ఈ మతోన్మాదం గుజరాత్ ఎన్నికల వరకే నా ?
ఈ మతోన్మాదం గుజరాత్ ఎన్నికల వరకే నా ? ఎడిటోరియల్ వ్యాసం
రోజురోజుకు దేశంలో మతోన్మాదం తీవ్రంగా రెచ్చగొట్టబడుతున్నది . ఒక ప్రత్యేక మతానికి చెందిన వారిని లక్ష్యంగా చేస్తున్నారు . ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంలో హిజాబ్ తో మొదలు పెట్టి ఎన్నో మత ఆచారాలను దేశ సమస్యలు గా చిత్రీకరించారు . ఉత్తరప్రదేశ్ ఎన్నికల తరువాత ఈ మతోన్మాదం చల్లబడుతుందని అనుకున్నారు . కానీ ఇంకా ఈ వెర్రి వేయి రకాలుగా పడగలు ఎత్తున్నది . సమస్యగాని ఒక సమస్యను రగిలిస్తూనే అది ఆరకముందే మరో సమస్యను రగిలిస్తున్నారు . ఒకరు అది తాజ్ మహల్ కాదు తేజోమహల్ అంటారు . తాజ్ మహల్ కింద హిందూ దేవాలయం ఉంది అని అంటారు. అక్కడ పూజలు చేస్తామంటారు . రజిని సింగ్ అనే బిజెపి నాయకుడు తాజ్ మహల్ లోని 22 మూసివేసిన గదులలో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారితో సర్వే చేయించాలని అలహాబాద్ హైకోర్టుకు వెళ్ళాడు .
ఇటువంటి పిటిషన్లను వేసేటప్పుడు ముందు అధ్యయనం చేసి రావాలి అని మొట్టికాయలు వేసింది అలహాబాద్ హైకోర్టు . పిటిషన్ ను కొట్టివేసింది . అయితే ఇది వారికి తెలవక చేసింది కాదు హైకోర్టు అనుకుంటున్నట్లుగా . బీజేపీ కాని దాని మాతృ సంస్థ ఆర్ ఎస్ ఎస్ కాని కావాలనే మతకలహాలు రెచ్చగొట్టడానికే ఇటువంటి చర్యలకు పూనుకున్నాయి . వారి సిద్ధాంతాల ప్రకారం మతకలహాలు చెలరేగితే నే హిందువులంతా ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థల వెనక సమీకరించ బడతారు . ఇతర దేశాలతో యుద్దం జరిగితేనే దేశ ప్రజల్లో దేశభక్తి పెరుగుతుందనే చౌకబారు సిద్దాంతం వీరిది . చివరికి కుతుబ్ మినార్ ని కూడా వదల్లేదు . ఇది విష్ణు స్తంభం అని ప్రచారం మొదలుపెట్టారు . కుతుబ్ మినార్ పేరును విష్ణుస్థంభంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు . అక్కడ హనుమాన్ చాలీసా చదివారు.
గుళ్ళు , గురుద్వారాలలో మైక్ లు ఉన్నా మసీదులనుండి మైక్ లలొ అజాన్ వినిపించడాన్ని మాత్రం సమస్య చేసారు . మసీదుల ముందు హనుమాన్ చాలిసా చదవడం మొదలు పెట్టారు. శ్రీరామ నవమి రోజు కత్తులు కటార్లు పట్టుకుని మసీదుల ముందు రెచ్చగొట్టె విధంగా నినాదాలిస్తూ వీరంగం సృష్టించారు . మసీదుల మీద కాషాయ జెండాలు ఎగురవేశారు . ఇక అయోధ్య బాబ్రీ మసీదు కూల్చివేత అప్పటినుండే కాశీ మధుర బాకీ అంటూ మతోన్మాద మంట ఆరిపోకుండా నినాదాలు ఇచ్చారు . పాత వివాదాలన్నింటిని ఈసారి అధికారాన్ని ఉపయోగించుకుని మరీ పెకిలిస్తున్నారు . కాశీలో జ్ఞానవాపి మసీదు లో శివలింగం బయటపడిందని ప్రచారం మొదలుపెట్టారు . అధికారికంగా అది శివలింగం అని ఎవరు ప్రకటించకపోయినా , హిందూ సంస్థలు , ముఖ్యంగా సోకాల్డ్ జాతీయ మీడియా రెచ్చగొట్టే విధంగా అది శివలింగమే అని కథనాలు ప్రచారం చేశారు .
దీనితో పాటు మథురలో శ్రీకృష్ణ జన్మ భూమి సమస్యను కూడా తీవ్రం చేస్తున్నారు . గత నుండే వీటి విషయంలో కోర్టుల్లో కేసులు వాదోపవాదాలు నడుస్తున్నాయి . గతంలో కోర్టులు చాలావరకు ఈ సమస్యలను ఉభయులకు అంగీకారయోగ్యంగానూ సామరస్యపూర్వకంగానూ పరిష్కరించడానకే ప్రయత్నించాయి . ఇప్పుడు కేంద్రంలో ఉన్న అధికారంతో జ్ఞాన వాపి మసీదు , మధుర శ్రీ కృష్ణ జన్మభూమి వివాదాలను హిందూ సంస్థలకు అనుకూలంగా పరిష్కరించి మత కలహాలను సృష్టించడానికి బిజెపి ప్రయత్నిస్తున్నది . తద్వారా తన ఓటు బ్యాంకు పెరుగుతుందనేది బిజెపి ఆలోచన . అంతులేకుండా రెచ్చగొట్టబడుతున్న మతోన్మాదాన్ని చూస్తూ ఉంటే జ్ఞానవాపి మసీదును , మథురలోని షాహీ ఈద్గాను కూడా బాబ్రి మసీదును కూలగొట్టిన విధంగా కూలగొట్టినా ఆశ్చర్యపోనక్కరలేదు .
