మోదీ నియంతృత్వ పోకడలు..
మోదీ నియంతృత్వ పోకడలు..
బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) ఢిల్లీ, ముంబాయి కార్యాలయాలపై ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నా యి. గత రెండు రోజులుగా బీబీసీ కార్యాలయంలో సోదాలు చేస్తూ, ఉద్యోగుల పనిని దిగ్బంధనం చేసి వారి సెల్‌ఫోన్లను లాక్కొని కార్యాలయాల్లోని రికార్డులను, వ్యాపార లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ఈ ఐటీ దాడులను తీవ్రంగా నిరసిస్తూ.. వీటిని కక్షపూరిత చర్యగా బీబీసీ ఖండించింది. ఈ మధ్య కాలంలో తమ సంస్థ రూపొందించిన ఇండియా: ది మోదీ క్వశ్చన్ అనే డాక్యుమెంటరీని విడుదల చేయటం మూలంగానే ఈ దాడులని బీబీసీ ప్రకటించింది. ఇదిలా ఉంటే... బీబీసీ కార్యాలయాలపై ఐటీ అధికారుల దాడులు, సోదాలకు మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సర్వే అని ముద్దుపేరు పెట్టింది! తమ పాలనా రీతులను విమర్శించిన వారిపై కక్షగట్టి దాడులకు తెగబడటం బీజేపీ ఒక విధానంగా అనుసరిస్తున్నది. ఇన్నాళ్లూ.. విపక్ష పార్టీ నేతలు, వారి సంస్థలు, హక్కుల సంస్థలు, మేధావులు, రచయితలు లక్ష్యంగా ఈడీ, ఐటీ దాడులు చేసి, కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేసిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా మీడియాను సైతం టార్గెట్ చేసుకోవటం మోదీ నియంతృత్వ రాజకీయాలకు పరాకాష్ట.
2002 గుజరాత్ మారణహోమం గురించి బీబీసీ ఇండియా: ది మోదీ క్వశ్చన్ డాక్యుమెంటరీని రూపొందించింది. ఇన్నేండ్లుగా ఎక్కడా ప్రస్థావించని ఓ ప్రభుత్వడాక్యుమెంటును ఆధారం చేసుకొని అందులోని విషయాలను ప్రస్థావిస్తూ ఈ డాక్యుమెంటరీ రూపొందించారు. ఇది నెల రోజుల కిందట యూకేలో రెండు భాగాలుగా ప్రదర్శించబడింది. ఆ డాక్యుమెంటరీలో గుజరాత్‌లో నరేంద్ర మోదీ రాజకీయ నేతగా, ముఖ్యమంత్రిగా ఎదిగిన క్రమం..., ఆ తర్వాత గుజరాత్ అల్లర్లు జరిగిన తీరు, అందులో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యపుపాత్రను పేర్కొన్నది. సంర్భానుసారంగా అనేక మంది ప్రముఖుల ఇంటర్వ్యూలున్నాయి. అందులో బీజేపీ నేతల అభిప్రాయాలుకూడా ఉన్నాయి. గుజరాత్ మారణకాండను ఈ డాక్యుమెంటరీ కళ్లకు గట్టింది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపింది.
బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై బీజేపీ నేతలు కన్నెర్ర జేశారు. అది పూర్తిగా వలసవాత మనస్తత్వంతో కూడుకొన్న శత్రుపూరిత దుష్ప్రచారం అని కొట్టిపారేసింది. అసహన రాజకీయాలకు మారుపేరైన మన బీజేపీ నేతలు అంతటితో ఆగలేదు. ప్రపంచంలో అత్యంత భ్రష్టమైన సంస్థ బీబీసీ అని అక్కసు వెళ్లగక్కారు. అంతే కాదు... ఆ డాక్యుమెంటరీ ప్రదర్శనను అడుగడుగునా అడ్డుకొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో డాక్యుమెంటరీ చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేశారు. డాక్యుమెంటరీ ప్రదర్శితం కాకుండా విద్యుత్తును తొలగించారు. బీజేపీ దాని అనుబంధ విద్యార్ధి సంఘం వారు విద్యార్థులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఢిల్లీలోనే కాదు దేశవ్యాప్తంగా... యూపీ, హైదరాబాద్, కేరళ తదితర ప్రాంతాల్లో డాక్యుమెంటరీని అడ్డుకున్నారు.
డాక్యుమెంటరీని అడ్డుకొని, బీబీసీని ఓ బ్రష్టసంస్థ అని నిందించారు సరే..., కానీ 2005లో... మత స్వాతంత్య్రాన్ని ఉల్లంఘించిన చర్యలకు బాధ్యుడిగా మోదీ వీసాను అమెరికా రద్దు చేసింది. గుజరాత్ మారణకాండ నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా ప్రకటించింది. మోదీ తమ భూ భాగంపై కాలుమోపటానికి వీలు లేదని తెగేసి చెప్పింది. కాలక్రమంలో కార్పొరేట్ల ప్రయోజనాల హామీలు ఎన్ని, ఏ స్థాయిలో లోపాయకారి ఒప్పందాలు కుదిరాయో.. కానీ ఆ తర్వాత కాలంలో ఆ వీసా రద్దును ఎత్తివేసి మోదీని ఆహ్వానించింది అమెరికా. కార్పొరేట్ సంస్థల లోగుట్టు పెరుమాళ్లకెరుక...!
