‘రాజ్యాంగ’ చర్చను ఆహ్వానిద్దాం సరే
‘రాజ్యాంగ’ చర్చను ఆహ్వానిద్దాం సరే!
– మరి ఏ దిశానిర్ధేశంలో పయనిద్దాం?
– ఇది కదా! తేలాల్సిన అసలు అంశం!
– ప్రస్తుత ఈ స్థితికి ప్రధాన కారకులెవరు?
– ఈ అంశం పై ‘వేకువ’ చర్చకు ఆహ్వానం
వేకువ ప్రత్యేక ప్రతినిధి:
ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష రాజకీయ వర్గాల్లో ‘ రాజ్యాంగం’ తీవ్రమైన చర్చకు తెరలేపింది. రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాలకు చేతినిండా పని కల్పించింది. ఈ వేడివేడి రాజకీయం ఎటు వైపు దారి తీస్తుందనే ఆసక్తికరమైన చర్చ సాగుతున్నది. ఈ నేపథ్యంలో ‘రాజ్యాంగం’ పై విశ్లేషనాత్మక కథనం. వ్యక్తిగతంగా ఎవరికేం అభిప్రాయాలున్నా రాజ్యాంగమేమి జడ పదార్ధం కాదు. రాజ్యాంగ రచనలో అత్యంత కీలక భూమిక పోషించిన మహనీయుడు, ప్రముఖ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన కూడా అదికాదు. రాజ్యాంగమనగానే అంబేద్కర్ పాత్ర అద్వీతయమైనప్పటికీ దీన్ని పూర్తి సెంటిమెంట్ అంశంగా చూడాల్సిన అవసరం లేదు. దేశ స్వాతంత్ర్య అనంతరం భారత దేశ అవసార్ధం రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ఇదంతా మన కళ్ళముందున్న చరిత్రే. 1950 జనవరి 26న రాజ్యంగాన్ని ప్రజలకు అంకితం చేసి గణతంత్రంగా ప్రకటించుకున్న రోజు. దీనికి ముందు దేశంలో బ్రిటీష్ చట్టాలు అమలు చేశారు. దీని రూపం, లక్ష్యం వేరు. తర్వాత మనం తెచ్చుకున్న రాజ్యాంగం దానికి భిన్నమైనదని గుర్తించాలి. రాజ్యాంగం పై చర్చ చేయాలంటే అమల్లోకి వచ్చిన ఈ 72 యేళ్ళ అనుభవాన్ని, నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించాలి. 2018 జనవరి నాటికి భారత రాజ్యాంగంలో 123 సవరణ ప్రతిపాదనలు, 101 సవరణ చట్టాలు జరిగాయి. ఇప్పటికీ ఇంకా కొన్ని ప్రతిపాదిత దశలో ఉన్నాయి. అంటే దీనర్ధం 72 యేళ్ళ క్రితం రాసుకున్న రాజ్యాంగం యథాతథ స్థితిలో లేదనేది కూడా నిష్టూర వాస్తవం. అవసరార్ధం దానికి పాలకులు సవరణలు చేస్తున్నారు. ఇందులో 42వ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో ‘సామ్యవాద, లౌకిక, గణతంత్ర’ అనే పదాలను సైతం చేర్చారు. ఈ సవరణను మినీ రాజ్యాంగ సవరణగా చెప్పుకోవడం గమనార్హం. అందుకే ప్రస్తుత స్థితిలో ‘కొత్త రాజ్యాంగ’ చర్చకు అనివార్యంగానే ప్రాధాన్యత కల్పిస్తున్నారు. అందువల్ల కేసీఆరో, మరెవరో ఈ అంశం తెరపైకి తేగానే ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికిప్పుడు ఇది కార్యరూపం దాల్చక పోయినా ఈ డిమాండ్ రానున్న రోజుల్లో ఏ మేరకు అంటే పాక్షికమా? పూర్తిగా అమల్లోకి వస్తుందా? అనేది భవిష్యత్‌లో మాత్రమే తేలనున్నది. ఈ అనుభవంతో పరిశీలిస్తే కొత్త సమస్యలు, కొత్త ఆలోచనలు ఉత్పన్నమైతే వాటికి పరిష్కారం చూపేందుకు నిజంగానే అవసరమైతే మరిన్ని రాజ్యాంగ సవరణలు ? లేక కొత్త రాజ్యాంగ రచన కూడా అనివార్యంగా ముందుకు రావచ్చు. తెచ్చేదైనా లక్ష్యమేమిటనేదే ఇక్కడ ప్రాథమిక ప్రశ్న.
