అద్భుతాల్లేవు​.. అచ్చేదిన్​ రాదు!

మోడీ పాలనలో వికసించని ‘సబ్​ కా వికాస్’​

నినాదాలే తప్ప ‘‘నిండు అభివృద్ధి’’ ఏది?

ఎనిమిదేళ్లయిన కనిపించని మార్పులు

ఐదు రాష్ట్రాల ఫలితాల ప్రభావం పై అందరి చూపు


వేకువ ప్రత్యేక ప్రతినిధి: ఎనిమిదేళ్లలో మోదీ సర్కార్‌ సాధించిన అభివృద్ధిపై  ఇప్పటికే చాలా చర్చ జరిగింది.  స్మార్ట్‌ సిటీల నుంచి మేక్‌ ఇన్‌ ఇండియాల వరకూ, అవినీతి నుంచి నల్లధనం నిర్మూలన వరకూ, అచ్చేదిన్‌ నుంచి సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌ వంటి నినాదాల వరకూ మోదీ అద్భుత ఫలితాలు సాధించి గనుక ఉంటే దేశ పరిస్థితులు మరోలా ఉండేవి.  ఇవన్నీ పోయి ఇప్పుడు ఆత్మనిర్భర్​ భారత్​  నినాదం వచ్చింది. నినాదాలే తప్ప జనానికి ఒరిగిందేమీ  కనిపించడం లేదు. మోడీ నినాదాలపైనా ప్రజల్లో విశ్వసనీయత సన్నగిల్లుతోంది. కొంతకాలంగా సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ భారీ ఎత్తున సీట్లు కోల్పోతుందనే చర్చలు సాగుతున్నాయి. సర్వేలు కూడా ఇందుకు అనుకూలంగానే ఉన్నాయి. తాజాగా ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైనా మోడీ పాలనా ప్రభావం తప్పకుండా పడుతుందనడంలో సందేహం లేదు. 

విపక్షపార్టీలన్నీ జతకట్టి ముందుకు సాగి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి. కానీ విపక్షాల్లో అనైక్యత కూడా మోడీకి కలసి వస్తోంది. మోదీ స్థానంలో బీజేపీ నుంచి వివిధ పక్షాలు ఆమోదించగలిగిన మరో ప్రత్యామ్నాయ నేత రంగంలోకి వస్తారనే ఆశలులేవు. మోడీ వైఖరి, స్వభావం, కక్షసాధింపు ధోరణి వల్ల ప్రతిపక్షాలే కాదు, స్వపక్షాలు కూడా ఆయనను వ్యక్తిగతంగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకించే పరిస్థితి ఏర్పడింది. మోడీ తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాల వల్ల కలిగిన దుష్ప్రరిణామాలను ప్రజలు ఇంకా అనుభవిస్తుంటే, దాంతో దేశానికి మేలు జరిగిందని ఇంకా బూటకపు  ప్రచారం చేసుకుంటున్నారు.  ఇది కూడా  ప్రజల్లోనే కాకుండా స్వపక్షంలోనూ వ్యతిరేకత వస్తోంది.  గడ్కరీ లాంటి వారు నర్మగర్భంగా విమర్శలు చేస్తున్నారు.  జైషే మహమ్మద్‌, లష్కర్‌ ఏ తోయిబా సంస్థలకు పాక్‌ నుంచి ప్రోద్బలం అందుతూనే ఉన్నది.  ముఖ్యంగా ప్రభుత్వానికీ,  కశ్మీర్‌ ప్రజలకూ మధ్య గతంలో ఎన్నడూ లేనంతగా దూరం పెరిగింది. ఉగ్రవాదులకు ప్రజల మద్దతు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నది. అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని ఖండించేందుకు అన్ని దేశాలు ముందుకు వస్తాయి కాని పాకిస్థాన్‌తో యుద్ధం చేయాల్సి వస్తే ఎన్ని దేశాలు భారత్‌కు అండగా నిలుస్తాయో  లేదో ముందు తేల్చుకోవాల్సి ఉన్నది. మోడీ పాలనపై ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. దీనికి ఏ విధంగా ముగింపు పలుకుతారని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. 

దేశంలో సమస్యలను పరిష్కరించడంలో రాజకీయ నాయకులు విఫలం కావడం వల్లనే దేశం ఎప్పుడూ అస్థిరంగా మారుతోంది. అత్యధిక మెజారిటీతో బీజేపీని ప్రజలు రెండుసార్లు ఎన్నుకున్నప్పటికీ దేశంలో స్థిరత్వం సాధించడంలో, వివిధ రాష్ట్రాలను, ముఖ్యమంత్రులను, మెప్పించడంలో, అందరికీ ప్రయోజనకరమైన విధానాలను అమలు చేయడంలో మోడీ విఫలం అయ్యారు.  ముఖ్యంగా దేశాన్ని ఒకే తాటిపైకి తేవడంలో సఫలం కాలేకపోతున్నారు. అందుకు కావల్సిన సామరస్య  దృక్పథాన్ని అనుసరించే బదులు ఆధిపత్య ధోరణిని అనుసరిస్తున్నారు. అధికారమే ధ్యేయంగా వ్యవహరిస్తూ ప్రత్యర్థులను నాశనం చేయడం లక్ష్యంగా పనులు చేస్తున్నారు. నిజానికి నరేంద్రమోడీకి ముందు కాంగ్రెస్‌ నేత ఇందిరాగాంధీకి కూడా అంతే ఆకర్షణ, అంతే మెజారిటీ లభించింది. అయితే ఆమె ఒక నియంతగా వ్యవహరించడం మూలంగా దేశంలో అస్థిరత ఏర్పడింది. ఆ సమయంలో ఇందిరాగాంధీ నిరంకుశ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేసిన ఒక శక్తిగా జనతాపార్టీ ప్రభవించింది. ఆనాడు ప్రతిపక్ష పార్టీలను కలిసికట్టుగా ఒకే వేదికపైకి తేవడంలో లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఉద్యమం ఒక శక్తిమంతమైన ఉత్పేర్రకంగా పనిచేసింది. కానీ నేతల్లో స్వార్థ కారణంగా అది విఫలం అయ్యింది. 

ఇప్పుడు కేసీఆర్‌ లేదా మమతా బెనర్జీ లేదా మరొకరు కావచ్చు ఈ తరహా ఐక్యత సాధిస్తారన్న నమ్మకం లేదు.  వీరికి ఒక స్థిరమైన, సంస్థాగత ఏర్పాటు ద్వారా ప్రభుత్వ పాలనకు ప్రజలు కోరుకుంటున్న ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించకపోతే ఉద్యమ లక్ష్యాలులేవు.  ఉమ్మడి కార్యక్రమం ద్వారా, ఒకే ఎన్నికల గుర్తింపు ద్వారా,  ప్రత్యామ్నాయాన్ని రూపొందించాలన్న సంకల్పం కూడా కానరావడం లేదు.  అందుకే మోడీ శిబిరంలో కేసీఆర్‌ యత్నాలు పెద్దగా కదలికచూపడం లేదు. అలాగే మోడీని మరింత నిరంకుశంగా చేస్తాయనడంలోనూ సందేహం లేదు.

Relative Post

Newsletter