కేసీఆర్ ‘రాజకీయ’ జాతర

కేసీఆర్  ‘రాజకీయ’ జాతర
– జనగామ కేంద్రంగా మలుపు?
– మేడారంలో భక్తుల సంరంభం  
– గులాబీ సభకు భారీ జనసమీకరణ 
– హామీల అమలుకు జేఏసీ ఆందోళన
– భారీగా పోలీసుల మోహరింపు


వేకువ ప్రత్యేక ప్రతినిధి: 

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మహా జాతర సంరంభం నెలకొన్న నేపథ్యంలో రాజకీయ జాతరకు అధికార గులాబీ పార్టీ  తెరతీయడం విమర్శలకు తావిస్తున్నది. ఉమ్మడి ఓరుగల్లంతా సమ్మక్క, సారలమ్మ జాతర జోష్​లో నిమగ్నమైన సందర్భంలో  జనగామ జిల్లా కేంద్రంలో  టీఆర్​ఎస్​ భారీ సభ ఏర్పాటు చేసి అందులో నిమగ్నం కావడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ఏకకాలంలో రెండు లక్ష్యాలు వచ్చిపడ్డాయి. ఈ కారణంగా మేడారం జాతర పై రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఏర్పాట్లపై సాగాల్సిన సమీక్ష కాస్తా జనగామ సభ రీత్యా ప్రాధాన్యత తగ్గిపోయింది. దీని వల్ల జాతరకు లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు అనివార్యంగా ఇబ్బందులు తలెత్తనున్నాయి.  ఇప్పటికే మేడారం జాతరకు రోజూ రెండున్న నుంచి మూడు లక్షల మందికి పైగా భక్తులు వచ్చీపోతున్నారు. ప్రతిష్టాత్మకమైన మేడారం జాతర సమయంలో గులాబీ రాజకీయ జాతరేంటని ప్రశ్నిస్తున్నారు. మేడారం కంటే  ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు జనగామ సభ ముఖ్యమైపోయిందని విమర్శిస్తున్నారు. మరోవైపు మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కేంద్రంపై విమర్శలు చేస్తున్న టీఆర్​ఎస్​ నేతలు ఇప్పుడు చేస్తుందేమిటంటూ ఎద్దేవా చేస్తున్నారు. జనమంతా మేడారం వాతావరణంలో ఉంటే టీఆర్​ఎస్​ సభ ఏర్పాటు చేయడం వల్ల పరోక్షంగా తమకూ ఇబ్బందులు తప్పవని భక్తులంటున్నారు. ముఖ్యంగా ప్రైవేటు వాహనాల్లో జాతరకు వెళ్ళాలను కునే వారికి ఇబ్బంది తప్పదు. మేడారం జాతర బందోబస్తులో పాల్గొనేందుకు సిద్ధమైతున్న పోలీసులకు మరో సభలో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సభకు భారీగా  పోలీసు భద్రత కల్పించనున్నారు. దీని వల్ల పోలీసుల పై పని ఒత్తిడిపడే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో  సానుకూల విషయమేమిటంటే ప్రధాన జాతరకు ముందుగానే ఈ సభ పూర్తి చేసుకోవడం. 


– మేడారం జాతర సంరంభం 

ఈ నెల 16 నుంచి 19 వరకు మేడారం జాతర ప్రధాన ఘట్టాలు ప్రారంభమైతాయి. కానీ, బుధవారం జరిగిన మండమెలిగే పండుగతో ఒక విధంగా అధికారికంగా జాతర ప్రారంభమైనట్లేనని చెప్పవచ్చు. గత నెల రోజుల నుంచి భక్తుల రాకపోకలు బాగా పెరిగాయి. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులతో  ఇప్పటికే మేడారం జనజాతరగా మారిపోయింది. దీనికి తోడు వాహనాల రాకపోకల రద్దీ పెరిగింది.  మేడారంలో చేసే వ్యాపారాల కోసం, నివాసాల కోసం పెద్ద సంఖ్యలో గుఢారాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, విధులు నిర్వహించే  సిబ్బంది, పోలీసులతో కీకారణ్యం కాస్తా జనంతో కిటకిటలాడుతున్నది. 16వ తేదీ నాటికి జనం పొటెత్తే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో జనగామ సభ పైన్నే  మంత్రులు కేంద్రీకరించడం సహజంగానే విమర్శలకు తావిస్తున్నది. గిరిజనులూ, గిరిజన జాతరలంటే ఒకింత నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


