సామ్రాజ్యవాదులు ఉక్రెయిన్ పై రుద్దిన యుద్దాన్ని నిలిపివేయాలి-మావోయిస్టు పార్టీ

ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్యపై భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ప్రకటన

సామ్రాజ్యవాదము ఉక్రెయిన్ పై రుద్దిన యుద్ధం వద్దని గొంతెత్తి నినదిద్దాం! భారత పౌరులను స్వదేశానికి తీసుకురావడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండించండి!


హైదరాబాద్:    సామ్రాజ్యవాదము ఉక్రెయిన్ పై రుద్దిన యుద్ధం వద్దని గొంతెత్తి నినదిద్దాం! భారత పౌరులను స్వదేశానికి తీసుకురావడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండించండి!మానవాళిని వినాశనం దిశగా తీసుకుపోతున్న సామ్రాజ్యవాదుల మధ్య వైరుధ్యాలు తీవ్ర స్థాయికి చేరుకుని ఇప్పుడు ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభమయింది. ఇది ఇంతటితో ఆగదని రష్యా, అమెరికా ప్రకటనలు తెలియజేస్తున్నాయి. ప్రపంచ శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరూ ఈ యుద్ధాన్ని ఆపమని నినదించవలసిందిగా మా పార్టీ కేంద్ర కమిటీ కోరుతున్నది. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులను సురక్షితంగా దేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం సమస్త చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయవలసిందిగా దేశంలో యావత్తు పీడిత వర్గాలు, సెక్షన్లను, ప్రజలను, ప్రజాస్వామికవాదులనూ కోరుతున్నది.


ఉక్రెయిన్ లో తూర్పు రీజియన్ లో డోనేస్టెస్క్, లూషన్సీ లను రష్యా పార్లమెంట్ స్వతంత్ర ప్రభుత్వాలుగా గుర్తించి అక్కడికి తన సైన్యాలను పంపాలని నిర్ణయించడంతో సామ్రాజ్యవాదుల మధ్య రాజకీయ, భౌగోళిక, ఆర్థిక పోటీ బాహాటంగా ముందుకు వచ్చింది. రష్యా సైన్యాలు తూర్పు ప్రాంతాల్లోకి చొచ్చుకునిపోవడమే కాక, ఉక్రెయిన్ పై అన్ని దిక్కుల నుంచి దాడి చేస్తూ రాజధాని కీప్ పై కూడా దాడి చేస్తున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత యూరపులో మళ్లీ ఆ స్థాయిలో యుద్ధ ప్రమాదం ముంచుకు రావడం ఇదే ప్రథమం. ఈ పరిణామాలు యూరపను, ముఖ్యంగా ఉక్రెయిన్ ప్రజలను తీవ్ర అనిశ్చితిలోకి నెట్టింది. ప్రపంచమంతా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఉక్రెయిన్లో ఇరవై వేల మందికి పైగా భారతీయులు నిస్సహాయులుగా, తీవ్ర భయాందోళనలకు గురై ఉన్నారు.


ప్రపంచ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్ కు 110 డాలర్లకు పెరిగిపోవడమే కాకుండా, మరి కొన్ని రోజులలో 150 డాలర్లు దాటవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ సంక్షోభ పర్యవసానం మన దేశ ఆర్థిక వ్యవస్థపై పడనున్నది. ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగడమే కాక సఫ్లవర్ ఆయిల్, గోధుమ, అల్యూమినియం, మెటల్ ధరలు పెరగనున్నాయి.


1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన సమయంలో అమెరికా, రష్యాకు ఇచ్చిన హామీని ఆ వెనువెంటనే కాలదన్ని నాటోను విస్తరించడం ప్రారంభించింది. 12 దేశాలకు పరిమితమై నాటోను అమెరికా 30 దేశాలకు విస్తరించింది. వార్సా కూటమిలో పోలెండ్, రుమేనియాను చెక్ రిపబ్లిక్, హంగరీలను నాటోలో కలుపుకుంది. ఐదు సంవత్సరాల తరువాత బాల్టిక్ దేశాలైన ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియాలను కలుపుకుంది. ఇవి రష్యాను ఆనుకుని ఉంటాయి. ఆ తర్వాత 2008లో జార్జియా, ఉక్రెయిన్లను నాటోలో కలుపుకుంటామని అమెరికా ప్రకటించింది. ఉక్రెయిన్ నాటోలో భాగమైతే మాస్కోకు 500 కిలోమీటర్ల దూరం వరకు నాటో విస్తరిస్తుంది. అమెరికా తన క్షిపణులను ఉక్రెయిన్ లో మొహరిస్తే రష్యాకు అతి ప్రమాదంగా ఉంటుంది. దీంతో రష్యాకు నల్ల సముద్రం మీద ఉన్న ఆధిపత్యానికి గండి పడుతుంది. అమెరికా ఇప్పటికీ ఉక్రెయిన్ సైన్యాలకు ట్రైనింగ్, ఆయుధాలతో పాటు నాటో సైన్యాలను అందిస్తూనే ఉన్నది.


