గులాబీ చాణక్యం

గులాబీ చాణక్యం

– జాతీయ రాజకీయరంగ ప్రవేశం

– జనామోద జనగామ గర్జన

–  ఈ కత్తికి రెండువైపులా పదును 

–  ఇక్కడ పట్టు...అక్కడ అడుగు 

– కేంద్రం పైన వ్యూహాత్మక దాడి

–  ఉద్యమకాల ఎత్తుగడకు పునర్జీవం


వేకువ. ప్రతినిధి: 

అనుకున్నది అనుకున్నట్లుగా....ఊహించింది ఊహించినట్లుగా...స్పందిస్తే ఆయన కేసీఆర్​ ఎందుకైతారు. అట్లాని మనకున్న  ముందస్తు అంచనాలను పూర్తిగా కాదనే తీరుగా  కూడా కేసీఆర్​ నిరాశపరచడు. కాకుంటే ఆయన మనమనుకున్న శృతిలో కాకుండా కొత్త రాగంలో ఎత్తుకుంటారు. అంతే తేడా. కాస్తంత భిన్నంగా ఉంటుంది కేసీఆర్​ తీరు. ఎదుటి వ్యక్తిని ఒకింత ఆశ్చర్యచకితుల్ని చేసినట్లుగా కన్పిస్తుంది. ఈ చాణక్య విద్యలో ఆరితేరిన కేసీఆర్​ ఎప్పటికప్పుడు తన ఎత్తుగడలకు కాస్తంత పదునుపెడుతూ ఎప్పటికప్పుడు తాజాదనం అద్దేందుకు ప్రయత్నిస్తారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయనకు అబ్బిన కళ ఇదే. ఈ కళను ఇంట, ఒంటబట్టించుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి రథసారధి కేసీఆర్​ మరోసారి ప్రదర్శించారు. జనగామలో శుక్రవారం జరిగిన భారీ సభలో అందుకే కేసీఆర్​ తన ప్రసంగంలో కొత్త రాజ్యంగం అంశాన్ని కనీసం మరోసారి లేవనెత్తలేదు. పైగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై మోడీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యల పై సైతం మౌనంగానే ఉన్నారు. వీటన్నింటిని పక్కన పెట్టడంలో వారిద్దరి మధ్య అంతర్గత స్నేహముందనే విమర్శలు మరోసారి వినిపిస్తున్నాయి. కానీ, తన జాతీయ రాజకీయ రంగ ప్రవేశానికి అవసరమైన మేర మోడీ పై విరుచుకపడడం ఇక్కడ గమనార్హం. అంటే తన జాతీయ రాజకీయ రంగ ప్రవేశానికి నిర్వహించిన జనామోద సభగా అభివర్ణించవచ్చు. 


– జనామోద జనగామ సభ

ప్రత్యేక రాజకీయవాతావరణంలో... ఆగమేఘాల మీద జనగామలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను లోతుగా పరిశీలిస్తే ఈ విషయాలన్నీ స్పష్టమైతాయి.  ఒక విధంగా కేసీఆర్​ జాతీయ రాజకీయ రంగ ప్రవేశానికి జనగామ సభను ‘జనామోద సభ’గా భావించాల్సి ఉంటుంది. గత లోక్​సభ ఎన్నికల సందర్భంగా ప్రతిపాదన రూపంలో ప్రకటించిన బీజ రూప ‘ఫెడరల్​ ఫ్రంట్​’ఈ మూడున్నరేళ్ళుగా ‘కేసీఆర్​ ఫ్రంట్​’లో అనేక రూపాంతరాలు చెందుతూ మేధోమధనం చెందిన తర్వాత తాజాగా పిండ రూపంలో ప్రాణం పోసుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ రూపానికి రాజకీయ వేదికగా రాష్ట్రాన్ని మార్చేందుకు వీలుగా జనగామ గడ్డ నుంచి ఆయన జాతీయ రాజకీయాలకు సిద్ధమైన నిర్ణయాన్ని ప్రకటిస్తూ జనామోదాన్ని పొందేందుకు యత్నించారు. అయితే కేసీఆర్​ ప్రయత్నాలు ఏమేరకు సఫలమైతాయనేది తదుపరి అంశం. 


