క్యాడర్​లో జోష్ తెచ్చేందుకు రేవంత్​ జోర్​దార్​ స్కెచ్​​!



– మన ఊరు–-మన పోరుకు శ్రీకారం

–పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

– గ్రామగ్రామానికి కాంగ్రెస్‌..నినాదంతో ముందుకు!

– ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ..

– ప్రజల్లోనే ఉండేలా బహిరంగ సభలు


వేకువ ప్రతినిధి: కేసీఆర్‌ పదునైన వ్యూహాలు ఓ వైపు.. బీజేపీ దూకుడు రాజకీయాలు మరో వైపు.. వీటన్నింటినీ తట్టుకుని కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. కానీ.. సొంత పార్టీ నేతల చికాకులతోనే కాలం గడిచిపోతోంది.  ఇలా అయితే.. వచ్చే ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడం ఖాయమని గ్రహించిన రేవంత్‌.. పాత వ్యూహాన్నే మళ్లీ ఆచరణలోకి తీసుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్‌ కు బలమైన క్యాడర్‌ ఉంది. నాయకత్వ లోపంతో ఈ ఏడేళ్లలో అందరిదీ తలో దారి అన్నట్లు తయారైంది. అయితే.. రేవంత్‌ పీసీసీ చీఫ్‌ అయ్యాక ఎన్నో మార్పులు జరిగాయి. క్యాడర్‌ లో జోష్‌ పెరిగింది. దీనికి తోడు ‘‘దళిత -గిరిజన ఆత్మగౌరవం’’ పేరుతో భారీ సభలు పెట్టి అందరి దృష్టి కాంగ్రెస్‌ పై పడేలా చేశారు. ఈ విషయంలో సక్సెస్‌ అయ్యారు.  నిరుద్యోగుల కోసం పోరాటాలు.. జంగ్ సైరన్ పేరిట సభలు కూడా ప్లస్‌ అయ్యాయి. తర్వాతి రోజుల్లో ఆ స్థాయిలో రేవంత్‌ సభలు పెట్టింది తక్కువే. ఎంతసేపు సొంత పార్టీలో ఉన్న సమస్యలతోనే సమయం సరిపోతోంది. దీంతో పీసీసీ అయిన సమయంలో ఆచరించిన ప్లాన్‌ నే మళ్లీ ఆచరణలోకి తీసుకొచ్చారు రేవంత్‌. భారీ సభలతో ప్రజల్లోకి వెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.  ప్రెస్‌ మీట్లతో సరిపెడితే జనాలకు ఎక్కడం లేదని గ్రహించి బహిరంగ సభలకే శ్రీకారం చుట్టారు. మన ఊరు–-మన పోరు పేరుతో భారీ సభలకు ప్లాన్‌ రచించారు రేవంత్‌ రెడ్డి. ముందుగా పరిగి నుంచి తన ప్రణాళికలను అమలు చేశారు. తర్వాతి రోజుల్లో వేములవాడ,  కొల్లాపూర్‌ సహా ఇతర ప్రాంతాల్లో సభలను ఏర్పాటు చేసి రూరల్‌ లెవల్‌ లో పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారు.  ఓవైపు టీఆర్‌ఎస్‌ అవినీతిని హైలెట్‌ చేస్తూ.. ఇంకోవైపు కాంగ్రెస్‌ పార్టీ గురించి వివరించి ప్రజల మన్ననలు అందుకోవాలని వ్యూహరచన చేశారు.

Relative Post

Newsletter