ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టేది..

ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టేది

అనధికార తవ్వకాలపై అలసత్వం

చూసీ చూడనట్లుగా రవాణా వ్యవహారం

ఆదిలాబాద్‌: జిల్లాలో ఇసుకతో లక్షలు దోచేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో  లక్షల్లో దందా కొనసాగుతుండగా, భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. రైతులకు సాగునీటికి, స్థానికులకు తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ అక్రమార్కుల దందా కొనసాగుతున్నా, అధికారులు పట్టించుకోక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారిక పనులకు కాంట్రాక్టర్లు మంచిర్యాల జిల్లా గోదావరి నుంచి ఇసుకను తీసుకువస్తారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో భవనాలు, ఇతర నిర్మాణాలకు అవసరమైన ఇసుకను పెన్‌గంగ నది నుంచి అక్రమంగా తరలిస్తారు. అధికారికంగా ఎలాంటి అనుమతులు లేకున్నా, దళారులు ఈ దందా నిత్యం  కొనసాగిస్తున్నారు. సహజసిద్దంగా ఇసుక లభ్యత ఉన్నా క్వారీలకు అవకాశం లేదని ఉన్నతాధికారులకు మైనింగ్‌ అధికారులు గతంలో నివేదికలు ఇచ్చారు. భూమి నుంచి రెండు విూటర్ల లోపే ఇసుక నిల్వలు ఉన్నాయని, దీంతో క్వారీలు ఏర్పాటు చేసే అవకాశమే లేదని కలెక్టర్‌కు నివేదించారు. నదిపరీవాహక ప్రాంతాల నుంచి ఇసుకను తోడితే భూగర్భజలాలు ఇంకిపోతాయని, రైతులకు సాగునీటి సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నారు. దీంతో అధికారికంగా ఇసుక క్వారీలకు ప్రభుత్వం నుంచి అనుమతులు లభించలేదు. దీనిని ఆసరా చేసుకున్న అక్రమార్కులు దందాకు తెరలేపారు. జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకొని పిప్పల్‌కోటి నుంచి 60 కిలో విూటర్లు భీంపూర్‌, జైనథ్‌, బేల మండలాల విూదుగా పెన్‌గంగ పరీవాహక ప్రాంతం ఉన్నది. వానకాలంలో ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పరీవాహక ప్రాంతాల్లో భారీగా ఇసుక నిల్వలు పేరుకుపోతాయి. డిసెంబర్‌లో ప్రవాహం తగ్గడంతో అక్రమార్కులు ఇసుక నిల్వలపై కన్నేస్తారు. జైనథ్‌ మండలం డొల్లార, పెండల్‌వాడ, కౌఠ, అనంత్‌పూర్‌, బేల మండలంలోని సాంగిడి, బెదోడ, కామ్‌గార్‌పూర్‌, కొద్దూర్‌, మాగ్లూర్‌కు ఇసుక తీసుకపోతారు. భీంపూర్‌ మండలం గొల్లఘాట్‌, తాంసి (కే), వడూర్‌, అంతర్‌గాం, గుబిడి గ్రామాల్లో నది ప్రవహించిన చోటు నుంచి ఇసుకను తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. అసలు నది ప్రవహించే చోట భూమి నుంచి రెండు విూటర్ల పైన ఇసుక నిల్వలు ఉంటేనే అధికారికంగా అనుమతులు ఉంటాయి. జిల్లాలో ఎక్కడా రెండు విూటర్లకు పైగా నిల్వలు లేవు. అయినా ఈ  అక్రమ రవాణాను  ఆపడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. జిల్లాలో 15 గ్రామాల పరిసరాల్లోంచి ఈ ఇసుక దందా సాగుతున్నది. నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు. ఈ అక్రమ దందా నిర్వహకులు  ఈ ప్రాంతంలో నలుగురిని కాపలా ఉంచుతారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ. 400 నుంచి రూ.500 వసూలు చేస్తారు. చలికాలంలో ప్రారంభమయ్యే ఈ అక్రమ వ్యవహారం ఎండాకాలం వరకు కొనసాగుతుంది. మొదట నది నుంచి తీసుకెళ్లే ఇసుకను ఓచోట డంప్‌ చేసి, అవసరమైన వారికి విక్రయిస్తారు. ఇసుక అక్రమ రవాణాపై తనిఖీలు నిర్వహిస్తున్నామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని,. ఆయా ప్రాంతాల్లో నిఘా పెట్టామని చెబుతున్నా ఫలితం మాత్రం కానరావడం లేదు. 

Relative Post

Newsletter