మత సహన ప్రతీక శివాజీ..
మత సహన ప్రతీక శివాజీ..
ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా... ఫిబ్రవరి 19న దేశ వ్యాప్తంగా హిందుత్వవాదులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించా రు. శివాజీ, భరతమాత చిత్రపటాలతో ఊరేగింపులు తీశారు. మహారాష్ట్ర పూణెలో 21ఎకరాల విస్తీర్ణంలో థీమ్ పార్క్ నిర్మాణాన్ని ప్రారంభిస్తూ... కేంద్ర హోం మంత్రి అమిత్ షా నాటి శివాజీ వారసత్వాన్ని నేడు నరేంద్రమోదీ హిందు ధర్మరక్షణకోసం నడుం కట్టి నడుస్తున్నారని చెప్పుకొచ్చారు. నాడు ముస్లిం రాజుల దాడులతో ధ్వంసం చేసిన దేవాలయాలను శివాజీ పునర్నిర్మించారనీ, ఇవ్వాళ అయోధ్య రామాలయం మొదలు, కాశీ విశ్వనాథ నడవాల నిర్మాణం, సోమనాథ ఆలయానికి స్వర్ణకాంతులు అద్దటం లాంటి కార్యక్రమాలతో మోదీ శివాజీ బాటలో నడుస్తున్నారని చెప్పుకొచ్చారు. విధ్వంసకులైన ముస్లిం రాజులను ఎదిరించి నిలిచి హిందు సంస్కృతిని పరిరక్షించిన పాలకుడిగా శివాజీని అమిత్ షా అభివర్ణిస్తున్నారు. శివాజీ నిర్మించిన సప్తకోటీశ్వర ఆలయాన్ని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పునర్నిర్మిస్తున్నారనీ, మోదీ కూడా అదే తోవలో నడుస్తున్నాడని షా అంటున్నారు. ఇంకా ఆయన మరో అడుగు ముందుకేసి... బాజీరావు పీష్వా, నానాసాహెబ్ పీష్వా, మాధవరావు పీశ్వాలకు వారసుడిగా మోదీ ముందుకు పోతున్నాడని అమిత్ షా చాలా సగర్వంగా ప్రకెటించుకొన్నారు. దీంతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తుల అసలు ఎజెండా ఏమిటో ఆయన ఏ ముసుగు లేకుండా ప్రకటించినట్లయ్యింది.
నాడు పీశ్వాల పాలనా తీరుకు వ్యతిరేకంగానే బీమాకోరేగాం చారిత్రాత్మక ఘటన చోటుచేసుకున్నదని చరిత్ర చెప్తూనే ఉన్నది. పీశ్వాల పాలనలో వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరిస్తూ సాగిన పాలనలో దిళితులు, ఇతర వెనుకబడిన కులాల, వర్గాల వారిపై అలవికాని దోపిడీ పీడనలు కొనసాగాయి. దళితులను కనీసం మనుషులుగా కూడా పరిగణించని పీశ్వాలను ప్రజలంతా ఎదిరించి పోరాడారు. ఆ క్రమంలోనే బ్రిటిష్ సైన్యంలో ఉన్న దళితులు ఆయుధాలు చేబూని పీశ్వాలపై దండెత్తి పీశ్వాల పీడన నుంచి విముక్తి పొందారనేది చరిత్ర. కాలగర్భంలో కలిసిపోయిన పీశ్వాల పాలనను మోదీ పాలనలో తిరిగి పునురుద్ధరించబోతున్నామని షా చెప్పకనే చెప్తున్నారు. అమిత్ షా సందర్భం చిక్కినప్పుడల్లా... హిందుత్వ వర్ణాశ్రమ ధర్మం తమ పాలనా లక్ష్యంగా ప్రకటిస్తూనే ఉన్నారు. మోదీ అధికారం చేపట్టిన తర్వాత ఉత్తరభారతాన దళితులు, ముస్లింలపై పెరిగిన దాడులు.. వర్ణాశ్రమ ధర్మరక్షణలో భాగమేనని వారు చెప్పటం గమనించదగినది.