అయితే ఇదంతా ఈ సంవత్సరం చివరిలో జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కొరకే బిజెపి చేస్తున్నదా ? గుజరాత్ ఎన్నికలు బీజేపీ కి చాలా ముఖ్యం . పార్లమెంటు ఎన్నికలలో గెలవడం కొరకు , ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో గెలవడం ఎంత ముఖ్యమో దాదాపుగా గుజరాత్ ఎన్నికలు కూడా అంతే ముఖ్యం . కాకపోతే ఉత్తరప్రదేశ్ విజయం ఎక్కువ మంది పార్లమెంటు సభ్యులను ఇస్తుంది . గుజరాత్ విజయం బీజేపీ నైతిక స్థైర్యాన్ని పెంచుతుంది . గుజరాత్ లో ఓడిపోతే , గుజరాత్ నుండి వచ్చిన ప్రధాని మోడీ హోంమినిస్టర్ అమిత్ షా లకు అంటే బీజేపీ అగ్రనాయకులకె నైతికంగా పెద్ద దెబ్బ అవుతుంది . అందుకే గుజరాత్ లో గెలవడం కొరకు ఎటువంటి ఎత్తుగడలు అయినా అవలంబించవచ్చు . అందుకే మతోన్మాదం ఇంత పెద్ద ఎత్తున రెచ్చగొట్ట బడుతున్నది . అయితే గుజరాత్ ఎన్నికల తర్వాత ఈ మతోన్మాదం చల్లబడుతుందా ? చల్లబడదు . బీజేపీ దృష్టిలో కేవలం గుజరాత్ ఎన్నికలే లేవు . గుజరాత్ ఎన్నికలు 2022 డిసెంబర్ లో జరుగుతాయి . 2023 లో కర్ణాటక (మే నెల), మధ్యప్రదేశ్ , ఛత్తీస్ గఢ్ , రాజస్థాన్ , తెలంగాణ (డిసెంబర్ నెల) లలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి . ఇవి చాలా ముఖ్యమైన రాష్ట్రాల ఎన్నికలు . 2022 లోనూ 20 23 లోనూ మొత్తం 11 అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి . ఈ ఎన్నికల వరకే కాదు 2024 లో జరిగే సాధారణ ఎన్నికల వరకు కూడా ఈ మతదురహంకారం , జాతీయ దురహంకారం కొనసాగుతాయి ఈ ఎనిమిది సంవత్సరాలలో బీజేపీ చేసిన ప్రత్యేక అభివృద్ధి అంటూ ఏమి లేనందున అభివృద్ధి పేరుతో ఎన్నికలకు పోయే పరిస్థితి లేదు .మత కలహాలు జాతీయ దురహంకారాన్ని మాత్రమే ఎన్నికల అంశాలుగా చేయక తప్పని సరి పరిస్థితిని కూడా ఎదుర్కొంటున్నది బిజెపి .
బీజేపీ మతదురహంకారాన్ని జాతీయ దురహంకారాన్ని రెచ్చగొట్టడానికి కేవలం ఎన్నికల నేపద్యం ఒక్కటే కారణం కాదు . దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం వలన కూడా బీజేపీ ఈ మార్గాన్ని ఎంచుకోక తప్పడంలేదు . నిరుద్యోగానికి బీజేపీ వద్ద జవాబు లేదు పరిష్కారం లేదు . నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులు కొనుగోలు శక్తి పరిధిని దాటిపోయాయి . డీజిల్ పెట్రోల్ ధరలు ముందే పెరిగిపోయాయి . అవి అన్ని ధరలను మండిస్తున్నాయి . వంట గ్యాస్ ధరలు రోజు పెరుగుతున్నాయి . కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు వాటి మీద కట్టే వడ్డీలు కూడా పెరుగుతున్నాయి . మరో వైపు పెద్ద పెద్ద కార్పోరేటు సంస్థలకు లాభాలు కట్టబెట్టడానికి దేశ వనరులు , కంపనీలను అప్పచెప్పుతున్నారు . రోజురోజుకు క్రమంగా ప్రజలలో అసంతృప్తి పెరుగుతున్నది . ఈ అసంతృప్తి ఇంకా తీవ్రం కాకముందే , ప్రజలు దేశం యొక్క అసలు సమస్యల గురించి ఆలోచించక ముందే ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించాలి . ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభం గా మారి తమ అధికారానికి ప్రమాదంగా ఏర్పడకుండా ఉండడానికి కూడా మతతత్వాన్ని జాతీయ దురహంకారాన్ని ఫాసిజాన్ని బిజెపి రెచ్చ గొడుతున్నది . అయితే సంక్షోభాల కాలంలోనే ప్రజలు , ఎవరూ ఎటువంటి వారు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతారు . కొంతమందిని కొంత కాలం మోసం చేయగలుగుతారు కానీ అందరినీ ఎల్లకాలం ఎవరు మోసం చేయలేరు
.-లంకా పాపిరెడ్డి