ప్రజా పక్షపాతమే జర్నలిస్టుకు గీటురాయి: కె.రాంచంద్రమూర్తి, సీనియర్ సంపాదకులు

ప్రజా పక్షపాతమే  జర్నలిస్టుకు గీటురాయి

– 90 దశకంలో నిష్పక్షపాత జర్నలిజం

– కలం వేకువ పత్రికావిష్కరణలో సీనియర్ సంపాదకులు  కె.రామచంద్రమూర్తి పిలుపు


ప్రజల పక్షపాతిగా ఉంటూ జర్నలిజాన్ని కొనసాగించడమే నిజమైన జర్నలిస్టుకు గీటురాయిగా సీనియర్ సంపాదకులు కె.రామచంద్రమూర్తి అభివర్ణించారు. సామాన్యుని సమస్యలే పరిష్కారంగా వృత్తిని కొనసాగించినపుడు ప్రజాదరణ లభిస్తుందన్నారు. ఇలాంటి జర్నలిజం 90దశకంలో వర్ధిల్లిందని గుర్తుచేశారు. కలం వేకువ నూతన పత్రికావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రామచంద్రమూర్తి పత్రికావిష్కరణ అనంతరం ప్రసంగించారు. హన్మకొండలోని వరంగల్ ప్రెస్ క్లబ్ లో  ఆదివారం కలంవేకువ పత్రికావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత తరం జర్నలిస్టులం కలుసుకుంటే 1995 నాటి ఉదయం పత్రికలో పనిచేసిన అనుభవాలను, అప్పటి జర్నలిజం పరిస్థితుల గురించి  మాట్లాడుకుంటామన్నారు. ఆ పత్రిక వ్యవస్థాపకులు దాసరి నారాయణరావు అలాంటి అవకాశాన్ని జర్నలిస్టులకు కల్పించారని గుర్తు చేశారు. 1995 తర్వాత పరిస్థితుల గురించి మాట్లాడుకోవాలంటే పెద్దగా ఇష్టపడరన్నారు. ఇదిలాఉండగా ఎంత తక్కువ వ్యాపారాలున్న వ్యక్తి పత్రిక వ్యవస్థాపకులుగా ఉంటే అంత స్వేచ్చతో పాటు ప్రజానుకూల వార్తలకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు. కానీ ఈ రోజు అ పరిస్థితి లేదన్నారు. పెద్ద పత్రికతో పోల్చితే చిన్న పత్రికలకు అలాంటి ఇబ్బంది ఉండదన్నారు. పత్రిక నిర్వహణ ఖర్చులు, భారం తక్కువగా ఉంటుందని దీని వల్ల పత్రికకు స్వేచ్ఛ లభిస్తుందన్నారు. సామాన్యులకు అందుబాటులో ఉన్న వెబ్ సైట్, యూట్యుబ్, ఈపేపర్   ప్లాట్ ఫామ్స్ ను  వినియోగించుకునే ప్రయత్నాన్ని అభినందించారు. ప్రభుత్వానికి భజన చేయడం, వారికి అనుకూలంగా వ్యవహరించడం, రాజకీయ నాయకులకు దగ్గరగా ఉండాలని కోరుకోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. వార్త వల్ల ప్రజలకు ప్రయోజనముందా లేదా అనేది ముఖ్యమన్నారు. రాజకీయ నేతలు ఏర్పాటు చేసిన పత్రికల్లో సైతం ప్రజా సమస్యలకు అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. సమాజంలో ఉన్న సమస్యలను లేవనెత్తి ముందుకు తీసుకురావాలన్నారు. ప్రజలు అమాయలు, ఎలాంటి వార్తలిచ్చినా ఆమోదిస్తారనుకుంటే భ్రమే అన్నారు. ఏ పత్రిక వెనుక ఎవరున్నారు. ఏ రాజకీయ అభిప్రాయాలతో ఉందనేది ప్రజలు గుర్తిస్తారని స్పష్టం చేశారు. ప్రజలతో సంబధం లేని జర్నలిజం నిలవదని ఎంత గొప్ప జర్నలిస్టు చెప్పినా పట్టించుకోరని తెలిపారు. ఉదయం పత్రికలో వచ్చిన వార్తలతో ప్రజల్లో అనేక మంది జర్నలిస్టులు హీరోలుగా చెలామణి అయ్యారని గుర్తు చేశారు. ప్రధాన స్రవంతి మీడియా ప్రజాకాంక్షలను ప్రతిబింబించలేక పోవడం వల్లనే సోషల్  మీడియాలో కొన్ని వార్తలకు లక్షలాది మంది ఫాలోవర్లు ఇందులో భాగమన్నారు. చిన్న సంస్థలకు ప్రజల్లో విశ్వాసం పెంపొందించుకుంటే  మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రజా సమస్యలను వెంటబడి పరిష్కారమయ్యే వరకు ముందుండాలన్నారు. రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటూ సమాజంలోని అనేక రుగ్మతలను నిశితంగా పరిశీలిస్తూ ముందుకు సాగితే ఆ ప్రతికకు భవిష్యత్తు ఉంటుందన్నారు. కలం వేకువ ఆ దిశగా పయనించాలని ఆకాంక్షించారు.


Relative Post

Newsletter