పొంగిపోర్లుతున్న పొలిటికల్​ భక్తి


– పారవశ్యంలో ప్రజాప్రతినిధులు  

–  పార్టీ నాయకుల మధ్య ప్రత్యక్ష పోటీ 

–  వీఐపీతాకిడితో లాభనష్టాలు


వేకువ ప్రత్యేక ప్రతినిధి: ఏ మతమేదైనా, భక్తి ఏదైనా వారి వారి వ్యక్తిగత విశ్వాసాలను గౌరవించాల్సిందే. పరస్పర గౌరవంతో మతసామరస్యాన్ని కాపాడితే సమాజంలో సహోదర వాతావరణం నెలకొంటుంది. కానీ, కొద్ది కాలంగా రాజకీయ రంగంలో భక్తి ప్రపత్తులు పెరిగిపోయాయి. అన్నింటా భక్తి, అందులో మతం ప్రధాన పాత్ర పోషిస్తున్నది. మతాలకు అతీతంగా ఆధ్యాత్మిక  కార్యక్రమాల్లో రాజకీయ నాయకులు మునిగితేలుతున్నారు. ఈ భక్తి ఇటీవల మరింత పెరిగి పరస్పరం పోటీలు పడుతున్నారు. ఏ కార్యక్రమం చూసినా...ఇందుగలడు...అందులేడని సందేహం వలదంటూ ప్రతీ కార్యక్రమంలో రాజకీయ ప్రతినిధుల పాత్ర లేకుండా...ప్రారంభం లేకుండా... పాల్గొనకుండా ఒక్క అడుగుముందుకు వేయడంలేదంటే అతిశయోక్తిలేదు. వీఐపీ తాకిడి వల్ల కార్యక్రమానికి ప్రాధాన్యత పెరుగుతున్న సందర్భాలతో పాటు చిన్నచిన్న వాటికి హాజరుకావడం వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బందులు నెలకొంటున్నాయి. 

–  విశ్వాసమేదైనా! కార్యక్రమమేదైనా!!

హిందువుల పర్వదినాలూ, ఉత్సవాలైనా... ముస్లీంల పండుగలూ కార్యక్రమాలైనా...క్రిస్టియన్​ల పండుగ రోజులైనా.... సిక్కులూ, బౌద్దులూ, జైనులూ ఎవరి  ఉత్సవాలైనా అతిచిన్న కార్యక్రమం నుంచి భారీ ఉత్సవం వరకు రాజకీయ నేతల భాగస్వామ్యం లేకుండా ప్రారంభం కావడంలేదు. మతాచార్యులు, స్వాములు, మత పెద్దలు చేసే కార్యక్రమాలకు సైతం రాజకీయ నాయకులో...లేదా.. ప్రజాప్రతినిధులో పాల్గొని ప్రారంభిస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధాని నుంచి గల్లీస్థాయి వార్డు మెంబర్​ వరకు ఈ కార్యక్రమాలకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో ఇటీవల పరిణామాలను చూస్తే అర్ధమైతుంది. రామాలయానికి శిలన్యాసమైనా....రామానుజుని సమారాధన ఉత్సవాలైనా...పీఎం నుంచి సీఎం స్థాయి నేతలు ప్రారంభాలు చేస్తున్నారు. ఇటీవల ముగిసిన సమ్మక్క సారలమ్మ జాతర, ఆఖరికి యాదగిరిగుట్ట పునర్మిర్మాణ ప్రారంభం కూడా ఇదే తీరుగా జరుగనున్నది.  తాజాగా శివరాత్రి ఉత్సవాలను నిదర్శనంగా పేర్కొనవచ్చు. 

– ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం 

జిల్లా కేంద్రాలు, నియోజకవర్గస్థాయిలో ఏ కార్యక్రమం చేపట్టినా జిల్లా మంత్రి, ఎమ్మెల్యే,ఎంపీ నుంచి చోటామోటా ప్రజాప్రతినిధులు తప్పకుండా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాలకు నాయకులు కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. గతంలో పండుగలు, ఉత్సవాలు జరిగితే ఈ ప్రజాప్రతినిధులు తప్పదన్నట్లుగా పాల్గొనేవారు. ఇప్పుడైతే పండుగ, ఉత్సవాలు వస్తే గుడిగుడి, మంటపం మంటపం, ఈద్గా ఈద్గా, చర్చీ చర్చీ,  కార్యక్రమం కార్యక్రమం విడిచిపెట్టకుండా పాల్గొంటున్నారు. ఈ ప్రజాప్రతినిధులు ప్రారంభించి తొలి మొక్కులు దంపతులతో సహా సమర్పిస్తే తప్ప కార్యక్రమం షురూ కావడంలేదు. తాజాగా మంగళవారం జరిగిన మహాశివరాత్రి పర్వదినం పరిశీలిస్తే ఎక్కడ చూసినా, ఏ ఉత్సవంలో చూసినా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పోటీలు పడి పాల్గొన్న దృశ్యాలు మనకు కన్పిస్తాయి. ఇవన్నీ ఒక్క హిందువులకో ముస్లీంలకో పరిమితమైనది కాదు. ఏ కార్యక్రమం జరిగినా ప్రజాప్రతినిధులు వస్తేనే ప్రారంభమైతున్నాయి.  

– వీఐపీ తాకిడితో లాభనష్టాలు

ప్రజాప్రతినిధులు వచ్చే వరకు కార్యక్రమ నిర్వహాకులు సైతం ఎదిరిచూస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధి రాక సందర్భంగా ఏర్పాటు చేసే భద్రతాచర్యలు, వారు వచ్చే వరకు ఇతరుల దర్శనానికి అవకాశం కల్పించకపోవడం వల్ల భక్తులు, సందర్శకులు ఎదురుచూపులు చూడాల్సిన సందర్భాలు ఇటీవల పెరిగిపోయాయి. వీఐపీల రాక సందర్భంగా ట్రాఫిక్​ కష్టాలు, సెక్యూరిటీ, ఆయా పార్టీల అనుచరుల హాడావుడి, మీడియా తాకిడి వెరసి సాధారణ భక్తులు ఆధ్యాత్మిక కేంద్రాలకు వచ్చే వారు ఇబ్బందులకు గురవుతున్నారు. స్థానికంగా నియోజకవర్గంలోనో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో తన పరపతిని చాటుకోవడం కోసం, తన అనుచరులను సంతృప్తి పరిచేందుకు, భక్తి విశ్వాసంతో కాదనకుండా ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. ఇది కొన్ని సందర్భాల్లో వారికి ఆ కార్యక్రమంలో పాల్గొనే సాధారణ ప్రజలు, భక్తులు, చివరికి బందోబస్తు చేపట్టే పోలీసులకు ఇబ్బందులు తప్పడంలేదు.  ప్రజాప్రతినిధుల మొహమాటం, నిర్వాహకుల అవసరం వెరసి ఒక్కోసారి ఇబ్బందులు తెస్తున్నాయి. అందువల్ల ఇటాంటి జనం ఎక్కువగా పాల్గొనే కార్యక్రమాల పట్ల ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరుతున్నారు. ముఖ్యంగా సమయపాలనను పాటించేందుకు ప్రాధాన్యతనివ్వాలని కోరుతున్నారు. 

– ఓటు చేజారుతుందనే భయం  

మత విశ్వాసాలు ఇటీవల ఓటు బ్యాంకు రాజకీయాల్లో కీలక భూమిక నిర్వహిస్తున్నందున ఒక్కోసారీ తమకు కొంత ఇబ్బందైనా ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాలకు వచ్చేందుకు అంగీకరిస్తున్నారు. లేకుంటే ప్రత్యర్ధిపార్టీకి అవకాశం దక్కుతుందనే ఆందోళన వెంటాడుతుంది. పైగా ఆ కార్యక్రమ నిర్వాహకులు తమ పార్టీకి చెందినవారో, అనుచరులై ఉంటున్నందున వారిని మెప్పించేందుకు ప్రజాప్రతినిధులు పడుతున్నపాట్లు బాగానే ఉన్నాయి. చివరికి మాత్రం ఈ విఐపీ తాకిడివల్ల సాధారణ ప్రజలు, భక్తులకు ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత తమపైన్నే ఉంది. 

Relative Post

Newsletter