మరోమారు పెగాసస్‌ ప్రకంపనలు

మరోమారు పెగాసస్‌ ప్రకంపనలు

న్యూయార్క్‌ టైమ్స్‌ సంచలన కథనం

ఇజ్రాయిల్‌తో ఒప్పందంలో భాగమని వెల్లడి

పార్లమెంట్‌ సమావేశాల ముందు మోడీకి తప్పని తిప్పలు

పెగాసస్‌ స్పైవేర్‌పై పెద్ద దుమారం రేగిన నేపథ్యంలో ’న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రిక ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. దీంతో మరోమారు దేశంలో ప్రకంపనలు తప్పేలా లేవు. పార్లమెంట్‌ సమావేశాలు జరగుతున్న వేళ ఈ కథనం మళ్లీ చిచ్చురేపేలా ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2017 జూలైలో ఇజ్రాయెల్‌లో పర్యటించినపుడు ఇరు దేశాలు కుదుర్చుకున్న సుమారు 2 బిలియన్‌ డాలర్ల విలువైన ఒప్పందంలో ఈ స్పైవేర్‌ కూడా ఓ భాగమని తెలిపింది. భారత దేశంతో పాటు అనేక దేశాల్లో ఈ స్పైవేర్‌ను ఉపయోగించి పాత్రికేయులు, మానవ హక్కుల మద్దతుదారులు, రాజకీయ నేతలు, ఇతర అధికారులపై నిఘా పెడుతున్నట్లు గత ఏడాది వార్తలు రావడంతో పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన వ్యక్తమైన సంగతి తెలిసిందే. న్యూయార్క్‌ టైమ్స్‌’ ప్రచురించిన కథనం ప్రకారం, ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ దాదాపు ఓ దశాబ్దం నుంచి నిఘా సాప్ట్‌వేర్‌ను సబ్‌స్క్రిప్షన్‌ ప్రాతిపదికపై ప్రపంచవ్యాప్తంగా దర్యాప్తు సంస్థలకు, నిఘా సంస్థలకు అమ్ముతోంది. ఇతర ప్రైవేటు కంపెనీలు, ప్రభుత్వ నిఘా సంస్థలకు సాధ్యం కానంతటి సమర్థవంతంగా తమ స్పైవేర్‌ పని చేస్తుందనే హావిూతో ఈ సాప్ట్‌వేర్‌ను అమ్ముతోంది. ఐఫోన్‌ లేదా ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ వెర్షన్‌ ఏదైనప్పటికీ దానిలోని సమాచారాన్ని నమ్మకంగా తెలుసు కోగలుగుతుందని హామీ ఇస్తోంది. మోదీ, నెతన్యాహు అన్యోన్యతకు నిదర్శనం...ఇజ్రాయెల్‌ను సందర్శించిన మొట్టమొదటి భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయేనని, ఆయన 2017 జూలైలో ఇజ్రాయెల్‌లో పర్యటించారని ఈ కథనం తెలిపింది. అప్పటి ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహుతో మోదీ చాలా అన్యోన్యంగా  ఉన్నారని తెలిపింది. ఈ అన్యోన్యతకు కారణాలు ఉన్నాయని చెప్తూ, ఇరు దేశాలు దాదాపు 2 బిలియన్‌ డాలర్ల విలువైన ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపింది. పెగాసస్‌ స్పైవేర్‌, మిసైల్‌ సిస్టమ్‌ ఈ ఒప్పందంలో కీలకాంశాలని వివరించింది. బెంజమిన్‌ నెతన్యాహు కొద్ది నెలల తర్వాత భారత దేశంలో పర్యటించారని తెలిపింది. పర్యవసానంగా 2019 జూన్‌లో ఇజ్రాయెల్‌కు అనుకూలంగా భారత దేశం ఐక్య రాజ్య సమితి ఆర్థిక, సాంఘిక మండలిలో ఓటు వేసినట్లు తెలిపింది. ఓ పాలస్తీనా మానవ హక్కుల సంస్థకు అబ్జర్వర్‌ హోదాను నిరాకరిస్తూ ఈ ఓటు వేసినట్లు తెలిపింది. భారత్‌ ఇజ్రాయెల్‌ విషయంలో ఈ విధంగా చేయడం ఇదే మొదటిసారి అని తెలిపింది. అమెరికాలోని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) కూడా పెగాసస్‌ స్పైవేర్‌ను కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఇదిలావుండగా, పెగాసస్‌ స్పైవేర్‌తో భారత దేశంలో అనేకమందిపై నిఘా పెట్టినట్లు గత సంవత్సరం పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ ఆరోపణలకు సరైన ప్రాతిపదిక లేదని కొట్టిపారేసింది. అయితే గత సంవత్సరం అక్టోబరులో సుప్రీంకోర్టు ముగ్గురు స్వతంత్ర నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. భారత దేశంలో నిర్దిష్టంగా కొందరు వ్యక్తులపై నిఘా పెట్టేందుకు ఈ సాప్ట్‌వేర్‌ను ఉపయోగించినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది. దేశ భద్రత అనే బూచిని చూపిన ప్రతిసారీ ప్రభుత్వానికి మార్గం సుగమం కాబోదని స్పష్టం చేసింది. ఈ బూచిని చూపినంత మాత్రానికి న్యాయ వ్యవస్థ మౌన ప్రేక్షకుడిగా మారిపోబోదని హెచ్చరించింది. న్వెస్టిగేషన్‌ కన్సార్షియం చొరవతో...భారత దేశంలో చాలా మంది మంత్రులు, రాజకీయ నేతలు, ఉద్యమకారులు, వ్యాపారవేత్తలు, పాత్రికేయులపై ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ తయారు చేసిన ఫోన్‌ హ్యాకింగ్‌ సాప్ట్‌వేర్‌తో నిఘా పెట్టినట్లు ఓ ఇంటర్నేషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ కన్సార్షియం గతంలో వెల్లడిరచిన సంగతి తెలిసిందే. ఈ సాప్ట్‌వేర్‌ 2011లో అంతర్జాతీయ మార్కెట్‌కు పరిచయం అయిందని, అప్పటి నుంచి అనేక దేశాల్లో దీనిని వాడుతున్నారని ఈ కన్సార్షియం తెలిపింది.

Relative Post

Newsletter