మీ కలం నిరంతరం మెలకువతో ఎన్నో వేకువలను సృష్టించాలి - మాడభూషి శ్రీధర్

కలం వేకువ 

సైబర్ అంతర్జాల దినపత్రిక సంపాదకులు

శ్రీయుతులు దుర్గా ప్రసాద్ గారికి 

శుభాభినందనలు, 

మీ కలం నిరంతరం మెలకువతో ఎన్నో వేకువలను సృష్టించాలి.కలం వేకువ పేరుతో ముద్రాక్షరాలతో పని లేని అంతర్జాల దినపత్రిక ఒకటి వరంగల్లులో ప్రారంభించడం చాలా సంతోష దాయకం. రావాలని ఉన్నా రాలేకపోయాను. అయినా వేకువ ఎవరో ఎవరి కోసం ఆగిపోకూడదు. కలకాలం కలం సాగిపోతూనే ఉండాలి. వరంగల్లునుంచి ఏ పత్రికారాని రోజుల్లో, కనీసం హైదరాబాద్ లో ఎఢిషన్లు ఏ పత్రికకూ లేని రోజుల్లో వరంగల్లునుంచి రోజు దినపత్రిక ఒకటి రావాలని మా నాన్నగారు, వరంగల్లులో తొలి దినపత్రిక వరంగల్ వాణి సంపాదకులు ఎం ఎస్ ఆచార్య అభిలషించడం నాకు తెలుసు. తరువాత కాలంలో వరంగల్లు ఆశ్చర్యకరంగా దాదాపు అన్ని ప్రధాన దినపత్రికల ప్రచురణ కేంద్రంగా మారిపోయింది. ఒకటో జనవరి 1980న వరంగల్ వాణి ఆరంభమైంది.  నేను ఉదయం దినపత్రికలో పనిచేస్తున్నరోజుల్లో నైట్ డ్యూటీ తరువాత మరునాడు వీక్లీ ఆఫ్ ఉండేది. ఆడ్యూటీ ముగించుకుని, అదే రాత్రి కొనసాగించి తెల్లవారు ఝామున వరంగల్లుకు పత్రికలు మోసుకుని వచ్చే వ్యాన్ లో నానాతంటాలు పడుతూ వరంగల్లుకు వచ్చే వాడిని. అప్పుడు అనుకునే వాడిని వరంగల్లులో ఎడిషన్ ఉంటే ఎంత బాగుండేదని. అప్పుడది అసాధ్యం అనిపించేది. కలం వేకువ పేరు చాలా బాగుంది. కాళోజీ కవితతో మొదలు కావడం మరీ బాగుంది. కాళోజీ మా ప్రెస్ కు వచ్చి తన డైరీ ఇచ్చేవాడు. నేను అప్పుడే ఆయన డైరీనుంచి తాజా కవితలు ఒకటి రెండు కంపోజ్ చేసి ఆయన డైరీ ఆయనకు ఇచ్చే వాడిని. నాన్నగారితో ముచ్చట్లు ముగియడానికి ముందే ఆయన కవిత కంపోజ్ అయి ప్రూఫ్ నాన్నగారి టేబుల్ మీద ఉండేది. కాళోజీ స్వయంగా సవరించడం, ఏ అక్షరం ఎందుకు రాసారో చెప్పడం నాకింకా గుర్తు.  అచ్చు అక్షరాలు, కాగితాలు, యంత్రాలు అవసరం లేని పత్రిక రోజూ ఎన్నిసార్లయినా వస్తుందంటే కూడా ఆరోజుల్లో ఊహకు కూడా సాధ్యం కాకపోయేది.జాతీయస్థాయిలో ప్రపంచాన్ని ఊపేసే సంఘటనలు జరిగినప్పుడు ప్రత్యేకంగా పత్రికను వెలువరచడం కూడా నాకు గుర్తు. ఇందిరాగాంధీ హత్య అటువంటి సంఘటన. రెండు పేజీల బ్రాడ్ షీట్ ముక్కతో వరంగల్ వాణి పత్రికలో కొన్ని వార్తల రచన, కంపోజింగ్,  ముద్రణ కూడా నేనే చేశాను. రేపటి వేకువదాకా ఆపి తీరిగ్గా చదువుకునే వార్త కాదది. అందరికీ తెలిసినా, ఏవో