– మేడారం పై ఎందుకీ శీతకన్ను 

మేడారం జాతర సంరంభం ప్రారంభమైన నేపథ్యంలో భక్తుల రాక పెరుగనున్నందున మరింత శ్రద్ధ వహించాల్సి ఉంది. జాతరలో ప్రాథమిక ఏర్పాట్ల పూర్తి పై అధికారులు నిమగ్నమైనప్పటికీ మంత్రుల స్థాయిలో శ్రద్ధ వహిస్తే పనుల్లో నాణ్యతతో పాటు పనుల పూర్తికి అవకాశం ఉంటుంది. ఉమ్మడి వరంగల్​ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతి రాథోడ్​లు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సత్యవతి రాథోడ్​ గిరిజన శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఆమె పై జాతర నిర్వహణ బాధ్యతలు భారం ఎక్కువగా ఉంది. దీనికి దేవాదాయ శాఖతో పాటు జిల్లా మంత్రులు సహకారం ఎంతైనా అవసరం. కానీ శుక్రవారం జనగామలో జరిగే టీఆర్​ఎస్​ సభ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి ఆ సభ ఏర్పాట్లకే అంకితం కాగా, మంత్రి సత్యవతి అటు మహబూబాద్​ టూ మేడారం వయా జనగామ టూ మహబూబాద్​ అనే పద్ధతిలో గత వారం రోజుల నుంచి చక్కర్లు కొడుతున్నది. మేడారం జాతర భక్తులకు ఏర్పాట్లు చేయడం పై  అధికార పెద్దల కేంద్రీకరణ తగినంత లేక పోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. పైగా ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రతిపక్ష పార్టీకి చెందినందున అధికార పార్టీ ప్రత్యేక  శ్రద్ధవహించాల్సిన అవసరం కాస్తా జనగామ సభ కారణంగా తగ్గిపోయింది. ఈ  సభ వల్ల భక్తులకు కొంత మేరకైనా ఇబ్బందులు తప్పవంటున్నారు. సభ పూర్తయ్యి జాతర పై దృష్టి కేంద్రీకరించసరికి పుణ్యకాలం కాస్తా పూర్తయితదని అంటున్నారు. 


– ప్రతిష్టాత్మక జనగామ సభ

గత వారం పది రోజుల్లో చకచకా మారిన రాజకీయ వాతావరణంలో జనగామలో శుక్రవారం ఏర్పాటు చేసిన గులాబీ సభ రాజకీయ అవసరాల దృష్ట్యా టీఆర్​ఎస్​ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ​ఈ సభకు సీఎం కేసీఆర్​ హాజరుకానున్నందున నేతలు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఈ సభకు జనగామ, పాలకుర్తి, స్టేషన్​ఘన్​పూర్​తో పాటు ఆలేరు, వరంగల్​ తూర్పు, వరంగల్​ పశ్చిమ నియోజకవర్గాల నుంచి భారీగా జనాన్ని తరలించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. లక్షమందితో సభ జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలంతా ఈ పనిలో ఉన్నారు. జనాన్ని తరలించేందుకు వాహనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.  మంత్రి హరీష్​రావు గురువారం ప్రారంభాలకు హాజరైనా ఈ సభ సక్సెస్​ కూడా ఉందంటున్నారు. 


