గ్రౌండ్​లోకి పొలిటికల్​ లీడర్లు


– ఎన్నికలకు ముందే జనం వద్దకు

– అధికార విపక్షాల పోటాపోటీ

– జుగుప్సాకరమైన విమర్శలు 

– రెచ్చగొట్టేందుకు నేతల యత్నం


ప్రత్యేక ప్రతినిధి:ఎన్నికలకు రెండు సంవత్సరాలకు ముందే రాష్ట్రంలో రాజకీయ నేతలు ప్రజల్లో పట్టు పెంచుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నాయి. అధికారం ఎంతటి వారినైనా కిందకు దింపుతోందనేదానికి రాష్ట్రంలో రాజకీయ పార్టీలు చెమటోడుస్తున్నాయి.  పోటాపోటీ విమర్శలు, ఆరోపణలతో పాటు అసభ్య పదజాలంతో జుగుప్సాకరంగా మారినప్పటికీ రాష్ట్రంలో పోలిటికల్​ హీట్​ క్రమంగా పెంచుతున్నారు. విమర్శల్లో నిజానిజాలను పక్కనపెడితే ఒక దశలో దిగజారి మాట్లాడుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గమ్మత్తేమిటంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో టీఆర్​ఎస్​ల విమర్శలు చూస్తే సిగ్గనిపిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీలు తమ బాధ్యత విస్మరించి విమర్శలు చేసుకోవడంలో కొత్త ఎత్తుగడ ఉందంటున్నారు. ఇక నిధుల కేటాయింపు, అభివృద్ధి, పథకాల గురించి చెబుతూ ఏదో తమ తాతల, తండ్రుల ఆస్తులు ప్రజలకు అప్పనంగా పంచిపెడుతున్నట్లు మాట్లాడుతున్నారు. ప్రజల గోళ్ళూడగొట్టి వసూలు చేస్తున్న ప్రత్యక్ష, పరోక్ష పన్నలే ఈ నిధులనే విషయాన్ని విస్మరించి తమ ఇంటినుంచి తెచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఇక మతం, కులాం, విభేదాలు, విద్వేషాలను పెంచిపోషించేందుకు ఎవరికి వారు తమదైన ప్రయత్నం చేస్తున్నారు. 


– క్షేత్రస్థాయిలోకి లీడర్లు 


నిన్నమొన్నటి వరకు నిరసనలు, ఆందోళనలతో ప్రజాపక్షమంటూ సెలవిచ్చిన నేతలు తాజాగా ప్రజల వద్దకు చేరి పాఠాలు వల్లెవేస్తున్నారు. తమకు తోచిన పద్ధతుల్లో, వివిధ రూపాల్లో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.  వాస్తవానికి ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నామని చెప్పే లీడర్లు వాస్తవానికి ప్రజలకే పాఠాలు చెప్పేందుకు యత్నిస్తున్నారు. ఎన్నికలొచ్చినప్పుడు మాత్రం ప్రజలు ఈ పార్టీల నాయకులకు పాఠాలు చెబుతారనేది చరిత్రచెప్పిన వాస్తవం. 


– అధికారం కోసం లీడర్లపాట్లు 


రానున్న  ఎన్నికల్లో అధికారం దక్కించుకునేందుకు, అదనపు బలాన్ని పెంచుకునేందుకు  రాష్ట్రంలోని విపక్షపార్టీలైన కాంగ్రెస్​, బీజేపీ, టీజేఎస్​, బీఎస్సీ, వామపక్షాలు, ప్రజాసంఘాలు తమదైన రీతిలో కార్యక్రమాలు చేపట్టి కేడర్​ను అప్రమత్తం చేస్తూ క్షేత్రంలో మరింత పట్టును పెంచుకునేందుకు వివిధ పద్ధతుల్లో ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో అధికారాన్ని కాపాడుకుని మళ్ళీ ఒక్కసారి, ముచ్చటగా మూడవ పర్యాయం కూడా రాష్ట్రంలో తమ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు గులాబీ దళం పావులు కదుపుతోంది. 


– కాంగ్రెస్​ కదనరంగం


నిన్నమొన్నటి వరకు నిరసనలు ,ఆందోళనలతో అధికార పక్షంపై కాంగ్రెస్​ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. నిరుద్యోగ సమస్య, దళితులు, అధికార పక్ష హామీల ఉల్లంఘనలు, వరిసాగు, పెట్రోల్​, డీజిల్​, గ్యాస్​ ధరల పెంపుతోపాటు ఇతర  సమస్యల పై రాస్తారోకోలు ధర్నాలు చేపట్టారు. అదే సమయంలో కాంగ్రెస్​లో ఉన్న అంతర్గత విభేదాలు పరిష్కరించుకునేందుకు కొంత ప్రయత్నించి ఇప్పటికైనా సఫలమయ్యాయి. నేతలంతా కలిసికట్టుగా అధికార టీఆర్​ఎస్​తో పాటు, బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు. ఇదే ఊపులో వరంగల్​ కేంద్రంగా వచ్చెనెల ఆ పార్టీ అధినేత రాహుల్​ పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా భారీ సభ నిర్వహించి జనాన్ని సమీకరించి తన బలాన్ని ప్రదర్శించేందుకు సమాయత్తమైతోంది. ఇప్పటికే వరంగల్​లో ఆ పార్టీ నేతలు మోహరించి కార్యకలాపాలు షురూ చేశారు. పీసీసీ చీఫ్​ రేవంత్​ వరంగల్​ సందర్శించి పార్టీ నాయకులకు దిశానిర్ధేశం, సభ విజయవంతానికి అవసరమైన కార్యాచరణ అమలు చేయనున్నారు. 


