ముచ్చింతల్పై మమకారం..
ముచ్చింతల్పై మమకారం..
‘మేడారాని’కి బహుదూరం..
గిరిజన జాతరపై ఎందుకీ వివక్ష
ఆ ఉత్సవాలకెందుకు ప్రాధాన్యం
ప్రజా ‘ప్రతినిధుల’ తీరు ప్రశ్నార్థకం
వేకువ ప్రతినిధి: ఒకరి వ్యక్తిగత విశ్వాసాలను మరొకరు ఎవరైనా గౌరవించాల్సిందే. వారి విశ్వాసాలను వ్యక్తం చేయడాన్ని సైతం విమర్శించలేము. కానీ,ప్రైవేటు ఉత్సవాలకు ఇచ్చినంత ‘ప్రాధాన్యం’ ప్రభుత్వం నిర్వహించే జాతరపై లేక పోవడం పట్ల ఈ అనుమానం తలెత్తుతున్నది. ఎందుకంటే జాతర, ఉత్సవాలు అటుఇటుగా ఒకే సమయంలో వచ్చినప్పుడు వీరు దేనికి ప్రాధాన్యమిస్తున్నారనేది బహిర్గతం కావడం గమనార్హం. అందువల్ల ప్రజాప్రతినిధుల వ్యవహార శైలిని పలువురు ప్రశ్నిస్తున్నారు. అటువంటి పోల్చుకునే ప్రత్యేక స్థితి రాష్ట్రంలో తాజాగా నెలకొంది. అదే ప్రఖ్యాత మేడారం సమ్మక్క, సారలమ్మ గిరిజన మహా జాతర, ముచ్చింతల్లో రామానుజాచార్యులు సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ రెండు ‘ప్రధాన’ కార్యక్రమాలపై ప్రజాప్రతినిధుల వైవిధ్య స్పందన ఇక్కడ ప్రశ్నార్థకంగా మారిందనే చర్చ సాగుతున్నది. ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చి, జాతరను మరుగున పరచడంలో తేడా ఉందంటున్నారు.
మేడారం వర్సెస్ ముచ్చింతల్
ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలో విశిష్టాద్వైత మత ప్రవక్త చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్మించబడ్డ 216 అడుగుల ఎత్తుగల రామానుజాచార్యుల పంచలోహ విగ్రహాన్ని 108 దివ్య దేశాలను ఉద్ఘాటన చేయడానికి భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోమవారంతో ఈ సహస్రాబ్ది ఉత్సవాలు ముగిశాయి. ప్రఖ్యాత మేడారం గిరిజన జాతర 16వ తేదీన ప్రారంభమై 19వ తేదీన ముగియనున్నది. కాగా, దాదాపు నెలరోజుల క్రితమే మేడారం జాతర అనధికారికంగా ప్రారంభమైంది. ఒక విధంగా ముచ్చింతల్ ఉత్సవాల కంటే ముందే మేడారంలో భక్తుల సంరంభం ప్రారంభమైంది.
ప్రజా ‘ప్రతినిధుల’ తీరు ప్రశ్నార్థకం
రెండు ముఖ్యమైన కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి ప్రత్యేక సందర్భంలో ఎవరి తీరు ఏంటిదో? ఏ పార్టీ ఎలా వ్యవహరిస్తుందో? ఏ ప్రజాప్రతినిధి ఏ విధంగా స్పందించారో పోల్చుకునే పరిస్థితి నెలకొనడడం కొంత బాధాకరం. ఎందుకంటే ఒకటి అర సందర్భాలు మినహా పార్టీ నేతల స్పందన అంటే ఒక విధంగా ఆ పార్టీ విధానంగా భావించాల్సి ఉంటుంది. కానీ, ప్రజాప్రతినిధులు, ప్రముఖ స్థానాల్లో ఉన్న వారు రెండు కార్యక్రమాలపై భిన్నంగా వ్యవహరించడమే ఇక్కడ ఆక్షేపణీయం. సమాజానికి వారు ఏ సందేశాన్ని, ఏ మార్గదర్శనాన్ని చేస్తున్నారనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ విమర్శలపై సూటిగా సమాధానం చెప్పకుండా కప్పదాటు వ్యవహారంతో వ్యవహరించే వారెక్కువమంది ఉన్నా కళ్లెదుట కనిపించే నిజాన్ని ఎలా? కనుమరుగు చేయగలరని ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రపతి నుంచి ప్రధాని, సీఎం వరకు హాజరు