చర్చకు తెరతీసిన కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పుకున్నట్లు 50 యేళ్ళ రాజకీయ, ప్రజా జీవితానుభవం నుంచి కొత్త రాజ్యాంగం రాయాలనడంలో తప్పేమీ లేదు. దాని కోసం దేశమంతటా చర్చ జరగాలనడంలోనూ అభ్యంతరం అవసరం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘కొత్త’ రాజ్యాంగ డిమాండ్ సాహసోపేతమైన అంశమే. అయితే దేశ అవసరాలకు కొత్త రాజ్యంగం అవసరమా? ప్రస్తుత రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేయాలా? కొన్ని సవరణలు అవసరమైతాయా? అనేది చర్చనీయాంశం. ఎందుకంటే ఈ 72 యేళ్ల అనుభవంలో అనేక రాజ్యాంగసవరణలు జరిగాయి. అయినప్పటికీ రాజ్యాంగ ప్రాథమిక రూపం మారలేదనేది ఒక వాస్తవం. ఈ నేపథ్యంలో తరచూ సవరణలెందుకు కొత్త రాజ్యాంగ రచన చేసుకోవచ్చు కదా? అనే ప్రశ్న వ్యక్తమవుతుంది. ఈ కారణంగానే కొత్త రాజ్యాంగం అనే అంశం సున్నితమైనది. సంక్లిష్టమైనదే కాదు. సంయమనంతో ఓర్పు, నేర్పుతో ప్రాథమిక లక్ష్యాలకు భంగం కలుగకుండా ఆచితూచి చేపట్టాల్సిన బృహత్తర కర్తవ్యం. అచరణలో ఆషామాషీ వ్యవహరం కూడా కాదు. ఎందుకంటే భారతావనికి సంబంధించిన విషయంలో అనేక సంక్లిష్టతలే కాదు. ప్రత్యేకతలు ఉన్నాయనే విషయం విస్మరిస్తే తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ఈ ఎరుకతో రాజకీయ పక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంది.
ప్రశ్నకు నేపథ్యమేమిటీ?
