ఆదివాసీల జోలికి వెళ్తే సహించేది లేదు: మంత్రి సత్యవతి రాథోడ్

ఆదివాసీల జోలికి వెళ్తే సహించేది లేదు

అడవిపైనే వారి జీవనాధారం 

మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్: ఆదివాసీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటాం. భద్రాద్రి జిల్లాలో ఆదివాసీలపై జరిగిన దాడిపై వెంటనే సమగ్ర విచారణ జరపాలని అధికారులను  రాష్ట్ర మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకల పల్లి మండలంలో రాచన్న గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివాసీ గూడెం, సాకివాగుకు చెందిన  ముగ్గురు ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ బీట్ గార్డులు అమానుషంగా ప్రవర్తించారన్న సంఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. వెంటనే ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్ లను ఆదేశించారు. ఆదివాసీ మహిళలకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి అన్ని విధాల న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే అడవిలో జీవనాధారం నిమిత్తం అటవీ ఉత్పత్తుల కోసం వెళ్లే ఆదివాసీల జోలికి వెళ్లొద్దని పలుమార్లు హెచ్చరించామన్నారు. అయినా కొంతమంది ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, వారిని ఉపేక్షించేది లేదన్నారు. మంత్రి ఆదేశాలతో స్పందించిన అధికారులు వెంటనే విచారణ ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటిడిఏ ప్రాజెక్టు అధికారికి దీనిపై వెంటనే విచారణ చేసి వివరాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

Relative Post

Newsletter