– బీజేపీ పాదయాత్ర


వరిసాగు సమస్యతోపాటు, పెంచిన విద్యుత్​ చార్జీలపై రాష్ట్రంలో బీజేపీ ఆందోళనలు కొనసాగించి తన బలాన్ని పెంచుకునేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ రాష్ట్ర చీఫ్​ బండి సంజయ్​ తన రెండవ విడత మహాసంగ్రామ యాత్రను  పాలమూర్​నుంచి ప్రారంభించారు. పార్టీ అధిష్టానం అండతో బీజేపీ బలోపేతానికి ప్రయత్నిస్తుండగా ఇటీవల ఆ పార్టీలో నెలకొన్న లుకలుకలు బయటపడ్డాయి. దీన్ని సరిదిద్దుకునే ప్రయత్నం అధిష్టానం చేపట్టింది.    


– బీఎస్పీ యాత్ర


బీఎస్పీలో చేరిన మాజీ ఐఎఎస్​​ ఆఫీసర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్ రాష్ట్రంలో చేపట్టిన బస్సుయాత్ర కొనసాగుతోంది. రాష్ట్రంలో టీఆర్​ఎస్​పై విమర్శలు చేస్తూ దళిత,బహుజన వర్గాలను కూడగట్టేందుకు ప్రయత్నం ప్రారంభించారు. రాష్ట్రంలో బీఎస్పీ పట్టుపెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. 


– టీజేఎస్​, ప్రజాసంఘాలు


ప్లీనరీ నిర్వహించుకున్న టీజేఎస్​ ఇటీవల ఇతర పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఆ పార్టీ అధినేత ప్రొఫెసర్​ కొదండరామ్​ తనదైన పద్ధతితో ప్రజాసంఘాలతో మమేకమైతున్నారు. రాజ్యాంగ పరిరక్షణ సమితిలో యాక్టివ్​గా భాగస్వామ్యమవుతున్నారు. 


– వామపక్షాలు ఆందోళనలు


సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎం–ఎల్​) పక్షాలు పెరిగిన ధరలు, పోడు భూముల సమస్యతో పాటు సామాజిక అంశాలపై  కేంద్రీకరిస్తూ ఇటీవల ఆందోళనలు తీవ్రం చేశారు. ఈ కార్యక్రమాల్లో తమ కేడర్​ను, ప్రజలను భాగస్వామ్యం చేస్తూనే అధికార బీజేపీ, టీఆర్​ఎస్​పై మండిపడుతున్నారు. ​


– గులాబీ లీడర్ల అప్రమత్తం


రాష్ట్రంలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్​ వ్యూహాత్మకంగా తన ప్రణాళిక అమలు చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూనే తెలంగాణ సాధించిన ప్రగతి అంటూ ప్రజలను మరోసారి తమవైపు నింపుకునే ప్రయత్నం ప్రారంభించారు. గతానికి భిన్నంగా కేంద్రంలోని బీజేపీని టార్గెట్​ చేసి తన రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. కేంద్రం విధానాలపై ప్రత్యక్ష నిరసనలు చేపట్టడం గమనార్హం. జాతీయ ప్రత్యాయమ్నాయం పేరుతో రాష్ట్రాల పర్యటనలే కాకుండా ధాన్యం కొనుగోళ్ళను రాజకీయం చేస్తూ ఢిల్లీలో దీక్ష చేపట్టడం గమనార్హం. దీనికి తోడు రాష్ట్రంలో పార్టీ లీడర్లు, మంత్రులు అప్రమత్తమయ్యారు. అధికార పార్టీ బలగమంతా ప్రజల్లో ఉండేవిధంగా ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్​ స్వయంగా  భారీ సభల్లో పాల్గొంటుండగా తదుపరి ఆ స్థాయి స్థానాన్ని పొందుతూ మంత్రి  కేటీఆర్ రాష్ట్ర పర్యటనలు చేస్తున్నారు. అక్కడక్కడా హరీష్​రావు సభల్లో మెరుస్తున్నారు. కేటీఆర్​ జిల్లాల పర్యటన అంటే సీఎం స్థాయిలో అధికారిక ఏర్పాట్లు, నాయకుల శ్రద్ధ కన్పిస్తోంది.

Relative Post

Newsletter