రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ప్రైవేటు సేనల వికృతాలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ప్రైవేటు సేనల వికృతాలు...
=====================================
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వికృత పోకడలు పోతున్నది. ఉక్రెయిన్‌లో యుద్ధం చేస్తున్నరష్యా సైనికుడు ఒకరు తనను తాను పేల్చుకొని ఆత్మహత్యకు పాల్పడి అమరో ఇద్దరినీ బలితీసుకున్నాడు. ఇతడు రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూప్ సైనికుడిగా తెలుస్తున్నది. అంతే కాదు.., ఇతడు గతంలో నేరస్తుడనీ, చేసిన నేరాలకు గాను జైలుశిక్ష అనుభవించాడు. కాన్‌స్టాంటైన్ తులనోవ్ అనే ఇతడు కారు దొంగతనం కేసులో, మాదక ద్రవ్యాల అక్రమరవాణా కేసులో కూడా నిందితుడిగా జైల్లో ఉంటే..., అతన్ని యుద్ధ సైనికుడిగా వాగ్నర్ గ్రూప్ నియమించుకున్నట్లు తెలుస్తున్నది. ఇలాగే... గై స్పరయాన్ అనే ప్రైవేటు సైనికుడిది కూడా నేర చరిత్రే. ఇతనిపై మాస్కోలో ఓ కేఫ్‌ను లూటీ చేసిన కేసులో జైలు శిక్ష పడింది. దీంతో ఉక్రెయిన్‌లో పోరాడుతున్న రష్యా సేనల స్థితి, ఉనికి చర్చనీయాంశం అవుతున్నది.
గత ఏడాది ఫిబ్రవరిలో నేరుగా ప్రత్యక్ష దాడికి దిగిన రష్యా... రోజుల వ్యవధిలోనే ఉక్రెయిన్‌ను పాదాక్రాంతం చేసుకుంటామని రష్యా అధ్యక్షుడు వ్లదిమీర్ పుతిన్ ప్రకటించాడు. కానీ ఏడాది కావస్తున్నా... ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా నిర్ణయాత్మక విజయం సాధించినట్టుగా చెప్పుకొనే స్థితిలో లేదు. అడుగడుగునా.. ఉక్రెయిన్ సేనలు రష్యా సైనికులను ప్రతిఘటిస్తున్నాయి. రష్యా తీవ్రంగా నష్టపోతున్నది. క్షిపణి దాడులు, ఎయిర్ స్ట్రైక్‌లతో భీకర దాడులకు దిగినా.. రష్యాకు ఆశించిన ఫలితాలు రావటం లేదు. గంటలు, రోజుల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం దీర్ఘకాల యుద్ధంగా పరిణమించటం, యుద్ధంలో పురోగతి లేకపోవటం, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండటంతో... రష్యా సైనికులు యుద్ధ భూమినుంచి పారిపోతున్న పరిస్థితులు ఎదురవుతు న్నాయి. ఈ నేపథ్యంలోంచే రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్బంధ సైనికీకరణకు పిలుపునిచ్చాడు. దీంతో యుద్ధ క్షేత్రంలోకి పోవటానికి ఇష్టపడని రష్యా పౌరులు అడవిలోకి పారిపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అలాగే.... ఉక్రెయిన్ యుద్ధంలోకి పోవటానికి ఇష్టపడని సైనికులను కందకాల్లో, చీకటి గుహల్లో నిర్బందిస్తున్నారని తెలుస్తున్నది.
మరో వైపు ఉక్రెయిన్‌లో రష్యా తీవ్ర ప్రతిఘటనను చవిచూస్తున్నది. గతంలో ఆక్రమించిన నగరాలను కూడా ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకొంటున్నది. ఒకానొక పరిస్థితిలో రష్యా సేనలు ఉక్రెయిన్ ధాటికి తట్టుకోలేక తిరుగుముఖం పడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోంచే... రష్యా ప్రభుత్వ సేనలకు అండగా ప్రైవేటు సేనలు తెరమీదికి వచ్చాయి. ప్రైవేటు సేనల అండతోనే ఈ మధ్య కాలంలో రష్యా క్లిష్ట పరిస్థితులనుంచి బయటపడి చిన్న చితకా విజయాలు సాధించిందని చెప్తున్నారు. స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ప్రైవేటు సేనల అండతోనే తమ బలగాలు మనగలుగుతున్నాయనీ, విజయాలు సాధించగలుగుతున్నామని చెప్పుకొచ్చాడు!
ఒక దేశం తరపున ప్రైవేటు సైనలు యుద్ధ క్షేత్రంలోకి దిగటం దిగ్బ్రాంతి కరం. ప్రైభుత్వ సైనికులకు సైనిక శిక్షణతో పాటు, యుద్ధనీతికూడా తెలిసి ఉంటుంది. అంతర్జాతీయ న్యాయసూత్రాలకు అనుగుణంగా ప్రభుత్వ అధికార సేనలు ప్రవర్తిస్తాయి. కానీ ప్రైవేటు సేనలకు ఇవేవీ వర్తించవు. ఈ నియమాలు కూడా ప్రైవేటు సైనికులకు తెలిసే అవకాశం లేదు. అందులోనూ రష్యా ప్రైవేటు సేన వాగ్నర్ గ్రూప్ ఉనికే చాలా ప్రమాదకరమైనది, అభ్యంతరకరమైనది.