ఏ రాజకీయ నేపథ్యంలో కేసీఆర్ కొత్త రాజ్యాంగం పై ప్రశ్నిస్తున్నారనేది ప్రధానమైన అంశం. ఇక్కడొక విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో అనేక విషయాలు మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రాల మధ్య ‘సంబంధాలు’ అనే ప్రాథమిక అంశంలో తీవ్రమైన పొరపాట్లు సాగుతున్నాయనే నేపథ్యంలో ఈ ‘కొత్త రాజ్యంగం’ డిమాండ్‌ను కేసీఆర్ ముందుకు తెచ్చారని భావించాలి. కానీ, ఇక్కడే కొత్త రాజ్యాంగం పై స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన కేసీఆర్ చెప్పకుండా ప్రశ్నవేసి తప్పించుకున్నారు. ప్రశ్నించాల్సిన వారు సైతం కేసీఆర్ మార్కు ఉచ్చులో చిక్కుకున్నారు. ఏ నేపథ్యంలో, ఏ కోణంలో, ఎవరి హితార్ధం కొత్త రాజ్యాంగ డిమాండ్ అవసరమని భావిస్తున్నారంటూ కేసీఆర్‌ను ప్రశ్నించాల్సి ఉండే. ఈ చర్చను ప్రారంభించిన కేసీఆర్‌కు వివరణాత్మకంగా ఆయన చెప్పాల్సిన అవసరం ఇప్పటికైనా ఉంది. ఇది చేయకుండా చర్చను గాలిలో పెట్టారు. వివరంగా దీనికి కేసీఆర్ తన కోణాన్ని వివరిస్తే చర్చకు మరింత అవకాశం ఉండేది. కానీ, ఆ అవకాశం ఇవ్వకుండా తగిలించి తమాషా చూసినట్లు వ్యవహరించారు. విషయం పై వ్యతిరేకత నెలకొంటే తన మాట నుంచి తప్పుకునేందుకు కేసీఆర్‌కు అవకాశం ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఆయన మాట్లాడిన సందర్భం నుంచి ఈ ప్రశ్నలేవనెత్తారనేదానికే ప్రస్తుతానికి మనం పరిమితం కావాల్సి ఉంటుంది. రేపు మనమనుకున్నదాన్ని ఆయన రంగంలోకి దిగి ‘నా ఉద్దేశ్యం’ ఇది కాదన్నా ఏం చేయలేం? ఎందుకంటే ఈ అవకాశాన్ని తన చేతుల్లోనే పెట్టుకున్నారు. ఇక ఇలాంటి విషయాల్లో కేసీఆర్ దిట్ట అనే విషయం కూడా కాదనలేము. విపక్షాల ప్రశ్నలకు కేసీఆర్ కాకుండా కడియంలాంటి ‘దళిత’ లీడర్లను రంగంలోకి దింపడం గమనార్హం. ఇదిలా ఉండగా ముందుగా కేసీఆర్ జనంలోకి ఒక అంశాన్ని వదిలి తమషా చూస్తారనేది ఇప్పటికే అనేక విషయాల్లో తేలింది.
చర్చకు దిశా నిర్ధేశం అవసరం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త రాజ్యాంగ ఆవశ్యకత ఏ ‘లక్ష్యం’ కోసం మాట్లాడినా చర్చ ఏ విధంగా ఉండాలనేది ప్రధానమైనది. ఎందుకంటే కొత్త రాజ్యాంగ రచన అనేది తాజాగా కేసీఆర్ ఒక్కడే లేవనెత్తిన సమస్యేమీ కాదు. దీనికి చాలా రోజుల క్రితమే ప్రత్యేక ‘శక్తులు’ పాదులు వేశాయి. దీనికి ఎన్డీయే హయంలో చర్చ ప్రారంభమైంది. ఇక స్వాతంత్ర్యానంతరం రాజ్యాంగ రచన సందర్భంగానే పూర్తిగా వ్యతిరేకించే శక్తులు ఉన్నాయి. ఈ శక్తుల రహస్య ఎజెండాలో మనుధర్మం అధికారిక రాజ్యంగంగా ఉండాలనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. ఇప్పటికీ ఈ ఆలోచన ఒక పాయగా నేటికీ కొనసాగుతున్నది. దీని నీలినీడలు అప్పుడప్పుడు మనకు కన్పిస్తూనే ఉన్నాయి. అందుకే నూతన రాజ్యాంగ డిమాండ్‌లో అనుకూల, ప్రతికూల రెండు భిన్నమైన కోణాలతో పాటు యథాతధస్థితి కొనసాగించాలనే మూడవ వాదనకు తావు ఉంది.
కొత్త గొంతుకైతారా?
