ఇది అన్ని వర్గాల బడ్జెట్ కాదు

                                                ఇది అన్ని వర్గాల బడ్జెట్ కాదు

ప్రతి ప్రభుత్వం త బడ్జెట్ ను అన్ని వర్గాల ప్రజల బడ్జెట్ గా చెబుతూనే ఉంటుంది . ఇంకా అదనంగా మాది పేద ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ అని కూడా చెబుతారు . సబ్ కా సాత్ , సబ్ కా వికాస్  BJP ముసుగు నినాదం .  బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్ర ప్రభుత్వం అదే చెబుతున్నది . రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చెబుతోంది . ప్రతి సంవత్సరం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మా బడ్జెట్ అందరి బడ్జెట్ పేద ప్రజల బడ్జెట్ అనీ అభివృద్ధికి నిచ్చెన వేస్తున్న బడ్జెట్ అనీ చెప్పడం ....  ప్రతిపక్షాలు పేద ప్రజల వ్యతిరేక బడ్జెట్ అభివృద్ధి నిరోధక బడ్జెట్ అంటూ విమర్శించడం మామూలు అయ్యింది . బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు చర్చించినప్పుడు పత్రికలలో టీవీలలో చర్చ జరగడం తర్వాత మౌనం వహించడం  కూడా మామూలే అయ్యింది . బడ్జెట్ కేటాయింపుల ప్రభావం వలన ఏమి జరుగుతున్నది ? నిజంగా కేటాయింపుల ప్రకారం నిధులు విడుదల అవుతున్నాయా ? లేదా ? లాంటి విషయాలు తరువాత పత్రికలలో టీవీలలో చర్చ జరగవు . ఇవన్నీ సంవత్సరానికి ఒకసారి బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు మాత్రమే చర్చ జరుగుతుంటాయి  .

నిజానికి బడ్జెట్ అనేది చాలా సులువైన విషయం . ఆదాయం ఎంత వస్తుంది ? ఏక్కడెక్కడి నుండి వస్తుంది ? వచ్చిన ఆదాయాన్ని ఎంత ఖర్చు ఎక్కడ చేయాలి ? అనేదే బడ్జెట్ . అయితే సామాన్యులకు అర్థం కాకుండా సంక్లిష్టంగా బడ్జెట్ ను ఎందుకు తయారు చేస్తారు ? ఎందుకు అంటే ప్రతి ప్రభుత్వం మాది పేద ప్రజల బడ్జెట్ అంటుంది కానీ దానికి వ్యతిరేకంగా ఉంటుంది . ఆ విషయం  ప్రజలకు అర్థం కాకుండా ఉండేందుకే అంకెల గారడి చేసి అబద్దాలను అందంగా పేర్చి బడ్జెట్ ను ఎవరికీ అర్థం కాకుండా సంక్లిష్టంగా మార్చుతారు  .