– ప్రజల ముందు అభివృద్ధి నమూనా 

తెలంగాణ ఉద్యమం చేపట్టిన అప్పటి పోరాట నేపథ్యాన్ని గుర్తు చేస్తూ రాష్ట్రసాధన, అభివృద్ధి అంశాలను ఉదహరించారు. తెలంగాణ సెంటిమెంట్​ను పునరుద్ధరించేందుకు మళ్ళీ ప్రయత్నించారు. తన యేలుబడిలో ఈ రాష్ట్రాన్ని ‘ఉద్దరించిన’ విధానాన్ని తెలియజేస్తూ ఈ ప్రాంతం అండగా దేశరాజకీయాల్లో తన ‘పాత్ర’ పోషించేందుకు ముందుకు సాగనున్నట్లు ప్రకటించారు. పోల్చుకునేందుకు వీలుగా రాష్ట్రాభివృద్ధికి చేపట్టిన సంక్షేమ పథకాల ఫలాల దృశ్యాన్ని ప్రజల ముందుంచారు. ఇదే సందేశాన్ని జాతీయ స్థాయిలో కేసీఆర్​ అందించే ప్రయత్నం చేశారు. నిధులు ఇవ్వకున్నా తనదైన ‘ అభివృద్ధి, సంక్షేమ నమూనా’ను దేశం ముందించేందుకు ప్రయత్నించారు. 


–  రాష్ట్ర అభివృద్ధికి  మోడీ అడ్డంకి

మరోవైపు జాతీయ రాజకీయాలంటే కేంద్రాన్ని ఢీకొనే శక్తి తనకుందనే  ‘నమ్మకాన్ని’ ఎంత కలిగిస్తే అంత అనుకూల పరిస్థితులు, విశ్వాసం దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఏర్పడుతుంది.  కేసీఆర్​ జాతీయ రాజకీయాల్లోకి వెళితే రాష్ట్రంలో తమ నేత పాత్ర లేదనే సందేహం, బెంగ తలెత్తకుండా తన పాత్రను మరో రూపంలో చేపట్టాల్సిన కర్తవ్యం మనముందుందని ప్రజలచే ఒప్పించే ప్రయత్నం చేశారు. రానున్న రోజుల్లో ఇక్కడ ఉండే తన వారసత్వ సర్కారుకు ఎలాంటి ఢోకా లేకుండా రక్షణ కవచంలా ఉంటుందనే ముందు జాగ్రత సైతం ఇందులో దాగి ఉంది. ఈ కారణాల రీత్యానే కేసీఆర్​ రాష్ట్రానికి కేంద్రం ఏ విధంగా అన్యాయం చేస్తుందనే తీరులో ఏకరువుపెట్టారు. ముఖ్యంగా విద్యుత్​ సంస్కరణల పేరుతో మోటార్లకు మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తుంటే తాను ఎలా అడ్డుపడుతుందోనని చెప్పారు. ఈ ఎనిమిదేళ్ళలో ఎంత అభివృద్ధి చేశామో వివరించే ప్రయత్నం చేస్తూనే ఈ అభివృద్ధికి కేంద్రం అడ్డుగోడగా నిలుస్తుందని, మెడికల్​ కాలేజీలు ఇవ్వడంలేదని, నిధులివ్వడంలేదంటూ, సమస్యలు సృష్టిస్తుందని ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. కేంద్రం వైఖరిని విమర్శిస్తూనే మనమే కేంద్రంలో తగిన భూమిక పోషిస్తే రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతుందని, మనం దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన తరుణం ఆసన్నమైందని ప్రజలను మానసికంగా సంసిద్ధం చేసే ప్రయత్నం చేశారు. 