తాజాగా కొత్త రాజ్యంగ రచన ప్రశ్న లేవనెత్తిన కేసీఆర్ తెలిసో తెలియకో అంతకు ముందు చర్చకు తెరతీసిన వారికి కొత్త గొంతుగా మారనున్నరా? అనే అనుమానాలు అప్పుడే ముసురుకుంటున్నాయి. ఇందులో ఎదైనా రహస్య ఎజెండా దాగి ఉందా? పాలక పక్షాల్లోని కొందరి ‘లక్ష్యం’ ప్రస్తుత రాజ్యంగమా? అనే ప్రశ్న ఊపందుకున్నది. ఫలవంతమైన చర్చ దిశగా తీసుకపోవడమనేది ప్రధానం. ఇందులో భాగస్వామ్య శక్తుల పాత్ర లేకుండానే చర్చ సాగే కుట్రకు అవకాశాలూ లేకపోలేదు. కేసీఆర్‌కు రాజ్యాంగం పైన ప్రశ్నించే హక్కు ఉన్నా? ఆయన నైతికత, ఆచరణ అనివార్యంగా ఈ చర్చల్లోకి వస్తుంది.
అగ్నిపరీక్షకు ఆచరణ
కేసీఆర్ తన రాజకీయ, ప్రజాజీవితంలో అణగారిన వర్గాల హక్కుల సాధన, రక్షణకు ఏ మేరకు కృషి చేశారనేది ఇక్కడ ప్రశ్నార్ధకమే? ప్రధానంగా ముఖ్యమంత్రిగా ఆయన పాలన తీరు చర్చకు వస్తుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఆయన రాజ్యాధికారంలో కల్పించిన స్థానం, దళిత ముఖ్యమంత్రి నినాదం, మూడెకల భూమి, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, బీసీలకు, మైనార్టీలకు, మహిళలకు సముచిత స్థానం ఇవన్నీ చర్చకు వస్తాయి. ఒకరకంగా కేసీఆర్ ఆచరణ ఎజెండాపైకి వస్తుంది. రాష్ట్రంలో ఆయన ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రతిపక్ష పార్టీల నుంచి ఫిరాయింపులు ఇవన్నీ రాజ్యంగలో భాగమే కదా? తన పరిధిలో అవకాశం లభించినపుడు రాజ్యాంగ హక్కుల అమలుకు తానేమి చేశారనేది ఇక్కడ గీటురాయిగా మారుతుంది. విసిరే ఈ రాళ్ళ దెబ్బల నుంచి కేసీఆర్‌తో సహా ఈ సందర్భంగా ఈ రాజకీయ పక్షం అంత సులభంగా తప్పించుకోలేరు.
‘కట్టిపడేస్తున్న’ సెంటిమెంట్
రాజ్యాంగ రచన అంబేద్కర్ అనితరమైన కృషిని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. రాజ్యాంగంతో అంబేద్కర్‌ను ముడివేసి సెంటిమెంట్‌గా భావించడం తప్పు కాదు. అన్ని సమయాల్లో ఈ సెంటిమెంట్‌కే పరిమితమైతే అంబేద్కర్ ఏ వర్గాలు, కులాల కోసం పనిచేశారో వారికి వ్యతిరేక శక్తులు నష్టం చేసే ప్రమాదాన్ని పసిగట్టాల్సి ఉంది. ప్రస్తుతం ‘రాజ్యాంగం’ అనే అంశం మంచికో చెడుకో చర్చ జరుగుతున్నపుడు ఈ పాత్రను సముచితంగా నిర్వహించి అంబేద్కర్ ఆలోచనను ఎత్తిపట్టే విధంగా అత్యంత జాగరూకతతో వ్యవహరించి ప్రత్యర్ధి ఎత్తులు చిత్తుచేయాల్సి ఉంటుంది. రాజ్యంగం పై అంబేద్కర్ కలలు, పొందుపరచలేని అంశాలు ప్రాధామ్యాలుగా చర్చ జరిగే విధంగా అందులో పాత్రదారులు కావాల్సిన సందర్భం తలెత్తింది. పాలకుల ద్వంద నీతిని నిలదీసేందుకు వినియోగించుకోవాలి. అంబేద్కరిస్టులు, ప్రజాస్వామిక వాదులు ‘సెంటిమెంట్’కు గురైతే నష్టం వాట్టిల్లే ప్రమాదం ఉంది.
