రాహుల్​ రాకతో మారిన ‘రాజకీయం’

రాహుల్​ రాకతో  మారిన ‘రాజకీయం’

–  రాష్ట్రంలో కాంగ్రెస్​కు కాల పరీక్ష 

– మూడు పార్టీల ముప్పేట దాడి

–  రాష్ట్రంలో  సరికొత్త చిక్కుముడి 

– ఈ పక్షాల లెక్కలన్నీ ఒక్కటేనా!

–  విమర్శల వెనుక ఐక్యతుందా? 


 (ప్రత్యేక ప్రతినిధి): తెలంగాణలో నిన్నటి వరకు చేతగాదు, చేవలేదు.. చచ్చిపోయిన ఆ పార్టీ దిక్కెవరు చూస్తారంటూ అవహేళనలూ, విమర్శలు చేసి పూచిక పుల్లలెక్క తీసేసిన కాంగ్రెస్​ పార్టీ ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన ఎజెండగా ప్రత్యర్ధి పార్టీలకు ఏకకాలంలో మారిపోయింది. వరంగల్​ కేంద్రంగా జరిగిన భారీ రైతు సంఘర్షణ సభ సక్సెస్​తో పాటు ఈ సభలో ప్రకటించిన వ్యవసాయ డిక్లరేషన్​ ( ఇంకా అమలుకే నోచుకోలేదు) ప్రత్యర్ధి పార్టీల్లో ప్రకంపనలు సృష్టించాయా? అంటే  కావచ్చేమోనని అనిపిస్తోంది. ఏమైనా పార్టీకి తెలంగాణలో కాలపరీక్ష తప్పనట్లుంది. 


–  ముప్పేట దాడిలో మతలబేమిటీ? 


కూడబలుక్కొని మాట్లాడుతున్నారా?  కాంగ్రెస్​ గత పాలనను పరిగణలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారా? లేక పార్టీకున్న పరపతి భరించలేక అక్కసుతో అంటున్నారా? వారే చెప్పాలిగానీ మూడు ముఖ్యమైన పార్టీలు ఒకే తీరుగా స్పందించడం ఇక్కడ గమనార్హం.  వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీ పేరుకే ప్రధాన ప్రతిపక్షమైనప్పటికీ శాసనసభలో మారిన లెక్కల నేపథ్యంలో ఈ స్థానం కూడా అధికార పార్టీకి అంటకాగుతోన్న ఎంఐఎంకు దక్కుతోంది. ఆ పార్టీ నేత ఓవైసీ కాంగ్రెస్​ పార్టీపై, ఆ పార్టీ నేత రాహుల్​గాంధీపై విరుచుకపడ్డారు. ఇక శాసనసభలో మూడు స్థానాలు, పార్లమెంట్​లో నాలుగు స్థానాలున్నా బీజేపీ రాష్ట్రంలో రానున్న రోజుల్లో అధికారపార్టీగా తమకు తాము బ్రాండ్​ ఇమేజ్​ కల్పించుకుంటూ రాజకీయ ఆధిపత్యాన్ని చాటుతోంది. ఈ పార్టీ అధినేత బండి సంజయ్​ కాంగ్రెస్​ పై తీవ్రంగా విరుచుకపడ్డారు. ఒక దశలో  కాంగ్రెస్​ పార్టీ నేత రాహుల్​ ఉపన్యాసం ప్రగతిభవన్​ స్ర్కిప్ట్​గా అభివర్ణించారు. రాహుల్​ను దూషించారు. ఇక అధికార టీఆర్​ఎస్​ పార్టీ అయితే మాములు స్థాయిలో కాంగ్రెస్​ పై విరుచుకపడలేదంటే అతిశయోక్తికాదు.  కాంగ్రెస్​ లక్ష్యంగా రాజకీయ దాడికి దిగడమే కాకుండా వ్యక్తిగతంగా ఆ పార్టీ అధినేత రాహుల్​ను, రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డిని టార్గెట్​ చేసి విమర్శలు గుప్పించడం గమనార్హం. చిత్రమేమిటంటే రాహుల్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు కూడా కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఎంపీగా ఉన్నారు. అయినప్పటికీ ఆయనను టార్గెట్​ చేస్తూ వచ్చారు. కానీ, కాంగ్రెస్​ సభకు ఒక రోజు ముందు మహబూబ్​నగర్​లో బీజేపీ భారీ సభను నిర్వహించింది. ఈ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరయ్యారు. ఆయన టీఆర్​ఎస్​ పై తీవ్రమైన విమర్శలు చేశారు. టీఆర్​ఎస్​, కేసీఆర్​ కుటుంబం తెలంగాణను ఆవినీతి రాష్ట్రంగా మార్చేసిందంటూ పథకాలన్నీ పూర్తి అవినీతిమయమంటూ విరుచుకపడ్డారు. అయినా ఆ పార్టీని ఎందుకు టార్గెట్​ చేయాల్సినంత స్థాయిలో టీఆర్​ఎస్​ నేతలు చేయకపోవడం ఇక్కడ గమనార్హం. కాంగ్రెస్​ను తిట్టేందుకు చూపిన శ్రద్ధ ఎందుకో బీజేపీపై కనబడలేదు. 