-ఉద్యమ ఎత్తుగడకు పదును

ఇదే ఊపులో కేసీఆర్​ మాట్లాడుతూ కేంద్రంలో బలమైన నేతగా ఉన్న మోఢీని ఢీకొడుతానంటూ ఢిల్లీకోటను బద్దలు కొట్టేందుకు ఇక్కడి నుంచి బయలుదేరి దేశ రాజకీయాల్లో పాత్ర పోషించుదాం అంటూ అంగీకారాన్ని తీసుకున్నారు. తెలంగాణను కొట్టాడితెచ్చుకున్నం, యుద్ధం చేసిన పార్టీ అంటూ ‘జాగ్రత్త నరేంద్రమోడీ’ తెలంగాణ పులిబిడ్డ మీ ఉడుత ఊపులకు, పిట్టబెదిరింపులకు భయపడమంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక తమ పార్టీ జోలికి బీజేపీ వస్తే నశం చేస్తాం బిడ్డలారా అంటూ బహిరంగహెచ్చరిక చేయడం గమనార్హం. 


కత్తికి రెండంచుల పదును 

ఇదిలా ఉండగా ఎనిమిదేళ్ళ పాలన ఫలితంగా రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఇవి మరింత పెరుగుతాయనడంలో సందేహం లేదు. ఈ కారణంగా కేంద్రంలో, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్​ పుంజుకుని అధికారంలోకి రాకుండా చేయడంలో మోడీ, కేసీఆర్​ ఇద్దరి లక్ష్యమొక్కటే. ఈ ముందస్తు జాగ్రత్తలో భాగంగా కాంగ్రెస్​కు ప్రత్యామ్నాయంగా కేంద్రంలో మరో పార్టీయో, కూటమినో ముందుకు తీసుకరావాల్సిన అవసరం మోడీ కున్నది. అట్లా అని ఆ కూటమి, పార్టీ  బీజేపీ ప్రత్యామ్నాయంగా మారకూడదు ఇది మోడీ ఆలోచన. ఇదే తరహాలో రాష్ట్రంలో కాంగ్రెస్​ పుంజుకుని అధికారంలోకి రాకూడదు. అలాగని బీజేపీ ప్రత్యామ్నాయంగా ముందుకు రాకూడదు. ఇది కేసీఆర్​ ఆలోచన. ఈ పరస్పర లక్ష్యంలో తేడా రాకుండా జాగ్రత వహిస్తున్నాయి. అదే సమయంలో ఒకరికొకరు పోటీ కావడం కూడా ఇద్దరికీ ఇష్టం లేదు. అందుకే అంతర్గత స్నేహం, బహిరంగ విమర్శలు వ్యక్తం చేసుకుంటున్నారని వీరిద్దరి వ్యవహార శైలిని పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 


– ఎంతకాలమీ ఎత్తులు పై ఎత్తులు? 

బీజేపీ, టీఆర్​ఎస్​ల మధ్య ఈ స్నేహం ఇలాగే కొనసాగాలనేదానికి ఏం కండీషన్​ లేదు. ఏడున్నరేళ్ళ స్నేహం ఇటీవల విమర్శల స్థాయికి చేరింది. ఇపుడు స్వరం మారింది. ఇదిలా ఉండగా తమ అధికార, రాజకీయ అవసరాల రీత్యా ఎలాంటి రూపాన్నైనా మార్చగల నేర్పరి తనం కేసీఆర్​కున్నది. అందువల్ల కేసీఆర్​ ఎత్తుగడలకు రెండు వైపులా పదును ఉందనేది అంటున్నారు. ఏమైనా ఇది రెండు పార్టీల పరస్పర ఆధారిత అంశం. కేసీఆర్​తనకు నష్టం జరిగే విషయాలను తాను అంగీకరించే అవకాశం లేదు. మోడీకి నష్టం వాటిల్లే ప్రయత్నాలను  ఆయన కూడా ఒప్పుకోరు. ఎవరికి వారు తమ పార్టీ పట్టు సడలిపోకుండా, అదే సందర్భంలో మరింత పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందుకే తాజా పరిణామాలను చూసి రాజకీయ చదరంగంలో ఎత్తులు పై ఎత్తులుగా  రాజకీయ అనువభజ్ఞులు అభివర్ణిస్తున్నారు. 

Relative Post

Newsletter