– సభకు రాజకీయ ప్రాధాన్యత

జనగామ సభకు రాజకీయ ప్రాధాన్యత ఉంది. రాజ్యాంగం పై కొత్త చర్చకు సీఎం కేసీఆర్​ తెరతీసిన తర్వాత కాంగ్రెస్​, బీజేపీ, దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆయన పై విరుచుకపడ్డాయి. ఈ నేపథ్యంలోనే పీఎం మోడీ హైదరాబాద్​ పర్యటనకు సీఎం దూరంగా ఉన్నారనే చర్చ సాగుతున్నది. ఇదే సమయంలో మోడీ రాజ్యసభలో తెలంగాణ ఆవిర్భావం పై చేసిన వ్యాఖ్యలు టీఆర్​ఎస్ కు ఆయుధంగా మారింది. కాంగ్రెస్​ ఇతర పక్షాలకు ఆ క్రెడిట్​ దక్కకుండా తమ పార్టీ కైవసం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కారణాల రీత్యా సభకు భారీ జనాన్ని సమీకరించడమే కాకుండా ‘సందేహాలూ తీర్చి సందేశాన్ని’ అందించాల్సిన బాధ్యత కేసీఆర్​ పై ఉంది. ఈ కారణంగా సభకు రాజకీయ ప్రాధాన్యత చేకూరింది. ఇప్పటికే  సీఎం కేసీఆర్​ పలు ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్​లను ప్రారంభించారు. ఈ కలెక్టరేట్​ ప్రారంభం కేవలం సందర్భం మాత్రమేనని సభ సక్కెస్​ ప్రధానమంటున్నారు. రాష్ట్రంలో మొదటి పార్టీ జిల్లా నూతన కార్యాలయాన్ని  ఇక్కడ కేసీఆర్​ ప్రారంభించనున్నారు. 


– హామీల అమలు పై ఆందోళన 

ఏడున్నరేళ్ళుగా ఏకపక్షంగా ముందుకు సాగుతున్న కేసీఆర్​కు ఇటీవల కొంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  ఇంతకాలం ఎవరేం ప్రశ్నించినా లెక్కచేయకుండా దూసుకపోతున్న  కేసీఆర్​కు అక్కడక్కడ బ్రేక్​లు పడుతున్నాయి.  ప్రతిపక్షాలు గొంతు విప్పుతున్నారు. ప్రజల్లో సైతం సీఎం ఇచ్చిన హామీలపై ఆగ్రహం వ్యక్తమైతున్నది. మాట మార్చే మంత్రులు, ఎమ్మెల్యేలను నలుగురిలో నిలదీస్తున్నారు. తాజాగా జనగామలో సీఎం పర్యటన ఉందన్న నేపథ్యంలో పది రోజులుగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికంగా జేఏసీ ఏర్పడి సీఎం గత ఎన్నికల్లో  ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పోటీ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఇచ్చిన హామీల మేరకు జిల్లాలో మెడికల్​ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్​  చేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా తాము మాత్రమే మెడికల్​ కాలేజీ హామీ ఇచ్చామని, సీఎం ఆ హామీ ఇవ్వలేదని బుకాయించే యత్నం చేసిన మంత్రి ఎర్రబెల్లిపై విరుచుకపడుతున్నారు.  సోషల్​ మీడియాలో గత ఎన్నికల సభలో సీఎం ఇచ్చిన మెడికల్ కాలేజీ హామీ వీడియో చక్కర్లు కొడుతున్నది. ఈ వేడిని కొంత తగ్గించేందుకు మంత్రి హరీష్​రావు బుధవారం జరిగిన టెలీకాన్ఫరెన్స్​లో జిల్లాలో మెడికల్​ కాలేజీ ఏర్పాటు చేస్తామని ఆ లక్ష్యంలో భాగంగానే మొదటి విడత ఎనిమిది జిల్లాలో కొత్త మెడికల్​కాలేజీలు ఏర్పాటు చేశామని చెప్పారు. మరో దశలో జనగామకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పకుండానే సమస్యను చల్లార్చే యత్నం చేశారు. 


– భారీ పోలీసు మోహరింపు 

 సీఎం సభ నాటికి జేఏసీ ఏ విధంగా స్పందిస్తుందనేది వేచిచూడాల్సిందే. ఇదిలా ఉండగా జనగామలో బుధవారం టీఆర్​ఎస్​, బీజేపీలు వేర్వేరుగా చేసిన ర్యాలీలు కాస్తా పరస్పర దాడులకు దారి తీసింది. అధికార టీఆర్​ఎస్​ ఇందులో ఒకడుగు ముందుకు వేసి కర్రపెత్తనం సాధించింది.  గురువారం నర్మెటలో రెండు పక్షాల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో జనగామ సభకు గతంతో పోల్చితే కాస్తంత ఎక్కువ బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇక షరామాములుగా విపక్షాలు, ప్రజాస్వామిక సంస్థల  ప్రతినిధులను గృహ నిర్భంధాలు, ముందస్తు అరెస్టులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదీ ఏమైనా జనగామ కేంద్రంగా రాజకీయ వేడి మరింత పెరుగనున్నది.

Relative Post

Newsletter