ఒక బడ్జెట్  పేద ప్రజలకు రైతులకు కార్మికులకు అనుకూలమైన బడ్జెట్ అవునో కాదో తెలుసు కోవాలంటే , బడ్జెట్ లో పేద ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడే కేటాయింపులు ఎంతవరకు జరిగాయో చూడాలి . పధకాల పేర్లు చూసి వాటికి కెటాయించిన నిధులన్ని పేదప్రజలకే చెందుతాయి అనుకుంటే మోసపోయినట్లే . ఏ పధకం వెనక ఏ వర్గం ప్రయోజనాలు ఉన్నయనేది తెలుసుకోలేకపోతే అన్ని బడ్జెట్ లు పేదప్రజల బడ్జెట్ ల క్రిందకే వస్తాయి . నిజానికి కేటాయింపులు ఎక్కువగా జరిగినా నిధులు విడుదల కాకపోవచ్చు , దారి మల్లవచ్చు . మన దేశ పాలకులు ఎక్కడ ఎంత ఖర్చు చేయాలో అంతే చేస్తారు , కేటాయింపులు ఎలా ఉన్నప్పటికి . అయితే పేరుకే అయినా శ్రామిక వర్గ ప్రజలకు నిధులేమి ఎక్కువగా కేటాయించ లేదు ఈ బడ్జెట్ లో . వ్యవసాయానికి రైతులకు కేటాయింపులలో నిర్లక్ష్యం చేయబడింది . వ్యవసాయానికి కేటాయించిన నిధుల లో సగం రైతుల ఖాతాలలో జమ చేసే పీఎం కిసాన్ పథకానికి వెళ్తాయి . ఇవి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కొరకు కాదు రాబోయే ఎన్నికలలో ఓట్లు పొందడానికి చట్టబద్ధంగా డబ్బులు పంచే పథకం ఇది  . రైతులు కొనే అన్ని సరుకులపై  సబ్సిడీలు అన్నీ తగ్గించి , అందులోని కొంత ధనాన్ని  దానంచేస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు , ఎన్నికలకొరకు . వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటించడం తప్ప నిధులు పెంచలేదు . ధరల ఒడిదుడుకులను నియంత్రించే , మార్కెట్ జోక్యం పథకం కింద గత రెండు బడ్జెట్ లో వేల కోట్లు , వందల కోట్లు  కేటాయించిన ప్రభుత్వం సారి లక్ష రూపాయలు కేటాయించింది . అంటే రైతులను వ్యాపారుల దాయాదాక్షిణ్యాలకు వదిలేసారు . వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో , వ్యవసాయ పరిశోధనా సంస్థలలో పరిశోధనలను ప్రోత్సహించడం లేదు . మాన్ శాంటా , బేయర్ లాంటి కార్పోరేట్ సంస్థల నుండి విత్తనాలు కొనడం కొరకు మన పరిశోధనలను నిరుత్సాహ పరుస్తున్నారు . దానితో మన వ్యవసాయ పంటల ఉత్పాదకత పెరగడం లేదు . సబ్సిడీలు అన్ని తగ్గిపోతూ ఉంటే రైతులకు వ్యవసాయం చేయడానికి పెట్టుబడి ఖర్చులు ఎక్కువ అయ్యి ఆదాయం తగ్గిపోతున్నది . 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నారు కానీ దాని ఊసే ఎత్తలేదు  ఈ బడ్జెట్ లో . కాకపోగా ప్రజలందరి ఆదాయం రెండింతలు అయిందని పచ్చి అబద్ధాలు చెప్పారు  .

 

మొత్తంగా రైతులకు వ్యవసాయం అభివృద్ధి కొరకు అవసరమైన కేటాయింపులు లేవు . ఉపాధిహామీ పథకానికి కూడా కేటాయింపులలో  32 శాతం కోత పెట్టారు  . ప్రధాని ఫసల్ బీమా పథకం బ్యాంకులకు లాభాలు చేకూర్చే పథకంగా మారింది . సబ్సిడీ లు అన్నీ తగ్గిస్తూ పోయిన తర్వాత మద్దతు ధర లేక పోయిన తర్వాత కేంద్రం  ఆరు వేలు ఇచ్చినా , రాష్ట్రం పది వేలు ఇచ్చిన ఉపయోగం ఏమీ ఉండదు . స్వామినాథన్ కమిషన్ చెప్పిన లెక్కల ప్రకారం రైతుల పంటలకు ధరలు లభిస్తే రైతులు ఎవరి దయాదాక్షిణ్యాల పైన ఆధారపడవలసిన అవసరమే ఉండదు . అసలు ఈ పని చేయకుండా ప్రభుత్వాలు అంకెల గారడీలు చేసుకుంటూ రైతులను ఉద్ధరిస్తున్నామని చెపుతున్నాయి  .