రష్యా ప్రైవేటు సేన వాగ్నర్ గ్రూప్ అధిపతి యెవ్‌గినీ ప్రిగోజిన్ చరిత్ర కూడా చాలా వివాదాస్పదమైనది. ప్రిగోజిన్ స్వయంగా దొంగతనం, దౌర్జన్యం కేసుల్లో నేరస్తునిగా జైలు శిక్ష అనుభవించిన వాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత.. అనేక చిన్న చిన్న వ్యాపారాలు చేసి చివరకు 1990ల్లో ఆహార సరఫరా దారుడిగా అవతారమెత్తాడు. ఆ క్రమంలోనే... పుతిన్‌కు ఆహారం సరఫరాచేసి, పుతిన్ కు అత్యంత సన్నిహితునిగా మారిపోయాడు. ఇప్పుడు అయితే... పుతిన్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకనిగానే కాకుండా.., అంతర్గత సలహాదరుల్లో ఒకడిగా పేరుగాంచాడు.
ప్రిగోజిన్ ఆహార పరఫరాతో పాటు ప్రైవేటు సైన్యాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ప్రైవేటు సైన్యం రిక్రూట్ మెంట్ కోసం గత ఏడాది రష్యాలోని జైళ్లన్నింటినీ ప్రిగోజిన్ సందర్శించినట్లు తెలుస్తున్నది. అంటే... జైళ్లల్లో ఉన్న నేరస్తులను తన వాగ్నర్ గ్రూప్‌లో సైనికులుగా చేర్చుకున్నట్లు అవగతమవుతున్నది. రష్యా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగాన్ని ఆసరా చేసుకొని నేరస్తులను, నిరుద్యోగ యువతీ యువకులను ప్రైవేటు సైనికులుగా చేర్చుకుంటున్నారు. నేరుగా యుద్ధ భూమిలోకి పోయే వారికి నెలకు రూ. లక్షా 60వేలు ఇచ్చి వాగ్నర్ సైనికుడిగా నియమించుకొంటున్నారు. మొదట్లో ఇలాంటి ప్రైవేటు సైన్యం ఉనకిని పుతిన్ ఖండించాడు. అది తప్పుడు ప్రచారంగా చెప్పుకొచ్చాడు. ప్రిగోజిన్ అయితే... వాగ్నర్ గ్రూప్ గురించి పత్రికల్లో రాసిన జర్నలిస్టులపై పరువునష్టం దావా వేస్తానని బెదిరింపులకు దిగాడు. తనంటే గిట్టని వారు చేస్తున్న దుష్ప్రచారంగా కొట్టివేశాడు.
ఇదిలా ఉంటే... ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సేనలను ఓటమి కోరల్లోంచి తప్పించేందుకు ప్రైవేటు సేనల సాయం తీసుకున్నట్లు పుతిన్ స్వయంగా ప్రకటించాడు. వాగ్నర్ గ్రూప్ ప్రైవేట్ సేనలు అంతర్జాతీయ టెర్రర్ గ్రూప్‌గా ఉక్రెయిన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపాడు. ప్రస్తుతం.. ఉక్రెయిన్‌లో రష్యా సేనలు 40 వేలు ఉంటే... అందులో 10వేల మంది వాగ్నర్ గ్రూప్ ప్రైవేటు సేనలున్నట్లు తెలుస్తున్నది. వాగ్నర్ గ్రూప్ ప్రైవేట్ సేనలు ఉక్రెయిన్‌లో అత్యంత అమానవీయంగా ప్రవర్తిస్తున్న దాఖలాలున్నాయి. అత్యాచారాలు, దోపిడీలకు పాల్పడుతూ యుద్ధనియమాలను ఉల్లంఘిస్తున్నాయి. ఈ వాగ్నర్ గ్రూప్ సేనలు ఉక్రెయిన్‌లోనే కాకుండా..., ప్రపంచంలో చాలా దేశాల్లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది.
వాగ్నర్ గ్రూపునకు ఓ నీతి, నియమం అంటూ ఏదీ లేదు. సిరియాలో... అధ్యక్షుడు అసద్ సేనలకు మద్దతుగా నిలిచి తిరుగుబాటుదారులను అణిచేందుకు పోరాడింది. ఇంకా పోరాడుతున్నది. అదే లిబియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనరల్ హప్తార్‌తో చేతులు కలిపి తిరుగుబాటుదారులకు అండగా నిలిచింది. ఎవరినుంచి ఎక్కువ డబ్బులు ముడితే వారి తరపున వాగ్నర్ గ్రూప్ రంగంలోకి దిగుతుంది.అలాగే... మధ్య ఆఫ్రికా దేశాల్లో సూడాన్‌లో వాగ్నర్ గ్రూప్ తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నది.-
--్రశామిక