సర్వేలతో సమస్యలకు మంగళం

-బీజేపీ, టీఆర్‌ఎస్ రాజకీయక్రీడ

-అధికార స్వార్థం, అవకాశవాదం

-ప్రజలను పక్కదోవపట్టించే ఎత్తులు

-రాష్ట్రంలో పౌరసంస్థల అలసత్వం


(వేకువ ప్రత్యేక ప్రతినిధి)

ప్రభుత్వమైనా, అధికార ప్రతిపక్షమైనా, ప్రజా సంఘమైనా, అధికార యంత్రాంగమైనా, ఆఖరికి ప్రచార సాధనాలైనా ప్రజా సమస్యలను పరిష్కారించేందుకు ప్రయత్నించడం ప్రధమ కర్తవ్యం. కానీ ఇటీవల ఈ బాధ్యతల నిర్వహణలో పూర్తి అపసవ్యత నెలకొని సమాజానికి తప్పుడు సంకేతాలను అందిస్తోంది. ప్రజలు ఎదుర్కొంటున్న నిజ జీవిత సమస్యల పరిష్కారమేమోకానీ ఉన్న సమస్యలను పక్కదోవ పట్టించి తమ పబ్బం గడుపుకుంటున్నారు. అధికార రక్షణ ప్రధమ కర్తవ్యంగా ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేపట్టడంలో నైపుణ్యత సాధిస్తూ ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఎత్తుగడలలో భాగంగానే చేపడుతున్న ఒకానొక కార్యక్రమమే సర్వేలు. ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉందని చెప్పవచ్చు. 

- వేడెక్కిన అధికార రాజకీయం

రాష్ట్రంలో టిఆర్ఎస్ పై అటు బిజెపి, ఇటు కాంగ్రెస్, మిగతా పక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు ఎక్కుపెట్టిన సందర్భం. గత ఏడాది కాలంగానే రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రజాపక్షాలు, కాసింత గొంతు విప్పుతున్నాయి. ఈ దశలోను కేంద్రంలోని అధికార బిజెపి వర్సెస్ రాష్ట్రంలోని టీఆర్ఎస్ గా మార్చి ఆధిపత్య రాజకీయ అంశాలుగా మార్చివేసి ప్రజా సమస్యలను చర్చించకుండా, ఎజెండా మీదికి రాకుండా రెండు అధికార పార్టీలు కలిసికట్టుగా,  వేరువేరుగా ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

- సమస్యతో ప్రజల సతమతం

రాష్ట్రంలో రైతాంగం, విద్య, వైద్యంతోపాటు ఉపాధి సమస్యలను ఎదుర్కొంటుంది. వరుస వానలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో ప్రజా సమస్యలు ఎలా పరిష్కరించాలి అందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఎంత అనేది మరిచిపోయి తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందంటే తాము అధికారంలోకి వస్తామంటూ సవాళ్లు చేసుకుంటూ ప్రజా గొంతును అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనికి తాజా సర్వేలు మరింత నిప్పును రాజేస్తున్నాయి.

- ప్రభుత్వ పనితీరు పై అవకాశం

వాస్తవానికి రాష్ట్రంలో టీఆర్ఎస్,  కేంద్రంలో బిజెపి అధికారంలో కొనసాగుతున్నాయి. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఇచ్చిన హామీలు ఏ మేరకు  అమలు చేశాయి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో ప్రజల ముందు పెట్టి అధికార పార్టీలపై, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన సందర్భంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలోకి వస్తారంటూ  సర్వేలు నిర్వహించడం సిగ్గుచేటు. ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించడంగా భావించాలి. 

- ఓటరు నాడీ తెలుసుకోగలమా?

వాస్తవానికి ఓటు వేసి చివరి క్షణం వరకు ఓటరు నాడిని 100% తెలుసుకునే పరిస్థితులు ఇప్పటికీ లేవు. ఓటు వేసిన తర్వాత ఓటరు అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు నిర్వహించే ఎగ్జిట్ పోల్ లో కూడా 100% ఫలితాలు రావడం లేదనేది ఆచరణలో తేలుతున్న అంశాలు. అలాంటి పరిస్థితులలో ఎన్నికలకు సుమారు ఒకటిన్నర సంవత్సరాల కాల పరిమితి ఉన్న సమయంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ సర్వేలు నిర్వహించడమే తప్పుదోవపట్టించే అంశం.

- సర్వేల్లోనూ స్వార్థపూరితం

అయితే ప్రభుత్వ వ్యతిరేకత, అనుకూలత అంశాలపై ఎవరైనా సర్వేలు నిర్వహించడాన్ని ఆహ్వానించవచ్చు. ఏ ప్రజాసమస్యలపై అనుకూల, వ్యతిరేకతలను తెలుసుకోవచ్చు. ఇదో మేరకు సమంజసం కూడా. కానీ దీనికి భిన్నంగా సర్వేలంటూ కొన్ని సంస్థలు సందర్భము, సమయము లేకుండా తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఫలితాలు విడుదల చేస్తున్నారు. వాటికి ఎక్కడలేని ప్రాచుర్యం కల్పిస్తూ ప్రజలను ప్రజాకాక్షలను అపహాస్యం చేస్తున్నాయి. ఈ సర్వే సంస్థల వెనుక ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రచ్చన్న హస్తం ఉంటుంది. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బు కూడా చేతులు మారుతుంది. సమస్య ఏదైనా ప్రజల మనోభావాలతో చెలగాటమాడుతూ తక్షణ సమస్యగా ఎదుర్కొంటున్న వాటిని చర్చకు రాకుండా చేసేందుకు ఇలాంటి తప్పుడు ఎత్తుగడలను గత కొంతకాలంగా అనుసరిస్తున్న విషయం తెలిసిందే.