ఒక దేశ ఆర్థిక వ్యవస్థ గురించి దాని భాగాల గురించి తెలియని వారే ఏదో ఒక విషయం గురించే వక్కాణించి చెపుతారు . వ్యవసాయం అభివృద్ధి చెందాలన్నా వ్యవసాయ ఉత్పాదకత పెరగాలన్నా దేశం అయినా రాష్ట్రం అయినా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందాలి . వ్యవసాయం , పరిశ్రమలు ఆర్థికవ్యవస్థకు రెండు కాళ్ల లాంటివి . ఒకసారి ఒక కాలు ముందుకు పడితేనే ఇంకొక కాలు తరువాత ముందుకు వస్తుంది . ఇది క్రమం . అంతే కానీ ఒక్క వ్యవసాయాన్ని పట్టుకొని పరిశ్రమతో సంబంధం లేకుండా అభివృద్ధి చేస్తామని అనుకోవడం చెప్పడం అమాయకత్వం అయినా  అవుతుంది లేకపోతే మోసం అయినా అవుతుంది .   పరిశ్రమల గురించి కేంద్ర రాష్ట్ర బడ్జెట్లలో పూర్తిగా నిర్లక్ష్యం వహించబడింది . కేంద్ర , రాష్ట్ర  ప్రభుత్వాలు రెండు కూడా సర్వీస్ సెక్టార్ నే పరిశ్రమ రంగంగా భావించేలా ప్రచారం చేస్తున్నాయి . ట్రాక్టర్లు , పంట కోత యంత్రాలు , నాట్లు వేసే యంత్రాలు ఇంకా ఎన్నో వ్యవసాయానికి అవసరమైన యంత్రాలు ఇప్పటికీ దిగుమతి చేసుకుంటున్నాము . ఎరువులు కూడా ఇప్పటికీ దిగుమతి చేసుకుంటున్నాము . వ్యవసాయ ఆధారిత పరిశ్రమలే  కాదు వ్యవసాయానికి అవసరమైన పరిశ్రమలనూ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు . విత్తనాలకు కూడా విదేశీ కంపెనీల పైనే ఎక్కువగా ఆధార పడాల్సి వస్తున్నది . స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తరువాత కూడా దేశ వ్యవసాయానికి కావలసిన యంత్రాలు ఎరువులు క్రిమిసంహారక మందులు ఇంకా దిగుమతులు చేసుకుంటున్నాము అంటే పాలకులు బడ్జెట్ లలో దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు . పాలకులు ఏమి చెబుతున్నారని కాదు ఏమి చేస్తున్నారు అనేదే అసలు విషయం . వైద్య రంగానికి చెందిన పరికరాలు అయితే దాదాపు పూర్తిగా దిగుమతుల పైనే ఆధారపడుతున్నారు . స్కానింగ్ యంత్రాల దగ్గర నుండి థర్మామీటర్ వరకు విదేశాల నుండే వస్తున్నాయి  . సర్వీస్ రంగానికి  కావలసినవన్ని  కూడా దిగుమతుల తోనే నడుస్తున్నవి . కంఫ్యూటర్ , స్కానింగ్ మిషన్ ల దగ్గరి నుండి ట్రక్కులు , రైల్లు , విమానాల వరకు దిగుమతులే పెద్ద దిక్కు .

