జనాల జేబుకు కత్తెర..ఇవ్వాళో, రేపో పెట్రో మంట

జనాల జేబుకు కత్తెర

పెరుగుతున్న నిత్యావసర ధరలతో ఇక్కట్లు

ఇవ్వాళో, రేపో పెట్రో మంట


వేకువ ప్రతినిధి, హైదరాబాద్​: దేశంలో ప్రభుత్వాలు అచేతనంగా ఉన్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ దేశంలో ఏం జరిగినా పట్టించుకోని రీతిలో కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ప్రధానంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నా..ఎక్కడ లోపం ఉందో గుర్తించడం లేదు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావు. మార్కెట్లో మాత్రం విపరీతంగా ధరలు పెట్టాల్సి వస్తోంది. ఉల్లిపాయల ధరలు దిగి రావడం లేదు. మిర్చికి గిట్టుబాటు ధరలు రావని గుంటూరు తదితర జిల్లాల్లో ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. పసుపు ధరలు గిట్టుబాటు కావడం లేదని నిజామాబాద్‌ తదితర జిల్లాల్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఉల్లిపాయలకు గిట్టుబాటు ధరలు లేవని కర్నూలు జిల్లాలో ఆందోళనలు చేస్తూనే ఉంటారు. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి, దేశానికి అవసరమైన ఉత్పత్తులను పెంచే ప్రయత్నాలు చేయడం లేదు. వరి విపరీతంగా సాగు అవుతున్నా బియ్యం ధరలు తగ్గడం లేదు. గిట్టుబాటు ధరలు లేవని రైతులు అంటుంటే మార్కెట్లో మాత్రం ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లోపం ఎక్కడో పాలకులు గుర్తించడం లేదు. ప్రజలకు నిత్యావసరాలను తక్కువ ధరలకు అందించే ఏర్పాట్లు చేయడం లేదు. 

మన వ్యవసాయ భూమలును మన ప్రజలకు అవసరమైన పంటలు పండించేలా మార్చడం లేదు. దేశానికి సమగ్ర వ్యవసాయ విధానం లేకపోవడం వల్లనే ఇలాంటి దుష్ఫలి తాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అలాగే మొన్నటి వరకు కరోనా దెబ్బతో అల్లాడిన ప్రజలకు ఇప్పుడు ఉక్రెయిన్‌ దెబ్బలు తినాల్సిన ఆగత్యం ఏర్పడింది. పెట్రో ధరలు భారీగా పెరుగుతాయన్న భయంతో వాహనదారులు బంకుల వద్ద క్యూలు కడుతున్నారు. పెట్రోల్‌ కనీసం 15 రూపాయలు పెంచుతారని ప్రచారం సాగుతోంది. ఎలాగూ ఎన్నికలు ముగియడంతో ఇక ధరలు పెంచడం అనివార్యంగా కనిపిస్తోంది. మరోవైపు రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. యుద్ధం ఆయిల్‌ రేట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం సాకుగా చూపించి అక్రమార్కులు చీకటి వ్యాపారానికి తెరతీశారు. అనేక జిల్లాల్లో ఆయిల్‌ ధరలు పెంచి, ప్రజల జేబులకు చిల్లులు పెడుతు న్నారు. ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్‌ అధికారుల మెరుపు దాడులు నిర్వహించారు. సన్‌ప్లవర్‌ అయిల్స్‌ ను ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడులు చేపట్టారు. దాడులు జరుగు తాయన్న ముందస్తు సమాచారంతో కొన్నిచోట్ల షాపులకు తాళాలు వేశారు వ్యాపారస్తులు. మరోవైపు వంటనూనెల ధరలను అమాంతంగా పెంచేశారు. విపరీతంగా పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నిత్యావ సర ధరలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు, యూరియా అందడం లేదు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. మన నేలలు నూనెగింజలకు అనుకూలంగా ఉన్నా నువ్వులు, వేరుశనగ, కుసుమ, పొద్దు తిరుగుడు పంటలను ప్రోత్సహించడం లేదు. వీటిని ప్రోత్సహించి రైతులకు చేదోడువాదోడుగా ఉండాల్సిన ప్రభుత్వాలకు ప్రణాళిక లేకుండా పోయింది. అదే పనిగా దిగుమ తుల మీద ఆధారపడడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. తాజాగా ఉక్రెయిన్‌ యుద్ధంతో వంట నూనెల ధరలను పెంచేసి అమ్ముతు న్నారు. నో స్టాక్‌ బోర్డు పెడుతున్నారు. వంట నూనెల ను ధరలు పెంచి విక్రయిస్తున్న దుకాణాలపై ఎపిలో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు  దాడులు చేపట్టారు. దాడుల్లో వంట నూనెలను అక్రమంగా నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని గుర్తించారు. దుకాణాలు, గిడ్డంగు లలో విస్తృతంగా తనిఖీలు చేశారు. పౌర సరఫరాల శాఖ, తూనిక కొలతల శాఖల  అధికారులు కూడా తనిఖీ ల్లో పాల్గొన్నారు. 

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో దిగుమతులపై ప్రభావం చూపడంతో ముందు గానే వంట నూనెల ధరలు లీటరుకు రూ.20కు పైగా పెరగడంతో ప్రజలు బెంబేలెత్తు తున్నారు. కృత్రిమ కొరత సృష్టించి అందినకాడికి దండుకుంటున్నారు వ్యాపారులు. అధికారులకు సమాచారం రావటంతో ఎక్కడి కక్కడే దాడులు చేస్తున్నారు. అధిక ధరలకు వంట నూనెలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అయినా కొందరు కేటుగాళ్ళు ప్రజల డిమాండ్‌ ని క్యాష్‌ చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆయిల్‌ మిల్లులు, హోల్‌సేల్‌ దుకాణాలపై విజిలెన్స్‌ అధికారులు దాడులు చేపట్టారు. వంటనూనె ఎక్కువ ధరలకు అమ్ముతున్నారనే ఫిర్యాదు రావడంతో ఆకస్మిక తనికీలు నిర్వహించారు. అసలు ధర కంటే ఎక్కువ రేటుకు వంట నూనెలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు.  వివిధ జిల్లాలో అధిక ధరలకు వంట నూనెలు అమ్ముతున్న పలు దుకాణాల్లో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హోల్‌సేల్‌ దుకాణాల్లోనూ వంట నూనెల నిల్వలను పరిశీలించారు. వంట నూనెల ధరలు పెంచి అమ్ముతున్నారనే ఫిర్యాదులపై దర్యాప్తు చేశారు. యుద్ధాన్ని సాకుగా చూపి, ఆయిల్‌ వ్యాపారస్తులు భారీగా నిల్వ చేసుకుంటున్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఎవరైనా వంట నూనె ధరలు పెంచి అమ్మితే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి.. రష్యా . ఉక్రెయిన్‌ యుద్ధం సామాన్యులకు పెనుశాపంగా మారింది. వంట నూనెలతో పాటు నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాలను సీరియస్‌గా తీసుకోవాలి. ప్రజలను దోచుకుంటున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

Relative Post

Newsletter