వివరాలు కోరుకునేవారే అంతా. కనుక మధ్యాహ్నం రెండుగంటలకల్లా మరునాటి వేకువ రావలసిన పత్రిక రావడం ఒక ధ్రిల్లింగ్ అనుభూతి. దాని డిమాండ్ కూడా ఎక్కువే. నేను సాయంత్రందాకా పేపర్ ప్రింట్ చేస్తూ ఉండే వాడిని. వరంగల్లు ఖాజీపేట హనుమకొండ ప్రాంతాలనుంచి చుట్టు పక్కల గ్రామాల నుంచి పేపర్ అయిపోయింది ఇంకా కావాలని ప్రెస్ కు వచ్చేవారు. నేను ప్రింట్ చేస్తూ ఉండేవాడిని. మానాన్నగారు కొన్ని వందల ఫోన్లు స్వీకరిస్తూ ఇందిరాగాంధీ మరణ వార్త సంక్షిప్తవివరాలు ఇస్తూ ఉండేవారు. ఒక దశలో నాకోసం నాన్నకోసం ఫోన్ చేసిన వాళ్లుకూడా పదేపదే అదే వార్త (ఇప్పుడు కరోనా వాయిస్ టోన్ వలె) వినవలసి వచ్చేది. నా మిత్రులంత మరునాడు ఎన్నిసార్లు వాళ్లు మానాన్నగారి గొంతులో ఇందిరాగాంధీ వార్త విన్నారో చెప్పిఏఢిపించాలని నవ్వేవారు. కలం వేకువ ఇప్పుడు చాలా అవసరం. వేకువ అవసరం. కలం వేకువ ఇంకా అవసరం. కలమే నిద్ర మేల్కొనకపోతే, వేకువ జనాన్ని మేల్కొల్పడం సాధ్యం కాదు.  మెయిన్ స్ట్రీం మీడియా పాలకుల గుప్పిట్లో బందీలయినాయి. పార్టీల రక్షణ లో పత్రికా రచన భద్రంగా పక్షపాతంతో భయం భయంగా బతికిపోతున్నది. జనానికి టివిల్లో వార్తా చానల్ ను చూసే ఆసక్తి కూడా చాలావరకు తగ్గిపోతున్నది. జనాన్ని నిద్రబుచ్చేవార్తలు, నిద్రలేపకుండా జాగ్రత్త పడే వార్తలు, అధికారుల తప్పుకాచే వార్తలు, తప్పులు ఒప్పని చెప్పే తప్పుడు వార్తలు,ఫేక్ న్యూస్ ఉత్పత్తి కర్మాగారాల వంటి వార్తా పత్రికలు విజృంభిస్తున్న ఈ రోజుల్లో సోషల్ మీడియానే దిక్కు. దీనిగురించి వివరంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే శక్తి ఉన్న ఇద్దరు పెద్దలు,  శ్రీ కె రామచంద్ర మూర్తిగారు, శ్రీ పాశం యాదగిరిగార్లు. వారితోపాటే నేనూ పనిచేసాను. నాన్నగారితో పనిచేసిన తరువాత నాకు వీరిరువురితో సుదీర్ఘంగా పనిచేసే అనుభవం ఉంది. ఇప్పడికీ నేను వీరిద్దరి తో కలిసే పనిచేస్తున్నాను. మాముగ్గురిని ఆహ్వానించిన మిత్రులు దుర్గాప్రసాద్ గారికి అభినందనలు. మీ పత్రికకు మీకు వెన్నెముక చాలా గట్టిగా ఉండాలని, నిలిచి నిలబెట్టే చైతన్యంతో వెన్నెముక కలిగిన పత్రికలే కలం వేకువను స్వాగతిస్తాయని నా అభిప్రాయం. అన్ని విధాలా మీరు విజయం సాధించాలని. మీ కలం జనానికి గళంగా బలంగా కలంగా నిలబడాలని ఆశిస్తూ ..

మీ

మాడభూషి శ్రీధర్ 

ఢీన్ మహీంద్ర యూనివర్సిటీ, హైదరాబాద్,

Relative Post

Newsletter