చెప్పదలుచుకున్నది ఏమిటంటే మన దేశంలో పారిశ్రామిక అభివృద్ధికి ఎంతో అవకాశం ఉన్నది .  అత్యంత అవసరం కూడా ఉన్నది . మన దేశమే పెద్ద మార్కెట్ . 2047 వరకు భారత దేశం అభివృద్ది చెందిన దేశంగా మార్చుతామని బడ్జెట్ లో చెప్పారు . ప్రపంచంలో ఏ దేశం కూడా పారిశ్రామికంగా అభివృద్ది సాధింకుండా అభివృద్ది చెందిన దేశంగా అవతరించ లేదు . కానీ మన పాలకులు అందమైన నినాదాలు ఇవ్వడం తప్ప దేశ పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేసింది ఏమీ లేదు . మేకిన్ ఇండియా , స్కిల్ ఇండియా లాంటి అలంకరించిన నినాదాలతో ప్రజలను మభ్య పెట్టి అన్ని రకాల సరుకులను దిగుమతులు చేసుకుంటున్నారు . అందుకే ప్రతి సంవత్సరం వ్యాపారలోటు మొత్తంగా పెరుగుతూనే పోతున్నది , అప్పుడప్పుడు తగ్గినా . మేకిన్ ఇండియా అమలు అవుతే దిగుమతులు ఎందుకు పెరుగుతాయి  ? ఆజాదికా అమృత కాలంలో కూడా జనాభాలోని శ్రామిక శక్తిలో 14 శాతం మాత్రమే పారిశ్రామిక రంగంలో ఉన్నది . దేశ జీడీపీలో పారిశ్రామిక రంగం వాటా 25 , 30 శాతం మధ్య లోనే ఉంటున్నది . అంటే మన బడ్జెట్ లు అన్నీ , మన దేశాన్ని పరాధీన దేశంగానే మార్చి నాయి . పారిశ్రామికంగా అభివృద్ధి చెందకుండా చేసి  అన్ని రంగాలకు అవసరం అయిన సరుకులకు  దిగుమతుల పైనే ఆధారపడేలా చేసాయి ప్రభుత్వాలు . ఎన్ని హామీలు ఇచ్చినా , దేశం పారిశ్రామికంగా అభివృద్ది చెందకుండా నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు . మన దేశ సర్వీస్ సెక్టార్ కు పరిమితులు ఉన్నాయి . వ్యవసాయ రంగం , పారిశ్రామిక రంగం అభివృద్ది చెందకుండా , సర్వీస్ సెక్టార్ ఇక అభివృద్ది కాదు . ప్రధానంగా  విదేశి సంస్థలకు సర్వీస్ చేసే IT రంగం అనిశ్చితమైనది . అది ఇప్పుడు ఎదుర్కుంటున్న సంక్షోభం అందరు చూస్తున్నదే . పారిశ్రామిక రంగం అభివృద్ది  చెందితే , వ్యవసాయ రంగంలో ఉన్న 60 , 65 శాతం శ్రామిక శక్తిలోని అదనపు శ్రామిక శక్తి పారిశ్రామిక రంగానికి బదిలీ అవుతుంది . అప్పుడు నిజమైన సర్వీస్ సెక్టార్ అభివృద్ది చెందుతుంది . వ్యవసాయమూ అభివృద్ది చెందుతుంది .   

దేశ ప్రభుత్వమైనా , రాష్ట్రాల ప్రభుత్వాలు అయినా ఒకే విధమైన అర్ధిక విధానాలు అవలంబిస్తున్నాయి . పధకాల పేర్లలో మార్పులు తప్పితే అన్ని బడ్జెట్ ల సారాంశం ఒకటే . అంతర్జాతీయ మార్కెట్ లలో  ఆధిపత్య దేశాల ప్రయోజనాలకు అనుకూలంగానే మన బడ్జెట్ లు రూపొందించ బడుతాయి . మన బడ్జెట్ లలో ఏ లోటు ఎంత ఉండాలో వారే నిర్ణయిస్తారు . అందుకొరకు ఏయే రంగాలలో సబ్సీడీలు తగ్గించాలో వారే చెప్పుతారు . ఏయే ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఉచితాలని చెప్పి  ఎత్తివేయాలో వారే చెప్పుతారు . మన దేశం WTO లో ఉన్నంత కాలం మన బడ్జెట్ లు ఇలాగే ఉంటాయి . ఇవి ప్రజలందరి బడ్జెట్ లు కావు . కార్పోరేట్ శక్తులు వారి భక్తుల ప్రయోజనాలు నెరవేర్చేవే ఈ బడ్జెట్ లు . ఇది ప్రజలకు అర్ధం కావాలి అంటే అందంగా అలంకరించిన రంగురంగుల పధకాల పేర్ల కింద కప్పివేయబడ్డ నిజమైన లెక్కలను బయటికి తీసి ప్రజల ముందు పెట్టడం , ప్రజాపక్ష మేధావుల , ఆర్ధికవేత్తల భాధ్యత . ఇది గతం కంటే మరింత ఎక్కువగా ఈ రోజు ఉంది ,

                                     లంకా పాపి రెడ్డి      

Relative Post

Newsletter