రష్యాకు పొంచి ఉన్న ప్రమాదం, దాని ఆధిపత్యాన్ని ఈ ప్రాంతాలపై నిలుపుకునే ఉద్దేశ్యంతో రష్యా కొన్ని దూకుడు చర్యలకు పాల్పడింది. పుతిన్ 2008లో జార్జియాలో అంతకలహాలు చెలరేగినప్పుడు వాటిని అరికట్టడానికి సైన్యాన్ని పంపి జార్జియాను కంట్రోల్ లోకి తెచ్చుకున్నాడు. ఉక్రెయిన్ లో క్రిమియా ద్వీపంలో విభజనకారులకు సైనిక మద్దతునిచ్చి రష్యాలో కలుపుకున్నాడు. బెలారుస్, కాకసస్ లో కూడా రష్యా ఆంతరంగిక జోక్యం చేసుకోవడంతో పాటు మధ్య ఆసియా దేశాల్లో కూడా తన ప్రభావాన్ని పెంచుకుంటున్నది.


ఉక్రెయినను జారు కాలంలోనే రష్యాలో కలుపుకున్నారు. సోవియట్ యూనియన్ లో ఉక్రెయిన్ స్వచ్ఛందంగా చేరింది. సోవియట్ యూనియన్ విడిపోయిన సందర్భంలో స్వతంత్ర దేశంగా ఏర్పడింది. అయితే ఉక్రెయిన్ లో తూర్పు రీజియన్లో రష్యా జాతి ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరు స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తింపు కోసం సాయుధ తిరుగుబాట్లు చేస్తున్నారు. వీరిపై ఉక్రెయిన్ సైన్యం అణచివేత చర్యలు చేపడుతున్నది. రష్యా సహాయంతో వీరు ఉక్రెయిన్ సైన్యాలను తిప్పి కొడుతున్నారు.

2014లో ఉక్రెయిన్ ఈ సైన్యాలను వెనక్కి నెట్టింది. దీనిపై ఇరు వర్గాల మధ్య బెలారసులో మిన్స్ లో ఒక ఒప్పందం కుదిరింది. ఈ క్రెయిన్ మిస్కీ-1 ఒప్పందాన్ని అమలు చేయకుండా మళ్లీ ఆ ప్రాంతాలపై దాడి చేయడంతో తిరుగుబాటుదారులు ఉక్రెయిన్ సైన్యాలను ఓడించారు. దీంతో ఫ్రాన్స్, జర్మనీలు కలుగజేసుకుని, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, ఉక్రెయిన్ల మధ్య మి-2 ఒప్పందాన్ని కుదిర్చాయి. ఈ ఒప్పందం ప్రకారం డోనేస్టెన్స్, లూషన్సీలను ప్రత్యేక రీజియన్లుగా గుర్తిస్తూ, వారికి అక్కడ స్వయం పాలన ఏర్పరచుకునే అధికారాన్ని కల్పిస్తూ మి-2 ఒప్పందం జరిగింది. అయితే నాటో దేశాల సహాయంతో ఉక్రెయిన్ ఈ దేశాలకు స్వయం ప్రతిపత్తిని అడ్డుకోవడం చేస్తూ వస్తున్నది. మరో వైపు నాటోలో చేరాలని నిర్ణయించుకుంది. దీంతో ప్రస్తుత యుద్ధం ప్రారంభమయింది.


రష్యా ఉక్రెయిన్ పై దాడి చేసిన వెంటనే అమెరికా నేతృత్వంలో ఫ్రాన్స్, జర్మనీ, గ్రేట్ బ్రిటన్లు రష్యా పై కీలకమైన ఆర్థిక ఆంక్షలు విధించాయి. నార్త్ స్టీమ్-2 పైప్ లైన్ ను జర్మనీ నిలిపివేసింది. దీంతో రష్యా నుంచి జర్మనీ దిగుమతి చేసుకుంటున్న గ్యాస్, చమురు నిలిపివేయబడింది. రక్షణ రంగ అవసరాలకు, బ్యాంకులపై, పుతిన్ సన్నిహిత కోటీశ్వరులపై ఆర్థిక ఆంక్షలు అమలవుతున్నాయని పశ్చిమ దేశాలు చెబుతున్నాయి గాని, ఈ ఆంక్షలు సామాన్యుల పై పెనుభారంగా మారబోతున్నాయి. ఈ రకంగా రష్యా సంక్షోభంలో ఇరుక్కోవాలని పశ్చిమ దేశాలు చూస్తున్నాయి. చైనా సహాయంతో ఆర్థిక ఆంక్షలు అధిగమించాలని రష్యా నిర్ణయించుకుంది.