ఇదంతా ఒక ఎత్తు అయితే... మత భేదం లేకుండా అన్ని వర్గాలనూ సమభావన దృష్టితో చూసి ప్రజలందరి మెప్పుకోసం తాపత్రయ పడిన శివాజీని ముస్లిం వ్యతిరేకిగా ప్రచారం చేయటం సంఘ్ పరివార్ శక్తుల కూట్ర. నిజానికి ఛత్రపతి శివాజీగా పేరుగాంచిన శివాజీ భోన్సాలే... అతిపిన్న వయస్సులోనే రాజ్యపాలనను చేపట్టి అందరి కోసం పాలనకొనసాగించాడు. బీజాపూర్ సుల్తాన్ అదిల్‌షాహి పై తిరుగుబాటు చేసి మరాఠాలో స్వతంత్రరాజ్యాన్ని స్థాపించాడు. నాటి ముస్లిం, మొగల్ రాజుల విధ్వంసకర విధానాలకు ఎదిరించి నిలిచి మరాఠా ప్రాంతంలో తన సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆ క్రమంలో ఆయన మత వివక్షను ఏనాడు పాటించలేదు. నిజానికి మత వివక్షను శివాజీ స్వయంగా ఎదుర్కొన్నాడు. అగ్రవర్ణం కాని శివాజీ పట్టాభిశేకానికి ఏ బ్రాహ్మణుడు రావటానికి ఇష్టపడలేదు. దాంతో... కాశీనుంచి గగాభట్ అనే బ్రాహ్మణున్ని ఆయన ఎత్తు బంగారం ఇచ్చి పట్టాభిశేక కార్యాక్రమానికి రావటానికి ఒప్పించాడు. అయినా.. ఆ కాశీ బ్రాహ్మణుడు.. తన కాలి బొటన వేలుతో శివాజీ నుదిటిపై బొట్టు పెట్టాడని చరిత్రలో రికార్డ్ అయి ఉన్నది.
శివాజీ... తన రాజ్యంలో, పాలనా వ్యవహారాల్లో ఏ విధమైన మత వివక్ష పాటించలేదు. ఆయన సైన్యంలో మూడో వంతు ముస్లింలే ఉండేవారు. అయన సైన్యానికి ఆయుధాలు అందించే.. ఫిరంగి ఆయుధాగారానికి అధిపతిగా ఇబ్రహిం ఖాన్ అనే ముస్లింను నియమించుకొన్నాడు. నౌకాదళాధిపతి కూడా ముస్లిం.. దౌల్ ఖాన్, విదేశీ వ్యవహారాల మత్రి కూడా హైదర్ అలీ అనే ముస్లిం. అంతెందుకు ఆయన అంగ రక్షకుడు మొహతర్ కూడా ముస్లిమే. శివాజీని చంపాలనే కుట్రతో.. ఆయుధాలు లేకుండా చర్చలకు రావాలని పిలిచిన అఫ్జల్‌ఖాన్ కుట్రలో భాగస్వామి అయ్య శివాజీని చంపబోయింది కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి అనే బ్రాహ్మణుడే కానీ ముస్లం కాదు. ఈ కుట్ర నుంచి శివాజీని కాపాడి సురక్షితంగా బయటకు తీసుకు వచ్చింద సిద్ది ఇబ్రాహిం అనే ముస్లిం. అంతెందుకు.... శివాజీ రాజభవనం ముందే.. ముస్లింల ప్రార్థన కోసం దర్గాను కట్టించిన పరమత సహనం శివాజీది. ఇలాంటి శివాజీని ముస్లిం ద్వేషిగా చిత్రీకరించే పనికి పూనుకోవటం హిందుత్వ శక్తుల కపటం. ద్రోహపు బుద్ధినీ, నీచత్వాన్నీ ఓ మతానికి అంటగట్టి చూడటం అసంబద్ధం. శివాజీకి లేని ముస్లిం మత ద్వేషాన్ని అంటగట్టి చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేయటం దుర్మార్గం.
చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా చెప్పుకోవటానికీ, చూపుకోవటానికీ ఓ పేజీలేని ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ శక్తులు ప్రజల్లో ఆమోదాన్నీ, విశ్వసనీయతను పొందటానికి అనేక కుట్రలు, కుహకాలకు పాల్పడుతున్నారు. తమకు ఏ రూపలోనూ సంబంధం లేని, కడదాకా కాంగ్రెస్ వాదిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్‌నూ తమ వాడిగా చూపుకోవటం కోసం నానా తంటాలు పడుతున్నారు. నిజానికి గాంధీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్‌ను హింసాత్మక, ఉన్మాద శక్తిగా ప్రకటించి ఆర్ఎస్ఎస్ ను నిషేధించిన వాడు పటేల్. దేశ రాజకీయాల్లో హింసాత్మక ఉన్మాదానికి కేంద్రంగా ఆర్ఎస్ఎస్ ను ప్రకటించి దానికి దేశ రాజకీయాల్లో చోటు ఉండకూడదని ప్రకటించిన వాడు పటేల్. అలాంటి పటేల్ ను ఇవ్వాళ బీజేపీ భుజాన మోయటం వెనుక ఎలాంటి కపటం ఉన్నదో.., శివాజీని హిందు పరిరక్షకుడిగా చెప్పటం వెనుక అలాంటిదే ఉన్నది. చరిత్రను వక్రీకరించి ప్రజల్లో లేని ఆమోదాన్ని పొందాలనుకోవటం బీజేపీ శ్రేణుల దురాశ. అది ఎన్నటికీ నెరవేరదు. భిన్న సంస్కృతులు, జీవనాలు కలిగిన భారతావనిలో మతోన్మాద రాజకీయాలకు చోటు లేదు.
-స్వరూపి