– వరంగల్​లో ఏం జరిగింది?  చేస్తున్న విమర్శలేంటి?  


వరంగల్​లో కాంగ్రెస్​ నిర్వహించిన రైతు సంఘర్షణ సభ ఆ పార్టీ నేతలు, ప్రత్యర్ధులు ఊహించని విధంగా భారీగా జనం హాజరయ్యారు. చాలాకాలానికి  ఇంత పెద్ద ఎత్తున జనం హాజరుకావడం కాంగ్రెస్​ పార్టీ కేడర్​ గొప్పతనమే కాకుండా ప్రజల్లో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతకు అద్ధం పడుతుందని చెప్పవచ్చు. ప్రజల్లోని అసంతృప్తి ఈ సభ రూపంలో వ్యక్తమైందని పరిశీలకుల అంచనా. ఈ సభ సహజంగానే కాంగ్రెస్​కు కొత్త ఊపిరులూదగా బీజేపీ జీర్ణించుకోలేక పోతోంది. టీఆర్​ఎస్​కు మింగుడుపడలేదని చెప్పవచ్చు. అందుకే తమ మిత్రుడు ఓవైసీ, ప్రకాష్​రాజ్​ లాంటి వాళ్ళు రంగంలోకి దిగడం దిగజారుడు తనానికి నిదర్శనం. రాజకీయ పార్టీ, రాజకీయాభిప్రాయాలు వ్యక్తం చేయడం తప్పుకాదు. కానీ, ఈ సభలో రాహుల్​గానీ, ఇతర నాయకులుగానీ ఓవైసీని పల్లెత్తుమాటనలేదు. అయినా తమ మిత్రునికి నష్టం వాటిల్లుతోందని ముందుకు వచ్చారంటే తప్పేమిలేదేమో? ఇక రాహుల్​ టీఆర్​ఎస్​తో పోలిస్తే బీజేపీని అంతగా విమర్శించలేదు. కేవలం, బీజేపీ చేతిలో టీఆర్​ఎస్ రిమోట్​కంట్రోల్​ అంటూ విమర్శించి తమ రాజకీయాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీఆర్​ఎస్​పై కూడా దిగజారి మాట్లడలేదు. ఆఖరికి కేసీఆర్​ పేరు కూడా ఆయన ఉచ్ఛరించలేదు. అయితే ఘాటైన రాజకీయ విమర్శలే చేశారు. ​తమ పార్టీ లీడర్లకు హెచ్చరికలు, టికెట్​ కేటాయింపుల పట్ల తమ విధానం స్పష్టం చేశారు. రైతు డిక్లరేషన్​ ఎంత ప్రధానమైందో తెలియజేశారు. ఆచరణ సంగతి పక్కన పెడితే డిక్లరేషన్​ ఆకర్షనీయంగానే ఉందని చెప్పవచ్చు. ఇదేమైనా భయపెడుతోందా? రాహుల్​ ఉపన్యాసం ఒక విధంగా హుందాతనంతో కూడి ఉందని చెప్పవచ్చు. దీనికి భిన్నమైన విమర్శలు, అవహేళనలు, వ్యక్తిగత విమర్శలు ప్రత్యర్ధి పార్టీలు వేర్వేరుగా చేసినప్పటికీ అవన్నీ  ఒక్కటిగా ఉండడం ఇక్కడ చర్చనీయాంశం. 


– ప్రజాసమక్షంలోనే ప్రతిపాదనలు


అత్యంత ముఖ్యవిషయమేమిటంటే అక్కడ జరిగింది. కాంగ్రెస్​ కార్యకర్తల మీటింగ్​ కాదు. అక్కడ జరిగింది బహిరంగ సభ, దానికి భారీ స్థాయిలో లక్షలాది మంది జనం హాజరయ్యారు. వారి సాక్షిగా రాహుల్​ మాట్లాడారు. ఈ విషయాన్ని విస్మరించడానికి వీల్లేదు. కానీ గత మూడు రోజులుగా రాష్ట్రంలో  మారుతోన్న రాజకీయ పరిస్థితి కొందరికి కునుకులేకుండా చేసిందని భావిస్తున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్​ ఏదో అత్యంత పవిత్రమైన పార్టీగా ఎవరూ అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ, ప్రజాస్వామ్యంలో ఆ పార్టీ తన విధానాలను ప్రజల సమక్షంలో హుందాగా చెప్పి, తమ  వ్యవసాయ ప్రతిపాదనలు ముందుంచినప్పుడు ప్రత్యర్ధులు స్పందించాల్సిన తీరు మాత్రం ఇది కాదనే అభిప్రాయం పెరుగుతోంది. ప్రత్యామ్నాయ రైతు ప్రతిపాదనలేమైనా ఉంటే లేకపోతే తాము చేస్తున్న సంక్షేమపథకాలు వివరించవచ్చు కానీ, దీనికి భిన్నమైన విమర్శలు చేస్తూ ఎదురుదాడి చేస్తున్న ఈ పరిణామాలు ఎటు వైపు దారితీస్తాయో వేచి చూడాల్సి ఉంది. 

–––––––

Relative Post

Newsletter