ముఖ్య మూడు వాదనలు
ప్రస్తుతం అమలైతున్న రాజ్యంగంలోని అణగారిన వర్గాలు, కులాలు, జాతులు, మతాలు, వనరులపై ఆధిపత్యానికి పటిష్టమైన విధానం అమలు చేయాలనే పార్టీలు, సంస్థలు, సంఘాలు, వ్యక్తులు అనేక మంది ఉన్నారు. ప్రస్తుత రాజ్యాంగాన్ని మెజార్టీ మతప్రాతిపదికన, సనాతన మనుధర్మానికి ప్రతి రూపంగా ఉండాలనే భిన్నమైన అభిప్రాయంతో మరి కొందరున్నారు. ప్రస్తుత రాజ్య్యాంగాన్ని యథావిధిగా అమలు చేయాలనే వారున్నారు. ఈ వాదనల పై చర్చించాలంటే ప్రాథమికంగా ఒక స్పష్టత అవసరం.
నిజాయితీ సమీక్ష అవసరం
రాజ్యాంగం పై చర్చకు ముందస్తుగా చాలా అంశాల పైన స్పష్టత అవసరం. అనుకూల, ప్రతికూల విషయాల పైన లోతైన చర్చ అవసరం. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు, అమలు, అనుభవాలు, గుణపాఠాలపై సమీక్షించాల్సిన చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్య, అణగారిన శక్తుల పాత్ర గణనీయంగా ఉండాల్సిన అసవరం ఉంది. ఈ శక్తుల ఒత్తిడి ఫలితంగా రాజ్యాంగంలోని హక్కుల అమలు, కొత్త హక్కుల సాధనకు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం దేశంలో ఇటాంటి చర్చకు సానుకూ పరిస్థితి ఉందా? చర్చలో అవకాశం కల్పిస్తారా? అనే ప్రశ్నలు, ఉప ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై ఒక అంచనాకు రాకుండా, ఎదురయ్యే చిక్కుముళ్ళు విప్పకుండా ముందుకు సాగడం కష్టం. తేనెతుట్టెను కదపడంలాంటిదే. రాజ్యాంగ రచన సందర్భంలో సాక్షాత్తు అంబేద్కర్ అనేక అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నారు. ఇక ప్రస్తుతస్థితిలో నూతన రాజ్యాంగ డిమాండ్ అంటే నల్లేరు మీద నడకేం కాదు. అన్నింటికన్నా ముఖ్యమైనది ఏ దిశానిర్ధేశంలో చర్చ సాగాల్సి ఉంటుందనేది ప్రధానమైనది. ఈ దిశగా రాజకీయ చర్చను తీసుకపోవాల్సి ఉండగా, భిన్నమైన చర్చ సాగడం దురదృష్టకరం. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందు పరిచిన లక్ష్యాలు సక్రమంగా లేవా? అమలు చేయడంలో నిర్లక్ష్యమా? ప్రణాళిక బద్ధంగా హక్కులను డొల్లగా మారుస్తున్న తెలివైన ‘పక్షాలు’ తప్పుదోవ పట్టిస్తుంటే బాధిత పక్షాలు వత్తాసు పలుకుతున్నాయి.