రెండో తేదీన మొదలైన రామానుజ ఉత్సవాలకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో పాటు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్షా, సీఎం కేసీఆర్తో పాటు సీఎల్పీ లీడర్ భట్టి సహా ఎందరో ప్రముఖులు, ప్రజాప్రతినిధులు సందర్శించారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖ స్థానాల్లో ఉన్న వారు క్యూ కట్టారు. ఉత్సవాలు ప్రారంభం కాబట్టి ప్రాధాన్యమిచ్చారనుకున్నా ఒక రకంగా ఇది మతపరమైన, ప్రైవేటు కార్యక్రమంగా భావించాల్సి ఉంటుంది. దాదాపు వెయ్యికోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టు పూర్తయ్యినట్లు చెబుతున్నారు. వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. సమతామూర్తిగా కీర్తిస్తున్న రామానుజార్యునికి, పీడితుల కోసం జీవితాన్ని అర్పించిన అంబేద్కర్ను పోల్చి ప్రధాని మాట్లాడడం గమనార్హం. అనేక మంది ప్రముఖ స్థానాల్లో ఉండి ముచ్చింతల్ కేంద్రంగా ప్రజలకు తమ సందేశాలిచ్చారు. సమాజానికి ఈ ప్రముఖలు తమ తీరు వల్ల ఏం చెప్పదలుచుకుకుంటున్నారని ప్రశ్నిస్తు వారికేం తక్కువలేరు.
గిరిజన జాతరపై వివక్ష?
ముచ్చింతల్లోని రామాజుని ఉత్సవాలు ప్రైవేటు కార్యక్రమమైనప్పటికీ, వేలాది మంది భక్తులు, ప్రముఖులు హాజరవుతున్నారనే కారణంగా అక్కడ విస్తృత స్థాయి ఏర్పాట్లు చేశారు. భారీ బందోబస్తు కల్పించారు. ఏకంగా పలువురు మంత్రులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఎం కేసీఆర్ కూడా ప్రారంభానికి ఒక రోజు ముందు స్వయంగా సందర్శించి పరిస్థితి సమీక్షించారు. ఉత్సవాల ప్రాధాన్య రీత్యా ఈ స్థాయి ఏర్పాట్లు తప్పవనుకుందాం. కానీ, ఆసియా ఖండంలోని అతిపెద్ద, గిరిజన మహా జాతర ఏర్పాట్లపై కూడా ఇదే స్థాయి శ్రద్ధ వహించాలి కదా? అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. పైగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే జాతర, రాష్ట్ర జాతరగా గుర్తించారు. జాతీయ స్థాయిలో జాతరగా గుర్తించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. పైగా కోటి 50లక్షల మంది భక్తులు వచ్చే జాతరగా అంచనా వేశారు. రెండేళ్ళకోసారి జరిగే ప్రత్యేక జాతర. రూ. 75 కోట్ల నిధులు రాష్ట్రం కేటాయించింది. తాజాగా కేంద్రం రూ.2.50కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రకటించారు. పనులను రాష్ట్రస్థాయి మంత్రులు కొన్ని సార్లు సమీక్షించారు. జాతరకు ఈ నెల 18న సీఎం కేసీఆర్ వస్తున్నారని సమాచారం. కానీ, తమ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఈ జాతర పనులను, ఏర్పాట్లను సీఎం స్థాయి వ్యక్తులు ప్రత్యక్షంగా ఎందుకు సమీక్షించరని ప్రశ్నిస్తున్నారు. ముచ్చింతల్ ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న జాతీయ స్థాయి ప్రజాప్రతినిధులు దేశంలోనే ముఖ్యమైన గిరిజన మేడారం జాతరను తొంగిచూడకపోవడంలో ఔచిత్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఆ ఉత్సవాలపై ఉన్న శ్రద్ధ, ‘గిరిజన’ జాతరపై లేదా? అంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే సీతక్క తప్ప, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు, పార్టీల నేతలెందుకు ఈ మేడారం ప్రగతి పనులపై పర్యవేక్షణ కనబరచరని ప్రశ్నిస్తున్నారు. ఏపార్టీ అయినా ప్రముఖులు, ప్రజాప్రతినిధుల తీరుపట్ల ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.