ప్రపంచంలో నిబద్ధ జర్నలిజానికి మారుపేరుగా ఉన్న బీబీసీని బీజేపీ నేతలు అత్యంత బ్రష్టమైనదిగా నిందించటంలో వింతేమీ లేదు. గతంలోనూ ప్రభుత్వ పనితీరును ప్రశ్నించిన ఆక్స్‌ఫామ్, ఇతర సంస్థలపై కూడా మోదీ ప్రభుత్వం ఈ విధంగానే కక్షసాధింపు చర్యలకు పూనుకున్నది. 2014లో మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇలాంటి అసహన కక్షపూరిత దాడులు మితిమీరిపోయాయి. బీజేపీ సైద్ధాంతిక భావజాలాన్ని విమర్శించినందుకు పన్‌సారే, కలబుర్గీ, దబోల్కర్, గౌరీ లంకేశ్ లాంటి మేధావులను, రచయితలను హత్య చేశారు. మోదీ పాలనావిధానాలను వ్యతిరేకిస్తున్న వారిని కటకటాల పాలు చేశారు. నరేంద్రమోదీని హత్య చేయటానికి కుట్ర పన్నారన్న అభియోగంతో... భీమా కోరేగాం కుట్రకేసు పెట్టి దేశ వ్యాప్తంగా ఉన్న కవులు, కళాకారులను జైలుపాలు చేశారు. ఈ కుట్ర కేసులో ప్రఖ్యాత విప్లవ రచయిత వరవరరావు మొదలు సుధా బరద్వాజ్ దాకా 17 మంది మేధావులను అరెస్టు చేసి తమ అసహన రాజకీయాలను చాటుకున్నారు.
గుజరాత్ అల్లర్లు మొదలు, సీఏఏ, ఎన్ ఆర్‌సీ వ్యతిరేక ఉద్యమాలు, నిన్నమొన్న షహీన్‌బాగ్, రైతు ఉద్యమాల దాకా మోదీ ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలను తప్పుపడుతున్న ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థను కూడా మోదీ ప్రభుత్వం పనిచేయనీయటం లేదు. ఆమ్నేస్టీ కార్యకర్తలను, నేతలను కేసులు మోపీ జైల్లో పెట్టింది. తాజాగా మోదీ మిత్రుడు గౌతం ఆదానీపై హిండెన్ బర్డ్ రీసెర్చ్ రిపోర్టును ప్రకటించిన షార్ట్ సెల్లింగ్ సంస్థపై ఏ రూపంలో దాడులు చేస్తుందో చూడాలి.
గుజరాత్ మారణహోమంలో హిందుత్వ సంస్థల పాత్ర, మోదీ పేక్షక పాత్ర లేదనీ చెప్పదల్చుకుంటే.. ప్రఖ్యాత జర్నలిస్టు రానా అయూబ్ రాసిన గుజరాత్ ఫైల్స్ కు సమాధానం చెప్పాలి. లేదా హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్ అడిగుతున్న ప్రశ్నలకు మోదీ బదులివ్వాలి. ఇవేవీ చేయకుండానే... బీబీసీ డాక్యుమెంటరీని అడ్డుకొని నిజాన్ని మరుగు పర్చాలనే ఉబలాటం నెరవేరేది కాదు.
మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ ప్రస్తుత తీరు చూస్తే... ఎమర్జెన్సీకి ముందురోజుల్లోని ఇందిరాగాంధీ గుర్తుకొస్తున్నది. నాడు ఇందిరాగాంధీ తన సొంతపార్టీలోని నేతల మాటలు ఖాతరు చేయక, విమర్శలను భరించలేక తన అదికారాన్ని నిలుపుకోవటం కోసం ఏకంగా ఎమర్జెన్సీనే ప్రకటించారు. సరిగ్గా ఇప్పుడు మోదీ కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఎమర్జెన్సీ అని అధికారికంగా ప్రకటించ లేదు కానీ... నాటి ఎమర్జెన్సీ రోజులను తలదన్నే విధంగా హక్కుల హనానికీ, నిర్బంధ విధానాలకు మోదీ పాల్పడుతున్నారు. తెలుగు సమాజంలో ఉన్న ఓ సామెత అన్నట్లు... ఆరిపోయే ముందు దీపం మరింత దేదీప్యంగా వెలుగుతుందట! మోదీ తీరు కూడా అదే అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఎమర్జెన్సీ తర్వాత... ఇందిరాగాంధీకి పట్టిన గతే.. మోదీకి తప్పదని రాజకీయ విశ్లేషకులు అనటంలో అతిశయోక్తి లేదేమో.
-శ్రామిక