పార్టీలు వేరు మాటొక్కటే
రాజ్యాంగంలో హక్కులు, అంబేద్కర్ సూచించిన లక్ష్యాల అమలు మాట్లాడకుండా బీజేపీ లీడర్లు ‘భారీ విగ్రహం’ ఏర్పాటు ఏమైందని ప్రశ్నించడం ఇక్కడ గమనార్హం. రాజ్యాధికారంలో బీసీలకు ఎందుకు ఇంకా సముచిత స్థానం ఏర్పడలేదనే విషయాన్ని ఈ బీసీనేత ప్రశ్నించకపోవడం విశేషం. రాజ్యంగ పునాదులు పెకిలిస్తూ, అణగారిన ప్రజల హక్కులను, రాష్ట్రాల హక్కులను హరిస్తూ, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ ఏకపక్ష, నియతృత్వ విధానాలను అమలు చేస్తున్న బీజేపీతో సహా పార్టీలు ఏవైనా అంశాలు ఇక్కడ చర్చనీయాంశాలు. 72 యేళ్ళ రాజ్యాంగం అమలు తర్వాత కూడా దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, మైనార్టీల హక్కులకు ఎందుకు భంగం కలుగుతుందో? రాజ్యాంగ స్ఫూర్తి అమలు కాకుండా దశాబ్దాల కాంగ్రెస్‌పాలనలో ఏ విధంగా ఏకపక్షంగా వ్యవహరించిందో జవాబుదారీ తనం లేకుండా ప్రజల ఈ స్థితికి తమ పార్టీ ఏ మేరకు కారణమో కనీస పత్తాపం లేకుండా కాంగ్రెస్ నేతలు మాట్లాడడం విడ్డూరం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆయనందించిన స్ఫూర్తితో ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించాల్సిన బహుజన సమాజ్ వాదీ పార్టీ నేత ‘మార్చకూడని వస్తువు’గా సెంటిమెంట్‌కు మాత్రమే పరిమితం కావడం విమర్శనీయం. ఈ సందర్భంలో అవకాశవాద పాలకుల గుట్టును నిలదీయాల్సిన అవసరం ఉంది. దీన్ని విస్మరించి ‘అంబేద్కర్’ సెంటిమెంట్ రగల్చడం వల్ల ప్రయోజనం లేదు. దేశంలో, రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులను కాలరాచి, అణగారిన ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన అవసరం మరోసారి తెరపైకి వచ్చింది.
ఉన్న హక్కులకు తూట్లు
అనేక ఒత్తిళ్ళు, సంఘర్షణ నేపథ్యంలో అంబేద్కర్ అందించిన రాజ్యాంగంలోని హక్కులకు పాలకులు దశాబ్దాల కాలంలో తూట్లు పొడుస్తూ వచ్చారు. ఏడున్నర దశాబ్దాల స్వాతంత్రం, ఏడు దశాబ్దాల గణతంత్రంలో పాలకులు తమ స్వభావాన్ని మార్చుకోకుండా ప్రాథమిక హక్కులు, సమానత, స్వేచ్చ, వనరుల పంపకం, తదితర అనేక అంశాలకు తిలోదకాలిస్తూ ఒక్కో హక్కును కాలరాస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని నాశనం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని డొల్లగా మార్చారనే విమర్శలున్నాయి. నల్లచట్టాలు, విదేశీ పెట్టుబడుల ఆధిపత్యం, అణగారిన వర్గాలకు రాజ్యాధికారంలో అవకాశంలేక, నిమ్న వర్గాలను బిచ్చగాళ్ళుగా చూడడం, కుల, మత వివక్ష, అణచివేత, నల్ల చట్టాల రూపకల్పన, విచ్చలవిడి రక్తపాతం, ఎమర్జెన్సీ లాంటి చీకటి కాలన్ని ఉదహరిస్తున్నారు. తాజాగా రాష్ర్టాల హక్కులన్ని అణచివేతకు గురైతున్న ప్రస్తుత కాలాన్ని ప్రశ్నిస్తున్నారు.