- అధికార స్వార్థమే అంతిమ లక్ష్యం

అధికారాన్ని కాపాడుకునేందుకు కొన్ని పక్షాలు, అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు మరికొన్ని పక్షాలు ప్రయత్నిస్తూ ప్రజలను ప్రశ్నించే తత్వం నుండి తప్పించేందుకు కుట్రలు కుయుక్తులు పన్నుతున్నారు. అందులో భాగంగానే తెలంగాణలో ఇటీవల విడుదల చేస్తున్న సర్వేలను మనం భావించాలి. అధికారంలో ఉన్న పార్టీలో లేదా ప్రతిపక్ష పార్టీలు ప్రజల నాడీ తెలుసుకునేందుకు, సంస్థగతంగా తమ పార్టీ నిర్మాణం ద్వారానో లేదా ప్రైవేట్ సంస్థల ద్వారానో వ్యక్తుల ద్వారానో అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేయడం తప్పు కాదు. సర్వే ఫలితాల మీద ఆధారపడి ప్రతిపక్షాలైతే తమ తమ పార్టీ కార్యక్రమాలను రూపొందించుకోవడం, ప్రజల మనసును గెలుచుకునేందుకునేందుకు ఈ సర్వేల ద్వారా ప్రయత్నించడం తప్పు కాదు.


ప్రభుత్వాలు సైతం తమ పాలసీలు పథకాలు ప్రజల స్పందన తెలుసుకునేందుకు సర్వేలను వినియోగించుకుంటే అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. ఈ సర్వేల ద్వారా తమ తప్పులు సమీక్షించుకొని మంచి మార్గంలో పయనించేందుకు ప్రయత్నిస్తే మనమంతా స్వాగతించాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉండగా ప్రభుత్వాల పని విధానం పై ప్రజల మనోభావాలు, ప్రతిపక్షాల పాత్ర పై ప్రజల స్పందన, సాధారణ ప్రజల అభిప్రాయాలను సమాజం ముందు ఉంచేందుకు నిజాయితీతో ప్రాథమిక స్థాయి అభిప్రాయాలను అద్దంలో మన ముందుంచేందుకు దోహదం చేస్తుంది.

- ప్రజాసమస్యలపై సర్వే చేయరెందుకు?

అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అంటే ఆయా సెక్షన్ల వారీగా విద్యార్థులు, ఉద్యోగులు, విద్య, వైద్యం రైతులు, వ్యవసాయం, పారిశ్రామిక రంగం, అన్ని రంగాల అభివృద్ధికి సంబంధించి సమస్యలను లేవనెత్తే విధంగా సర్వేలను చేపట్టి వాటి ప్రతిబింబాలను ప్రజల ముందు పెడితే వాటిని సమీక్షించుకొని అధికార ప్రతిపక్షాలు తమ బాధ్యతలను నిర్వహించుకునేందుకు అవకాశం చిక్కే విధంగా ఒత్తిడికి దోహదం చేస్తుంది. కానీ పై ప్రాథమిక అంశాలు పక్కకు పెట్టి అధికారం చుట్టూ తిరిగే జోరిగల్లాగా సర్వేలను ఫక్తు తమ స్వార్థం కోసం వినియోగించుకోవడమే కాకుండా ప్రజలను ప్రజా సమస్యల నుంచి పక్కదోవ పట్టించేందుకు వినియోగించడం క్షమించకూడదు. ఇలాంటి కుట్రపూరిత విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తేవడమే కాకుండా సర్వే సంస్థల దుర్మార్గాలను కూడా ఎండగట్టాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో పాలకుల వైఫల్యాలను ఎత్తి చూపే విధంగా కార్యక్రమాలను ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది. 

- పౌరసంస్థల పై బాధ్యత

ఈ విషయంలో పౌర ప్రజాస్వామిక సంఘాలు వేదికలు వ్యక్తుల యొక్క పాత్ర ముఖ్యమైనది. ముఖ్యంగా మేధావులు ఇలాంటి సందర్భాలలో ముందు భాగంలో ప్రజల పక్షంగా ఉండాల్సి ఉంటుంది. అంటే అధికారం కోసం తమ రాజకీయ ప్రయోజనం కోసం ఎన్నికలు లేని సమయంలో నిర్వహించే కుర్చీ కొట్లాట ఆదిత్య రాజకీయాలను లేకుండా అడ్డుకున్నప్పుడే ప్రజల ప్రయోజనాలు కాపాడుతాయి.

Relative Post

Newsletter