అంటే ఎంత చిన్నచూపు, వివక్ష ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
మహిళా క్రికెట్ పట్ల వివక్ష, అణిచివేత ఒక్క భారత్‌లోనే కాదు, అభివృద్ధిచెందిన ఆధునిక దేశాలుగా చెప్పుకొంటున్న ఇంగ్లండ్, ఇతర యూరప్ దేశాల్లోనూ దీనికి భిన్నంగా ఏమీ లేదు. పురుషుల క్రికెట్‌కు ఇచ్చిన ప్రోత్సాహంలో అణువంతైనా ఉన్న స్థితి ఎప్పుడూ లేదు. ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా... అననుకూలతలను, వివక్షతలను తట్టుకొని నిలిచిన మహిళా మణుల పోరాట ఫలితమే నేటి పరిస్థితి అని చెప్పవచ్చు.
అయితే... విచిత్రం ఏమంటే.... క్రికెట్ అభివృద్ధి, వికాస చరిత్ర అంతా మహిళల చుట్టే తిరగటం గమనార్హం. వందల ఏండ్ల ప్రపంచ క్రికెట్ చరిత్ర పొడవునా.. మహిళా క్రికెట్ పట్ల వివక్షకు అంతులేదు. వసతుల కల్పన, ప్రాధాన్యం, రెమ్యునరేషన్ విషయంలోనే కాకుండా.. రికార్డుల విషయంలోనూ మహిళా క్రికెటర్ల పట్ల ఎంతటి వివక్ష కొనసాగిందో ఈ ఉదాహరణలే సాక్ష్యం.
ఒక టెస్ట్ లో సెంచరీ చేసి 10 వికెట్లు తీసింది ఎవరయా అంటే.. ఇంగ్లండ్ ప్లేయర్ ఇయాన్ బోథం పేరు చెప్తారు. కానీ అతని కన్నా ముందే... ఆస్ట్రిలియా మహిళా క్రికెటర్ బెట్టీ విల్సన్ ఆ ఫీట్ సాధించిందన్న దాన్ని మన పురుష క్రికెటర్లు, క్రికెట్ బోర్డులు దాచి పెట్టాయి, మరుగు పర్చాయి. 1958లో ఇంగ్లండ్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 11 వికెట్లు తీయటమే కాకుండా.. సెంచరీ చేశారు బెట్టీ విల్సన్. అలాగే... వన్డే క్రికెట్ లో డబుల్ సెంచరీ చేసింది ఎవరంటే.. టక్కున సచిన్ టెండూల్కర్ అని చెప్తారు. ఆయన పేరుమీదనే రికార్డ్ నమోదై ఉన్నది. మన దేశంలో గ్వాలియర్‌లో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో సచిన్ డబుల్ సెంచరీ చేశాడు. కానీ.. అంతకు 13 ఏండ్ల ముందే... ఆస్ట్రేలియా ప్లేయర్ బిలిండా క్లార్క్ 1997లో వన్డేలో డబుల్ సెంచరీ చేసింది. అయినా రికార్డుల్లో ఆమె పేరును ఎక్కడా ప్రస్థావించరు. అసలది జరిగినట్లుగా కూడా నమోదు చేయలేదు, చెప్పటం లేదు.
మరో వైపు... వందల ఏండ్ల క్రికెట్ చరిత్రలో కొత్తగా చేసిన, వచ్చిన ప్రతి ప్రయోగానికి మహిళా క్రికెట్టే వేదిక అయ్యింది. క్రికెట్‌లో ప్రపంచ కప్ పోటీ అనేది మొదట మహిళల క్రికెట్‌లోనే ఆరంభమైంది. 1973లో మహిళా ప్రపంచ కప్ నిర్వహిస్తే, 1975లో పురుషుల ప్రపంచ కప్ నిర్వహించారు. టీ-20 మ్యాచ్ కూడా మహిళలతోనే ఆరంభమైంది. 2004లో తొలి మహిళా టీ-20 మ్యాచ్ ఇంగ్లండ్‌లో న్యూజీలాండ్-ఇంగ్లండ్ మధ్య జరిగింది. ఓ సంవత్సరం తర్వాత 2005లో పురుషుల టీ-20 మ్యాచ్ నిర్వహించ బడింది. ఆస్ట్రేలియా- న్యూజీలాండ్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. అలాగే... ప్రపంచ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వటం కూడా మహిళా క్రికెట్ తోనే మొదలైంది. 1978లో మహిళల ప్రపంచ కప్‌కు భారత్ ఆతిథ్యమిస్తే... ఆ తర్వాత తొమ్మిదేండ్లకు పురుషుల ప్రపంచకప్ భారత్ లో జరిగింది.
ఇంకా చెప్పాలంటే... క్రికెట్ ఆటలో బౌలింగ్, బ్యాటింగ్‌లో వచ్చిన ఆవిష్కరణలు కూడా మహిళా క్రికెటర్లలోంచే వచ్చాయి. ఓవర్ ఆర్మ్ బౌలింగ్ మొదలు బ్యాటింగ్ విన్యాసాల దాకా ఎన్నైనా చెప్పుకోవచ్చు. చివరికి పింక్‌బాల్ ప్రయోగం కూడా మహిళా క్రికెట్‌తోనే ప్రారంభమవటం గమనించదగినది.
ఇప్పటికీ మహిళా క్రికెటర్లకు పురుష క్రికెటర్లతో పోలిస్తే.. తీవ్ర వివక్ష కొనసాగతున్నది. ఒక్కో మ్యాచ్‌కు ఇచ్చే ఫీజు మొదలు కొని ప్రైజ్ మనీ దాకా చిన్నచూపు స్పష్టంగా కనిపిస్తున్నది. నేటి ఆధునిక నాగరిక ప్రపంచంలోకూడా మహిళా క్రికెట్‌పై వివక్ష కొనసాగటం గర్హనీయం. స్త్రీ అన్నింటా సమానమని చెప్పటం కాదు, చేతల్లో చూపాలి. మహిళా క్రికెట్‌కు అన్నింటా సమ ప్రాధాన్యమిచ్చి ప్రోత్సహించాలి. అలా ఇచ్చినప్పుడే... తెలుగమ్మాయి గొంగడి త్రిష లాంటి ఎందరో దేశ కీర్తి ప్రతిష్ఠలను రెపరెపలాడిస్తారు.
శ్రామిక