సూటి ప్రశ్నలు
రాజ్యాంగంలోని హక్కులు, విప్లవాత్మక స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ కొత్త రాజ్యంగాన్ని కొరుకోవడంలో మర్మమేమిటనే ప్రశ్న ఉదయిస్తున్నది. ఈ డిమాండ్ వెనుక ఉద్దేశ్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ దుర్మార్గాలన్నింటిని కొనసాగించే సాధికారిత కావాలనుకుంటున్నారా? నిజమైన ప్రజా హక్కుల అమలుకు అండగా నిలవాలనుకుంటురా? అనేది కీలకమైంది. అయితే రాజ్యాంగంలోని హక్కుల ‘అమలు, ఆచరణ, చిత్తశుద్ధి, నిజాయితీ’ తదితర అంశాలు తప్పక చర్చకు వస్తాయి. పాలక పక్షాల ఆచరణ గీటురాయిగా మారుతుంది. ఈ అంశంలో ఏ రాజకీయ పక్షం నిజాయితీగా వ్యవహరించిందనేది పెద్ద ప్రశ్నార్ధకం. ప్రస్తుత దేశ రాజకీయ, ఆర్ధిక పరిస్థితికి, కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు తలా పాపం తిలా పిడికెడు అనేరీతిలో వారి భాగస్వామ్యం ఉందనేది చరిత్ర చెబుతున్న చేదు వాస్తవం.
అప్రమత్తత అవసరం
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామిక శక్తులు, అణగారిన వర్గాలు, కులాలు, అణచివేతకు గురైతున్న సమూహాలు చైతన్యవంతమైన పాత్ర నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉంది. అప్పుడే రాజ్యాంగంలో ఉన్న హక్కుల అమలు, సాధించుకున్న హక్కుల పరిరక్షణ, నూతన హక్కుల సాధనకు అవకాశం లభిస్తుందనేది ఆచరణ తేల్చిన వాస్తవం. ఈ భౌతిక పరిస్థితే ప్రస్తుత రాజ్యాంగాన్ని అంకిత భావంతో అమలు చేసేందుకు, నూతన హక్కులు సాధించేందుకు దోహదం చేస్తుందనేది చరిత్ర చెబుతున్న గుణపాఠం. రాజకీయ పక్షాలు ఏ ‘ఉద్ధేశ్యం’ ఏ ఎజెండా? ఏ రహస్య కార్యాచరణతో కొత్త రాజ్యాంగ డిమాండ్ తెచ్చినా ప్రజాస్వామిక శక్తులు అప్రమత్తతతో వ్యవహరించి ప్రజానుకూల హక్కుల సాధనకు, ఇప్పటి వరకు చేసిన నష్టాన్ని లెవనెత్తే ప్రజాస్వామిక ఉద్యమానికి పాదు కొల్పాల్సిన బాధ్యత ఉంది. లేకుంటే స్వార్ధపూరిత ఆలోచనతో పన్నే కుట్రలో చిక్కుకుని విలవిలలాడే ప్రమాదం పక్కనే పొంచి ఉన్నది. ఈ చారిత్రక సందర్భంలో అప్రమత్తతే కాదు. చైతన్యవంతమైన పాత్ర నిర్వహించేందుకు ఈ శక్తులు ముందుకు సాగాల్సిన కర్తవ్యం మాత్రం ఉంది. ప్రస్తుతం రేఖామాత్రంగా ప్రారంభమైన ఈ రాజ్యాంగ ‘చర్చ’ రానున్న రోజుల్లో వేగమంతమైతుంది. అందుకే ఈ చారిత్రక సంక్లిష్ట సమయంలో క్రియాశీలక భూమిక నిర్వహించేందుకు ప్రజాస్వామిక శక్తులు, అణచివేతకు గురైతున్న వర్గాలు, కులాలు అప్రమత్తతతో ఉండాల్సిన ఆవశ్యకతను ప్రస్తుత తరుణం గుర్తు చేస్తున్నది.
––––––––––
నోట్: ఈ అంశం పై ‘వేకువ’ చర్చకు ఆహ్వానిస్తున్నది. భిన్నమైన అభిప్రాయాలున్న వారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చు.