ప్రియమైన ప్రజలారా,

అమెరికా, గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా సామ్రాజ్యవాదుల మధ్య జరుగుతున్న పిల్లి, ఎలుక చెలగాటం చివరకు యుద్ధానికి దారి తీసి ప్రపంచ ప్రజలను, ముఖ్యంగా యూరపు దేశాల ప్రజలను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తున్నది. రెండు ప్రపంచ యుద్ధాల్లో, ప్రచ్ఛన్న యుద్ధంలో ప్రపంచ మానవాళికి శాంతి కరువై సామ్రాజ్యవాదుల యుద్ధ పిపాసతో కోట్లాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితులు, ఉద్రిక్తతలు మానవాళికి తీవ్ర నష్టం చేస్తాయి. సామ్రాజ్యవాదులు గొంతు లోతు కూరుకుపోయిన ఆర్థిక, ద్రవ్య సంక్షోభం నుంచి బయటపడడానికి యుద్ధాలకు తలపడుతున్నాయి. ఆర్థిక, రాజకీయ, భౌగోళిక ఆధిపత్యం పోటీ చివరకు యుద్ధాలకు దారి తీస్తున్నది. సామ్రాజ్యవాదులను ప్రపంచ మానవాళి పై రుద్దుతున్న ఈ యుద్ధాన్ని యావత్తు ప్రజానీకం ఖండించాలి.

రష్యా ఉక్రెయిన్ పై దాడి నిలిపివేసి తూర్పు రీజియన్ ప్రాంతాల నుంచి ఉపసంహరించుకోవాలి. ఉక్రెయిన్ ప్రభుత్వం మిన్స-2 ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలి. ఉక్రెయినను నాటోలో చేర్చుకోవడం నిలుపుదల చేయాలి. ఈ ప్రాంతాలంతటా నిస్సైనికిరణ చేయాలి.

భారత ప్రభుత్వం అమెరికా నేతృత్వంలో గల క్వాడ్ లాంటి మిలిటరీ కూటమిలో సభ్యత్వం కలిగి ఉండడం, మరో వైపు రష్యా నుంచి మిస్సైల్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం చేస్తూ, ఉక్రెయిన్‌లో శాంతి ప్రవచనాలు వల్లించి సామ్రాజ్యవాద యుద్ధ కుట్రల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. భారత ప్రభుత్వం క్వాడ్ నుంచి బయటకు రావాలని ప్రజలంతా డిమాండ్ చేయాలి. ఉక్రెయిన్‌లో యుద్ధం అనివార్యం అని తేలినప్పటికీ భారత ప్రభుత్వం భారత పౌరులకు రక్షణ కల్పించడంలో విఫలమైంది. ఇలాంటి సమయాల్లో పౌరులకు అండగా ఉండే దౌత్య కార్యాలయాన్ని భారత ప్రభుత్వం వెనక్కి తీసుకువచ్చింది. ఎయిర్ ఇండియా రేట్లను మూడింతలు పెంచింది. ప్రజలు సొంత ఖర్చుతో ఉక్రెయిన్ నుంచి పక్క దేశాలకు రావాలని అక్కడ నుంచి విమానాలు ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఎంతో ప్రయాసతో కూడుకున్నది. యుద్ధం మొదలయిన తరువాత చేపట్టిన చర్యలు అక్కడ ఉన్న భారతీయులను దేశానికి తిరిగి తీసుకురావడానికి సమగ్రంగా లేవు. భారత ప్రభుత్వ ఈ నిర్లక్ష్య వైఖరిని ఖండించాలి.

సామ్రాజ్యవాదులు ఉక్రెయిన్ లో ప్రారంభించిన ఈ యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయవలసిందిగా, ప్రజలను, ఈ భూమిని, ప్రపంచాన్ని రక్షించవలసిందిగా యావత్తు ప్రపంచ దేశాల కార్మికులు, రైతులు, విద్యార్ధులు, ఉద్యోగులు, జాతులు, మతపర అల్పసంఖ్యాక ప్రజలు, శాంతికాముకులు మొత్తంగా ప్రజానీకం గొంతెత్తి నినదించవలసిందిగా కోరుతున్నాం.

అభయ్ అధికార ప్రతినిధి

కేంద్ర కమిటీ

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

(ఫిబ్రవరి 26, 2022)

Relative Post

Newsletter